పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

66 - ప్రథమతః శరీరోత్పత్తిపూర్వక శరీరవర్ణనమ్

యయాతిరువాచ - యయాతి పలికెను.

మాతలీ! ఈ శరీరము పాపము వలన పడుచున్నది. ధర్మమువలన అనగా పుణ్యమువలన పడుచున్నది. కావున పాపమునకు, పుణ్యమునకు విశేషమే కనపడుటలేదు. మళ్ళీ శరీరమేర్పడుచున్నది. మళ్ళీ పూర్వపురీతిలో పతనము జరుగుచున్నది. కావున ఈ దేహమెట్లు పుట్టుచున్నదో నాకు విస్తరముగా చెప్పుము.

మాతలిరువాచ - మాతలి పలికెను.

ఇక నరకవాసులకు నరకమునకు వెళ్ళు పాపమును మాత్రమే చేయువారికి అధర్మమువలన మాత్రమే భూతములనుండి ఒక క్షణములోనే శరీరము పుట్టును. ఇట్లే దేవతలకు ధర్మముతో భూతసారమునుండి దివ్యశరీరము వెంటనే పుట్టును, కర్మపరిపాకమువలన మహానుభావులకు కలుగు శరీరము ఆయా రూపపరిణామములతో నాలుగు విధములని తెలియవలయును. భూమిని పైకి భేదించుకొని వచ్చు స్థావరములు తృణగుల్మలతాదులు ఒకటి. కృమికీటపతజ్ఞాదులు స్వేదమువలన కలుగు దేహులు. ఇక పక్షులన్నీ అండజములే. అట్లే సర్పములు మొసళ్ళు. ఇక మానవులు జరాయుజములు. బాష్పాజ్ఞస్తువులు కూడా జరాయుజములే. నీటితో తడిపిన భూమి సూర్యుని వేడితో పక్వమై వాయువుచే ఊదబడి క్షేత్రమగును. ఆ క్షేత్రమున విత్తబడిన బీజములు నీటితో తడుపబడి మృదుత్వమును పొంది మూలభావమును పొందును. ఆ మూలమునుండి అంకురముదయించును. అంకురమునుండి ఆకులు పుట్టును. పర్ణమునుండి నాళము, నాళమునుండి కాండము, కాండమునుండి కొమ్మలు రెమ్మలు పుట్టును. ఆ పొట్టనుండి పాలు ఏర్పడును. పాలనుండి తండులమేర్పడును. తండులములేర్పడిన తరువాత ఓషధులు ఫలించును. యవలనుండి వరి వరకు 17 విధములు శ్రేష్టములుగా పరిగణించబడుచున్నవి. పంటయే సారముగా కలవి ఓషధులు, తక్కినవి క్షుద్రములుగా కీర్తించబడును.

ఈ ఓషధులు ధాన్యములు తెంచబడి కోయబడి దంచబడి మునులచే మొదట సంస్కరించబడి మరల చాటలచే రోళ్ళతో రోకళ్ళతో పాత్రలతో నీళ్ళతో అగ్నితో సంస్కరించబడును. తమ తమ భేదములతో ఆరు విధములుగా మార్పును చెందును. పరస్పర రససంయోగముతో చాలా చాలా రుచులను పొందును. భక్ష్య భోజ్య పేయలేహ్య చోష్య ఖాద్యములుగా పేరుపొందును. వాటి భేదములు షడంగములు మధురాది షడ్గుణములు. ఆయన్నమును ముద్దల రూపముతో దేహులు భుజించెదరు. లోపల జీర్ణకోశములో క్రమముగా సకలప్రాణులను స్థాపించును. పక్వముకాని భుజించిన ఆహారమును ఆ వాయువు రెండుగా చేయును. అగ్ని మధ్యలో ప్రవేశించి వేరు వేరు గుణములుగా నున్న ఆహారమును పక్వము చేయును. అగ్ని పైన జలమునుంచి జలముపైన అన్నమునుంచి జలము క్రింద స్వయముగా ప్రాణవాయువుండి అగ్నిని మెల్లగా ఊదుచుండును. వాయువుచే ఊదబడిన అగ్నిజలమును అత్యుష్ణము చేయును. ఇట్లు వేడి తాకుటచే అన్నము పూర్తిగా పక్వమగును. పక్వమైనది ఘనముగా రసముగా రెండుగా అగును. ఘనమైన పక్వము 12 విధముల మలరూపములతో దేహమునుండి బయటకు వెడలును. చెవులు, కన్నులు, నాసిక జిహ్వ, దంతములు, ఓష్టములు, జననేంద్రియము, గుదము మలములను స్రవించుచుండును. స్వేదము మలము మూత్రము ఇవి పన్నెండుగా చెప్పబడినది. హృదయమధ్యమున బంధించబడిన అన్ని నాడులు అంతటా ఆ నాడులు ముఖములందు సూక్ష్మరూపముగా ప్రాణము స్థాపించబడును.

ఆ రసముతో ప్రాణము నాడులను నింపును. ఆ నాడులు పరిపూర్ణ దేహమును తృప్తిపరచును. అంతట ఆ నాడుల మధ్యలో నున్నది శరీర ఊష్మముతో రసము పక్వమౌను, పక్వమగుచు రెండు పాకములుగా నగును. త్వక్ మాంస అస్థి మజ్జ మేదో రుధిరములుగా ఏర్పడును. రక్తమునుండి లోమములు, మాంసములు, కేశములు ఏర్పడును. మాంసమునుండి స్నాయువు, స్నాయువునుండి మజ్జా అస్థులు, వప మజ్జ అస్థులనుండి ఏర్పడును. మజ్జాకారముతో వైకల్యమునందును. శుక్రము ప్రసవస్వరూపము. ఇట్లు  త్వక్కు మాంసము, అస్థి, మజ్జ, మేదస్సు, రుధిరము,  లోమములు,  కేశములు,  స్నాయువు,  వప, శుక్రము,  వైకల్యము. ఈ పన్నెండు అన్న పరిణామములుగా చెప్పబడుచున్నవి. శుక్రము అన్న పరిణామమే. శుక్రమునుండి దేహము సంభవించును. - ఋతుకాలమున నిర్దోషమైన శుక్రము యోనిలోనున్నచో వాయువుచే ప్రేరేపించబడి స్త్రీ రక్తముతో ఐక్యమును పొందును. శుక్ర విసర్గకాలమున కారణముతో కూడిన జీవుడు యోనిలో ప్రవేశించును. అట్లు ప్రవేశించువాడు తన కర్మలచే నియమించబడును. రక్తముతో కూడిన శుక్రము ఒకే రోజుతో బిందువుగా అయిదు రాత్రులలో బుడగగా, ఒక నెలలో మాంసముగా అయిదు విధములుగా అగును. మెడ, శిరస్సు, స్కంధములు, వెన్నెముక, ఉదరము, హస్తపాదములు, ప్రక్కలు, కటి, శరీరము ఏర్పడును. రెండు నెలలకు కీళ్ళు ఏర్పడును.

