పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
53 - సుకలా పాతివ్రత్య భంగార్థం ఇన్ద్రస్య శ్రమవైఫల్యమ్
సుకలోవాచ - సుకల పలికెను.
ఇట్లు పూర్వము నేను పురాణములలో ధర్మమును వింటిని. భర్తలేకుండగా పాపనిశ్చయురాలనై భోగమునెట్లు అనుభవించగలను. ప్రియుడు లేకుండగా నేను నా శరీరమును ధరించను.
విష్ణురువాచ - విష్ణువు పలికెను.
సుకల ఇట్లు సర్వధర్మశ్రేష్ఠమైన సాటిలేని పతివ్రతా ధర్మమును వివరించగా ఆమె చెలులు ఉత్తమస్త్రీలు మహాసంతోషముతో పుణ్యప్రదమైన పరమధర్మమును స్త్రీలకు ఉత్తమగతినిచ్చుదానిని వినినవారై ధర్మవత్సల, మహానుభావురాలు అయిన సుకలను స్తుతించిరి. నరోత్తమా! బ్రాహ్మణులు, దేవతలందరుపుణ్యస్త్రీలు, పతి కామప్రభావము వలన సుకలా ధ్యానమును చేయుచున్నారు. సర్వేశ్వరుడైన ఇంద్రుడు చాలా దృఢముగా ఆలోచించి సుకలా పతివ్రతా ప్రభావమును చిన్తన చేసెను. అమరేంద్రుడు నేను ఈమె ధైర్యమును, పతిస్నేహమును చలింపచేతును. ఇందులో సందేహము లేదు అని నిశ్చయించుకొని త్వరగా దేవాధిపుడు మన్మధదేవుని స్మరించెను. అంతట మన్మధుడు పుష్పచాపమును తీసుకొని మీనకేతువు, ప్రియురాలైన రతీదేవితో కూడి ఇంద్రునివద్దకు వచ్చెను. చేతులు జోడించుకొని ఇంద్రునితో ఇట్లు పలికెను. “నాధా! నన్నెందుకు స్మరించితిరి? మానదా! సర్వభావముతో నాకు ఆదేశమునిమ్ము” అని.
ఇంద్ర ఉవాచ - ఇంద్రుడు పలికెను.
మహానుభావురాలు ఈ సుకల పతివ్రత పరాయణురాలు. కామదేవా! నీవు వినుము. నాకు ఉత్తమసాయమును చేయుము. పుణ్యురాలు, శుభకరురాలు అయిన సుకలను చలింపచేయుము. ఇట్లు పలికిన ఇంద్రుని మాటలను వినిన మన్మధుడు అతనితో ఇట్లు పలికెను.
సహస్రాక్షా! అట్లే కానిమ్ము. మీ ఆజ్ఞను పాలింతును. ఇందులో సందేహము లేదు. మీ కుతూహలము ప్రకారము సాహాయమును చేతును. మునుల చేతకూడా జయింపశక్యము కాని మన్మధుడు మరల ఇట్లు పలికెను. గొప్ప మునులను, ఋషులను, దేవతలను కూడా గెలువగలవాడను నేను. ఇక కామినీ విషయమును చెప్పవలయునా? నేను స్త్రీ అవయవములతోనే బలము కలవాడను. దేవా! నేను కామినుల అవయవములయందు నిత్యము నివసింతును. ఫాలభాగమున, కుచములందు, నేత్రములందు, కేశాంతములందు, నాభియందు, నడుముయందు, పృష్టభాగమున, పిరుదులందు, యోనిమండలమున, అధరమున, దత్తభాగములందు, బాహుమూలములందు నివసించుచుందును. ఇట్లు అంగములలో, ప్రత్యంగములలో అంతట నేను నివసింతును. నారి నా గృహము. నేనెప్పుడూ అచటనే యుందును. నారీదేహముననున్న నేను పురుషులందరిని చంపుదును. ఇందులో సందేహము లేదు. సహజముగానే స్త్రీ అబల. నా బాణములచే తపింపచేయబడి తండ్రిని, తల్లిని, ఇతరులను, స్వజనులను, బంధువులను, చక్కని రూపము గుణము కలవారిని చూచినా బాణములచే కొట్టబడి చలించును. ఇందులో సందేహమే లేదు. పరిపాకమును ఆలోచించజాలదు. సుందరుని చూచిన స్త్రీకి యోని, చనుమొనలు స్పందించును. సురేశ్వరా! స్త్రీలకు ధైర్యముండదు. నేను సుకలను నశింపచేతును.
