పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
38 - అధ్యాయము
సూత ఉవాచ - సూతమహర్షి పలికెను.
ఇట్లు బోధించబడిన వేనుడు పాపస్వభావమును పొందెను. ఇట్లు మహాపాపి అయిన జైనునితో మోహించబడి ఆ దుర్మార్గుని పాదములకే నమస్కరించి సత్యధర్మాదిక్రియలను వేదధర్మములను విడిచి చక్కని యజ్ఞములను మానిపించెను. వేదములను నిషేధించెను. పవిత్రములగు శాస్త్రములతో ప్రవర్తింపచేయు ధర్మమును కూడా నడిపించలేదు. అట్టి వేనుని శాసనము వలన లోకమంతయూ పాపమయమాయెను. వేదములు లేవు. యాగములు లేవు. ధర్మశాస్త్రములు లేవు. దానములు లేవు. అధ్యయనము లేదు. ఇట్లు ధర్మము లోపించి మహాపాపము కొనసాగినది. అంగుడు వారించిననూ వ్యతిరేకముగానే ఆచరించుచుండెను. తండ్రి పాదములకు తల్లి పాదములకు నమస్కారము కూడా చేయుట లేదు. ఏ బ్రాహ్మణునికి నమస్కరించుట లేదు. నేనొక్కడినే ప్రతాపవంతుడను అని గర్వించి తలిదండ్రులు వారించుచున్ననూ తీర్థదానాది శుభకార్యములు ఆచరించకనే తన భావానుగుణముగా చాలాకాలము దుష్కృత్యములనాచరించుచుండెను. ఇట్లు అంగుడు అందరితో ఇతను ఎందువలన పాపి ఆయెను? వంశమునకు మచ్చ ఎందుకు తెచ్చుచున్నాడు? అని విచారించి చివరికి మృత్యువు పుత్రికయగు సునీధను ఎవరి దోషమువలన ఇట్టి దుష్టుడు జన్మించెనో నిజము చెప్పుము అని యడిగెను.
సునీధోవాచ - సునీధ పలికెను.
నందిని ముందే తన చరితను పుణ్యమును నా దోషములను అంగునకు చెప్పినది. నేను నా బాల్యముననే మహానుభావుడగు సుశంఖుడు తపము చేయుచుండగా నేను పాపమును చేసితిని. అంతకుమించి మరేమియు చేయలేదు. కోపించిన సుశంఖుడు నాకు దుష్టసంతానము కలుగునని శపించెను. ఈ విషయము నాకు తెలుసు. కావుననే ఇతడు దుష్టుడాయెను. ఈ మాటలను వినిన తరువాత మహాతేజస్వి అయిన అంగుడు ఆ ప్రియురాలితో కలిసి వనమునకు వెడలెను. ఇంతలో ఈ సప్తర్షులు వేనుని వద్దకు వచ్చిరి. అంగపుత్రుడగు వేనుని పిలిచి ఇట్లు పలికిరి.
వేనమహారాజా! సాహసమును చేయకుము. నీవు ప్రజాపాలకుడవు. ఈ సకల చరాచరజగత్తు త్రైలోక్యము నీ అధీనములోనిదే. సకల జగత్తు ధర్మములోనే నిలిచియున్నది. పాపకర్మలను విడిచి పుణ్యకర్మల నాచరించుము. ఇట్లు వారు పలుకగా నవ్వుచూ వేనుడిట్లు పలికెను. నేనే పరమధర్మమును నేనే సనాతన ధర్మమును. నేనే పోషకుడను. రక్షకుడను. నేనే వేదార్ధమును. నేనే ధర్మమును, మహాపుణ్యమును. సనాతనమగు జైనధర్మమును. ఓ బ్రాహ్మణులారా! కర్మతో ధర్మస్వరూపుడనగు నన్నే సేవించుడు.
