పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
8 - అధ్యాయము
కశ్యపమహర్షి పలికెను.
ఆత్మ అట్లు మాటలను విని గర్భమున అధోముఖముతో నుండి మోహజాలముతో బంధింపబడి ప్రతిదినము ఖేదముతో ఆకులచిత్తుడై సర్వపీడాభిపీడితుడై దుఃఖాక్రాంతుడై ఆధివ్యాధి సమాక్రాంతుడై హాహాకారముతో మూర్ఛితుడై మహాదుఃఖముతో జ్ఞానమోహపీడితుడాయెను.
మహాప్రాజ్ఞుడా అపుడు నీ మాట వినలేదు. ధ్యానము వారించుచున్ననూ గర్భసంకటమున పడితిని. కావున భయంకరమగు ఈ గర్భవాసమునుండి కాపాడుము.
జ్ఞానము పలికెను.
ఓ ఆత్మా! నేను నిన్ను వారించితిని. నా మాటను నీవు వినలేదు. మహాక్రూరులగు పంచాత్మకులచే గర్భసంకటమున పడవేయబడితివి. ఇక ఇపుడు నీవు ధ్యానమును సమీపించుము. అతనివలన సుఖమును పొందగలవు. నీకు గర్భవాసమునుండి విడుదల లభించును. సందేహము లేదు. జ్ఞానవాక్యమును విని జ్ఞానస్వరూపమును తెలిసి ధ్యానమును పిలిచి నా మాట వినుము. నేను నిన్ను శరణుపొందితిని. ఓ ధ్యానమా! నన్ను కాపాడుము అని పలికెను. ధ్యానము అట్లే కానిమ్ము అని అంగీకరించెను. అంతట ఆత్మధ్యానమును చేరెను. ధ్యానముతో కలిసి గర్భమున నివసించుచుండెను. మోహశూన్యుడాయెను. ఆత్మధ్యానమును చేరిన వెంటనే గర్భవాసభయమును మరిచెను. ఇట్లు జ్ఞానధ్యానములతో కలిసిన ఆత్మ మోహమునకు దూరమాయెను. ఆత్మ నేను ఎపుడూ సుఖస్వరూపుడనే. గర్భమునుండి బయలు వెడలగానే పంచాత్మకమును విడుతును అని గర్భముననుండి ఆలోచించుచుండెను. ప్రసవకాలము సమీపించగానే వాయువు ప్రాణము గర్భమును కదిలించెను. అపుడు యోని 24 అంగుళములు వికసించును. గర్బగత పిండము 25 అంగుళములు ఉండును. కావున పీడ యేర్పడును. ఇట్లు పీడించబడుచు మూర్ఛను పొందును. జ్ఞానధ్యానములతో కలిసి భూమిపై పడును. ప్రాజాపత్యవాయువు జ్ఞానధ్యానములను విడదీయును. భూమిని స్పృశించినంతనే జ్ఞానధ్యానములను మరచును. సంసారబంధమున కట్టుబడి శరీరము ప్రియముగా భావించు గుణదోషములు ఆక్రమించును. మహామోహము ఆవరించును. ప్రతిదినము స్నానపానాదికములను కోరుచునేయుండును.