ఇంద్ర ఉవాచ - ఇంద్రుడు పలికెను.
మన్మధా! నేను రూపవంతుడను, గుణవంతుడనగు పురుషునిగా అయ్యెదను. కేవలము కుతూహలము కొరకు ఈ స్త్రీని చలింపచేతును. నేను కోరికతో, భయముతో, లోభముతో, ఇతర కారణములతో మోహముతో, క్రోధముతో చేయుట లేదు రతిప్రియా! ఇది ముమ్మాటికీ నిజము. ఆమె సత్యమైన పాతివ్రత్యము నాకెట్లు తెలియును. ఇటునుండి వెళ్ళి నిష్కర్షించెదను. ఇక్కడ నా మోహ జననము కారణము కావలయును. ఇట్లు ఇంద్రుడు కాముని ఆదేశించి స్వయముగా అచటికి వెడలెను. తనకు వికృతిని కల్పించుకొని రూపవంతుడు, గుణవంతుడు ఆయెను. సర్వాభరణములతో శోభించు శరీరము కలవాడై సర్వభోగములతో కూడియున్నవాడై భోగలీలాసమేతుడై అన్నివేళలా ఔదార్యము కలవాడై కృకాలుని ప్రియురాలు ఉన్న ప్రతి ప్రదేశమున ఆయా ప్రదేశములలో ఆత్మలీలను, స్వరూపమును, గుణమును, భావమును చూపుచుండెను. ఆమె మాత్రము ఆ పురుషుని కాని, అతని రూపసంపదను కాని చూచుట లేదు. ఆమె వెళ్ళిన ప్రతిచోట అతనూ వెళ్ళి ఆమెను చూచుచుండెను. సాభిలాష మనస్సులో ఆమెను చూచుచుండెను. సర్వభావములతో ఇంద్రుడు కామచేష్టలను చూపుచుండెను. నాలుగు దారుల కూడలిలో దారిలో, తీర్థములలో సుకల ఎక్కడికి వెళ్ళినచో ఇంద్రుడు అక్కడక్కడికి వెళ్ళి ఆమెనే చూచుచుండెను. ఆ తరువాత ఇంద్రుడు పంపిన దూతి సుకల వద్దకు వెళ్ళెను. మహానుభావురాలైన సుకలతో నవ్వుతూ ఇట్లు పలికెను. ఆహా! ఎంత సత్యము! ఏమి ధైర్యము! ఏమి కార్తీ! ఏమి ఓర్పు. ఈమెవంటి రూపవతి ఈ సంసారములో మరియొకరు లేరు. కళ్యాణి నీవెవరు? ఎవరి భార్యవు? నిన్ను భార్యగా పొందినవాడు ధన్యుడు, పుణ్యవంతుడు.
