పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
11 - అధ్యాయము
ఋషులు పలికిరి.
సర్వజ్ఞులగు తాము చెప్పిన దైత్యదానవుల యుద్ధమును వినగలిగితిమి. ఇపుడు మహానుభావుడగు సువ్రతుని చరితమును వినగోరుచున్నాము. సువ్రతుడు ఎవరి పుత్రుడు? ఏ గోత్రమునబుట్టినవాడు? అతను చేసిన తపమేది? శ్రీహరిని ఎట్లు ఆరాధించెను.
సూతమహర్షి పలికెను.
నేను పూర్వము వినినది వినినట్లుగా జ్ఞానమహిమవలన మహానుభావుడగు సువ్రతుని చరితమును చెప్పెదను. సువ్రతుని చరితము పావనము, దివ్యము, విష్ణువు ప్రభావమును తెలుపునది. శ్రేయములను ప్రసాదించునది. సమగ్రముగా శ్రీమహావిష్ణువు అనుగ్రహముతో మీకు వివరించెదను.
మహానుభావులారా! పూర్వకల్పమున పాపనాశకమగు సుక్షేత్రమున రేవాతీరమున పరమపావనమగు వామనతీర్థమున కౌశికకులమున పుట్టిన సోమశర్మ అను ద్విజోత్తముడు పుత్రహీనుడగుటవలన బహుదుఃఖములు కలవాడుగా నుండెను. దారిద్ర్యదుః ఖముతో సంతానములేని దుఃఖముతో ఎపుడూ పీడింపబడుచు పుత్రులను పొందుటకు ధనమును పొందుటకు కూడా రాత్రింబగళ్ళు ఆలోచించుచుండెను. అతని భార్య సుమన అనునది పరమపతివ్రత. చింతతో తలవంచుకొనియున్న భర్తను చూచెను.
తపశ్శీలురాలగు సుమన తన ప్రియుని అట్లుండుట చూచి ఇట్లు పలికెను. తమ మనస్సు అనంత దుఃఖములతో కలచబడినది. నీవు మోహముతో ఆవరించబడియుంటివి మహామతీ! చింతను విడువుము. నీకేమి దుఃఖము కలిగెనో నాకు తెలుపుము. స్వస్థుడవై సుఖమును పొందుము. చింతతో సమానమగు దుఃఖము కాని శరీరమును శుష్కింపచేయునది కాని ఇంకొకటి లేదు. చింతను విడిచినవాడు సుఖసంతోషములనందగలరు. నా ముందు చింతకు కారణమును చెప్పుము. ఇట్లు ప్రియురాలి వాక్యమును వినిన సోమశర్మ ప్రియురాలితో ఇట్లు పలికెను.
సోమశర్మ పలికెను.
మంగళకరురాలా! కోరియే చింతించుచుంటిని. చింతయే దుఃఖమునకు కారణము. నీకు అదియంతయూ వివరించెదను. విని నిశ్చయించుము. నేను ఏ పాపముతో పుత్రహీనుడను ధనహీనుగానైతినో తెలియకున్నాను. ఇదియే నా దుఃఖమునకు కారణము.
సుమన పలికెను.
అన్ని విజ్ఞానములను తెలియబరుచునది, అన్ని సందేహములను తొలగించునది, ఉపదేశస్వరూమును చెప్పెదను వినుము. లోభము పాపబీజము. మోహము పాపమూలము. ఆ వృక్షమునకు అసత్యము కొమ్మ. మాయాశాఖలు విస్తరించియున్నవి. దంభము, కౌటిల్యము ఆకులు, కుబుద్ధిచే పూలు పూచును. దాని పరిమళము అనృతము, అజ్ఞానము ఫలము. కపటము, నాస్తికత, దొంగతనము ఈర్ష్య క్రూరులు అసత్యభాషులు, పాపులు మోహవృక్షము యొక్క మాయాశాఖలను ఆశ్రయించు పక్షులు. ఆ యజ్ఞాన ఫలమునకు అధర్మము రసము, ఆశ అను జలముచే పెంచబడును. ఆ ఫలరసము అశ్రద్ద. ఆ ఫలము యొక్క అధర్మరసము అతిమధురముగా తోచును. ఈ లోభవృక్షము ఇట్టి ఫలములతో నిండియున్నది. ఈ చెట్టు నీడను చేరి సంతోషించుచు చక్కగా పండిన పండ్లను ప్రతిదినము. తినుచు ఆ ఫలరసమును అధర్మముతో పోషించబడుచు సంతోషించువాడు పతనాభిముఖుడగును.