మూడు నెలలలో నూర్ల అంకురములు, సంధులు ఏర్పడును. నాలుగు నెలలలో అంగుళ్యాదులు ఏర్పడును. ముఖము, నాసిక, కర్ణములు అయిదు నెలలలో ఏర్పడును. దత్తపి జిహ్వ, నఖములు ఏర్పడును. ఆరవనెలలో కర్ణములకు ఛిద్రములు ఏర్పడును. పాయువు, మేడ్రము, ఉపస్థ, శిశ్నము, గాత్రములలో సంధులు 7 నెలలలో ఏర్పడును. అంగములు, ప్రత్యజ్ఞములు పరిపూర్ణముగా కేశములతో కూడిన శిరస్సు సుస్పష్టమైన అవయవ విభాగము. 8వ నెలలో ఏర్పడును. ఇట్లు పంచభూతాత్మకుడై పరిపక్వము చెంది ఉండును. తల్లి తీసుకొను ఆహారబలముతో ఆరువిధముల రసములతో నాభి సూత్రముతో బంధించబడి దినదినమునకు పెరుగుచుండును. ఆ తరువాత జీవుడు స్మృతిని పొందును. సంపూర్ణమైన ఈ శరీరమున సుఖదుఃఖములను నిద్రను స్వప్నమును పూర్వజన్మలో చేసినదానిని తెలియును. చనిపోయిన నేను మరల పుట్టితిని. పుట్టిన నేను మరల మరణించితిని. నానా యోని సహస్రములను చాలామార్లు నేను చూచితిని. ఇపుడు పుట్టిన వెంటనే సంస్కారమును పొందగానే మరల గర్భమున పుట్టకుండునట్లు శ్రేయస్సును ఆచరించెదను. గర్భములోనున్నవాడు, ఇట్లు ఆలోచించును. నేను గర్భమునుండి వెలువడగానే సంసారమును తొలగించు పరజ్ఞానమును అధ్యయనము చేతును.

గొప్ప దుఃఖముతో తప్పక పీడించబడి కర్మవశమున ఉంటూ మోక్షోపాయమును ఆలోచించుచుండును. పెద్ద పర్వతముతో ఆక్రమించబడినవాడు దుఃఖించునట్లు విచే చుట్టబడిన దేహి దుఃఖితుడైయుండును. సముద్రమున పడినవాడు ఆకులుడై దుఃఖించునట్లు గర్భోదకముచే తడుపబడిన సర్వావయవములు కలవాడై వ్యాకులుడగును. లోహకుంభమున ఉంచబడినది అగ్నిచే పచనము కావించబడినట్లు గర్భకుంభములో పడవేయబడిన జీవుడు జఠరాగ్నిచే పచనము చేయబడును. అగ్నివర్ణముగల సూదులతో భేదించబడు శరీరము కలవాడు పొందు దుఃఖము కంటే గర్భదుఃఖము 8 రెట్లు అధికముగా నుండును. గర్భవాసమున కంటే అధిక దుఃఖమును కలిగించు ఇంకొక వాసము లేదు. శరీరము కలవారికి తులతూచరానిది పరమఘోరమైన దుఃఖము కలుగును. ఇది ప్రాణులకు గర్బదుఃఖమును నీకు తెలిపితిని. ఈ గర్భవాసదుఃఖము స్థావర జజ్జమములకు ఆత్మగర్భానురూపముగా దుఃఖము కలుగును. గర్భము కంటే కోటిరెట్లు పీడ యోని యన్తముచే పీడించబడుట వలన కలుగును. మూర్చపొందినవానికి పుట్టుచున్నవానికి కలుగును. చెరుకువలె పీడించబడుచు పాపమను ముద్గరముచే పిండబడుచు గర్భమునుండి వెలువడువానికి బలవత్తరములైన సూతికా వాయువులచే గొప్ప దుఃఖము కలుగును. దానినుండి రక్షింపబడు ఉపాయమును తెలియజాలడు. సారములేని చెరుకు యంత్రముచే పీడించబడుచున్నట్లు యోనిలో నున్న శరీరము యోని యన్తముచే పీడించబడుచు బయటపడును. అస్థులు కలది, వర్తులాకారముగా నున్నది, స్నాయుబధ్ధములతో పరివేష్టితమైనది, రక్తమాంసవపలతో పూయబడినది, విణ్మూత్రద్రవములకు నివాసమైనది, కేశలోమ నఖములచే కప్పబడినది, ఉత్తమమైన రోగములకు నివాసము, వదనమను ఒకే మహాద్వారము కలది, 8 గవాక్షములచే అలంకరించబడినది, రెండు పెదవులను కవాటములు కలది, దంతములు జిహ్వ అను అర్గలములు కలది, నాడీ స్వేద ప్రవాహము కలది, కఫపిత్తములచే నింపబడియున్నది, జరాశోకములచే కూడియున్నది, కాలవక్రములోని అగ్నిలో ఉండునది.