ఆ వనిత మాటలను వినిన మనస్వినియగు సుకల ఇట్లు పలికెను. వైశ్యజాతిలో పుట్టినవాడు, ధర్మాత్ముడు, సత్యవత్సలుడు వృకలుడనువానికి నేను ప్రియురాలను, భార్యను. అతను ధీమంతుడు. సత్యసంధుడు. నేను నిజమునే చెప్పుచున్నాను. ధర్మాత్ముడైన నా భర్త మంచిబుద్ధికలవాడు తీర్థయాత్రలకు వెళ్ళెను. నా భర్త వెళ్ళి ఇప్పటికి మూడు సంవత్సరములు గడిచినవి. ఆ మహాత్ముని వియోగముతో నేను దుఃఖించున్నాను. ఇది నా వృత్తాశ్రమంతయూ నీకు తెలిపితిని. నన్నిట్లు అడుగుచున్న నీవెవరో చెప్పుము. ఇట్లు సుకల మాటలను వినిన దూతి ఇట్లు బదులు పలికెను. భద్రురాలా! నన్నడుగుచున్నదంతయూ నీకు తెలిపెదను. వరవర్ణిని నేనొక పనికొరకు నీ వద్దకు వచ్చితిని. చెప్పెదను వినుము. విని నిశ్చయించుకొనుము. వరాననా! దయలేని నీ భర్త నిన్ను విడిచి వెళ్ళెను. ప్రియురాలికి హాని చేయు అతనితో నీవేమి చేతువు? సాధ్వీ ఆచారముతోనున్న నిన్ను విడిచి ఆ పాపి వెళ్ళినాడు. వెళ్ళిన అతను ఆ చోట బ్రతికియున్నాడో మరణించినాడో తెలియదు. అట్టివానితో నీవేమి చేతువు? నీవు వ్యర్థముగా బాధపడుచున్నావు. బంగారు నిగనిగలు కల నీ శరీరమును ఎందుకు నశింపచేయుచున్నావు? బాల్యమున మానవుడు బాలక్రీడా సుఖము తప్ప మరియొకదానిని తెలియడు. వార్ధక్యమున దుఃఖమే. ముసలితనము శరీరమును హింసింపచేయును. యౌవనముననే సుఖములను, భోగములను అనుభవింతురు. తారుణ్యమున్నంతవరకు మానవులు అనుభవింతురు. సుఖభోగాదికరసమును నరుడు స్వేచ్చగా అనుభవించి రమించును. యౌవనమున్నంతవరకే భోగములననుభవింతురు. యావనము గడిచిన తరువాత ఏమి అనుభవించెదవు?
ముసలితనము వచ్చిన తరువాత ఏ కొద్ది కార్యము సిద్ధించదు. ముసలివాడు ప్రతినిత్యము చిన్తలోనే మునుగుచుండును. సుఖకార్యము మసలివానికి సిద్ధించదు. నీరంతా వెళ్ళిపోయిన తరువాత సేతువు కట్టినట్లు యౌవనము గతించిన తరువాత నీ దేహమట్లే అగును. కావున ఇపుడు యౌవనములోనే సుఖమును అనుభవించుము. మదిరాపానమును చేయుము. అందమైన కనులుగలదానా! నీ ఈ శరీరమును కామబాణములు దహించును. ఈ ఒక పురుషుడు, రూపవంతుడు, గుణవంతుడు వచ్చినాడు. ఈ పురుషశ్రేష్ఠుడు సర్వజ్ఞుడు. గుణవంతుడు, ధనవంతుడు. నీ కొరకు స్నేహముతో నిత్యము ప్రయత్నించుచున్నాడు.
సుకలోవాచ - సుకల పలికెను.