ఇట్లు ఆత్మ పంచాత్మకములతో పోషించబడుచు పాపములను ఆచరించు ఇంద్రియముతో విషయములతో వ్యాపించబడుచుండెను. బంధుసమూహముతో దీనురాలగు భార్యతో ప్రతిదినము కలత చెందుచుండెను. మహామోహముతో మోహజాలముతో బంధించబడుచు నావికునిచే చేప వలలో చిక్కినట్లుగా కదలలేక బంధించబడెను. దృఢముగా నున్న మోహజాలములతో బంధించబడెను. ఇట్టి ప్రపంచముతో వ్యాపించుదానితో వ్యాపించబడి జ్ఞాన విజ్ఞాన భ్రష్టుడై రాగద్వేషవశ్యుడై కామక్రోధములతో పీడించబడుచు ప్రకృతిచేత కర్మచేత బద్దుడై మహామూఢుడాయెను. ఇట్లు ఆత్మ మూఢుడై కామక్రోధవశుడై దుర్మార్గులగు లోభరాగాదులచే ఆక్రమించబడెను. ఈమె భార్య, ఇతను పుత్రుడు, ఇతను మిత్రుడు, ఇది ఇల్లు అని మహామోహప్రదమగు సంసారజాలముతో మోహించబడి బంధితుడై పలు విధములగు పుత్రశోకాది దుఃఖములతో కలతచెందుచు ముసలితనముతో, వ్యాధులతో మానసికచింతలతో ఆక్రమించబడి మహాభయంకరములగు దుఃఖములతో మోహములతో పరితపించుచుండెను. అవమానములతో అభిమానములతో నానా దుఃఖములతోకొట్టబడుచు వృద్దుడై బలహీనుడై ప్రతిదినము అయ్యో! అయ్యో! అని విచారించుచు మూర్చపొందుచుండెను. రాత్రి స్వప్నములను చూచుచు పగలు చైతన్యరహితుడై అంగవైకల్యములతో ప్రతిదినము వ్యాపించబడుచు సంసారమున తిరుగుచు వైరాగ్యమును చూచెను. వైరాగ్యము సంశయరహితుడు, బంధుహీనుడు, ప్రశాంతుడు, పరితుష్టుడుగా నుండెను. ఆత్మ వైరాగ్యముతో ఇట్లు పలికెను. వైరాగ్యము కామక్రోధవర్జితునిగా నుండుటను చూచెను. ఇట్లునగ్నముగా నున్న నీవు ఎవరవు? మిత్రులవద్ద ఎట్లు సిగ్గుపడుచులేవు? ప్రజలు, స్త్రీలు, వృద్ధులు, యువతులు, తల్లులున్నారు. వీరి మధ్యన ఉండి కూడా నగ్నత్వమునకు భయపడుచు లేవు.
వీతరాగ ఉవాచ –
వైరాగ్యము పలికెను.
ఈ సంసారమున నగ్నుడనని ఎవరు భావించెదరు. నగ్నుడనుకానని ఎపుడు భావించును. చక్కగా కట్టుకొనిన నీవు వస్త్రములను ధరించియూ నగ్నుడను కానని అనుకొనుచున్నాను. కాని నేను నగ్నుడను కాను. నీవే నగ్నముగా కనపడుచున్నావు. నీవు ఇంద్రియములకు, విషయములకు వశుడవై మర్యాదను విడిచితివి.
నీవు తెలిసినచో పురుషునికి మర్యాద ఏదో విపులముగా తెలుపుము.
కశ్యపమహర్షి పలికెను
మహాజ్ఞాని మహాబుద్ధిమంతుడగు వీతరాగుడు ఆత్మతో ఇట్లు పలికెను.
వీతరాగుడు పలికెను.
ఎల్లపుడు సుఖదుఃఖములయందు స్థిరముగా మెలగవలయును. ఆయా పరిస్థితులలో అన్ని సమయములలో కష్టమును, కష్టదశను స్థితిని విడువవలయును. ఇక ఇపుడు లజ్జ గురించి చెప్పెదను. ఈ విషయమున ఎక్కువగా మనస్సు కలత చెందుచుండును. నేనిపుడు ఇలా నగ్నముగా స్థానశూన్యునిగా ఉండరాదు. ఇట్లు పశ్చాత్తాపమును చెందుట లజ్జ యనబడును. ఎవరికొరకు సిగ్గుపడవలయును? రెండవవాడు లేడు. ఒకడే పురుషుడు. దివ్యుడు. ఎవరికీ ఏ హానీ చేయనివాడు. ఇక నీవు చెప్పిన జనులను గూర్చి చెప్పెదను వినుము. కుమ్మరివాడు చక్రమున మట్టిముద్దనుంచును. సూత్రముతో (దండము) త్రిప్పుచు పలు ఆకారములనేర్పరచును. కొన్ని వేల భాండములను తన బుద్దిలో భావించిన విధముగా ఏర్పరచును. అట్లే పరమాత్మ కూడా నానారూపములను సృజించును. తరువాత ఏదో ఒక కారణముతో నశించును. ఎపుడూ ఉండువారు ఎప్పటినుండియో ఉండువారి విషయమున సిగ్గుపడవలయును. వారు మరల భూమండలమునకు రారు కదా! భూమి, నీరు, తేజము, వాయువు, ఆకాశము ఈ అయిదు అన్నిచోట్ల, అన్ని వేళలా ఉండును, కనపడును. అన్ని ప్రదేశములలో అన్ని అవయమువలలో అన్ని శరీరములలో ఈ అయిదు ఉండును. అన్ని చోట్ల ఉన్నపుడు ఎవరి విషయమున సిగ్గుపడవలయును? ఇక ఇపుడు స్త్రీలరూపమును చెప్పెదను వినుము. నీరున్న వేయికుండలలో ఒకే చంద్రుడు ప్రకాశించునట్లు నీవు కూడా అన్ని శరీరములలో ప్రకాశించుచుందువు.