కామక్రోధములచే ఆక్రమించబడుచుండునది, నిట్టూర్పులతో వర్ణించబడునది, భోగతృష్ణలచే ఆర్తి చెందినది, అతిరహస్యముగా నుండునది, రాగద్వేషములకు వశమైనది, అన్ని అంగములు ప్రత్యజ్ఞములు ఒకే వర్ణముగా చేయబడినది, మావిచే చుట్టబడినది, బహిరంగమైన సంకటముతో యోని మార్గమునుండి బయలువెడలునది, మలమూత్ర రక్తములతో తడుపబడిన అవయవములు కలది ఆరు కోశములచే పుట్టినది, అస్థిపంజరసంఘాతము ఈ కలేవరమున అర్పించబడినది, 365 తంతువులతో కూడియున్నది. 350 ఆవరణములచే కప్పబడినది. ఇవన్నీ రోమకోటులు. స్థూలసూక్ష్మములు దృశ్యాదృశ్యములు. చివరవరకు ఈ మాంసనాడులతో కూడుకొనియుండునది శరీరము. నిరంతరము స్వేదమును చిమ్ముచు అశుచిగానుండునది, లోపల ప్రాణభీతిచే కూడియున్నది. 32 దంతములు, ఇరువది నఖములు, పిత్తము, శుక్రార్థము, కఫము అర్థాఢకం అనగా రెండు శేర్లు. 30 పలముల వప అందులో సగం అనగా 15 పలముల కలలము, 10 కోట్ల వాయువుల పలమందురు. పది పలములు మేధస్సు. మహారక్తము మూడు పలములు, 12 పలములు మజ్జరక్తములు. కుడవమనగా శుక్రార్థమని తెలియవలయును. అందులో సగమే దేహధారులకు బలము. ఒక మాంసపిండము వేయి పలములు నూరు పలములు రక్తము. మలమూత్రములకు కొలత లేదు. రాజా! ఇట్టి దేహమను గృహమున ఆత్మ వసించును. విశుద్దమైన ఆత్మకు అశుద్ద శరీరముతో సంబంధము కర్మబన్ల వినిర్మితమే. అంతటా శుక్ర శోణితసంయోగమువలన దేహము పుట్టుచున్నది. ఎల్లపుడు విణూత్రములతో కలసియే ఉండును. కావున ఈ శరీరము అశుచియనబడును. మలముతో లోపల వెలుపల నిండియున్న అశుచి యగునో శాచముతో శోధించబడుచున్ననూ ఈ దేహము అశుచియే అగును. ఈ దేహమును చేరిన అతి పవిత్రములైన పంచగవ్యములు, హవిస్సులు అశుచిత్వమునే పొందును. ఎందుకనగా ఈ దేహము అశుచియే కదా! అతిస్వాదుతరములు, రుచ్యములైన అన్నపానీయములు కూడా సుగంధములు కూడా వెంటనే అశుచిత్వమును పొందును. ఇంతకంటే అశుచి మరేదుండును? ప్రతిదినము బయలువెడలుచున్న అశుచిత్వమును మలమూత్రస్వేదాదులను చూచుటలేదా?

దేహమును అనుసరించి ఉండు మలము దుర్గంధము. అట్టి మలమున కాధారమైన దేహము శుచి ఎట్లగును? పంచగవ్యములతో, దర్భజలముతో దేహము శోధించబడుచున్ననూ కాల్చబడుచున్న మర్దించబడుచున్న బొగ్గువలె నిర్మలత్వమును పొందదు. పర్వతమునుండి సెలయేర్లు ప్రవహించుచున్నట్లు ఎన్నో ద్రవములు శరీరమునుండి ప్రవహించుచుండును. అశుచియైన కఫమూత్రాదులతో నిండిన దేహము శుచి యెట్లగును? సకలవిధ అశుచిత్వములకు ఆధారమైన శరీరమునకు ఒక్క ప్రదేశము కూడా శుచిగా కనపడదు. రాత్రింబవళ్ళు మట్టితో, నీరుతో శోధించబడుచున్ననూ చేయి శుచి కాజాలదు. ఇంత చూచుచున్ననూ నరులు విరక్తులు అగుట లేదు. ఈ శరీరము ఎంత ధర పెట్టిన ధూపాదులతో ప్రయత్న పూర్వకముగా సంస్కవరించబడుచున్ననూ కుక్కతోక ఎంత వంచిననూ తన వంకరను విడువనట్లు శరీరము కూడా తన స్వభావమును విడువదు. బొగ్గును ఎంత సంస్కరించిననూ తెలుపును పొందజాలదు కదా! ఎంతగా శోధించిననూ శరీరము నిర్మలము కాజాలదు. తన దుర్గన్దమును తాను వాసన చూచుచున్ననూ, తన మలమును తాను చూచుచున్ననూ తన ముక్కును తానే నలుపుకొనుచున్ననూ ఈ లోకము విరక్తిని చెందదు. ఆహా! మోహము మాహాత్యము ఎంత ఆశ్చర్యకరము! ఆ మోహముతో జగమే వ్యామోహించబడుచున్నది. తన శరీరము యొక్క దోషములను చూచుచు దుర్గంధమును వాసన చూచుచు కూడా విరక్తిని చెందదు. తన శరీర దుర్గంధముతో కూడా విరక్తి చెందనివారికి విరక్తి కారణమింకేమి యుండును. జగత్తంతా పవిత్రమే. దేహమే గొప్ప అపరిశుద్దము. మలావయవములను స్పృశించుట వలన శుచి కూడా అశుచియే యగును. గంధము యొక్క లేపనమును తొలగించుటకు దేహమునకు శౌచము చెప్పబడినది. దోషము గంధము తొలగిన తరువాత భావశుద్ధితో దేహము శుద్ధిపొందును. సకలగంగాజలముతో మట్టిని శరీరమునకు వ్రాయుట వలన శుద్ది పొందును. దుర్గంధ దేహముగల మానవుడు దుష్టభావమున్నచో శుద్ధిని పొందజాలడు. దుష్టమైన మనసు గలవాడు తీర్థస్నానములతో తపములతో శుద్ధిని పొందజాలడు. తీర్థమున కడిగినంతమాత్రమున ఈ ఆకారము శుద్ధిని పొందజాలదు. అంతరంగము దుష్టమైనవాడు అగ్నిలో ప్రవేశించిననూ శుద్ధి లభించదు. అట్టివానికి స్వర్గము లభించదు. అపవర్గము లభించదు. ఒక దేహము మాత్రము దహించబడును. భావశుద్దియే పరమశౌచము. అన్ని కర్మలలో భావశుద్దియే పరమప్రమాణము. ఒక భావముతో ప్రియురాలు ఆలింగనము చేయబడును. మరొక భావముతో పుత్రికను ఆలింగనము చేసుకొందురు. వస్తువులు వేరు కాకున్ననూ మనసుచే వేరు చేయబడును.

