పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
29 - అధ్యాయము
పృథివీం ప్రతి పృధోరుక్తిః
పృథుచక్రవర్తి పలికెను.
మహాపాపే! పాపమునాచరించువారు ఒకరు నశించిననూ సాధుజనులు పుణ్యకార్యములనాచరించువారు సుఖముగా జీవించెదరు. కావున పాపబుద్ధి కలిగి పాపములనాచరించువానిని సంహరించవలయును. కావుననే సకల ప్రాణులను నశింపచేయుచున్న నిన్ను చంపెదను. ఇపుడు నీవు అన్ని బీజములను లోపింపచేసితివి. అన్నిటిని భుజించి, స్థిరపడి ప్రజలను చంపి ఎటుపోగలవు? దురాచారులు, పాపులు నశించిననాడు సాధువులు సంతోషముగా జీవింతురు. కావున పాపులను సంహరించవలయును. సాధువులను రక్షించవలయును. అట్లు చేసిన ధర్మము వృద్ధిచెందును. ప్రజాక్షయరూపమగు గొప్ప పాపమును నీవు చేసితివి. తన కొరకో ఇతరుల కొరకో ఒకరి కోసమైతే చంపరాదు. కాని లోకమును తపింపచేయువారిని చంపినవారికి పాపముండదు. ఒకని చంపినచో చాలా మందికి సుఖము కలుగుచున్నచో అట్టివానిని చంపియే తీరవలయును. కావున నేను చెప్పు మంచిమాటను విననిచో ప్రజల కొరకు నిన్ను చంపెదను. ఈ ప్రపంచహితము కొరకు నా మాటను వినని నిన్ను నిశితబాణములతో సంహరించెదను. నా ధర్మముతో నా తేజస్సుతో లోకత్రయవాసులగు సాధువులను నేను ధరించెదను. కావున నా ఆజ్ఞను స్వీకరించి ధర్మబద్దముగా ఈ ప్రజలను ఎల్లపుడు జీవింపచేయుము. ఇట్లు ఇపుడు నా ఆజ్ఞను పాలించినచో సంతసించి నిన్ను సర్వదా కాపాడగలను. నిన్ను ఇతర రాజులు కూడా చక్కగా పాలించగలరు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. పృధు చక్రవర్తి ఇట్లు పలుకగా ధేనురూపముననున్న ఆ పృథివి శరీరమున బాణములతో ధర్మాధారుడు మహాబుద్ధిశాలియగు పృథుచక్రవర్తితో ఇట్లు పలికెను.
భూదేవి పలికెను.
ఓ మహారాజా! సత్యము పుణ్యము ప్రయోజనము కల నీ ఆదేశమును ప్రజలకొరకు తప్పక నెరవేర్చెదను. ఇందు సంశయముతో పనిలేదు. పరమపావనములగు కార్యములు ప్రయత్నములు పవిత్రమగు ఉద్యమముతో ఉపాయముతోనే సిద్దించును. నీవు సత్యవంతుడవగుటకు ప్రజలందరను చక్కగా ధరించుటకు అందరిని వృద్ధి పొందించుటకు తగిన యుపాయమును యోచించుము. నీవు విడిచిన వాడియైన ఉత్తమ బాణములు నాలో నాటుకొనినవాటిని తొలగించుము. శరీరము లోపల దాగియున్న శల్యములను కూడా ఉద్దరించుము. నన్ను సమతలముగా చేయుము. అట్లు చేసినచో నాపై నీరు నిలుచును.
సూతమహర్షి పలికెను.
అంతట పృథుచక్రవర్తి పలురూపములుగా ఎంతో పెద్దగానున్న పర్వతములను వింటి కొనతో చిమ్మివేయుచు సమముగా చేసెను. అప్పటినుండి ఆ పర్వతములు వృద్ధిపొందినవి. అంతట పృథుచక్రవర్తి ఆ భూమి శరీరమునుండి శరములను స్వయముగా తొలగించి ప్రీతి నిండిన మనసుతో గోతులు కందకములు బాణఘాతములతో సమముగా చేసెను. ఇట్లు పుణ్యవర్థనుడగు పృథుచక్రవర్తి భూమినంతటిని సమముగా చేసెను. ఆ తరువాత చాలామార్లు చక్కగా ఆలోచించి మొదటి స్వాయంభువ మనువును దూడనుగా ఏర్పరిచెను. ఇట్లు అన్ని మన్వంతరములు గడిచిన పిమ్మట భూమి ఎగుడుదిగుడులుగా నాయెను. ఎక్కడా దారియే లేదు. కొన్నిచోట్ల సమతలములు, కొన్నిచోట్ల ఎగుడుదిగుడులుగా నుండియున్నది.