గతకాలమున నీవు సహస్ర జంతువులయందు మోహమును పొందితివి, స్థావర జంగమములందు కూడా మోహమును పొందితివి. స్త్రీ మాయా మోహమయ పాపరూపము అగు యోనిద్వారముతో, స్తనములతో, పిరుదులతో, యౌవనముతో శోభించుచుండును. హృదయదేశమున నుండు అధికమాంసమును స్తనములందురు. ఆ మాంసమును చూచుచుందురు. జనుల పతనమునకు మోహరూపముగా చూపబడుచున్నది. నీవు చెప్పినది స్త్రీ కాదు. పరమాత్మ ఆత్మవినోదమునకు చేసిన విచిత్రమిది. స్త్రీలో వలె పురుషునిలో కూడా జీవుడు అంతటా ఉండును. యోని, కుచములు లేనివారు, వాటియందు ఆశలేనివారు జీవన్ముక్తులుగా ఎపుడూ ఉందురు. నరుడు పురుషుడు, నారి ప్రకృతి. ముక్తులు ఎప్పుడూ వారితో రమించజాలరు. ప్రకృతితో కలిసియున్న నీవు పురుషునిలో కనపడుచుందువు. ఎవరు ఎవరిముందు సిగ్గుపడవలయును? ఇట్లు ఆలోచించి సంతోషముతో నుండుము. ఇక ఇపుడు వృద్దస్త్రీని ఎపుడు వృద్దురాలని అందులో వివరించెదను. చర్మము జీర్ణమైయుండును. నెరసిన తెల్లని వెంట్రుకలుండును. బలహీన దీనబలుల ఆశ్రయమును కోరునది. వాస్తవముగా ఈమె వృద్దురాలు కాదు. కాని వృద్దురాలు అనెదరు. ఈమె లక్షణమును చెప్పితిని. ఇక యువతిని గూర్చి చెప్పెదను. ప్రతి క్షణము జ్ఞానముతో పెరుగునది జీవుని ఆశ్రయించునది సుమతి అనబడును. ఈమెయే వృద్ధయువతి కూడా. పురుషుల మధ్య ఎపుడూ ఉండు స్త్రీ సిగ్గుపడవలయును. ఇక నీవు చెప్పిన తల్లిని గూర్చి వివరించెదను. ప్రాణుల అవయవములలో ఎపుడూ చైతన్యములుండును. ఇతరులకు జ్ఞానమునిచ్చునది ప్రజ్ఞ యనబడును. ప్రాణులను పోషించుటకు ప్రజ్ఞయే తల్లిగా కీర్తించబడినది. ఈ ప్రజ్ఞ పోషణమునకు హితమునకు అందరిలో ఉండును. సుమతి అనబడునదే తల్లి. సంసారద్వారమునకు మార్గములుగా చెప్పబడిన రూపములు తల్లులుగా చెప్పబడినవారు బహుదుఃఖములను కలిగింతురు. ఇట్లు మాతృరూపమును చెప్పితిని. ఇంకేమి చెప్పవలయును?