స్త్రీ పుత్రుని ఒక భావముతో ఆలింగనము చేసుకొనును. పతిని వేరొక భావముతో ఆలింగనము చేసుకొనును. స్వభావానుగుణమే సకల జగము, సకల కార్యములు అని తెలియవలయును. భావహీనముగా భార్యను ఆలింగనము చేసుకొనరాదు. పలువిధములైన సుగంధములు రసవంతములైన అన్నాద్యములను భావము లేకుండగా ఆరగించరాదు. అందువలన అన్ని విషయములలో భావమే కారణము. ప్రయత్నించి చిత్తమును శుద్ధిపరచుకొనుము. బాహ్యశుద్దితో ఏమి లాభము? భావశుద్ధి మనశ్శుద్ధియున్నవాడు స్వర్గమును మోక్షమును కూడా పొందగలడు. జ్ఞానమును అవలంబించి వైరాగ్య మృత్తికతో అవిద్యారాగవిణ్మూత్ర లేపనము కలవాడైనచో శుద్ధి చేసిననూ నశించును. ఈ శరీరము సహజముగనే అశుచి అని తెలియుదురు. ఈ శరీరము కదలీసారము వంటిది. అసారము, నిస్సారము కూడా. ఇట్లు దేహము దోషము కలదని తెలిసి ప్రాజ్ఞుడు రాగాదులను శిథిలము చేసుకొనవలయును. అట్టివాడు సంసారమును దాటును. గట్టి పట్టుగలవాడు నిలచును. ఇట్లు అన్ని దుఃఖములకంటే జన్మదుఃఖము మహాకస్టమని చెప్పబడినది. నానా కర్మలవలన కలుగు అజ్ఞానదోషముచే గర్బములోనున్నపుడు కలిగిన జ్ఞానము పుట్టిన వెంటనే నశించును. దుఃఖముచే మూర్ఛను పొంది యోని యముచే పీడించబడుట వలన బాహ్య వాయువుతో కూడా దేహుల మోహసంగముతో ఘోరమైన ప్రపంచమును స్పృశించినంత మాత్రముననే జ్వరము కలుగును. ఆ గొప్ప జ్వరముతో మహామోహము కలుగును. మోహితునికి స్మృతిభ్రంశము త్వరగా కలుగును. అట్టి స్మృతిభ్రంశము వలన పూర్వకర్మ వశముచే జీవునికి ఆ జన్మలోనే రతి కలుగును. రాగమును పొంది మోహమును పొందిన జీవుడు చేయకూడని కార్యమున ప్రవర్తించును. తనను తెలియజాలడు. ఇతరులను తెలియజాలడు. దైవమును తెలియజాలడు. ఉత్తమ శ్రేయస్సును వినడు. నేత్రములున్ననూ చూడజాలడు.  

అట్టివాడు దారిలో మెల్లగా నడుచుచు అడుగడుగున జారిపడుచు జ్ఞానులచే బోధించబడిననూ బుద్ది ఉన్ననూ తెలియజాలడు. లోభవశమునందిన మానవుడు సంసారమున క్లేశములనందుచుండును. గర్భములోని స్మృతి లేకపోవుటకు శివుడు శాస్త్రమును చెప్పియున్నాడు. ఆ దుఃఖమును తెలుపుటకు స్వర్గమును, మోక్షమును సాధించునది ధర్మకామార్థములను సాధించునది శివుని జ్ఞానము మాత్రమే, కాని ఈ సంసారమున నరుడు తన శ్రేయస్సును తాను కలిగించుకొనడు. ఇది అత్యాశ్చర్యకరము. ఇంద్రియవృత్తులు పూర్తిగా తెలియనందున బాల్యమున గొప్ప దుఃఖము కలుగును. మంచిపని చేయవలయునని కోరుచున్ననూ చెప్పజాలడు. చేయజాలడు. లోలతను పెంచు వాయువుతో దంతములు వచ్చునపుడు కలుగు దుఃఖము చాలా గొప్పది. బాల్యములోని రోగములతో బాలగ్రహముల పీడలతో ఆకలిదప్పులు చుట్టుముట్టిన శరీరము కలవాడై ఒకచో నిలుచును. ఒకచో నడుచును. బాల్యమున మోహమువలన మలమూత్రములను భక్షించుటకు కూడా ప్రయత్నించును. కౌమారమున చెవులు కుట్టుటతో తల్లిదండ్రులు కొట్టుటతో అక్షరాదులు అధ్యయనాదులచే గురువులు పెద్దలు శాసించుటవలన దుఃఖము పొందును. మదించిన ఇంద్రియముల ప్రవృత్తివలన కామరాగాదులచే పీడించబడుచు రోగాదులచే నిరంతరము పీడించబడువానికి యౌవనములో మాత్రము సుఖమెక్కడిది? ఈర్ష్యాసూయలలోనూ గొప్ప దుఃఖమే. మోహము వలన దుఃఖము కలుగును. దానిలో దుఃఖము, దుఃఖముతో కోపించుట రాగము దుఃఖమునే కలిగించును. కామాగ్నిచే పీడించబడుచున్నవాడు రాత్రిపూట నిద్రను కూడా పొందజాలడు. ధనమును సంపాదించవలయునను చింతతో పగలు మాత్రము దుఃఖమెక్కడిది? సీసంగమమున ప్రవర్తించు పురుషుని దేహమునుండి శుక్రబిందువులు స్వేదబిందువులవలె సుఖమునకు కాజాలవు. కుష్టువ్యాధితో పీడించబడుచు క్రిములచే పీడించబడువానికి కండూయనముతో అగ్నితాపముతో కలుగు సుఖమే స్త్రీలలో నుండునని తెలియును. అక్టోపార్జన చింతలో కలుగు సుఖము కూడా అట్టిదే.