ఋషయః ఊచుః - ఋషులు పలికిరి.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను మూడు వర్ణములు ద్విజులనబడుదురు. అన్ని వర్ణములకు అతిసనాతనమైనది శ్రుతి. అందరూ వేదాచారముతో ప్రవర్తింతురు కావుననే ప్రాణులు జీవించుచున్నవి. నీవు బ్రహ్మవంశములో పుట్టినవాడవు. బ్రాహ్మణుడవు. తరువాత పరాక్రమమును ప్రవర్తింపచేసి రాజులైతిరి. రాజేన్హా! రాజుల పుణ్యముతోనే ద్విజులు సుఖముగా జీవింతురు. రాజుల పాపముతో నశింతురు. కావున పుణ్యమునాచరించుము. నీవు ధర్మమునాదరించితివి. ఆచరించితివి. ఇది కృతయుగధర్మము. త్రేతాయుగధర్మము ద్వాపరమున ప్రవర్తించదు. కలి ప్రవేశమున మానవులు అధర్మమును ప్రవర్తింపచేతురు. జైనధర్మమునాశ్రయించి అందరూ పాపమోహితులై వేదాచారమును విడిచి పాపమును పొందెదరు. జైనధర్మము పాపమునకు మూలము. ఇందులో సందియము లేదు. ఈ జైనధర్మముతో మోహితులై పతితులౌదురు. మానవులందరూ పాపపు పుట్టలేదురు. అట్టి పాపులను నశింపచేయుటకు సర్వపాపపరిహారకుడగు గోవిందుడు అవతరించును. తన ఇచ్ఛానుసారముగా రూపు దాల్చి పాపులను సంహరించును. ఇట్లు పాపులు ఒకచోట కూడగా మ్లేచ్ఛులను నశింపచేయుటకు శ్రీహరి స్వయముగా కలిగా యవతరించును. కావున పాపవ్యవహారమును విడువుము. పుణ్యమునాచరించుము. సత్యముతో ప్రవర్తించుము. చక్కని ప్రజాపాలకుడవు కమ్ము.
వేన ఉవాచ - వేనుడు పలికెను.
నేను జ్ఞానులలో శ్రేష్ఠుడను. ఇచట నా కంతయూ తెలియును. విపరీతముగా ప్రవర్తించువాడు దండించబడుట తథ్యము. ఇట్లు అతిగా పలుకు పాపబుద్ధియగు ఆ రాజు విషయమున ఆ బ్రహ్మపుత్రులందరూ కోపించిరి. ఆ మహానుభావులందరూ కోపించుటను చూచిన రాజు బ్రహ్మశాప భయముతో పుట్టలో ప్రవేశించెను. అంతట కోపించిన ఆ ఋషులు అంతట వేనునికై చూచిరి. పుట్టలో మృతిచెందినాడని తెలిసిన ఋషులు పాపబుద్ది క్రూరుడగు వేనుని బలముతో పైకి తెచ్చిరి. పాపకర్ముని వేనుని చూచిన ఋషులు సావధానులై కోపముతోనే రాజు ఎడమచేతిని మధించిరి. ఆ చేతినుండి చాలా పొట్టి వాడు నల్లనివాడు భయంకరుడు పుట్టెను. అతను ఎర్రని కనులు కలవాడు. బాణము ధనువు కలవాడు. పాపులగు నిషాదులకు పాలకుడు పోషకుడు, మ్లేచ్చులకు రాజాయెను. పాపకర్ముడగు ఆ నిషాదుని చూచిన ఋషులు దక్షిణపాణిని మధించిరి. ఆ చేతినుండి భూమినుండి ఓషధులను పితికిన మహానుభావుడు పృధువను మహాజ్ఞాని మహాబలుడు రాజరాజు పుట్టెను. ఆ పృథుచక్రవర్తి పుణ్యమువలన ధర్మార్థకోవిదుడగు వేనుడు కూడా చక్రవర్తి పదవిని అనుభవించి శ్రీహరి అనుగ్రహమువలన శ్రీవిష్ణులోకమగు పరమపదమును చేరెను.
ఇది శ్రీపాద్మపురాణమున రెండవదియగు భూమిఖండమున వేనోపాఖ్యానమున 38 - అధ్యాయము
