పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

5 - అధ్యాయము

             శివశర్మ పలికెను.

‘సుపుత్రా! తపస్సు, ఇంద్రియ నిగ్రహము, ఆచారములు, గురుశుశ్రూష, నా యందలి భక్తితో సంతోషించితిని. నా ఈ వికారరూపమును విడుచుచున్నాను. ఇపుడు నన్ను చూచి సంతోషించుము.’ ఇట్లు పలికి శివశర్మ తమ మొదటి శరీరమును చూపెను. మొదట తలిదండ్రులను చూచినట్టులిపుడు మరల కనపడిరి. మహానుభావులు, తేజోవంతులు, సూర్యబింబములా భాసించువారుగా నుండిరి. సోమశర్మ ఎంతో భక్తితో వారిద్దరి పాదములకు నమస్కరించెను. అపుడు పుత్రునితో చాలా సంతోషముగా మాటలాడి శ్రీమన్నారాయణుని అనుగ్రహముతో భార్యతో కలిసి తమ యోగప్రభావముతో పుణ్యములతో ధర్మాత్ముడగు శివశర్మ ఇతరులు పొందరాని విష్ణుపదమును పొందెను. ఇతర పుణ్యములతో తపస్సులతో చింతనలతో న్యాసధ్యానజ్ఞాన స్తవములతో, దానములతో తీర్థయాత్రలతో విష్ణుసాక్షాత్కారము లభించదు. సమాధితో జ్ఞానయోగముతో పరమపదము సాక్షాత్కరించును.

      సూతమహర్షి పలికెను.

అంతట అచట సోమశర్మ బుద్ధిమంతుడు కావున తపమునాచరించెను. బంగారమును ఆభరణములను రాళ్ళుగా, మట్టి పెద్దలుగా చూడసాగెను. ఆహారవిజయమును, నిద్రావిజయమును పొంది సర్వవిషయములను విడిచి ఏకాంతమున నివసించుచుండెను. యోగాసనమునధిరోహించి, నిరాశుడై గ్రహించుటను విడిచెను. అట్లుండగా అతనికి మృత్యుకాలము సంప్రాప్తమాయెను. అట్లు మృత్యుకాలము ఆసన్నము కాగా సోమశర్మవద్దకు రాక్షసులు వచ్చిరి. ఋషుల పూజను పెంచు శాలగ్రామ క్షేత్రమున కొందరు దైత్యులని, మరికొందరు దానవులని పలుకుచున్న మాటలు చాలాకాలమునకు తపము చేయుచున్న సోమశర్మ చెవిలో పడెను. జ్ఞానముతో ధ్యానమగ్నుడైన సోమశర్మలో దైత్యభయము ప్రవేశించెను. ఆ ధ్యానములోనే దైత్యభయముతో ఆ మహానుభావుని ప్రాణములు త్వరగా బయలువెడలెను. సోమశర్మ దైత్యభయముతో మృత్యువునందెను. కావున దైత్యగృహమున హిరణ్యకశిపుని పుత్రునిగా జన్మించెను. దేవాసుర మహాయుద్దమున శ్రీహరిచే సంహరించబడెను. శ్రీమహావిష్ణువుతో యుద్దము చేయుచు ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుని విశ్వరూపముతో పాటు వాసుదేవత్వమును (సర్వాంతర్యామిత్వమును) చక్కగా సాక్షాత్కరించుకోగలిగెను. పూర్వ యోగాభ్యాసబలముతో చక్కని జ్ఞానము కలవాడు కావున పూర్వజన్మను శివశర్మ చరితమును గుర్తుచేసుకొనెను. నేను పూర్వము సోమశర్మను, రాక్షసజాతిలో పుట్టితిని. ఈ దేహమును విడిచి ఉత్తధామ పరమపావనము, మోక్షదాయకమగు పుణ్యములతో జ్ఞానముతో ఎపుడు శ్రీహరి సన్నిధికి చేరెదనో అని యుద్దములో మరణించుచు ప్రహ్లాదుడు చింతించెను. పూర్వము ప్రహ్లాదుడు ఇట్లు ఆలోచించెను. సర్వసందేహనివర్తకముగా ఈ చరితమును చెప్పితిని.

       సూతమహర్షి పలికెను.

యుద్దమున శ్రీహరితో ప్రహ్లాదుడు మరణించగా అతని తల్లి కమల పుత్రుడు మరణించుటవలన రాత్రింబవళ్ళు పుత్రశోకముతో విలపించసాగెను. హిరణ్యకశిపుని ప్రియురాలు కమల మరో పతివ్రత, మహానుభావురాలు పుత్రశోకముతో విలపించుచుండగా నారదమహర్షి అచటికి వచ్చి ఇట్లు పలికెను.

