పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
25 - అధ్యాయము
సూతమహర్షి పలికెను.
అందమైన కనుదోయిగల ఈ సుందరి ఎవరు? తన వయ్యారములతో విలాసములతో పరిపూర్ణ భావములతో సకల జనులనే మోహింపచేయుచున్నది. ప్రపంచమునే తన వశమున నుంచుకోగలదు. ఇట్లు అందమైన ఈ బాల ఈ విశ్వమున విరాజిల్లుచున్నది. పద్మనేత్రి, పీనస్తని (బలిసిన చనుగవ కలది), కుంకుమ లేపనము చేసుకున్నది, పద్మముఖియగు రంభను చూచిన ఆ వృత్రాసురుడు ఈమె నా కోరికల పుట్టిల్లు లేదా ఈ సుందరి రతీదేవి కాబోలు. పరిపూర్ణ భావము కలది, చక్కని రూపము కలది, కోరికలు నిండిన నింపు అవయవములు స్వభావము కలది అతి చంచలస్వభావము కలది కామమోహితగా చూచుచున్నాను. వెళ్ళి ఆమె ఎవరో అడిగెదను. ఇట్లు వృత్రాసురుడు చింతించినవాడై కామమోహితుడు, కామాతురుడై కాలచోదితుడై త్వరితంగా వెళ్ళి ఆ చారులోచనను చూచి దీనమనస్కుడై త్వరగా ఇట్లు పలికెను.
సుందరీ! నీవెవ్వరిదానవు? ఎవరు నిన్ను ఇచటికి పంపిరి? నీ శుభనామమేది? నాకు చెప్పుము. నీ గొప్ప సౌందర్యముతో తేజస్సుచే మోహితుడనైతిని. నాకు వశము కమ్ము! ఇట్లు వృత్రాసురుడు పలుకగా కామాతురుడగు వృత్రునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావా! నేను రంభను. విహరించుటకు చెలులతో కలిసి ఉత్తమమగు నందనవనమునకు వచ్చితిని. నీవెవరు? ఎందుకు నా వద్దకు వచ్చితివి?
వృత్రాసురుడు పలికెను.
ఓ బాలా! నేనెవరో చెప్పెదను వినుము. ఎందుకొచ్చితినో తెలియుము. నేను అగ్నినుండి పుట్టినవాడను. కశ్యపుని పుత్రుడను. దేవదేవుడగు ఇంద్రునకు మిత్రుడను. నాకు సగము ఇంద్ర సింహాసనము అనుభవమునకు వచ్చినది. నా పేరు వృత్రాసురుడు. నన్ను నీవేల నెరుగవు? నా పరాక్రమమునకు మూడు లోకములు వశమైనవి. అట్టి నేను ఇప్పుడు నీ శరణు చేరితిని. నన్ను కామునినుండి కాపాడుము. ప్రియురాలా! కామముతో కలత చెందిన నన్ను సేవించుము.
రంభ పలికెను.
ఓ వీరా! నేనిప్పుడే నీకు వశమయ్యెదను. అందుకు సందియమవసరములేదు. కాని నేను చెప్పినదల్లా నీవు చేయవలయును. అనగా వృత్రుడు అట్లే కానిమ్ము! నీవు చెప్పినదంతయూ చేసెదను అని పలికెను. ఇట్లు మాటలాడి ఆ వృత్రాసురుడు పరమపావనము దివ్యమగు ఆ నందనవనమున రంభతో రమించెను. రంభ గీతముతో, నృత్యముతో, విలాసముతో, హాస్యము, సంభోగముతో ఆ మహాదైత్యుడగు వృత్రాసురుడు మోహితుడాయెను. అంత ఆ దానవోత్తమునితో రంభ ఇట్లు పలికెను. ఇచట ఇపుడు సురాపానము చేయుము. మధుపానము గావించుము అని. అపుడు చంద్రానన విశాలాక్షియగు రంభతో వృత్రాసురుడిట్లు పలికెను.
నేను బ్రాహ్మణుని పుత్రుడను. వేదవేదాంగపారగుడను. నిందితమగు సురాపానమునేట్లు చేసెదను అని. అంత రంభ పట్టుదలతో (ఆగ్రహముతో) సురనందించగా ఆమెమీది మక్కువతో సురాపానము చేసెను. ఇట్లు సురాపానమున మోహితుడై వృత్రాసురుడు జ్ఞానభ్రష్టుడు కాగానే ఇంద్రుడు వజ్రాయుధముతో హతమార్చెను. అంతట ఇంద్రుడు బ్రహ్మహత్యాది మహాపాపములలో తగుల్కొనెను. అంతట బ్రాహ్మణులు ఇంద్రా! నీవు పాపము చేసితివి. మా మాటవలన మహాబలుగు వృత్రుడు నిన్ను నమ్మెను. ఇట్లు విశ్వసించినవానిని చంపితివి. ఇది మహాపాపము.
ఇంద్రుడు పలికెను.
శత్రువును ఏదో ఒక ఉపాయముతో వధించవలయును. దేవబ్రాహ్మణులను చంపినవాడు యజ్ఞములకు ధర్మములకు పీడ కలిగించువాడు త్రైలోక్యనాశకుడగు దుష్టుడు సంహరించబడెను. మీరు దానికొరకు కోపించుచున్నారు. ఇదియేనా న్యాయము. బ్రాహ్మణోత్తములారా! మీరందరూ చక్కగా ఆలోచించుడు. తరువాత న్యాయాన్యాయ్యములను విచారించి తరువాత కోపించుడు. ఇట్లు మహాత్ముడగు ఇంద్రునిచే బోధించబడి, అట్లే బ్రహ్మాది దేవతలచే బోధించబడిన ఆ బ్రాహ్మణోత్తములు ధర్మబాధకుడు సంహరించబడుటతో తమ తమ నెలవులకు చేరిరి.
ఇది శ్రీపాద్మపురాణమున రెండవదియగు భూమిఖండమున వృత్రాసురవధయనునది ఇరువదియైద - అధ్యాయము.
