పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
4 - అధ్యాయము
సూతమహర్షి పలికెను.
ఆ నలుగురు పుత్రులు గోలోకమునకు వెళ్ళిన తరువాత మహాజ్ఞానియగు శివశర్మ చిన్నపుత్రునితో ఇట్లు పలికెను.
‘మహాజ్ఞానీ సోమశర్మా! నీవు పితృభక్తితత్పరుడవు. నేనిచ్చు అమృతభాండమును జాగ్రత్తగా కాపాడుము. నా భార్యతో నేను తీర్థయాత్రలకు వెళ్ళుచున్నాను.’ అంత సోమశర్మ ‘మహానుభావా! అట్లే కానిండు. అమృతభాండమును కాపాడెదను’ అని పలికెను అంత శివశర్మ సోమశర్మకు అమృతభాండమునిచ్చి పది సంవత్సరములు నిరంతరాయముగా తపమాచరించెను. జాగరూకతతో సోమశర్మ రాత్రింబవళ్ళు అమృతభాండమును కాపాడుచుండెను. అపుడు మహాకీర్తిమంతుడగు శివశర్మ మరల అటకు వచ్చెను. మరల ఒక మాయతో తనను తన భార్యను కుష్టరోగగ్రస్తులుగా ఏర్పరచుకొని మాయతో మాంసపిండములుగా కనపడుచు సోమశర్మవద్దకు వచ్చెను. అట్లు వచ్చిన వారిద్దరిని దుఃఖితులను చూచి అంతులేని జాలితో సోమశర్మ ఇట్లు పలికెను. వారి పాదములకు నమస్కరించి ‘మీలాంటివారిని తపఃప్రభావసంపన్నులను ఇదివరకు చూడలేదు. సద్గుణరాశులు, పుణ్యరాశులు అయిన మీయందు ఇదేమిటి? దేవతలందరూ దాసులుగా ఎల్లపుడూ మీ ఆజ్ఞాపాలకులు. మీచే ఆకర్షించబడి వచ్చుచున్నారు. మీ శరీరమున ఏ పాపముతో ఈ వ్యాధి ప్రాప్తించెను. మా తల్లి పుణ్యాత్మురాలు, పతివ్రత. భర్త ప్రసాదముతో మూడు లోకములను గెలువగలదు. ఈమె ఎట్లు ఈ వ్యాధిని పొందినది. తపస్సునకు ఫలము లేదు. రాగద్వేషములను విడిచి అన్ని కర్మములతో భర్తను దైవములా సేవించునది. ఎలా కుష్టువ్యాధిని పొందినది.’
శివశర్మ పలికెను.
‘పుణ్యాత్ముడా! విచారించకు. కర్మఫలమును అనుభవించి తీరవలయును. రోగమున్న మమ్ములను శుద్ధిచేయవలయును. నీకు పుణ్యము కావలయునన్నచో మమ్ములను సేవించుము.’ ఇట్లు శివశర్మ పలుకగా మహానుభావుడగు సోమశర్మ పుణ్యాత్ములగు మిమ్ములను సేవింతును. తలిదండ్రులను పూజించని నేను పాపిని, దుష్టుడను, లోభిని అగుదును. అట్టి నాకు ఏ పనిచేయు అర్హత ఉండదు. ఇట్లు పలికి వారి దుఃఖముతో తాను దుఃఖించుచు వారి శ్లేష్మమూత్ర పురీషములను శుద్దిచేయుచుండును. పాదప్రక్షాలనమును, శరీరమును వత్తుట, స్నానము, ఆసనములను భక్తితో చేయుచుండెను. మహానుభావుడగు సోమశర్మ ఈ ఇద్దరిని భుజములపై కూర్చుండబెట్టుకొని పుణ్యతీర్థములకు గొనిపోయి స్వహస్తములతో స్నానము చేయించుచు మంత్రపూర్వకముగా యథావిధిగా మంగళస్నానమును చేయించి, పితృతర్పణమును, దేవతాపూజనమును తల్లిదండ్రులతో చేయించుచుండెను. స్వయముగా అగ్నిలో హవనము చేయును. ఉత్తమాన్నమును వండును. ఇద్దరిని మేల్కొల్పును. భుజింపచేయును. పడకపై పరుండబెట్టును. నిద్రపుచ్చును. వస్త్రములు పుష్పాది సుగంధద్రవ్యములను ప్రతినిత్యము వారికిచ్చును. సుగంధద్రవ్యములతో తాంబూలమును ఇచ్చును. వారి కోరికలను తీర్చును. కందమూలములు, పాలుపండ్లు, భక్ష్యాదులను ప్రతినిత్యము ఇచ్చును. వారు అడిగినదానిని వెంటనే ఇచ్చుచుండును. ఈ క్రమముగా సోమశర్మ ప్రతినిత్యము ప్రసన్నులను చేయుచు పూజించుచుండెను.
