పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
50 - పద్మావతీ చరితమ్
సుకలోవాచ - సుకల పలికెను.
పద్మావతీ పలుకులను వినిన గోభిలుడు ఇట్లు పలికెను. “నీవు నన్నెందుకు శపించదలచితివో కారణమును తెలుపుము. నేను ఏ దోషమును చేసితిని? నీవు నన్నెందుకు శపించ సమకట్టితివి? నేను గోభిలుడను పేరుకల దైత్యుడను. యక్షరాజైన కుబేరుని సేవకుడను. నేను దైత్యుల ఆచారముతో మెలగుచున్నాను. గొప్ప విద్యను తెలియుదును, వేదశాస్త్రార్థములను తెలిసినవాడను. ఇంకా కళలలో నిపుణుడను. ఇట్లు నేను దైత్యాచారమును చక్కగా సమగ్రముగా తెలియుదును వినుము తెలిపెదను. పరుల ధనమును, పరుల భార్యలను బలవంతముగా అనుభవించెదను. మేము దైత్యులము. దైత్యాచారముతో ప్రవర్తించుచున్నాము. నేను ముమ్మాటికీ నిజమునే చెప్పుచున్నాను. ప్రతిదినము బ్రాహ్మణుల లోపములను వెదకుచుందుము. అట్టి బ్రాహ్మణుల తపస్సును విఘ్నములను కల్పించి నశింపచేతుము. ఇందులో సంశయము లేదు. లోపమును పాపమును చూచియే వరాననా! బ్రాహ్మణులాచరించు దేవయజ్ఞమును ధర్మయజ్ఞములను నశింపచేయుదుము. ఉత్తమ బ్రాహ్మణులను నారాయణదేవుని మహానుభావురాలైన పతివ్రతను, నిరంతరము భర్తృసేవాతత్పరురాలను దూరముగా విడిచిపెట్టుదుము. ఉత్తమ బ్రాహ్మణుని తేజస్సు మహాత్ముడైన శ్రీహరి తేజస్సు. పతివ్రతయైన స్త్రీ తేజస్సు దైత్యులు సహించజాలరు. పతివ్రతా భయముతో, శ్రీహరి భయముతో, ఉత్తమ బ్రాహ్మణుని భయముతో, సామాన్య బ్రాహ్మణులు రాక్షసశ్రేష్టులు కూడా నశించెదరు. నేను దానవధర్మముతో సంచరించుచున్నాను. నన్నెందుకు శపించదలచితివి. నా దోషమును ఆలోచించుము.’
పద్మావత్యువాచ - పద్మావతి పలికెను.
“పాపాత్ముడా! నా ధర్మమును చక్కని దేహమును నీవు నాశనము చేసితివి. నేను పతివ్రతను, సాధ్విని. పతినే కోరుదానను. తపస్సును ఆచరించుదానను. నేను నా సంప్రదాయములోనున్నదానను. నీవు నీ మాయతో నాశనము చేసితివి. దుష్టుడా అందుకే నిన్ను దహింపచేతును. ఇందులో సంశయములేదు.”
గోభిల ఉవాచ - గోభిలుడు పలికెను.