ఆత్మోవాచ –
ఆత్మ పలికెను.
వీతరాగుడు పలికెను.
నా పేరు వీతరాగుడు. నా బంధువు వివేకము. నాకు విషయమున ఆశను వదులుకొని అన్ని కోరికలు వెడలిపోవును. దుష్టములగు కర్మలు నన్ను చూడజాలవు. ఎపుడూ ఆశ నావద్దకు రాజాలదు. క్రోధలోభమోహములు నా భయముతో నశించును.
ఆత్మ పలికెను.
వివేకుడను నీ భ్రాత ఎట్టివాడు? అతని స్వరూపమును, నీ స్వరూపమును నాకు తెలియజేయుము.
వీతరాగుడు పలికెను.
కశ్యపమహర్షి పలికెను.
అంతట వివేకుడు శాంతి క్షమ అను భార్యలతో కలసివచ్చెను. అన్నిటిని చూచువాడు, అన్ని తెలియువాడు, అంతటా ఉండువాడు, సర్వతత్త్వములందు ఆశ కలవాడు, సర్వసందేహములకు శత్రువు, జ్ఞానమునందు ప్రేమ కలవాడు, ధారణ ధీ అను ఇద్దరు పుత్రికలు, పెద్దకొడుకు యోగము, మోక్షము గురువు, పరిశుద్దుడు, అహంకారరహితుడు, ఆశారహితుడు, దానము గ్రహించనివాడు, అన్ని సమయములలో ప్రసన్నముగా నుండువాడు, సుఖదుఃఖాదులకు లొంగనివాడు, బుద్ధిమంతుడు, ధర్మసత్యములు మహామంత్రులుగా క్షమాశాంతులతో కలిసి వివేకము వచ్చి వీతరాగునితో ఇట్లు పలికెను. నీవు పిలువగా వచ్చితిని. నన్నెందుకు పిలిచితివో కారణమును తెలుపుము.
వీతరాగుడు పలికెను.
నీ ముందు నిలుచున్న పురుషుడు మహాపాశములతో కట్టుబడియున్నాడు. మోహబాణములతో తొట్రుపడుచున్నాడు. సంసారబంధనమున చిక్కుకొనియున్నాడు. ఈ ఆత్మసర్వవ్యాపకుడు. నాకు స్వామి. పంచతత్త్వములతో కలిసి జ్ఞానధ్యానరహితుడై యుండెను. నీవు తత్త్వములు బాగుగా తెలిసినవాడవు. ఇతనిని అడుగుము అని. వీతరాగుని మాటను విని వివేకము ఇట్లు పలికెను.
వివేకము పలికెను.
ఓ విశ్వనాయకా! తాము సుఖముగా నుంటున్నారా? ఈ సంసారమునకు వచ్చిన తరువాత తాము ఏమి అనుభవించితిరి? ఏ సుఖమును పొందితిరి?
ఆత్మ పలికెను
ఓ మహాప్రాజ్ఞా! నేను జ్ఞానహీనుడనై దారుణము సహింపశక్యముకాని గర్భవాస దుఃఖమును అనుభవించితిని. జ్ఞానభ్రష్టుడనై నేను దేహమున బహువిధములుగా పుట్టితిని. బాల్యావస్థను పొందిన నేను కృత్యాకృత్యములను చాలా ఆచరించితిని. యౌవనమున క్రీడించితిని. చాలామంది భార్యలను అనుభవించితిని. వార్ధక్యమును పొంది పుత్రశోకాది దుఃఖములతో పరితపించితిని. రాత్రింబవళ్ళు భార్యాది వియోగములతో బహువిధ దుఃఖములతో వేగిపోతిని. రాత్రింబవళ్ళు సుఖమునే ఎరుగను. ఇట్లు దుఃఖములతో తపించుచున్న నేను ఏమి చేయవలయును? నేను సుఖమును పొందగల ఉపాయమును తెలుపుము. ఈ సంసారసాగరబంధమునుండి విడిపించుము.
వివేకము పలికెను.