జీవునికి బాల్యము లేదు, తారుణ్యము జీవితమున లేదు. ఈ జీవునికి వృద్ధత్వమూ లేదు. జీవుడు స్వయంసిద్దుడు. సుసిద్దిని ప్రదానము చేయువాడు. జీవుడు మరణము వార్ధక్యము లేనివాడు. అంతటా వ్యాపించియుండువాడు. సుసిద్ధి కలవాడు. అన్నీ తెలిసినవాడు. ఏ కోరిక లేనివాడు. అన్ని కోరికలను ఇచ్చువాడు. జీవుడు ఆత్మరూపముతోనుండును. ఇల్లువంటిది కాయము స్థితి. శిల్పితో నేయువానితో కాయముండునట్లు మందిరము సూత్రముతో ఏర్పడును. నానాదారు సముదాయములతో బాలాకాష్ఠ సంఘాతములతో మట్టితో, ఉదకముతో కూడా అంతట ఇల్లుగా పరిణమించును. కాష్ఠము రంగులు వేసినచో, చిత్రించినచో చిత్రమగును. ఇంటిని సూత్రముతో వేష్టనము చేసినచో రూపము ఏర్పడును. ఆ ఇంటిని యజమాని ప్రతినిత్యమూ లేపనాదులచే పోషించుచుండును. వాయువుచే డోలాయమానమైన ఇల్లు ప్రతినిత్యము మురికిపట్టును. అట్టి కాలము ఇంటికి మధ్యమ కాలము అనబడును. మరల ఇంటికి రూపహాని అగును. మరల గృహస్వామి లేపనాదులను చేయును. గృహస్వామి తన ఇష్టానుసారము ఇంటికి కొత్త రూపమును కలిగించుచుండును. అదియే ఆ ఇంటికి తారుణ్యముగా చెప్పబడును. కాష్ఠ సంఘములతో ఆ ఇల్లు చాలాకాలము జీర్ణత్వమును పొందుచుండును. అపుడు ఇంటిని నిర్మించిన వస్తువులు స్థానభ్రష్టములగును. మూలభాగము అగ్రభాగములు చలించును. ఆ తరువాత లేపనాభారమును సహించజాలదు. కేవలము ఆధారముచే మాత్రమే నిలుచును. దూతికా! ఇదియే ఇంటికి వార్ధక్యము.
పడిపోవుచున్న ఇల్లును చూచి గృహస్వామి ఆ ఇంటిని విడిచిపెట్టవలయును. వెంటనే ఇంకో ఇంటిలోనికి ప్రవేశించుటకు వెళ్ళియే తీరును. అట్లే మానవులకు బాల్యము, యౌవనము, వద్దత్వము కూడా. బాల్యమున బాలరూపముగా, జ్ఞానహీనముగా కనపడును. ఈ శరీరమును వస్త్రాలంకార భూషణములతో చన్దనాదిలేపనములతో తాంబూలాదులవలన కలుగు రంగులతో ఈ శరీరమును చిత్రించుకొనును. ఈ శరీరము తారుణ్యమును పొందినపుడు అతిరూపము ఏర్పడును. లోపల వెలుపల అన్ని రకముల రసములతో పోషించును. ఆ పోషణ భావనతో దేహము పరిపుష్టమగును రసములతో కొత్తమాంసము వృద్ధిపొందును. ఇట్లు చక్కగా రసములచే ఆప్యాయతములైన అంగములు విస్తారమును పొందును. అవే రసములతో ప్రత్యంగములు కూడా తమ తమ రూపములను పొందును. దస్తములు, అధరములు, స్తనములు, బాహువులు, కటి, పృష్ఠము, ఊరువులు, హస్తములు, పాదములు ఇట్లు అన్ని అవయవములు వృద్దిపొందును. ఇట్లు రసములతో మాంసముతో ఈ అవయవములే వృద్ధిపొందును. రసమాంసములతో అంగములు చక్కని రూపమును తెచ్చుకొనును. దూతికా! ఆ స్వరూపములతో మానవుడు రసబద్దుడగును. అపుడే మనిషి చక్కని రూపముకలవాడు అని అందురు. ఈ లోకమున దేనితో ప్రియుడగును. దూతికా ఈ శరీరము మలమూత్రములకు ఆవాసము. అపవిత్రమైన ఈ శరీరము ఎపుడు సిగ్గులేనిదై మలములను స్రవించుచునేయుండును. నీటి బుడగలవంటి ఆ రూపమును ఏమని వర్ణించెదను. 50 యేండ్ల వయసు వరకు ఈ కాయము దృఢముగా నుండును.