పూర్వము చాక్షుష మన్వన్తరమున మొదటి సృష్టి జరిగినపుడు భూమి ఎగుడుదిగుడుగా నుండెను. అపుడు గ్రామములు, పురములు, పత్తనములు, దేశములు, క్షేత్రములు మొదలగు వ్యవస్థ లేకుండెను. వ్యవసాయముకాని, వ్యాపారము గోపాలన కాని లేకుండెను. అపుడు అబద్దమాడుట, లోభత్వము లేకుండెడివి. మత్సరము అభిమానము, పాపములు చేయువారు లేకుండెడివారు.
వైవస్వతమన్వంతరము రాగా వేనుని పుత్రుడగు పృధుచక్రవర్తి పుట్టుకకు పూర్వమున్న ప్రజలు ద్విజులు కొందరు భూమిమీద, కొందరు గుట్టలపైన, కొందరు నదీతీరములందు, కొందరు పొదలలో సర్వతీర్ధములలో సముద్రతీరమున నివసించుచుండెడివారు. అపుడు వారికి కందమూలఫలములు ఆహారముగా నుండెడివి. ఆ ఆహారము కూడా ఎంతో కష్టముమీద లభించెడిది. పృథుచక్రవర్తి వారి కష్టమును చూచి పృథుచక్రవర్తి స్వాయంభువ మనువును వత్సముగా ఏర్పరిచెను. అచట పాలు పిండుటకు తన అరచేతినే పాత్రగా కల్పించెను. అంతట పృథుచక్రవర్తి అంతట పురుషశ్రేష్ఠుడగు ఆ పృధువు భూమినుండి సస్యమయ క్షీరమును పితికెను. అదియే ఉత్తమగుణాన్వితమగు అన్నమునిచ్చెను. అమృతసమమగు ఆ అన్నముతో ప్రజలు దేవతలను పితృదేవతలను ఇతర ప్రజలను తృప్తిపరచుచుండిరి. ఆ పృధు చక్రవర్తి అనుగ్రహముతో ప్రజలు సుఖముగా జీవనమును గడుపసాగిరి. అట్లు ప్రజలు దేవతలకు, పితృదేవతలకు, విశేషించి బ్రాహ్మణులకు, అతిథులకు అన్నమునిచ్చి ఆ తరువాత పవిత్రులై వారు అన్నమును భుజించుచుండెడివారు.
ఇతరులు యజ్ఞములతో పూజించుచు జనార్ధనుని తృప్తిపరచుచుండిరి. ఆ యజ్ఞాన్నముతో దేవతలు తృప్తిని పొందుచుండిరి. అంతట శ్రీమహావిష్ణువు పంపగా వచ్చిన పర్జన్యుడు చక్కగా వర్షించును. ఆ వర్షము వలన పవిత్రములగు ఓషధులు పండును. పృథుచక్రవర్తి రాజ్యమునుండియే అన్ని సస్యములు పండుచున్నవి. అంతకుమునుపు లేవు. అప్పటినుండి ఇప్పటివరకు అటువంటి అన్నముతోనే జీవనమును కొనసాగించుచున్నారు. ఋషులందరూ కలిసి కూడా భూమిని పితికిరి. తరువాత అదృష్టవంతులగు బ్రాహ్మణులు సత్యవంతులగు దేవతలు పితికిరి. సోముడు దూడ కాగా దేవగురువు పాలు పితికెను. అమృతము, ధాన్యము, పాలు మొదలగువాటితో అమరులు జీవించుచుండిరి. వారు తినగా మిగిలిన పవిత్రాన్నముతో ఇతర జంతువులన్నియూ జీవించుచుండెడివి. ఋషులచే పితకబడిన భూమి సత్యమును పుణ్యమును ప్రవర్తింపచేసినవి. ఇక ఇపుడు పితృదేవతలు భూమిని పితికిన విధానమును తెలిపెదను.
రాజతపాత్రను కల్పించుకొని యముని దూడనుగా చేసుకొని అంతకుడు పితుకువానిగా వారు అమృతమయమగు స్వధాక్షీరమును పితికిరి. నాగులు సర్పములు తక్షకుని దూడను చేసుకొని సొరకాయ బుల్డను పాత్రగా చేసుకొని విషమను క్షీరమును పితికిరి. నాగులకు ధృతరాష్ట్రుడు పితుకువాడు. సర్పములు నాగులు ఆ విషముతో జీవించుచున్నవి. అతిభయంకరమగు ఆ విషముతో నాగులు కూడా జీవించుచున్నవి. భయంకరములగు సర్పములు కూడా ఘోరమగు విషముతో బ్రతుకుచున్నవి. క్రూరములు మహాకాయములు మహాబలము కలవి ఆ నాగులు సర్పములు ఆ విషమునే ఆహారముగా ఆచారముగా బలముగా ఆధారముగా జీవించుచున్నవి.
