పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
43 - మేరుపర్వతమున ఇక్ష్వాకు సైనికులతో శూకరయుద్దము
సుకలోవాచ – సుకల పలికెను.
ఇట్లు ఆ శూకరములన్నీ యుద్ధమునకై అచట చేరిరి. ముందరనున్న రాజునకు వేటగాళ్ళు అచట నిలిచిరి. రాజేన్హా! మహావరాహము గిరిసానువును ఆశ్రయించియుండెను. ఆ వరాహము గొప్ప యూధభావముతో వ్యూహమును ఏర్పరచి నిలిచెను. ఆ వరాహము కపిలవర్ణము కలది. స్థూలమైన బలిసిన అవయవములు కలది. మహాదంష్టలు కలది. పెద్ద నోరు కలది. సహింపశక్యముకాని శూకరమది. అతిభయంకరముగా గర్జించుచున్నది. శాలతాలవనమును ఆశ్రయించియున్న ఆ వరాహములను మహారాజు చూచెను. వారి మాటలను వినిన ప్రతాపవంతుడైన మనుపుత్రుడు శూరమైన ఈ వరాహమును పట్టుకొనుడు. బలముతో గర్వించిన వరాహమును కొట్టుడు. ఇట్లు పలికి వారితో ప్రతాపవంతుడైన మనుపుత్రుడు ముందుకురికెను. అంతట ఆ వేటగాళ్ళందరు వేటమదముతో మోహించబడినవారై సన్నద్దులై కవచములను ధరించి వేటకుక్కలతో ముందుకు వెడలిరి. మహాబలుడైన రాజరాజు మహాసంతోషముతో కూడినవాడై అశ్వమునధిరోహించి మంచి సైన్యముతో చతురంగబలముతో పర్వతరాజమైన మేరుపర్వత ప్రాంతములోని గంగాతీరమునకు వచ్చెను. ఆ పర్వతము రత్నధాతువులతో నిండియున్నది. నానావృక్షములతో అలంకరించబడియున్నది.
సుకలోవాచ - సుకల పలికెను.
ఆ మేరుపర్వతము బలమునకు, కాంతికి నిలయమైన సూర్యభగవానుని కిరణసమూహ ప్రసారముచేత కాంతివంతమై, అత్యున్నతమై ఆకాశమునే చేరుచున్నట్లుగా చాలా చిన్న చిన్న పర్వతముల చరియల, శిఖరముల శోభను అందుకొని, ప్రకాశించుచున్నది. చాలా యోజనముల దూరము ప్రవహించుచున్న పరిశుద్ధమైన, అలలతో కూడిన గంగానదిచే శోభించుచు, ముత్యముల వంటి నిర్మలమైన నీటి బిందువులచే అంతట ప్రక్షాళనము చేయబడుటచే తెల్లని శిలాతలములు గలదై మేరుపర్వతము చక్కని శోభతో కూడియున్నది. దేవతలు, చారణులు, కిన్నరులు, గంధర్వ విద్యాధర సిద్ధ, అప్సరోగణములతో, నాగేంద్రులతో, మునిజనులతో కూడియున్నది. శ్రీఖండ, చందన, సరళశాల, తమాలవృక్షములతో, ఉత్తమ సిద్ధిని ప్రసాదించు రుద్రాక్షలతో, కల్పవృక్షములతో శోభించుచున్నది. నానాధాతువులతో చిత్రవిచిత్ర వర్ణములు గలది, నానారత్నములతో నిండియున్నది, ప్రియురాండ్రతో వారి సువర్ణహారములతో ప్రకాశించు విమానపంక్తితో శోభించుచున్నది. ఆ పర్వతశిఖరములందు నారికేళవనములు, పూగ పున్నాగ, వకుళ, కదలీఖండమండితముగ, చంపక పాటల కేతక పుష్పములతో సువాసితమై పలు లతల సమూహములతో, లతలలోని పుష్పముల సుగంధములతో, పద్మములు నిండిన సరస్సులతో, నానావర్ణములుగల పుష్పములతో, నానావృక్షములతో అలంకరించబడియున్నది. దివ్యవృక్షములతో కూడుకొనిన స్ఫటిక శిలాతలములు గలది. యోగి యోగీంద్ర సిద్దులచే సేవించబడు గుహలు గలది. అందమైన సెలయేళ్ళు, పర్వతశిఖరములనుండి ప్రవహించుచున్న జలపాతములతో, నదీప్రవాహజలము, జలపాతముల, సెలయేరుల జలముల సంగమములతో క్రొత్తకాంతిని పొందియున్నది. మడుగులు, కుంటలు, బావులు, సరస్సులు మొదలగు వివిధ జలాశయములనుండి, బయల్వెడలుచున్న నిర్మల జలధారలతో, అనేకమైన కొండచరియలతో, శిఖరములతో, పర్వతరాజము భాసించుచున్నది. ఆ పర్వతరాజమున శరభ శార్దూల సింహాది మృగసమూహములు విహరించుచున్నవి. బాగా మదించిన ఏనుగులు, మహిషములు, ఎనుబోతులతో కూడియున్నది. ఇట్లు లెక్కకు మిక్కిలి దివ్యభావములతో పర్వతరాజమైన మేరువు శోభించుచున్నది.