తాము పరిశుద్దులు. సుఖదుఃఖాది ద్వంద్వరహితులు. పాపశూన్యులు. జగన్నాయకులు. తాము సుఖప్రదులగు వీతరాగులను చేరుడు. మీరు సందేహించకుండా ఆచారశూన్యులుగా నగ్నునిగా నున్న వీతరాగుని చూచితిరి. వీతరాగులు సుఖమును చూపువారు. సర్వసంతాపనాశకులు. ఇట్లు వివేకుని మాటలను వినిన ఆత్మ మరల వీతరాగుని చేరెను. అతనితో దీనుడై బరువుగా నిట్టూర్చుచు ఇట్లు పలికెను. నా మాటను వినుము. నాకు సుఖమును పొందు మార్గమును చూపుము అని. అంతట వీతరాగుడు అట్లే కానిమ్ము! నీ మాటను పాటించెదను. సుఖము గురించి చెప్పితివి కావున నీవు మరల వివేకుని వద్దకే వెళ్ళుము. ఈ వివేకుడే నీకు సుఖమార్గమును బోధించగలడు. ఇట్లు వీతరాగుడు పంపగా వివేకుని వద్దకు వెళ్ళి వివేకునితో ఇట్లు పలికెను. నేను వీతరాగునితో పంపబడితిని. నాకు సుఖమును చూపుము. నిన్ను శరణు వేడితిని. సంసారాపదనుండి నన్ను కాపాడుము.
వివేకుడు పలికెను.
మహాప్రాజ్ఞుడా! జ్ఞానము వద్దకు వెళ్ళుము. అతను నీకు అంతయూ చెప్పగలడు. ఇట్లు పలుకగా ఆత్మ జ్ఞానము వద్దకు వెళ్ళెను. మహాతేజోవంతుడా! అన్ని భావములను చూపువాడా! నిన్ను శరణువేడితిని. సుఖమార్గమును చూపుము.
జ్ఞానము పలికెను.
ఓ లోకేశా! నేను నీ సేవకుడను. కాని నీవు నన్ను తెలియుటలేదు. నేను, ధ్యానము కలిసి నిన్ను చాలామార్లు పంచాత్మకముతో కలియవద్దని వారించితిమి. పంచాత్మక సంగతితో ఆపదను పొందితివి. ధ్యానము వద్దకు వెళ్ళుము. అతను నీకు సుఖమును ప్రసాదించగలడు. ఇట్లు జ్ఞానముతో పంపబడిన ఆత్మ ధ్యానమునాశ్రయించి ఉండెను. అత్యంత సిద్దమగు సుఖమును నాకు చూపుము. నీ శరణమును పొంది నన్ను రక్షించుము. ఇట్లు పలికిన ఆత్మ మాటలను వినిన ధ్యానము సంతోషమునంది ఆత్మతో ఇట్లు పలికెను. నీవు ఏ పనులలోనైననూ నన్ను విడువకుము. నీవు వీతరాగునితో వివేకము ధ్యానముతో వివేకముతో ఎపుడూ కలిసి ఉండుము. ఆత్మావలోకనము చేయుచుండుము. నీవు జ్ఞానము కలిగి స్థిరునివై సందేహములు బాధలు లేకుండగా నుండుము. గాలిలేని ప్రదేశమున నున్న దీపము మసిని విడుచునట్లు సంశయములను విడిచిన నీవు అన్ని దోషములను నశింపచేసి ఆనందమును పొందెదవు. ఏకాంతమున నుండి ఆహారమును విడిచి, ఆహారమును తీసుకొనదలచినచో మితముగా భుజించి సుఖదుఃఖభావములను విడిచి, మౌనమును దాల్చి చాపల్యమును విడిచి స్థిరాసనమునంది ఆత్మతో పరమాత్మను ధ్యానించుచు నాస్థిరబుద్ధితో శ్రీమన్నారాయణుని స్థానమగు పరమపదమును పొందగలవు.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదగు భూమిఖండమున ఆధ్యాత్మవర్ణనలో ఎనిమిదవఅధ్యాయము.