కావున పురుషుడు చింతను విడిచి లోభమును చేయకూడదు. ధనపుత్ర కళత్ర విషయమున చింతించరాదు. మూర్ఖుల ధారిని అనుసరించుచు మూర్ఖులనే చింతించుచు నాకు మాత్రమే ప్రయోజనము చేరవలయునని ఆలోచించుచుండును. మంచిభార్యను పొందినను పుత్రులనేల బడయుట లేదు. ఇట్లు మోహముతో రాత్రింబవళ్ళు చింతించుచునేయుండును. ఈ చింతామధ్యమున ఏదో ఒక క్షణము సుఖమును చూచునేమో కాని మంచి తెలివి తెచ్చుకొని గొప్ప దుఃఖముతో పీడించబడును. ఓ బ్రాహ్మణోత్తమా! చింతామోహములను విడిచి అనువర్తించుము. సంసారములో ఎవరితోనూ సంబంధము లేదు. మిత్రులు, బాంధవులు, పుత్రులు, తండ్రి, తల్లి, భృత్యులు, భార్య వీరందరు సంబంధులుగా ఉందురు. కాని ఎవ్వరితోనూ సంబంధముండదు.
సోమశర్మ పలికెను.
భద్రురాలా! సంబంధమెలాంటిదో విస్తరముగా తెలుపుము. దేనిలో ధనపుత్రాది బంధువులు సంబంధము కలవారిగా నుందురు.
ఋణసంబంధముతో వచ్చువారు కొందరు తాము పూర్వజన్మలో దాచిపెట్టినదానిని హరించువారు. కొందరు లాభమును కలిగించువారు. కొందరు ఉదాసీనులుగా నుందురు. పుత్రులు, మిత్రులు, స్త్రీలు వీరందరూ ఈ నాలుగు భేదములతో పుట్టుదురు. భార్య, తండ్రి, తల్లి, భృత్యులు, స్వజనులు, బంధువులు తమ తమ సంబంధముతోనే ఈ భూమిపై పుట్టుదురు. న్యాసముంచినవారు, న్యాసమును హరించినవారు, ఈ భావముతోనే చేసినవారు, చేయించినవారు ఈ సంబంధముతోనే పుట్టెదరు. తమ సొమ్మును అపహరించినవారి ఇంట సొమ్మును దాచిపెట్టినవాడు గుణవంతుడు, రూపవంతుడగు పుత్రునిగా పుట్టును. తన సొమ్మును అపహరించినవానికి భయంకరమగు గొప్ప దుఃఖమును ఇచ్చి వెడలును. తాను దాచిన సొమ్మును అపహరించినవానికి సొమ్ము దాచినవాడు గుణవంతుడు, రూపవంతుడు అగు పుత్రునిగా పుట్టి ప్రతిదినము తండ్రిపై భక్తిని చూపుచు ప్రియముగా మధురముగా మాటలాడుచు స్నేహమును కనబరుచుచుండును. రోగియై ఆ రోగమును తొలగించు నెపముతో తన సొమ్మును తీసుకొని ఎంతో ప్రీతిని కలిగించి తాను ఇచ్చినది మొత్తమును హరించువరకు ఉండి తరువాత చనిపోయి భయంకరమగు గొప్ప దుఃఖమునే కలిగించును. ఇట్లు అతను పుత్రుడై సేవార్ధమును చూపి మహాగుణములతో ప్రీతిని కలిగించును. కాని అల్పాయువై త్వరలో మరణించును.
ఇట్లు దుఃఖమును కలిగించి వెళ్ళుచుండును. మరల మరల పుట్టుచుండును. తండ్రి హా హా పుత్రా! హా పుత్రా! అని అరుచునపుడు పుత్రుడు అతనిని అపహసించును. పెద్దగా నవ్వును. ఎవని పుత్రుడు. ఎవడు తండ్రి. నేను దాచిపెట్టినదానిని ఇతను హరించెను. ద్రవ్యమును అపహరించిననూ నా ప్రాణములు పోలేదు. అపుడు నాకు గొప్ప దుఃఖము, అసహ్యము కలిగినది. ఇపుడు నేను ఇతనికి అంతటి దుఃఖమునిచ్చి నా ధనమును నేను తీసుకొని చక్కగా వెళ్ళేదను. నేను ఎవనికి పుత్రుడను. ఇతను నాకు పూర్వము తండ్రి కాడు. కొడుకు కాడు. నేను ఈ దుర్మార్గునకు పిశాచత్వమును ఇచ్చితిని. ఇట్లు పలికి అతనిని పరిహసించి ఈ విధముగా గొప్ప దుఃఖమునిచ్చి ఈ మార్గముతో వెళ్ళేదరు. ఇట్లు తాము దాచిపెట్టిన ధనమును అపహరించు పుత్రులుందురు. చాలా చోట్ల వీరు సంసారమున బహుదుః ఖమును కలిగించుచుందురు. ఇక ఇపుడు ఋణసంబంధి పుత్రులను చెప్పెదను. వినుము.
ఇది శ్రీ పద్మపురాణమున రెండవదగు భూమిఖండమున సువ్రతోపాఖ్యానమున 11 - అధ్యాయము.