“నృపనందినీ! నీవు కోరినచో ధర్మమునే చెప్పెదను. రోజూ అగ్నిచయనము చేయు బ్రాహ్మణుని విధానమును వినుము. ప్రతిదినము రెండుమార్లు హోమమును చేయుచు అగ్నిమందిరమును వీడనివాడు నిత్యము హోమము చేయువాడు అగ్నిహోత్రి అనబడును. వరాననా! ఇట్లే ఇంకొక భృత్యధర్మమును చెప్పెదను వినుము. మనస్సుతో, కర్మతో, వాక్కుతో, పరిశుద్దుడై నిత్యము యజమాని ఆజ్ఞను పాలించువాడు, యజమానికి వెనుకా ముందు నిలుచువాడు భృత్యుడనబడును. అతను పుణ్యమును పొందును. గుణవంతుడు, జ్ఞాని అయిన పుత్రుడు శుభసంకల్పముతో తండ్రిని రక్షించువాడు, తల్లిని కూడా మనఃపూర్వకముగా సేవించువాడు, వాక్కుతో, శరీరముతో సేవించువాడు, ప్రతిదినము గంగాస్నానము చేసిన ఫలమును పొందును. దీనికి వేరుగా చేయువాడు పాపియగును. ఇట్లే పతివ్రతాధర్మమును చెప్పెదను వినుము. ప్రతిదినము త్రికరణములతో భర్తకు సేవచేయునది, భర్త సంతోషించినచో సంతోషించునది, కోపించినచో కోపింపనిది, భర్త పనులన్నిటిలో ఎల్లపుడూ ముందుండునది పతివ్రత అనబడును. తడి పతితుడైననూ, చాలా దోషములు కలవాడైనను, ఏ కారణముతోనైననూ కుష్టురోగమువాడైననూ, కోపి అయి.నను విడిచి పెట్టనివాడు తల్లిని, తండ్రిని ఇట్లు నిత్యము సేవించువాడు శ్రీమహావిష్ణువు పరమపదమును పొందెదరు. ఇట్లే స్వామిని సేవించు భృత్యులు స్వామియనుగ్రహమువలన ఉత్తమలోకములను చెందెదరు. ఎపుడూ అగ్నిని పరిత్యజించనివాడు బ్రహ్మలోకమును పొందును. అగ్నిని విడుచు బ్రాహ్మణుడు వృషలీపతి అనబడును. స్వామిని విడిచినవాడు స్వామిద్రోహియనబడును. అగ్నిని, తండ్రిని, యజమానిని విడువరాదు. బ్రాహ్మణుడు, పుత్రుడు, సేవకుడు అగ్నిని, తండ్రిని, యజమానిని ఎప్పుడూ విడువరాదు. నేను ముమ్మాటికి నిజమునే చె చున్నాను.
పతిని వ్యాధిగ్రస్తుని, వికలుని, కుష్టువానిని విడిచి వెళ్ళువారు నరకమునకు వెళ్ళేదరు. ఏ పనిచేయనివాడైననూ, ధనము లేనివాడైననూ, సంపాదించలేనివాడైననూ, శ్రేయమును కోరు స్త్రీ భర్తను విడువరాదు. భర్తను విడిచి ఇంకొక పనిని కోరి స్త్రీ వెళ్ళినచో ఆ స్త్రీని పుంశ్చలీ సర్వధర్మబహిష్కృత అందురు. భర్త గ్రామాన్తరమునకు వెడలినపుడు భోగమును, శృంగారమును, లోలత్వము చేసుకొనినచో ఆమెను పుంశ్చలి అందురు. ఇట్లు వేదశాస్త్రసమ్మతమైన ధర్మమును తెలియుదురు. బ్రహ్మ మొదటనే దానవులను, రాక్షసులను, ప్రేతలను సృష్టించియున్నారు. దానికి సమగ్రముగా కారణమును చెప్పుచున్నాను. వినుము. బ్రాహ్మణులు, దానవులు, పిశాచములు, రాక్షసులు, ధర్మముకొరకే సృష్టించబడిరి. వారుకూడా అన్నీ చదివియున్నారు. ఆచరించుచున్నారు. జ్ఞానములేని దానవులు విధిహీనముగా ప్రవర్తించుచుందురు. మానవులు అన్యాయముగా విధిని విడిచి ప్రవర్తించుచున్నారు. అట్లు విధిహీనముగా ప్రవర్తించువారిని శాసించుటకే దానవులు, రాక్షసులు సృష్టించబడిరి. ఇంకొక పనికి కాదు. విధిహీనముగా ప్రవర్తించు నరాధములను మేము శాసించుచుందుము. దండించుచుందుము. నీవు సిగ్గును విడిచి భయంకరమైన పనిని చేసియున్నావు. గృహస్థధర్మమును విడిచి ఇక్కడికెందుకు వచ్చితివి. ఇంకా ఈ ముఖముతో నేను పతిదేవతను అనుచున్నావా? ఆ పతిదైవత్వము నీ పనిలో కనపడుట లేదు. భర్తను విడిచి నీవెందుకు ఇటకు వచ్చినావు. ఇంకా సిగ్గులేకుండగా ఆభరణములను అలంకరించుకొనియున్నావు. ఈ పని ఎందుకు చేసితివి? ఏమిటా కారణము? నాకు చెప్పుము. ఇంకా ఎట్టి సందేహము లేకుండగా గిరికాననమున సంచరించుచున్నావు. కావుననే నేను నిన్ను గొప్ప దండనతో సాధించినాను.