ఆ మాత్రమే సౌఖ్యము స్త్రీలలో కూడా అని తలచవలయును. అంతకన్నా అధికము లేదు. అదియే మానవునికి వేదన. అది లేనిచో చిత్తమునకు నిర్వతి ఉండజాలదు. ఇట్లు ఇదివరకు పొందినదానినే పరస్పరము పొందెదరు. అదియే ఇంకొకతీరుగా అగుచుండును. ఇట్లు ఈ శరీరమును ముసలితనము ఆక్రమించును. వ్యాధి వ్యాపించును. అపుడు ఈ శరీరము ప్రియము కాజాలదు. ఇదివరకెన్నడూ లేని విధముగా జరచే పీడించబడినదైన దేహమును చూచి కూడా విరక్తి చెందనిచో అతనికంటే ఇంకెవరు జడపదార్థము? ముసలితనము ఆక్రమించిన దేహి భార్యాపుత్ర బంధువులచే దురాచారములచే భృత్యులచే అవమానించబడిననూ శక్తిలేనివాడు గాన సహించును. ముసలితనము వచ్చినవాడు ధర్మమును అర్ధమును కామమును మోక్షమును సాధించజాలడు. కావున మౌవనములోనే "ధర్మమును ఆచరించవలయును. వాతపిత్త కఫాదుల వైషమ్యమే వ్యాధి అనబడును. ఈ దేహము వాతాది సమూహమే. కావున తన ఈ శరీరము వ్యాధిమయమని తెలియవలయును. వాతాదులకంటే భిన్నముకాదు గాన వ్యాధి పంజరము ఈ దేహము. నానావిధ రోగములచే దేహమునకు కలుగు దుఃఖములు పలు విధములు. అవి ఎవరికి వారే తెలియదగినవి. ఇంకా నీకేమి చెప్పవలయును. 101 మృత్యువులు ఈ దేహమున ప్రతిష్టించబడినవి. అందులో ఒకటి మాత్రమే కాలమృత్యువు. మిగిలినవి ఆగనుకములు. ఆగస్తుక మృత్యువులు ఔషధముల ద్వారా శాంతించును. జపహోమదానములచే కూడా శాస్త్రించును. కాలమృత్యువు శాంతించదు. అపమృత్యువు రోగాదులచే కలుగనిచో దాన్ని అనుభవించజాలడు. అనుభవించనివాడే అపమృత్యువునకు భయపడుచుండును. పలురకముల వ్యాధులు సర్పాసిప్రాణులు విషములు అభిచారములు ఇవన్నియూ దేహులకు మృత్యుద్వారములు. సర్వరోగాదులచే పీడించబడిననూ కాలమృత్యువును స్వయముగా ధన్వన్తరి కూడా తప్పించజాలడు. ఔషధములు తపస్సు, దానములు, తల్లి తండ్రి బంధువులు కాలపీడితుని రక్షించజాలరు. రసానములు తపస్సు జపములు యోగసిద్ధులు మహానుభావులు ఆగంతుకమృత్యువును శాస్త్రింపచేతురు కాని కాలమృత్యువును శాంతింపచేయజాలవు. కాలమృత్యువును పొందియే తీరవలయును.

చనిపోయినవాడు బహుయోనులలో కర్మవశమున పుట్టుచుండును. దేహము మారినంత మాత్రాన కర్మ క్షీణించుటవలన వియోగమును భావించుచున్నాడు. దానిని మరణమందురు కాని అది పరమార్దములో నాశము కాదు. మహాతమస్సులో ప్రవేశించినవానికి, సకల మర్మస్థానములు ఛేదించబడగా మరణమున జీవునికి కలుగు దుఃఖమునకు ఇచట సాటియైనది ఇంకొకటి లేదు. మరణముతో చాలా దుఃఖమును పొందుచు హా నాన్నా! ప్రియుడా! ప్రియురాలా అని ఆక్రందించును. ఈ జగత్తు సర్పముచే కప్పవలె మృత్యువుచే మ్రింగబడును. బంధువులు పరిత్యజించగా ప్రీతిపాత్రులు చుట్టుముట్టగా బరువుగా వేడిగా నిట్టూర్చుచు ఎండిపోయిన నోటితో మంచము మీద పొర్లుచు మాటి మాటికి మూర్ఛిల్లుచుండును. మూఢుడై కాళ్ళు చేతులు ఇటునటు విసరుచుండును. మంచము పైనుండి భూమిపైకి భూమి పైనుండి మంచము మీదికి చేరుటకు కోరుచుండును. తన వశమును తప్పినవాడై సిగ్గును విడిచి మలమూత్రములచే పూయబడి ఎండిన గొంతు, పెదవులు, దవడలు కలవాడు నీరును యాచించుచు తన ఆస్తిని ధనమును గూర్చి చింతించుచు నేను మరణించిన తరువాత ఇదంతా ఎవరిదగును అని ఆలోచించుచు యమదూతలు కాలపాశముతో ఆకరించుచు గొనిపోబడుచు గొంతులో గుర్ గుర్ ధ్వని వచ్చుచుండగా మరణించును. జలగ ఒక గడ్డిపోచనుండి ఇంకొక గడ్డిపోచను చేరునట్లు ఒక దేహము నుండి ఇంకొక దేహమును చేరును. పూర్వదేహమును విడిచి తరువాతి దేహమును పొందును. వివేకము కలవారికి మరణదుఃఖము కంటే యాచనా దుఃఖము పెద్దది. మరణము వలన కలుగు దుఃఖము కణికము. యాచనవలన కలుగు దుఃఖము అననము. జగత్పతి అయిన శ్రీమహావిష్ణువు యాచించుటకు వామనుడాయెను. యాచనా దుఃఖము కంటే లాఘవమును పొందించని ఇతర దుఃఖమేది అధికమని ఇపుడు నాకు తెలిసినది. మృత్యువు కన్నా యాచనా దుఃఖమే అధికము. కావున ఇతరులను యాచించరాదు ఆశ చులకనకు కారణము. యాచనకు మొదట దుఃఖమే మధ్యలో దుఃఖమే అంతములో భయంకరమైన దుఃఖము సంభవించదు.

