పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
59 - తీర్థయాత్రను చేసి ఇంటికి వెళ్ళదలచిన కృకలునికి ధర్మము పితృబంధమును చూపుట
విష్ణురువాచ - విష్ణువు పలికెను.
కృకలుడు సర్వతీర్థములను పర్యటించి సేవకునితో కలిసి మహానన్దముతో తన ఇంటికి బయలుదేరెను. కృకలుడు ఎప్పుడూ నా సంసారము సఫలము. నా పితృదేవతలు తృప్తిచెంది స్వర్గమునకు వెళ్ళెదరు. ఇట్లు ఆలోచించుచుండెను. ఇంతలో కృకలుని పితామహులను ప్రత్యక్షముగా బంధించి అతని ముందుకు ఒక మహానుభావుడోచ్చి నీకుత్తమ పుణ్యము కలుగలేదు అని పలికెను. అతను దివ్యరూపుడు మహాకాయుడు కృకలునితో ఇట్లు పలికెను. “నీకు తీర్థఫలము లేదు. నీవు పడిన శ్రమ అంతా వృధా. నీకు నీవుగా సంతోషమును పొందుచున్నావు. నీకు ఉత్తమ పుణ్యము కలుగుట లేదు. ఇట్లు అతని పలుకులను వినిన కృకలుడు దుఃఖముచే పీడించబడుచు నీవు ఎవరవు? ఎందుకిట్లు పలుకుచున్నావు? నా పితామహులను ఎందుకు బంధించినావు? ఇది ఏ దోషప్రభావము? నాకు నీవు కారణమును తెలుపుము. తీర్ధ ఫలము ఎందుకు లేదు? నా యాత్ర సఫలమెందుకు కాదు? నీకు స్పష్టముగా తెలిసినచో నాకంతయూ తెలుపుము.
ధర్మ ఉవాచ - ధర్మము పలికెను.
పవిత్రురాలు, పుణ్యతమురాలు అయిన తన భార్యను విడిచి వెళ్ళినవాడు ఆచరించిన పుణ్యఫలము అంతయూ వ్యర్థమగును. ధర్మాచారపరురాలు, పుణ్యురాలు, సాధువ్రతపరాయణురాలు, పాతివ్రత్యరతురాలు, సుగుణవతి, పుణ్యమునందు ప్రీతి కలది అయిన భార్యను విడిచి ధర్మకార్యమును ఆచరించినవాడు అతనాచరించిన ధర్మమంతయూ వ్యర్థమగును. సర్వాచారపరాయణురాలు, శుభకరురాలు, ధర్మసాధకతత్పరురాలు, ఎల్లపుడు పతివ్రతరతురాలు, జ్ఞానవత్సలురాలు ఇట్టి భార్య పరమపుణ్యురాలు ఎవరికి ఉండునో అతని ఇంటిలో దేవతలు సర్వదా నివసింతురు. అతనింటిలో మధ్యలో పితృదేవతలుండి అతనికి శ్రేయస్సును వాంఛించెదరు. గంగాది పున్యనదులు, సాగరములు కూడా అతనింటిలో నుండును. సత్యతత్పరురాలైన పుణ్యసతి ఉన్న ఇంటిలో యజ్ఞములు, గోవులు, ఋషులు అచటనే యుందురు. అచటనే అన్ని తీర్ధములు పుణ్యములు పలువిధములు ఇవన్నీ భార్యతోనే ఉండును. పవిత్రురాలైన భార్యాయోగముతో గృహస్థాశ్రమమేర్పడును. ఈ భూమండలమున గృహస్థాశ్రమమును మించిన ధర్మము ఇంకొకటి లేదు. సత్యపుణ్యములతో కూడియున్న గృహస్థుని ఇల్లు పావనమైనది. ఆ ఇల్లు సర్వతీర్థమయము, సర్వదేవమయము కూడా. గృహస్థాశ్రమము నాశ్రయించియే సకల ప్రాణులు జీవించుచుండును. ఇటువంటి ఉత్తమాశ్రమము ఇంకొకటి కనపడదు.
సతి భార్య ఉన్న ఇంటిలోనే మంత్రములు, అగ్నిహోత్రములు, దేవతలు, సనాతన సర్వధర్మములు, దానములు, ఆచారములు అన్నీ ప్రవర్తించును. భార్యలేని ఇల్లు అడవి అగును. యజ్ఞములు, వివిధ దానములు సిద్ధించజాలవు. భార్యలేని పురుషునికి మహావ్రతములు సిద్ధించజాలవు. ధర్మకార్యములు అన్ని పుణ్యకార్యములు సిద్దించజాలవు. భార్యతో సమానతీర్ధము లేదు. ధర్మమును సాధించవలయునన్న భార్యయే ఉత్తమ తీర్ధము. గృహస్థునకు భార్యను మించిన ఇంకొక ధర్మము లేదు. పురుషునికి భార్య ఉన్నచోటే ఇల్లు. గ్రామముకాని, అరణ్యము కాని, సర్వధర్మసాధనము భార్యయే. భార్యతో సమానమైన తీర్థము లేదు. భార్యకు సాటివచ్చు సుఖము లేదు. భార్యతో సమానమైన పుణ్యము లేదు. తరింపచేయునది, హితమును కలిగించునది భార్యయే. నరాధమా! ధర్మయుక్తురాలైన భార్యను విడిచి వెళ్ళుచున్నావు. గృహమును, ధర్మమును విడిచి వెళ్ళుచున్నావు. ఇక నీకు ధర్మఫలమెచటున్నది. భార్య లేకుండగా తీర్థమున శ్రాద్ధమును నీవు పెట్టినందున ఆ దోషముతో నీ పూర్వ పితామహులు బంధించబడిరి. శ్రాద్ధము పెట్టిన నీవు దొంగవు. శ్రాద్ధ భోజనము చేసిన వీరు దొంగలు. నీవు చేసిన శ్రాద్దమునకు భార్యలేనిదే అన్నము లభించదు. శ్రద్దతో సుపుత్రుడు శ్రాద్దము చేసినచో భార్య ఇచ్చు పిండముతో అతనికి కలుగు పుణ్యమును చెప్పెదను.
అమృతపానముతో నరులకు తృప్తి కలుగునట్లు శ్రాద్దముతో పితృదేవతలకు తృప్తి కలుగును. నేను ముమ్మాటికీ నిజమునే చెప్పుచున్నాను. గృహస్థ ధర్మమునకు భార్యయే యజమానురాలు, మూఢా! నీవు నీ భార్యను మోసగించి వ్యర్థముగా చోరకర్మను చేసితివి. ఈ పితరులు పెద్ద చోరులు. భార్య లేకుండా తిన్నవారుకూడా చోరులే. భార్య తన చేతితో అమృతముగా వండినదానినే పితృదేవతలు సంతోషము నిండిన మనస్సుతో భుజించెదరు. ఆ భోజనముతోనే తృప్తి పొందెదరు. సంతోషించెదరు. కావున పురుషుడు భార్య లేకుండగా ధర్మమే లేదు. సిద్దించదు. పురుషులకు సుగతిని ప్రసాదించు భార్యా సమతీర్థము ఇంకొకటి లేదు. భార్య లేకుండగా ఆచరించిన ధర్మము వ్యర్థమగును.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున యాబది తొమ్మిద - అధ్యాయము.