ఆ తరువాత కాయమునకు హాని కలుగును. ఆ శరీరము ప్రతిదినము తరుగుచుండును. దంతములు శిధిలములగును. నోటిలో లాలాజలము అధికముగా ఊరుచుండును. పాదములు నడువజాలవు. చేతులు పనిచేయజాలవు. కాలవశమున ముసలితనముచే పీడించబడి ఈ దేహము అసమర్థమగును. జరాగ్నితాపముతో శుష్కించి ఆ రసము ఎండిపోవును. ఇట్లు వార్ధక్యమున దేహము అసమర్థమగును. ఇక దేనితో రూపత్వమును కోరబడును. జీర్ణమైన గృహము నశించునట్లు వార్థక్యమున శరీరము క్షయము పొందును. ఇందులో సందేహము లేదు. ఇట్లే నాకు కూడా ప్రతిదినమున రూపము వచ్చినది. రంగు వచ్చినది. ఇపుడు నేను దేనితో రూపము కలదానను? .ఎవరు నా రూపమును కోరుచున్నారు. బలియయిన పురుషుడు దేనితో బలవంతుడు. ఎంత బలవంతుడైనను జీర్ణగృహమును ప్రవేశించజాలడు కదా! దూతీ! నీవు దేనికొరకు వచ్చితివి? ఎవరు ఇవన్నీ చెప్పుచున్నారు? నీవు నా శరీరమున దేనిని చక్కగా చూచితివో ఇపుడు చెప్పుము. ఆ శరీరమునకు శరీరము కల అతనికి అంగాదులు క్షీణించుచునేయుండును. ఇంతకన్నా ఎక్కువగా ఏదీ లేదు. నీవు ఇతను ఎట్లో నేనూ అట్లే ఉన్నాను. ఈ విషయమున ఎట్టి సంశయము లేదు. రూపమెవరికి ఉండదు? ఈ భూమండలమున రూపవంతుడెవడున్నాడు? శుభకరములు అగు పర్వతములన్నీ ఎత్తుగా ఎదుగునవి పతనముతో ముగియును. కాలముచే పీడించబడి పడిపోవును. అట్లే భూతములు కూడా. ఇంకొక విధములేదు. ఏ రూపమూ లేనివాడు, దివ్యరూపముగలవాడు ఆత్మ. అంతట ఉండువాడు, పరిశుద్దుడు. సకల స్థావర జంగమములలో, అన్ని ఘటములలో ఒకే నీరున్నట్లు అన్ని దేహములలో ఒకే ఆత్మ ఉండును.
ఘటము నశించినచో ఒకే జలము మిగులును. కాని ఏకత్వము తెలియజాలము. మాంసపిండము నశించిన తరువాత ఆత్మ ఒకటే మిగులును. సంసారముననున్నవారందరికి ఒకే రూపమును నేను చూచుచున్నాను. నీవు ఎవరికోసమిచటికి వచ్చితివో. నీవు వెళ్ళి అతనికీ మాటలు తెలుపుము. నా అపూర్వమును చూపుము. అపూర్వమును అనుభవించదలచితివా? వ్యాధిచే పీడించబడుచున్న కఫము నిండియున్న దేహమునుండి రక్తము కదులును. స్థానభ్రష్టమగును. అపుడు లోపలనుండి అన్ని అంగసంధులలో పాలిపోవుట ఏర్పడును. ఒక పక్క నాశము చెంది తన రూపమును విడిచిపెట్టును. అంతట అక్కడ కృములు చేరి ఆ భాగములు మలముగా ఏర్పడును. అపుడు తన రూపమే తనకు దుఃఖమును కలిగించును. అట్టి రూపమును పరిత్యజించవలయును. ఆ తరువాత ఆ భాగము కృములతో దుర్గంధముతో నిండిపోవును. ఆ ప్రదేశమున పురుగులు, పేలు ఏర్పడును. ఇందులో సంశయము లేదు. ఆ కృమి ఆ ప్రాంతమును చీల్చును. అంతట దురద కలుగును. ఆ భయంకరమైన దురదను కలిగించిన పేను తీవ్రమైన వ్యధ కలిగించును. శరీరమునంతటిని చలింపచేయును. గోళ్ళ కొనలచే గీకినచో దురద శాస్త్రించును. రతి కూడా ఇట్లు గోళ్ళతో ఘర్షణవంటిదే. వినుము. ఇందులో సంశయము లేదు. మానవుడు ఇంత తెలిసి కూడా రసములను భక్ష్యములను భుజించుచునేయుండును. అట్లు భుజించిన రసపదార్థములను వాయువు జీర్ణకోశమునకు పంపును. ఇట్లు భుజించినది జీర్ణకోశమునకు చేరినది. అచట కప్పిపుచ్చబడి వాయువు దానిని మలముగా చేసి పడవేయును. భుజించిన ఆహారములో సారభూతమైనది రక్తముగా మారును.