అయోధ్యాపతి, మనుపుత్రుడైన ఇక్ష్వాకువు ఉత్తమురాలైన భార్యతో, చతురంగబలములతో, ముందు వేటగాండ్రు, అతివేగముగా పరుగెత్తు, వేటకుక్కలతో, భార్యతో కూడియున్న సూకరము ఉన్నచోటికి వెడలెను. ఆ సూకరము కూడా పెద్దవి, చిన్నవి అయిన చాలా సూకరములతో, మేరుభూమిని, గంగాతీరమును ఆశ్రయించి ఉన్నచోటికి వచ్చెను. ఇక్ష్వాకు మహారాజును చూచి ఆ వరాహము తన ప్రియురాలితో ఇట్లు పలికెను. “ప్రియురాలా! బలశాలియగు కోశలాధిపతి వచ్చియున్నాడు చూడుము. నాకొరకు వేటాడుటకు సిద్దమైయున్నాడు. దేవదానవులకు సైతము గగుర్పాటు కలిగించు గొప్ప యుద్దమును చేయుదును.”
తరువాత మహాతేజశ్శాలియగు మహారాజు ధనుర్బాణములు ధరించి, సత్యధర్మములను నిరంతరమనుసరించు తన ప్రియురాలగు సుదేవతో సంతోషముతో యిట్లు పలికెను.
“ప్రియురాలా! మహాబలము గలది, గర్జించుచున్న ఈ మహావరాహమును చూడుము. ఈ వరాహము తన పరివారముతో కూడియున్నది. మృగములను వేటాడువారికిది అందరానిది. ఇపుడే దీనిని తీక్షములైన బాణముతో వధించెదను. మహాశౌర్యముగల యా వరాహము నాతో యుద్దమునకై ఎదురువచ్చుచున్నది.” ఇట్లు భార్యతో పలికి, వేటగాండ్రతో యిట్లు చెప్పెను “ఈ వరాహబలమునకు తగిన శూరులను పంపుడు” అని. అట్లు ఇక్ష్వాకు ఆజ్ఞచే బలము, తేజము, పరాక్రమముగల వేటగాండ్రు పంపబడినవారై, గర్జించుచు పరుగెత్తిరి. వారందరు వరాహము వంకకు వాయువేగముతో వెడలిరి. ఆ వనేచరులు తీక్షణమైన బాణసమూహములతో కొట్టసాగిరి. వీరత్వముతో నున్న ఆ వరాహమును నానా శస్త్రాస్త్రములతో కొట్టుట మొదలిడిరి.