సకలప్రాణులకు దుఃఖపరంపర సహజసిద్ధము. వర్తమానమున దుఃఖములే గతకాలమున దుఃఖములే. పుట్టుకగురించి విచారించరాదు. పుట్టుకతో విరక్తిచెందడు. ఆహారము అతిగా తీసుకున్ననూ దుఃఖమే. అల్పారమున దుఃఖమే. భోజనము చేయుచున్నపుడు కంఠము అటు ఇటు కదులుచుండును. కావున భోజనమున మాత్రము సుఖమెక్కడిది? అన్ని రోగముల కంటే శ్రేష్ఠతమమైన వ్యాధి ఆకలియే. సామాన్య రోగి ఔషధము లేనిచో ఆ క్షణము మాత్రమే చింతించును. ఇక ఆకలివ్యాధి వేదన తీవ్రమైనది. సంపూర్ణ బలమును నశింపచేయును. ఇతర వ్యాధుల వలె క్షుద్వ్యాధితో ఆవరించబడినవాడు మరణించును. రసము కూడా జిహ్వాగ్రమును తిప్పివేయును. అందులో మాత్రమేమి సౌఖ్యమున్నది. ఆ క్షణార్థకాలమున కంఠమును చేరి నివర్తించును. కావున క్షుద్వ్యాధితో బాధపడుతున్నవారికి అన్నము సుఖమునకని తలచరాదు. ఇక అన్ని కార్యములను విడిచిపెట్టి చనిపోయినవానివలె పరుండుటలో తమస్సు నిండిన మనసు

కలవానికి సౌఖ్యమెక్కడిది? ఇక మేలుకొనిననూ తాను చేయవలసిన పనులలో మునిగినవానికి సౌఖ్యమెక్కడిది? వ్యవసాయము వ్యాపారము సేవ గోరక్షాది పరిశ్రమలలో సుఖమెట్లుండును? ప్రొద్దున మలమూత్ర విసర్జనములతో మధ్యాహ్నము ఆకలిదప్పులతో రాత్రి కామునితో నిద్రతో తృప్తిని పొంది ఆనందమనుచునే బాధించబడుచుందురు. ధనమును సంపాదించుటలో దుఃఖము సంపాదించిన ధనమును రక్షించుటలో దుఃఖము. అర్థము నశించిననూ దుఃఖమే. వ్యయమైననూ దుఃఖమే. కావున ధనముతో మాత్రము సుఖమెక్కడిది? దేహము కలవారికి మృత్యువు వలె భయమున్నట్లు ధనవంతులకు దొంగలవలన, జలమువలన, అగ్నివలన, స్వజనుల వలన, రాజు వలన భయమెప్పుడూ ఉండునదే. ఆకాశమున పక్షులు మాంసమును భుజించును. భూమిలో మృగములు మాంసమును భుజించును. నీటిలో మత్స్యములు భుజించును. అట్లే ధనమును వాడు అన్ని చోట్ల అందరిచే భుజింపబడును. అనగా ధనంతుని ధనమును అన్ని చోట్ల అందరూ హరించుటకే ప్రయత్నించుచుందురని తాత్పర్యము. సంపదలలో మోహింపచేయును. విపత్తులలో వారించుచుండును. సంపాదించినపుడు కష్టపెట్టును. ఇక ధనమెప్పుడు సుఖమును కలిగించును? ధనపతి మొదట ఉద్విగ్నుడైయుండును. తరువాత అన్ని విషయములలో విరక్తి కలుగును. ఈ ఇద్దరిలో ధనవంతుడే దుఃఖమును పొందుచుండును. విరక్తుడే సుఖమును పొందును అని నా అభిప్రాయము. హేమన్తములో చలిబాధ, గ్రీష్మములో ఎండబాధ, వర్షర్తువులో అతివృష్టి, అనావృష్టి బాధ. కావున ఏ కాలము సుఖమునిచ్చును? వివాహమునకై చేయు ప్రయత్నములో నాలుగైదు రోజులు వివాహము చేయుటలో దుఃఖమే. తరువాత గర్భభారము దుఃఖమే. ప్రసూతిలో బాధ, ప్రసూతి సమస్యలతో బాధ. శిశువుల మలమూత్రాది కర్మలతో బాధ. శిశువులకు దంతవ్యాధి, నేత్రవ్యాధి, నాసికాది వ్యాధులతో అన్నీ బాధలే.

నా గోవులు నశించినవి. వ్యవసాయము దెబ్బతిన్నది. నా భార్యా పారిపోయినది. ఇన్ని ఆపదలు వచ్చినవి. ఇంటిని చెప్పదలచినచో భయము. నా భార్యకు చిన్న శిశువు సంతానము కలది. అనగా బాలెంత. అన్నమెవరు వండెదరు? ఇక పెళ్ళి విషయమున నా కన్యకు ఎట్టి భర్త లభించునో? ఇట్టి చింతలు కలవానికి సంసారులకు సుఖమెక్కడిది? కుటుంబ చింతతో ఆకులత చెందినవానికి కులము శీలము, అన్ని గుణములు, బాగా కాలని కుండలో పోసిన నీటివలె దేహముతో పాటు నశించును. సంధీ విగ్రహ చింతతో రాజ్యమున మాత్రము సుఖమెక్కడిది? పుత్రుని వలన కూడా భయమున్న సంసారమున ఇంకా సుఖమెట్లు లభించును? సకల ప్రాణులకు సజాతీయుల వలననే భయముండును. సజాతీయులు ఒకే ద్రవ్యమునాశించుచుండుట వలన శునకములకు వలెనే పరస్పరము భయముండును. అడవిలోనికి వెళ్ళకుండగా ఏ ఒక్క రాజైననూ ప్రసిద్ధి పొందినవాడున్నాడా? అన్నిటిని కాదనుకున్నవాడే భయము లేకుండగా సుఖముగా నుండగలడు. మహాపరాక్రమము కల కార్తవీర్యార్జునుని వేయి బాహువులను జమదగ్ని పుత్రుడైన పరశురాముడు ఖండించెను. జమదగ్ని పుత్రుడైన పరశురాముని బలమును శ్రీరాముడు నశింపచేసెను. జరాసస్థుడు రాముని తేజస్సును కీర్తిని నశింపచేసెను. జరాసంధుని బలమును భీముడు నశింపచేసెను. భీముని బలమును హనుమంతుడు నశింపచేసెను. ఆ హనుమంతుడు సూర్యునిచే విసరివేయబడెను. బలదర్పితులైన నివాతకవచాది దానవులను అర్జునుడు సంహరించెను. ఆ యర్జునుడు గోపాలులచే ఓడించబడెను. ప్రతాపవంతుడైన సూర్యుడు కూడా మేఘములచే కప్పబడును. ఆ మేఘము వాయువుచే వేరుచేయబడును. వాయుబలమును పర్వతములు హరించినవి. ఆ పర్వతములను అగ్ని కాల్చును. ఆ అగ్నిని నీరు చల్లార్చును. ఆ జలమును సూర్యుడు హరించును. ఆ సూర్యుడు జలముతో పాటు మూడు లోకములు బ్రహ్మకు ఒక పూట కాగానే నశించును. ఆ బ్రహ్మ కూడా దేవతలతో కలిసి పరార్థ ద్వయ కాలము ముగియగానే శివునిచే పరమాత్మచే సంహరించబడును. ఇట్లు ఈ సకల చరాచర జగత్తులో పరమాత్మ జగన్నాధుడు అవ్యయుడైన శ్రీమన్నారాయణుడు తప్ప సర్వాతిశాయియైన బలమెక్కడా లేదు. ప్రతిదీ ఎంతో కొంత గొప్పదే అని తెలిసి అతి గర్వమును విడువవలయును. ఇట్టి జగత్తులో ఎవడు పండితుడు? ఎవడు సర్వాతిశాయి దేవత? అన్నీ తెలిసినవాడు ఏ ఒక్కడూ లేడు. అట్లే పూర్తిగా మూర్ఖుడూ ఎవ్వరూ లేరు. అతను తెలిసినంతలో అతను అచట పండితుడు.