ఇక ఇపుడు అసురులు దానవులు అన్నసదృశమగు అయస్పాత్రను కల్పించి సార్వకామికము మాయామయము సర్వశత్రువినాశకమగు క్షీరమును పితికిరి. వారికి విరోచనుడు దూడాయెను. దైత్యులకు ద్విమూర్ధ ఋత్విక్కు మహాబలుడగు మధు పితుకువాడు. మహాబలులగు దైత్యులు మహాప్రాజ్ఞులు మహాకాయులు మహాతేజస్సు మహాపరాక్రమము కలవారు ఆ మాయతోనే వర్తించుచుందురు. వారికి అదియే బలము, అదియే పౌరుషము. దానవులు దానితోనే జీవించుచున్నారు. వారు ఇప్పటికి ఆ మాయతోనే జీవించుచున్నారు. వారు అన్ని మాయలు నేర్చినవారు. చాలా ప్రజ్ఞ కలవారు. మాయతోనే జీవించుచున్నారు. వారికిదియే బలము. సర్వాధారయగు భూమిని యక్షులు కూడా పితికిరి అని పూర్వకల్పమున మహాత్ములు చెప్పగా వినుచున్నాము. యక్షులు విశాలమగు అయస్పాత్రిలో అంతర్థానమను క్షీరమును మహాప్రాజ్ఞుడగు కుబేరుని దూడగా చేసుకొని పరమపవిత్రుడు ప్రాజ్ఞుడు బుద్దిమంతులలో ఉత్తముడు మణిధరుని తండ్రియగు రజితనాభుడు పితుకువానిగా నుండెను. ఈ రజతనాభుడు మహామతి సర్వజ్ఞుడు, సర్వధర్మజ్ఞుడు, యక్షరాజపుత్రుడు, బలవంతుడు, అష్టబాహువులు కలవాడు, మహాతేజశ్శాలి, రెండు తలలు గలవాడు, మహాతపస్విగా నుండెను. యక్షులు ఎప్పుడూ అంతర్ధానవిద్యతోనే ప్రవర్తించుచుందురు.
తరువాత ఈ భూమిని మహాబలులగు రాక్షసులు అట్లే ఆర్తి కలిగిన పిశాచములు కూడా పితికినవి. మానవ కపాలమను అయోమయము శవపాత్రగా చేసుకొని సుప్రజను అనుభవించుటకు తీవ్రమగు కోపమును పరాక్రమము కలవారై మహాబలుడగు రజతనాభుని దోగ్గనుగావించి, సుమాలిని దూడను గావించి రక్తమను పాలను పితికిరి. రాక్షసులు, యాతుధానులు, పిశాచులు యక్షులు దారుణములగు భూతసంఘములు ఆశోణితముతో జీవించుచున్నవి.
చక్కని విద్వాంసుడగు చిత్రరధుని దూడను గావించుకొని గంధర్వులు అప్సరసలు ఈ భూమిని పితికిరి. వారు పద్మపాత్రలో గాంధర్వగానదుగ్ధామును పితికిరి. ఆ దుగ్గమును పితికినవాడు మహామతి పరమపావనుడగు సురుచియను గంధర్వుడు. వారు పితికిన ఆ క్షీరము శుచిగీతము. ఆ క్షీరముతోనే గంధర్వులు యక్షులు అప్సరసలు జీవించుచున్నారు. పరమపావనములగు పర్వతములు మహానుభావుడగు హిమవంతుని దూడగా చేసుకొని, శైలజమును పాత్రను చేసుకొని మేరువు పితుకువానిగా ఏర్పరచుకొని వివిధ రత్నములను ఓషధులను పాలనుగా పితికిరి. ఆ పాలలో పర్వతములన్నియూ చాలా ఉన్నతముగా పెరిగినవి. కల్పద్రుమాది సకలవృక్షములు పలాశపాత్రను చేసుకొని జువ్విని దూడనుగావించుకొని మద్దిని పితుకువానిగా చేసుకొని నరకబడినవి కాలినవి మళ్ళీ చిగురించుట అను పాలను పితికినవి.