ఇట్లు ప్రతినిత్యము సేవించుచున్ననూ శివశర్మ ప్రతిదినము సోమశర్మను పిలిచి నిందించుచుండెను. నిష్ఠురవాక్యములతో నిందించుచు ముష్టిఘాతములను కూడా ఇచ్చుచుండెను. అన్ని విధములుగా సేవించుచున్ననూ పుణ్యకార్యములనాచరించుచున్ననూ కులపాంగనా నీవు చక్కగా పనులను చేయుటలేదు. ఇట్లు నిష్ఠురముగా నిందించుచు దండముతో కొట్టుచుండెను. ఇట్లు చేయుచున్ననూ సోమశర్మ కోపించుట లేదు. మనోవాక్కాయములతో సంతుష్టునిగానే తండ్రిని పూజించుచుండెను. ఇట్లే తల్లిని కూడా ప్రతిదినము పూజించుచుండెను. దీనినంతయూ పరిశీలించుచున్న శివశర్మ తనను తాను తన నడవడిని పరీక్షించుకొనెను. విష్ణుశర్మ నా కొరకు అమృతమును తెచ్చెను. అతను పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, పితృభక్తిపరాయణుడు. ఇట్లు ఆలోచించుచు కొంతకాలము గడిపెను. అంతట శివశర్మ సోమశర్మ భక్తిని చూచి ఇట్లు ఆలోచించసాగెను. నేను మొదట యజ్ఞశర్మను తల్లి శరీరావయవ ఖండములను అంతటా వెదజల్లిరమ్మని చెప్పితిని. నా మాటను పాటించెనే కాని తల్లి అని జాలి తలచలేదు. ప్రాణములేని శరీరమును నరకుట స్వల్పమే. కాని వేదశర్మ తన తలను ఖండించుకొని మహాసాహసమును ప్రదర్శించెను. కాని ఈ సోమశర్మ కృత్యము అన్నిటికంటే గొప్పదిగా తలచుచున్నాను. ఇతడు ఒక నిమిషము కూడా కదులుట లేదు. సాహసమునే చేయుచున్నాడు. ఇతని తపఃప్రభావము పరమసత్యముగా కనపడుచున్నది. ప్రతినిత్యము మమ్ములనారాధించుచూ తపఃప్రభావమును పెంచుకొనుచున్నాడు. అందుకే ఇతని తపఃప్రభావమును పరీక్షించుచున్నాను. భక్తిభావమునుండి కాని, సత్యమునుండి కాని కొంచెము కూడా చలించుట లేదు. నా మాయతో నా శరీరమున కుష్ఠురోగమును కూడా చూపితిని. శ్లేష్మమలమూత్రములను చూచి అసహ్యించుకొనుట లేదు. స్వయముగా తన చేతులతో వ్రణములను శుద్దిచేయుచున్నాడు. పాదములను వత్తుచున్నాడు. శౌచమును చేయుచున్నాడు. ఎంత కఠినముగా దుస్సహముగా మాటలాడుచున్ననూ సహించుచున్నాడు. బెదిరించుచున్ననూ నిందించుచున్ననూ కొట్టుచున్ననూ ప్రియముగానే మాటలాడుచున్నాడు. ఎన్నివిధములుగా కష్టపెట్టుచున్ననూ అన్నిటిని సహించుచున్నాడు. శ్రీమహావిష్ణువు ప్రసాదముతో (దయతో) ఇతని దుఃఖమును తొలగించెదను. ఇట్లు సోమశర్మను గూర్చి శివశర్మ తనలో తానాలోచించుకొనెను.
శివశర్మ మరల మాయను ప్రదర్శించి భాండమునుండి అమృతమును అపహరించెను. తరువాత సోమశర్మను పిలిచి ఇట్లు పలికెను. నేను నీకు వ్యాధినాశకమగు అమృతమునిస్తిని. నేను త్రాగుటకు వీలుగా నాకు త్వరగా అమృతభాండమునిమ్ము, విష్ణుశర్మ అనుగ్రహమువలన లభించిన అమృతముతో రోగరహితుడనగుదును. శివశర్మ ఇట్లు పలికిన వెంటనే లేచి త్వరగా వెళ్ళి శూన్యముగానున్న అమృతకలశమును చూచి ఇట్లు ఏపాపి చేసెను. నాకు అప్రియమును చేసినవారెవ్వరు? ఇట్లు విచారించుచు సోమశర్మ దుఃఖితుడాయెను. తండ్రివద్ద ఈ సత్యమును తెలిపినచో వ్యాధిపీడితుడగు తండ్రి కోపించును. ఇట్లు చాలాసేపాలోచించి సోమశర్మ నాకు సత్యము పితృశుశ్రూష చేసిన తపస్సు, ఇంద్రియనిగ్రహము, ధర్మపాలన నిజమగుచో ఈ ఘటము అమృతపూర్ణము కావలయును. ఇట్లు ధ్యానము చేసి చూచిన వెంటనే కలశము అమృతపూర్ణముగా కనపట్టెను. అట్లు చూచిన సోమశర్మ సంతుష్టుడై తండ్రివద్దకు వెళ్ళి నమస్కరించి త్వరగా అమృతకలశమును తెచ్చి తండ్రిగారూ! తెచ్చిన ఈ అమృతభాండమును స్వీకరించుడు. పానము చేసి రోగనిర్ముక్తులు కండు. ఇట్లు సత్యధర్మార్థయుతమగు వాక్యమును మధురముగా వినిన శివశర్మ సంతోషము నిండినవాడై ఇట్లు పలికెను.
ఇది శ్రీ పద్మపురాణమున ద్వితీయమగు భూమిఖండమున శివశర్మోపాఖ్యానమున నాలుగ - అధ్యాయము.
