పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

40 - నిత్యనైమిత్తిక దానఫల కథనమ్

వేన ఉవాచ - వేనుడు పలికెను.

దేవదేవా! పూర్వము మీతో నిత్యదానఫలమును వినియుంటిని. నైమిత్తిక దానము చేసినవానికి కలుగు ఫలమును నాకు తెలుపుము. మీ అనుగ్రహముతో ఎంత వినుచున్నా నాకు తృప్తి కలుగుట లేదు. వినవలయునని శ్రద్ద కలుగుచున్నది.

విష్ణురువాచ - శ్రీమహావిష్ణువు పలికెను.

నృపోత్తమా! ఇపుడు నైమిత్తికదానములను చెప్పెదను. మహాపర్వ సంభవించినపుడు శ్రద్దతో దానములను సతాత్రలకు అర్పించినవానికి కలుగు పుణ్యఫలమును వినుము. మహాపర్వలో గజమును కాని, రథమును కాని, అశ్వమును కాని దానము చేసినవాడు పుణ్యదేశమున రాజుగా పుట్టును. సకల భృత్య పరివారముతో కూడియుండును. అచట నా అనుగ్రహమును పొందును. రాజగును. ధర్మాత్ముడగును. జ్ఞానవంతుడు, బలవంతుడగును. మహాతేజోవంతునిగా పుట్టును. మహాపర్వ సంభవించినపుడు భూదానమును చేసినవాడు లేదా గోదానమును చేసినవాడు సర్వభోగపతియగును. పరమ పుణ్యాత్ముడైన బ్రాహ్మణునికి దానము చేయవలెను. పుణ్యతీర్థపర్వలో పాత్రను తెలిసినవాడు మహాదానములను చేసినవాని చిహ్నములను చెప్పెదను. అతను భూపతియగును. తీర్థమున సర్వకాలము సంప్రాప్తించినపుడు గుప్తదానము చేసినవాడు గొప్ప నిధులు నిరంతరము లభించుచునేయుండును. మహాపర్వ లభించినపుడు పుణ్యతీర్థమున బ్రాహ్మణశ్రేష్ఠునకు బంగారముతో కూడిన చక్కని వస్త్రదానము చేసినవానికి కలుగు ఫలమును చెప్పెదను.

అట్టివానికి సుగుణవంతులు, వేదపారగులు, ఆయుష్మస్తులు, సంతానవంతులు, యశస్సు పుణ్యముకల చాలామంది పుత్రులు కలిగెదరు. మహామతీ! వారు విశాలమైన, దృఢమైన సంపదకలవారు, సర్వసమృద్ధిచెందిన లక్ష్మీవంతులు అయ్యేదరు. పవిత్రమైన సౌఖ్యమును పొందెదరు. ధర్మవంతునిగా పుట్టుదురు. మహాపర్వ సంభవించినపుడు ప్రయత్నపూర్వకముగా తీర్థమునకు వెడలి కాంచనవర్ణముగల కపిలను సువర్ణముతో మహానుభావుడైన బ్రాహ్మణునకు దానము చేయవలయును. అట్టి దానము వలన కలుగు పుణ్యఫలమును చెప్పుచున్నాను వినుము. కపిలాదానమును చేసినవాడు సకల సౌఖ్యములను చక్కగా అనుభవించును. బ్రహ్మలోకమును చేరి బ్రహ్మ ఆయుః ప్రమాణము వరకు అచటనే నివసించును. మహాపర్వ సంభవించినపుడు గోవును వస్త్ర అలంకార భూషణములతో బంగారముతో పాటు చక్కగా అలంకరించి దానము చేసినచో రాజేనా ఆ దాన ఫలభోగమును నేను చెప్పుచున్నాను వినుము. దానభోగములతో కూడిన విపుల సంపద కలుగును. సర్వవిద్యాపతి అయి విష్ణుభక్తుడగును. ఈ భూమండలమున్నంతవరకు అతను విష్ణులోకమున నివసించును. పర్వకాలమున తీర్థమునకు వెడలి బ్రాహ్మణునకు ఒక భూషణమును దానము చేసినచో భూలోకమున సకల భోగములను అనుభవించి స్వర్గమున ఇంద్రునితో విహరించును. మహాపర్వ సంప్రాప్తించినపుడు బ్రాహ్మణోత్తమునకు వస్త్రమును, భూమిని, భోజనమును సత్పాత్రునకు శ్రద్ధతో దానము చేసినచో అతను వైకుంఠమున విష్ణుతుల్య పరాక్రముడై ఆనందించును.

