పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

70 - మహాదారుణ యమలోక పీడావర్ణనమ్

మాతలిరువాచ - మాతలి పలికెను.

మహాతీవ్రము పరమభయంకరము అగు యమపీడను ఇపుడు చెప్పెదను. క్రూరులు బ్రాహ్మణ హంతకులు అయిన పాపులందరు ఈ యమపీడను అనుభవించెదరు. ఒకచోట పరమపాపులు తీవ్రమైన పిడకల నిప్పులచే ఉడికించబడుదురు. ఒకచోట సింహములచే తోడేళ్ళచే పెద్ద పులులచే పాములచే, భయంకరమైన కీటకములచే, ఒకచో పెద్ద జలగలచే, ఒకచో కొండచలువలచే తేనెటీగలచే భయంకరమైన సర్పములచే విషమును గ్రక్కు ఆశీ విషములచే ఒకచో మదించిన యేనుగు గుంపులచే, అవికూడా బలిసినవి ధ్వంసము చేయబడువాటిచే దాని తీక్షమైన కొమ్ములచే పెకలించుచున్న మహావ భములచే పెద్ద కొమ్ములుగల దుష్టగాత్రములను బంధించు మహిషములచే భయంకరములైన డాకినీ భూతములచే పెద్ద వక్షముగల రాక్షసులచే మహాఘోరమైన వ్యాధులచే పీడించబడుచు వెళ్ళుచుందురు. పెద్ద పత్తికొండను అధిరోహించి దవానలములచే కాల్చబడుచు మహావేగముగా వీచుచున్న మహాభయంకరమైన వాయువుచే మహాపాషాణ వర్పముతో అంతట భేదించబడుచు పడుచున్న పిడుగుల ధ్వనులచే భయంకరమైన ఉత్కాపాతములచే బాగుగా మండుచున్న నిప్పులవానతో చంపబడుచు వెళ్ళుచుందురు. పెద్ద నీటి వర్షముతో నింపబడుచు యమునివద్దకు వెళ్ళేదరు. పాపమును చేయు నరులు భయంకరమైన పాపమును అనుభవించెదరు. ఇట్లు ఆయా పాపవిశేషములతో పాపిష్టులైనవారు పాపములను చేయువారు బహుపీడలచే ఆకులమైన నరకమును అనుభవించెదరు. మహారాజా! ఇట్లు నీకు పుణ్యపాపముల వివేకమునంతయూ చెప్పితిని. ఇంకా సర్వోత్తమమైన ఏ ధర్మశాస్త్రమును చెప్పవలయునో తెలుపుము.

ఇదీ శ్రీ పాద్మపురాణమున రెండవదియగు భూమిఖండమున వేనోపాఖ్యానమున పితృతీర్థవర్ణనలో యయాతి చరితమున డెబ్బదియ - అధ్యాయము.