నీవు అధర్మమునాచరించుదానవు. దుష్టురాలవు. భర్తను విడిచివచ్చితివి. నీ పతిదేవత్వమెక్కడున్నది. నా ముందు చూపుము. నీ భర్తను విడిచినందున నిన్ను పుంశ్చలి అందురు. భర్తను కాదని వేరుశయ్యను పొందిన స్త్రీ పుంశ్చలి అగును. నీకు నీ భర్తకు నూరు యోజనముల అంతరమున్నది. నీవు పుంశ్చలీ ఆచారమును కలిగియున్నదానవు. నీ పతి దైవత్వమెక్కడున్నది. సిగ్గూ బిడియము లేనిదానవు. దుష్టురాలవు. ఇంకా నా ఎదురుగా నిలబడి మాటలాడుచుంటివా? నీకు తపస్సెక్కడున్నది? పతిభావమెక్కడున్నది? తేజస్సెక్కడున్నది? బలమెక్కడ? ఒకవేళ ఉన్నచో నీ బలవీర్యపరాక్రమమును నాకు చూపుము.”
పద్మావత్యువాచ - పద్మావతి పలికెను.
“అసురాధమా! మా తండ్రి నామీది ప్రేమతో నన్ను భర్భగృహమునుండి ఇచటికి తీసుకొని వచ్చెను. అందులో పాపమెక్కడున్నది? నేను పతిభావముతోనే ఉన్నాను. కామముతో, లోభముతో, మోహముతో, మత్సరముతో నేను భర్తను విడిచిరాలేదు. నీవే కపటముతో భర్తృరూపమును ధరించి మోసగించితివి. నీవు మధురానాధుడవని భావించి నీ సముఖమునకు చేరితిని. నీవు మాయావివి అని తెలిసిన తరువాత దానవాధమా! ఒకే హుంకారముతో నిన్ను భస్మము చేతును.”
గోభిల ఉవాచ - గోభిలుడు పలికెను.
“కనులు లేని మానవులు చూడజాలరు. ధర్మనేత్రములు లేని నీవు నన్నెలా తెలియగలవు? నీవు తండ్రి ఇంటికి వెళ్ళాలను భావము కలిగినపుడే పతిధ్యానమును విడిచితివి. అపుడే నీ హృదయమున జ్ఞాననేత్రము నశించినది. జ్ఞానచక్షువు నశించిన నీవు నన్నెలా తెలియగలవు? భార్యకు తల్లి, తండ్రి, అన్న, స్వజనులు, బాంధవులు ఎక్కడివారు? అందరి స్థానములలో భర్త ఒక్కడే ఉండును. ఇందులో ఎట్టి సందేహము లేదు. ఇట్లు పలికి దానవాధముడైన గోభిలుడు నవ్వుచునే పుంశ్చలీ! నాకు నీ భయము లేదు. నా మాటకూడా వినుము, నీ శాపముతో ఏమగును? నీవు అనవసరముగా వణుకుచున్నావు. నా ఇంటిలో నివసించి నీవు కోరిన భోగములను అనుభవించుము.”
పద్మావత్యువాచ - పద్మావతి పలికెను.
“సిగ్గులేనివాడా! పాపాచారపరాయణా! నీవేమి మాటలాడుచున్నావు. నేను సతీభావముతో ఉన్నాను. పతివ్రతపరాయణురాలను. మహాపాపా! నీవిట్లే మాటలాడినచో నిన్ను దహించెదను.” ఇట్లు పలికి ఏకాన్తమున భూమిమీద కూర్చునెను. గొప్ప దుఃఖముతోనున్న పద్మావతితో గోభిలుడు ఇట్లు పలికెను. “శుభకరురాలా! నేను నీ కడుపులో సుకృతమైన నా వీర్యమునుంచితిని. అందువలన మూడులోకములను క్షోభింపచేయు పుత్రుడు నీకు కలుగును.” ఇట్లు పలికి గోభిలుడు వెడలిపోయెను. దురాచారపరాయణుడైన గోభిలుడు వెడలిన తరువాత పాపమును ఆచరించిన పద్మావతి రాజపుత్రిక గొప్ప దుఃఖమును పొందినదై పెద్దగా ఏడ్చెను.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున యాబదియ - అధ్యాయము.