వేటగాండ్రు వదలిన శరములు, బాణములు, తోమరములు, పర్వతముపై మేఘములు వర్షించు ధారలు భూమిపై పడినట్లు వారాహముపై పడుచుండెను. దృఢమైన ఆయుధములతో కొట్టబడుచు, నూర్లమంది వేటగాండ్రతో ఓడించబడుచున్నను యూధపతి అయిన ఆ వరాహము యుద్ధరంగమున మధ్యలో నిలిచెను. ఆ వరాహము గూడా తన పుత్రులు, పౌత్రులు, బంధువులతో కలిసి, శత్రువులను చంపసాగెను. తన కోరలతో సంహరించబడుచున్న వేటగాండ్రు క్రిందపడసాగిరి. అమితవేగముగా త్రిప్పుటవలన కాళ్ళు చేతులు విరిగి కొందరు పడసాగిరి. వేటగాండ్ర గర్జనలతో, వచ్చుచున్న ఇక్ష్వాకు మహారాజును వారాహము చూచెను. తన తేజస్సుతో ముఖముతో, దంష్టలతో, నశింపచేయబడుచున్న వేటగాండ్రను, ఆ వరాహమును చూచుచున్న ఇక్షాకు మహారాజు, వారాహము వెళ్ళిన చోటికే తాను వెళ్ళసాగెను. రాజు వెడలిన చోటికి వారాహము వెళ్ళసాగెను. ఆ వరాహముతో రాజు యుద్దము కోరనట్లుగా అనిపించెను. అయినను కోపించిన సూకరరాజు మహానుభావుడైన ఇక్ష్వాకుమహారాజును అడ్డగించి భయపెట్టి యుద్దహర్షముతో ఇక్ష్వాకువుతోనే యుద్దము కోరుచుండెను. యుద్దములో నేర్పరి అయిన వరాహము మహారాజుతో యుద్దమును కోరుచు, తుండాగ్రముతో తీక్షదంష్టలతో, నఖములతో భూమిని క్షోభింపచేయుచు, గర్వముతో హుంకరించుచు, మహారాజు పరిశుద్దుడని, విష్ణుపరాక్రమముగలవాడని తెలిసికొని సంతోషముతో పులకించెను. సాటిలేని సూకర పౌరుషమును చూచిన ఇక్ష్వాకువు దేవశత్రువైన రాక్షసుడే వరాహరూపముతో వచ్చెనని ఆలోచించి యిట్టి శత్రువును నివారించు ఉపాయమును ఆలోచించి, ఈ వరాహము నశించుటకు తన వేటగాళ్ళతో “వరాహమును పట్టి బంధించుడు” అని ఆదేశించెను.
ఏనుగులు వేగవత్తరమైన రధములు పంపబడినవి. సువర్ణ ఖడ్గములను ధరించినవారు భుశుండి ముద్దరము పాశములను ధరించిన వేటగాళ్ళు అచట నాదములు చేయుచుండిరి. అచట పరుగెత్తుచున్న హయములు గజములు వారించబడుచున్ననూ ఆగుట లేదు. అచట వరాహము ఒక్కొక్కచోట కనబడుటలేదు. కొన్ని చోట్ల కనపడుచున్నది. కొన్నిచోట్ల భయమును చూపుచున్నది. కొన్నిచోట్ల గుఱ్ఱములను మర్ధించుచున్నది. యుద్దములో జయింపశక్యము కాని వరాహము వీరులైన భటులను మర్దించి క్రోధముతో ఎర్రబారిన కనులు గలదై సహింపరాని శబ్దమును చేసెను. యుద్దములో జయింపశక్యముకాని పెద్ద శరీరముకలది, యుద్ధము చేయుచున్న మేఘగంభీరనాదమును చేయుచున్న ఆ వరాహమును కోశలాధిపతి చూచెను. ఆ వరాహము గర్జించుచున్నది. యుద్దమును చేయుచున్నది, వీరులను తన తేజస్సుతో మర్ధించుచు విలసిల్లుచున్నది. నోటిలో మెరుపు తీగవలె దంష్ట విరాజిల్లుచున్నది. ఆ వరాహము ఉల్లాసముతో విహరించుచున్నది. మనుపుత్రుడైన ఇక్ష్వాకు మహారాజు అలా వరాహమును నిశితమైన శరములతో కొట్టబడిన దానిని బంధువులతో ఒక్కొక్క వరాహము శరములతో కొట్టబడిన దానిని చూచెను.