నిర్మలము పరిశుద్ధమైన వీర్యము బ్రహ్మస్థానమును పొందును. ఆ వీర్యము సమానవాయువుచే ఆకర్షించబడి ఆ పాయువుతో గొనిపోబడి ఎక్కడా స్థానము పొందజాలక చంచలముగా నుండును. ప్రాణుల కపాలములలో అయిదు కృములుండును. రెండు కర్ణమూలములందు, అట్లే నేత్రస్థానములలో రెండు, చిటికెనవేలంత రక్తపుచ్ఛముకలవై యుండును. కొన్ని నవనీతవర్ణములో కృష్ణపుచ్ఛముకలవై యుండును. ఆ కృముల పేర్లు కూడా నీవు నానుండి వినుము. పిజ్జలీ శృఙలి అను రెండు కృములు కర్ణమూలములలోనుండును. చపలము పిప్పలము నాసికాగ్రములలో నుండును. శృజ్జలీ జజ్జలి అనునవి నేత్రాన్తరములలో నుండును. ఇట్టి కృములు అయిదువేలుండును. ఇందులో సంశయము లేదు. రాజికా (ఆవగింజ) ప్రమాణముతో ఫాలములోనుండును. ఇవన్నీ కపాలరోగమును కలిగించునవి. ఇందులో సంశయము లేదు. కృమి ముఖమున కేశద్వయముండును. కేశద్వయము కనపడిన వెంటనే ప్రాణుల క్షయము కలుగునని ఇందులో సంశయము లేదు. స్వస్థానములోనున్న ప్రాజాపత్యముఖమున వీర్యము రసరూపముగా పడును. ముఖముతో ఆ వీర్యమును పానము చేయును. దానివలన మత్తుడగును. తాలుమధ్య ప్రదేశమున చ్చలముగా నుండును. ఇక్కడ పిజ్జల సుషుమ్నా అను నాడులుండును. దాని చక్కని బలముతో జాలపశిరమున ఆ నాడివలన ప్రాణులందరికి కామకండూతి కలుగును. దానివలన పురుషునికి అంగము, స్త్రీకి యోని స్పందించును. ఇట్లు మదించిన స్త్రీ పురుషులు సంగమించెదరు. ఆ మైధునముతో కాయసంఘర్షణ జరుగును. ఆ సంగమము వలన కలుగు సుఖము క్షణ మాత్రమే. మరల అటువంటి కండూతియే కలుగుచుండును. ఇటువంటి భావము అంతట కనపడుచున్నది. నీవు కూడా నీ స్థానమునకు వెళ్ళుము. ఇందులో కొత్తది ఏదీ లేదు. ఇందులో కొత్త అనుభూతి ఉన్నచో చేయవచ్చును. కాని అట్టిది లేదు. ఇందులో సంశయము లేదు.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున యాబది మూడ - అధ్యాయము.