వివేకము కల బ్రాహ్మణోత్తమునకు వస్త్రముతో పాటు బంగారమును దానము చేసిన తన ఇచ్చానుసారముగా అగ్నివంటి తేజోవంతుడై వైకుంఠమున నివసించును. సువర్ణకుంభమును మంచినెయ్యితో నింపవలయును. పైన వెండిరేకుతో మూయవలయును. ఆ కుంభమును వస్త్రహారములతో అలంకరించవలయును. బ్రహ్మసూత్రముతో చుట్టి పుష్పమాలలతో అలంకరించి వేదమన్తములతో ప్రతిష్టింపచేసి పవిత్రములైన షోడశోపచారములతో అర్చించవలయును. చక్కగా అలంకరించి మహానుభావుడైన బ్రాహ్మణునికి దానము చేయవలయును. అట్లే 16 ఆవులు వస్త్రములతో పాలు పిండు కంచుపాత్రలతో నాలుగు సువర్ణకుంభములతో, బంగారముతో కూడిన దక్షిణను ఈయవలయును. అట్లే వస్త్రాలంకార భూషణములతో 12 గోవులను వేరుగా మరొక బ్రాహ్మణునకు ఈయవలయును. ఈ విషయమున సంశయము లేదు.

రాజపుత్రా! ఇట్టి ఇతర దానములు తీర్ధసమయమును ఉత్తమపాత్రను పొంది శ్రద్దతో దానము చేసినచో బహుపుణ్యమును ప్రసాదించును. ఒక కోరికతో విష్ణువునుద్దేశించి దానము చేసినచో ఆ దానభావనతో భావనా పరికల్పితుడై కోరిన ఆ ఫలమును పొందును. ఇందులో సంశయము లేదు. ఇక ఇపుడు ఆభ్యుదయమును యజ్ఞములతో ప్రాప్తించుదానిని చెప్పెదను. ఆ దానముతో ఆ శ్రద్దతో ప్రజ్ఞావృద్ధిని పొందును. దుఃఖమును పొందడు. ఈ లోకమున ధర్మాత్ముడై భోగములను అనుభవించును. దివ్యగతిని పొందిన తరువాత ఇన్జభోగములను అనుభవించును. తన కులము వేయి కల్పముల వరకు స్వర్గమును చేర్చును. ఇట్లు ఆభ్యుదయమును చెప్పితిని. ఇక ఇపుడు ఇంకొకటి చెప్పెదను.

శరీరము క్షీణించుచున్నదని తెలిసి వార్ధక్యముతో పీడించబడినవారు తప్పక దానమును చేయవలయును. ఎవరో ఏదో చెప్పారని ఎవరిమీద ఆశ పెట్టుకొనరాదు. 'నేను చనిపోయినచో నా పుత్రులు, ఇతరులైన స్వజనులు, బంధువులు, మిత్రులు నేను లేకుండగా ఎట్లుండెదరు?’ అని వారిమీద మోహముతో మోహించబడి ఏ కొంచెము కూడా దానము చేయడు. అట్టి మోహాత్ముడు మృత్యువును పొందును. ఇతని మిత్రులు, బంధువులు రోదింతురు. దుఃఖముతో మాయామోహములతో పీడించబడి మృతుని మోక్షమును ఆలోచించుచు దానములను సంకల్పింతురు. అతడు మరణించిన తరువాత, మాయామోహము తొలగిన తరువాత, సంకల్పించిన దానములను మరతురు. లోభముతో దానమును చేయరు. చనిపోయినవారు బహుదుఃఖములతో యమలోకమార్గమును బట్టును. ఆకలి దప్పి బాధించుచుండగా ఎన్నో దుఃఖములచే పీడించబడుచుండును గాన స్వయముగానే దానమును చేయవలయును కాని ఎవరో చేయుదురని ఆశించరాదు.

రాజశ్రేష్టా! ఎవరికి పుత్రులు? ఎవరికి పౌత్రులు? ఎవరికి భార్య? ఈ సంసారములో ఎవరికీ ఎవరూ కారు. కావున దానమును చేయవలయును. జ్ఞానము కలవాడు తానే దానము చేయవలయును. ఇందులో ఎట్టి సంశయమూ లేదు. అన్నము, పానీయము, తాంబూలము, ఉదకము, సువర్ణము, దూడతో నున్న చక్కని ఆవును, భూమిని, పలురకముల ఫలములను, చాలా జలపాత్రలను నీటితోనున్నవాటిని, విచిత్రవాహనములు, ఎన్నో బండ్లు పలువిధములైన గంధములను, కర్పూరము, పాదములకు సుఖమునిచ్చు పాదరక్షలను సుఖమును కోరువారు దానము చేయవలయును. మహారాజా! ఈ దానములతో యమమార్గములను సుఖముగా యమదూతలచే అలంకరించబడినదారిని వెళ్ళును.

 ఇది శ్రీపాద్మపురాణమున ద్వితీయభాగమైన భూమిఖండమున వేనోపాఖ్యానమున నలుబదియ - అధ్యాయము