అన్ని విషయములలో సమాధానమునకు ప్రభావము ఒకే తీరుండును. ధనము ఎక్కువగా నున్నచో ఎవరికో ఒకరికి ఏదో ఒకచో ప్రభావము కనబడును. దానవులు దేవతలను గెలిచిరి. మరల దేవతలు దానవులను గెలిచిరి. ఇట్లు వారి వారి అదృష్టానుసారముగా జయము పరాజయము కలుగుచుండును. రాజులకు కూడా రెండు వస్త్రములు, ఒక చెంబెడు నీరు, తగినంత భోజనము, వాహనము, శయ్య, ఆసనము తప్ప మిగిలినవన్నీ దుఃఖమునే కలిగించును. శయ్యామందిరమున కూడా రాజునకు కావలసినది ఒక మంచము మాత్రమే. వేలకొద్ది ఉదకుంభములు కష్టమును, ఆయాసమును విస్తరింపచేయుటయే. ప్రత్యూషకాలమున మంగల వాద్యఘోషము పురవాసులందరికీ సమానమే. రాజ్యమున రాజునకు ఇది నా ఇంటిలో మ్రోగించబడుచున్నదని అభిమానమాత్రమే. ఆభరణములన్నీ బరువే. ఆలేపనమంతా మలమే. గానమంతా ప్రలాపమే. నృత్యము ఉన్మత్తచేష్టయే. ఇట్లు రాజ్యభోగములతో విచారించినచో సుఖమెక్కడిది? రాజులకు విరోధముతో ఒకరినొకరు గెలువవలయునని చింతయేయుండును. శ్రీమదముతోనే నహుషాదిరాజులు స్వర్గము చేరిరి. మరల పతనమైరి. కావున సంపదతో ఎవరు సుఖమును పొందును? స్వర్గములో కూడా ఇతరుల సంపద ఉజ్జ్వలముగా నుండుటను చూచినపుడు సౌఖ్యమెక్కడిది? దేవతలు కూడా ఒకరినొకరు మించవలయునని అసూయతోనే ఉందురు. నరులు స్వర్గమున పుణ్యఫలమును మూలమును ఛేదించియే అనుభవింతురు. స్వర్గమున ఉన్న పుణ్యమున అనుభవించెదరు గాని ఇంకొక పుణ్యకర్మను చేయజాలరు. అదే స్వర్గమున మహాభయంకరమైన దోషము. మూలము ఛేదించబడిన వృక్షము కొన్ని దినములలో క్రుంగిపడునట్లు పుణ్యము క్షీణించుటవలన స్వర్గవాసులు భూమిపై పడెదరు. సుఖాభిలాషతోనున్నవారికి సుఖభోగాది సమూహములతో హఠాత్తుగా వచ్చిన కష్టము దుఃఖము కూడా స్వర్గవాసులకు తప్పదు. కావున చక్కగా ఆలోచించినచో దేవతలకు స్వర్గమున కూడా సుఖము లేదనియే చెప్పవలయును. స్వర్గములో కర్మలు సిద్ధించునపుడు భోగము, కర్మలు క్షీణించినపుడు దుఃఖమే. ఇక నరకాగ్నిలో దేహులకు మహాదుఃఖము, మహాకష్టము తెలిసినదే. వాక్కు మనస్సు, కాయములవలన ఏర్పడిన భయంకరమైన పలు భావములతో మహాకష్టములు సంభవించును. గొడ్డళ్ళతో నరుకుట, నారవస్త్రములు నేయుట, ఆకులను కొమ్మలను, ఫలములను పడవేయుట అది కూడా తీవ్రవాయువుతో నదులచే ఇతర దేహులచే ఉన్మూలనము దావాగ్ని హిమశోషములచే స్థావజాతులలో దుఃఖము అట్లే భుజంగసర్పముల క్రోధముతో మహాభయంకరమైన దుఃఖము దుష్టులను చంపుట, పాశములచే బాధించుట సంభవించును.