ఇక గుహ్యులు చారణులు సిద్దులు విద్యాధరులు అందరూ తమకు రావలసిన వాటిని పితుకుకొనిరి. ఇట్లు సర్వకామప్రదాయిని సర్వధాత్రియగు ఈ భూమిని తాము ఆయా పాత్రలు దూడలుగా చేసుకొని అందరూ తమకు కావలసిన వాటిని పితికిరి. ఆ భూమి కూడా వారికి కావలసిన పాలను అన్నిటిని ఇచ్చుచునేయుండెను. ఇది భూమిసౌహార్దము. ఈమెయే అన్నిటిని ధరించునది. అందరిని పోషించునది. ఈ భూమి సర్వశ్రేష్ట. అన్ని రకముల ధనములను ధరించి ఉండునది. అన్ని కోరికలను తీర్చునది. ఇది ధేనువు. అవసరమున్నపుడు అవసరమున్నంత ఇచ్చునది. పావన వస్తుసముదాయములతో అలంకరించబడియున్నది. ఈ భూమియే అన్నిటికన్నా జ్యేష్ఠురాలు. ఈమెయే ప్రతిష్ఠకు మూలము. ఈమెయే సృష్టి, ఈమెయే సంతానము. ఈమెయే పావనురాలు. పుణ్యములను ప్రసాదించునది. ఈమెయే పుణ్యము. అన్ని సస్యములను మొలకెత్తింపచేయునది ఈమెయే. సకల చరాచర జగత్తు ప్రతిష్ఠకు మూలము. ఈమెయే మహాలక్ష్మి. ఈమెయే విద్య. ఈమె సర్వవిశ్వస్వరూపురాలు. అన్ని కోరికలను ఇచ్చునది, అన్నిటిని ప్రసవించునది. అన్ని బీజములను మొలకింపచేయునది. అన్ని శ్రేయములను ప్రసాదించునది. అన్ని లోకములను ధరించునది. పంచభూతములను ప్రకాశింపచేయునది. ఇది సముద్రాంతమువరకు ఉండెడిది. దీనిని మేదిని అని అందురు. మధుకైటభులను రాక్షసుల మేధస్సుతో నిండియున్నందున దీనిని మేదిని అనుచున్నారు. ఆ తరువాత పృధుచక్రవర్తి ముందుకు వచ్చినది. పృధువునకు పుత్రికగా అయినది. అందువలన పృధివి అను పేరు కలిగినది. ఈ భూమి ఆ పృథుచక్రవర్తిచే పరిపాలించబడినది.
ఈ భూమి అన్ని గ్రామములకు ఆధారము. గృహములతో శోభించుచుండునది. పురములతో పత్తనములతో కూడియుండునది. సస్యములు కలది, చక్కని సమృద్ధి కలది. సర్వతీర్థమయము ఇట్లు ఈ భూదేవి సర్వలోకస్వరూపిణి. పృధుమహారాజు ఇంతటి ప్రభావ సంపన్నుడుగా పురాణములలో కీర్తించబడుచున్నాడు. వేనుని పుత్రుడు మహానుభావుడగు పృధుచక్రవర్తి సర్వకర్మలను ప్రకాశింపచేసినవాడు. సనాతనుడగు విష్ణువు బ్రహ్మరుద్రులు బ్రహ్మవాదులచే నమస్కరించబడునట్లు బ్రాహ్మణులచే నమస్కరించబడునట్లు బ్రాహ్మణులచే ఋషులచే అందరిచే పృథుచక్రవర్తి నమస్కరించదగినవాడు. ఈ పృథుచక్రవర్తి వర్ణాశ్రమములను స్థాపించువాడు.సర్వలోకములను ధరింపచేయువాడు. రాజులందరిచేత రాజులు కాదగినవారందరిచేత నమస్కరించదగినవాడు. ఇతను ఆదిరాజు. మహాప్రతాపవంతుడు. ధనుర్వేదమును తెలియగోరువారిచేత జయకాంక్షులగు యోధులచేత నమస్కరించదగినవాడు. ఇతను రాజులందరికి వృత్తిని ఒసంగిన మహారాజు.
ఓ బ్రాహ్మణోత్తములారా! నేనిట్లు పాత్ర విశేషమును ఉత్స విశేషములను దోగ్దృ విశేషములను క్షీర విశేషములను మీ ముందుంచితిని. మీ అందరిముందు యదార్థములను తెలిపితిని. వేనుని పుత్రుడగు పృథుచక్రవర్తి చరితము ధన్యము యశస్యము ఆరోగ్యప్రదము, పుణ్యము, పాపప్రణాశనము అగు చరితమును వినువారికి ప్రతిదినము భాగీరధి స్నానఫలము లభించును. అన్ని పాపములు తొలగి పరిశుద్ధుడై విష్ణులోకమును చేరును.
ఇది శ్రీపాద్మపురాణమున 55 వేల సంహితలో రెండవదగు భూమిఖండమున పృధూపాఖ్యానమున 29 - అధ్యాయము.
.
.