అంతట ఇక్ష్వాకు మహారాజ సైనికులతో మీ బలముతో ఆ సూకరమును ఎందుకు పట్టుకొనుట లేదు? నిశితములైన బాణములతో తీక్ష ములైన ఆయుధములతో యుద్ధము చేయుడు అని పలికెను. మహానుభావుడైన రాజు కోపించి పలికిన మాటలను విని ఆ సైనికులందరూ యుద్ధమునకు వచ్చిరి. ఎన్నో వేలమంది భటులతో యుద్ధము చేయుచున్న ఆ వరాహమును అన్ని దిక్కులలో చుట్టుముట్టి యుద్ధమున సూకరమును ఆయుధములతో భేదించిరి. కొందరు బాణజాలములతో కొట్టిరి. మంచి యోధులు యుద్ధమున విశాలములైన చక్రఘాతములతో వజ్రపాతములతో ఆ వరాహము కొట్టబడినది. ఆ వరాహము యుద్దమున జయింపరానిది. అంతట పౌరుషముతో కోపముతో ఆ వరాహము యుద్ధమున పాశములను తెంపుకొని మరల నిలిచెను. బయలుదేరెను. మహా శూకరములతో కలిసి రక్తధారలతో అభిషేకించబడుచున్ననూ యుద్దమునకు బయలుదేరెను. తుండములతో వీరులను కొట్టుచుండెను. గుఱ్ఱములను, యేనుగులను ఛేదించెను. తీక్ష మైన తన దంష్ట్రాగ్రభాగముతో వీరులైన పదాతులను రోషముతో పడవేయసాగెను. కోపించిన ఆ వరాహము యేనుగు తొండమును ఖండించెను. కోపించి పాదనఖములతో భటులను కొట్టి సంతోషించెను.
అంతట సూకరములు వేటగాళ్ళు పరస్పరము క్రోధారుణ నేత్రములతో యుద్దము చేసిరి. వేటగాళ్ళతో వరాహములు వధింపబడ్డవి. వరాహములతో వేటగాళ్ళు వధింపబడిరి. యుద్ధభూమిలో చంపబడి భూమి మీద పడి రక్తముతో నెల్లబారిరి. వరాహములతో కొట్టబడి ప్రాణములను విడిచి భూమిపై బడిరి. యోధులచే చంపబడి వరాహములు పడిపోయినవి. కొన్ని వేటకుక్కలు ప్రాణములను విడిచినవి మృగములను చంపు వేటగాళ్ళు చంపబడి అక్కడక్కడా భూమిపై పడియుండిరి. రాజు తన ఖడ్గపాతములచే చాలా శూకరములను వధించెను. కొన్ని వరాహములుచనిపోయినవి. మరికొన్ని భయపడి గుహలలో దాగియున్నవి. కొన్ని పొదలలో మరికొన్ని కందరములలో, ఇంకొన్ని గుహలలో నిలిచియుండెను. వరాహముల దంష్ట్రాగ్రములతో ఛేదించబడి వేటగాళ్ళు కొందరు ప్రాణములను విడిచిరి. అట్లు మరణించి స్వర్గమునకు చేరిరి. మరికొందరు ఖండఖండములుగా చీల్చబడిరి. వలలు, పాశములు, కుటకములు, పంజరములు, నరములు అక్కడక్కడ తెంపబడి భూమిపై పడియున్నవి. ఒక్క వరాహరాజు మాత్రము తన ప్రియురాలితో కలిసి అయిదారుగురు పౌత్రులతో కలిసి బలదర్పితమై యుద్దమునకు నిలిచియుండెను.
అపుడు సూకరి మరల సూకరముతో ఇట్లు పలికెను. “ప్రియుడా! ఈ బాలకులతో, నాతో కలిసి రమ్ము.” ఆ మాటలను వినిన వరాహము ప్రీతిచెంది భయపడుతున్న ప్రియురాలితో ఇట్లు పలికెను. “నేను అన్ని విధములుగా ఆయుధములతో భేదించబడితిని. ఎక్కడికి పోదును. నాకు నిలువ స్థానము లేదు. నేను నశించినచో ఈ వరాహయూధము నశించును. రెండు సింహముల మధ్య సూకరము నీరు త్రాగగలదు కాని రెండు సూకరముల మధ్య సింహము నీరు త్రాగజాలదు. ఇది సూకరజాతులలో కనబడుచున్న ఉత్తమ బలము. నేను భగ్నమై మరణించుచు ఈ రాజు సైన్యమును నశింపచేసియే వెళ్ళేదను. మహానుభావురాలా! గొప్ప శ్రేయస్సును కలిగించు ధర్మమును తెలియుదును. ఏ లోభముతో కాని, భయముతో కాని యుద్దము చేయుచు నశించుచు రణతీర్థమును విడిచి వెళ్ళినచో అతను పాపి అగును. ఇందులో సంశయము లేదు. వీరలు తీక్షణమైన శస్త్రసమూహమును చూచి సంతోషించును. యుద్దములో మరణించిన సురగంగలో స్నానమాడి ఆ తీర్థము తీరమును చేరును. అట్టి వారు వైష్ణవలోకమును చేరును. తన పితరులను తరింపచేయును. వచ్చుచున్న వీరులను చూచుచూ ఖిన్నుడనైన నేను ఎట్లు వెళ్ళేదను?