కీటకములు అకస్మాత్తుగా పుట్టుట అట్లే మరణించుట. ఇవి మాటిమాటికి సంభవించును. ఇట్లే పాములకు ఇతర కీటకములకు సంభవించుచుండును. ఇక పశువులకు తమను తాము అదుపులో వుంచుకొనుట, దండములతో కొట్టుట, ముక్కును కుట్టి తాడువేసి భయపెట్టుట, కొరడాతో బాగా కొట్టుట, బెత్తము, కట్టెలు మొదలగువాటితో, గుదిబండతో, అంకుశముతో అవయవములను బంధించుట, భావముతో మనసుతో కష్టములతో భిక్ష యువాది పీడనము, తమ మందనుండి విడిపోవుట, బలముతో గొనిపోవుట, బంధించుట ఇవి పశువులకు శరీరమునకు కలుగు కష్టములు అనేకములు కలవు. వర్షము, చలి, ఎండలతో పక్షులకు చాలా కష్టము. ఇట్లు అఖిల జంతువులకు పలు విధములుగా దుఃఖములు సంభవించును. ఇక నరులకు గర్భవాసమున గొప్ప దుఃఖము పుట్టుక దుఃఖమే. బాల్యమున అజ్ఞాన దుఃఖము, కౌమారమున పెద్దల శాసనము, యౌవనమున కామరాగ ఈర్ష్యలతో దుఃఖము. ఇట్లే వ్యవసాయము, వ్యాపారము, సేవాదులచే గోరక్షాది కర్మలతో కష్టము. వృద్ధభావమున ముసలితనముతో, వ్యాధులతో బాధలు. మరణమున పెద్ద దుఃఖము, యాచనలో ఇంకా దుఃఖము. రాజుల వలన, అగ్నివలన, పిడుగుల వలన, దొంగల వలన, శత్రువుల వలన పెద్ద భయము. ధనమును సంపాదించుటలో, రక్షించుటలో, నశించుటలో, వ్యయములో గొప్ప దుఃఖము. పిసినారితనము, మత్సరము, దంభములు ధనాధిక్యమున గొప్ప భయము. చేయగూడని పనులలో ప్రవర్తించుట ధనము కలవారికి కలుగు భయము. భృత్యవృత్తి, వడ్డీవ్యాపారము దాస్యము పారతంత్ర్యత, ఇష్టము కలుగకుండుట అనిష్టము కలుగుట వేలకొలది సంయోగవియోగములు, కరువు దౌర్భాగ్యము, మూర్ఖత్వము, దారిద్ర్యము పైన క్రింద నరకములు, రాజవిక్రమము, ఒకరినొకరు అవమానించుకొనుట దుఃఖము. ఒకరితో ఇంకొకరికి భయము, ఒకరినొకరు కోపించుకొనుట ఇవి రాజులకు కలుగు దుఃఖములు.

కోరికలున్నవానికి భావములు అనిత్యములు. ఒకరి రహస్యముల నొకరు బయలుపరచుట, ఒకరి చేతిని ఇంకొకరు పీడించుట, వేటగాళ్ళు పక్షులు పాపభేదముననుసరించి ఒకరినొకరు భక్షించుట ఇత్యాది దుఃఖములతో చరాచర జగత్తు భయపడుచున్నది. కావున మానవుడు నరకమునుండి మనుష్యలోకము వరకు అన్నిటిని విడువవలయును. బరువును ఒక భుజము నుండి ఇంకొక భుజమునకు మార్చుకొని విశ్రాంతిగా భావించునట్లు ఈ లోకమంతా ఒక దుఃఖమును ఇంకొక దుఃఖముతో తొలగించుకొనును. ఒకటి కంటే ఇంకొకటి గొప్పదిగా భావించుచు భోగమను నావలను అధిరోహించెదరు. దేవతలకు ధర్మము క్షీణించుటవలన స్వర్గమున దుఃఖము కలుగును. పుణ్యము క్షీణించుట వలన నానా యోనులలో సంభవించుట. దేవలోకములో కూడా పలు విధములగు రోగములు చెప్పబడినవి. అశ్వినీదేవతలు యజుని శిరమును ఛేదించిరి. ఆ దోషముతో యజ్ఞునికి ఎల్లపుడూ శిరోరోగమే ఉండును. భాస్కరుని కుష్టువ్యాధి, వరుణునికి జలోదర వ్యాధి, పూషకు దత్తభంగము, ఇంద్రునికి భుజము స్తంభించుట, చంద్రునికి గొప్ప క్షయరోగము, దక్షునికి గొప్ప జ్వరము ఇట్లు ప్రతికల్పములో గొప్ప దేవతలకు కూడా క్షయము, రెండు పరార్థముల తరువాత బ్రహ్మకు కూడా క్షయము. దక్షుని పుత్రిని తనకు పౌత్రిని బ్రహ్మ పూర్వము కామించుట, ఈ ప్రభువే కోపముతో యోగమును తెలిసిన జయను శపించుట వీటివలన కామక్రోధములున్నచోట దోషములు కూడా అట్టివే సంభవించును. ఇట్లు సకలవిధ దుఃఖములున్నవి. ఇందు సంశయము లేదు. అగ్నిహోత్రునికి తగ్గుట, హెచ్చుట, పుట్టుట, నశించుట కలదు.

 స్త్రీని వధించుట, కామాసక్తి, పాండవులకు సారధ్యము, ఇక రుద్రుడు త్రిపురదాహము, దక్షయజ్ఞ వినాశము, కుమారస్వామి శుక్రుని వలన జన్మ, అనేక క్రీడలు ఇట్లు త్రిమూర్తులు కూడా రాగాదిదోషములు కలవారే. దేవతలందరు దోషయుతులే. వీరందరికంటే సర్వలోక ప్రభువు శాత్తుడు, పరిపూర్ణుడు, ముక్తిప్రదుడు. ఇట్లు జగత్తు మొత్తము ఒకరినొకరు మించవలయుననే భావనతో నుందురు. జగత్తంతయు దుఃఖాకులమే అని తెలిసి నిర్వేదమును చెందవలయును. నిర్వేదముతో విరక్తి, విరాగము వలన జ్ఞానము, జ్ఞానము వలన పరమాత్మ స్వరూపజ్ఞానము, పరమాత్మ స్వరూపజ్ఞానము వలన మంగలప్రదమైన ముక్తి లభించును. ముక్తి లభించినచో సకల దుః ఖములు తొలగును. స్వస్థుడై సుఖియగును. అపుడు సర్వజ్ఞుడు పరిపూర్ణుడు, ముక్తుడు అనబడును.

మహారాజా! నీవడిగినదంతయూ నీకు తెలిపితిని. సర్వజ్ఞానముచేతనే ధర్మాధర్మ వివేకము కలుగును. కావున దేవరాజాజ్ఞవలన ఇంద్రలోకమునకు వెళ్ళవలయును.

ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున పితృమాతృ తీర్థమాహాత్యమున అరువది ఆర - అధ్యాయము.