వీరులకు ఆనందమును కలిగించువానిని శస్త్రములతో నిండియున్నవానిని యోధుని చూచి సంతోషముతో ఎదురేగువానికి కలుగు ఫలమును వినుము. అట్టివానికి ప్రతి అడుగులో గంగాస్నానము లభించును. ప్రియురాలా! యుద్దమున భంగపడి ప్రాణముమీది లోభముతో ఇంటికి వెడలినవానికి కలుగు ఫలమును వినుము. అట్టివాడు తల్లి దోషమును బయలుపరచినవాడగును. అట్టివాడిని స్త్రీజాతుడు (స్త్రీ అయినా పురుషరూపముననున్నవాడు) అని నలుగురు అందురు. పరాక్రమమును ప్రకాశించిన చోట యజ్ఞములు, తీర్ధములు మహాతేజోవంతులైన దేవతలు, మునులు, సిద్దచారణులు కుతూహలముతో చూచుచుందురు. ఇచటనే మూడు లోకములు నిలిచియున్నవి. యుద్దమున భంగపడినవానిని త్రైలోక్యవాసులందరూ వింతగా చూతురు. ఇతను పాపి, ధైర్యములేనివాడు అని శపించెదరు. పిరికివాడని పరిహసింతురు. అట్టివానికి ధర్మరాజు దుర్గతిని చూపును. ఇందులో సంశయము లేదు. యుద్దమున వీరునికి ఎదురుగా నిలబడి తన శిరోరక్తమును తానే త్రాగవలయును. అట్టివానికి అశ్వమేధఫలము లభించును. ఇంద్రలోకమునకు వెడలును. వరాననా! యుద్దమున శూరుడు శత్రువులను జయించినచో సంపదలను నానా భోగములను అనుభవించును. ఇందులో సంశయము లేదు. శత్రువునకెదురుగా నిరాశ్రయుడై ప్రాణములను విడిచినచో పరమస్థానమును పొంది దేవకన్యను అనుభవించును. ఇట్లు నేను యుద్దధర్మమును, మీరధర్మమును తెలియుదునే! భంగపడి ఎట్లు వెళ్ళేదను?
మనువు పుత్రుడు, ధీరుడు ఇక్ష్వాకు మహారాజుతో యుద్ధము చేసెదను. ఇందులో సంశయము లేదు. వరాననే! నీవు పిల్లలను తీసుకొని వెళ్ళుము. సుఖముగా జీవించుము.” అతని మాటలను వినిన ఆ సూకరం ఇట్లు పలికెను. “నేను నీ స్నేహగౌరవరస రతిక్రీడాది బంధములచే బంధించబడితిని. మానదా! నీ ముందే నా పిల్లలతో కలిసి ప్రాణములను విడుతును.” ఇట్లు ఆ వారాహదంపతులు మాట్లాడుకొని ఒకరి హితమును ఒకరు కోరుచు యుద్ధము చేయుటకే నిశ్చయించుకొనినవారై శత్రువులను చూచుచుండిరి. కోశలాధిపతి వీరుడైన ఆ ఇక్ష్వాకుమహారాజును, మహాబుద్ధిమంతుని చూడసాగెను. చక్కని వర్షాకాలములో మెరుపుతీగల ప్రకాశములతో ఆకాశమున మేఘము గర్జించునట్లు ప్రియురాలితో కలిసి ఆ వీర వరాహము చక్కగా గర్జించుచున్నది. గిట్టలను భూమిపై వ్రాయుచు రాజశేఖరుని ఆహ్వానించుచుండెను. అపుడు మహానుభావుడైన ఇక్ష్వాకుమహారాజు పురుషార్థముతో కూడి గర్జించుచున్న ఒక్క వరాహమును చూచెను. వెంటనే వేగముగా పరుగెత్తగల అశ్వమును అధిరోహించి ఆ వరాహము ముందుకు ఉరికెను.
ఇది శ్రీ పద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున నలుబదిమూడ - అధ్యాయము.