‘పుణ్యభాగినీ! మహాభాగా! నీవు పుత్రుని కొరకు విలపించకుము. శ్రీహరితో చంపబడిన నీ పుత్రుడు మరల పుట్టును. మరల తన లక్షణములతో నీ పుత్రునిగా పుట్టి మరల ప్రహ్లాదుడను పేరే ఉండును. అసురభావములు లేనివాడై దైవభావములతో దేవతలతో నమస్కరించబడుచు ఇంద్రపదవిని పొందును. ఆ పుత్రునితో నీవు ఆనందమును పొందగలవు. ఈ రహస్యమును నీవు ఎవరికీ తెలుపరాదు. ప్రహ్లాదునికి జ్ఞానబోధను చేయుము. దీనిని అతిరహస్యముగా దాచి ఉంచుము.’ ఇట్లు చెప్పి నారదమహర్షి వెడలిపోయెను.

తరువాత కమలాగర్భమున పుట్టి ప్రహ్లాద నామముతో వెలసెను. బాల్యభావముననే శ్రీమహావిష్ణువును ధ్యానించసాగెను. నరసింహ స్వామి అనుగ్రహముతో స్వర్గమున ఇంద్రపదవి నధిష్టించెను. దైవత్వమును పొంది ఇంద్రపదవిని పొంది జ్ఞానస్వరూపుడై శ్రీవిష్ణులోకమగు మోక్షమును పొందును. సృష్టి భావములు అనేకములు అనంతములు అసంఖ్యాకములు. మహానుభావులు జ్ఞానులు ఈ విషయమున మోహమును పొందరాదు. మీరడిగినదంతయూ మీకు వివరించితిని మరియొక్క సందేహమును లేదా ప్రశ్నను కూడా అడుగుము నేను తీర్చెదను. దేవదేవుడగు శ్రీమన్నారాయణుడు దానవక్షయమును దేవవిజయమును గావించి మూడు లోకములను స్థాపించెను. ఋషయ ఊచుః

దేవశబ్దమునకు ధారకమగు ఇంద్రత్వము ఎవరికి వచ్చినది? ఎవరిచ్చిరి? ఈ విషయమును విస్తరముగా వివరించుము.

       సూతమహర్షి పలికెను.

ఈ మహానుభావుడు ఇంద్రత్వమును పొందిన విధానమును విస్తరముగా చెప్పెదను. శ్రీమహావిష్ణువు మహాసంగ్రామమున రాక్షసులందరిని సంహరించగా పాపులందరూ నశించిరి. అపుడు దేవతలు గంధర్వులతో నాగులతో విద్యాధరులతో కలిసి శ్రీమహావిష్ణువును సమీపించి చేతులు జోడించి ఇట్లు పలికిరి. ‘భగవంతుడా! దేవదేవా! హృషీకేశా! నీకు నమస్కారము. మా విన్నపమును దయతో ఆలకించుడు. ఇపుడు మాకు పుణ్యాత్ముడు శాసకుడు, రక్షకుడుగా ఒక ఇంద్రుని ఏర్పరుచుము. మూడు లోకములలోనివారు అతనిని ఆశ్రయించి సుఖజీవనమును సాగింతురు.’

                  వాసుదేవుడు పలికెను.

‘పుణ్యాత్ములారా! నా లోకమున వైష్ణవతేజముతో, బ్రాహ్మణోత్తముడు చాలా కాలమునుండి నివసించుచున్నాడు. అతనికి నా లోకమున నుండు కాలము ముగిసినది. అతను నా భక్తుడు, మహానుభావుడు బ్రాహ్మణోత్తముడు. నా తేజస్సుతో మిమ్ములను పాలించును. ఆ ధర్మాత్ముడు ధర్మములో అందరినీ రంజింపచేయును. అతను మీకు పాలకుడు, ధారకుడు బ్రాహ్మణ సత్తముడు, ధర్మాత్ముడు మీకు పాలకుడగును. అదితి పుత్రుడు, సువ్రతుడనువాడు, మహాబలుడు, మహా పరాక్రమము కలవాడు కను మీకు ఇంద్రుడగును.’

                    సూతమహర్షి పలికెను.

ఇట్లు శ్రీహరి దేవతలకు ఉత్తమ వరములనిచ్చెను. శ్రీమహావిష్ణువుతో కలిసి దేవతలందరూ విజయులై తలిదండ్రులగు అదితి కశ్యపులను చూచుటకు వెళ్ళిరి. సుఖాసీనులగు అదితికశ్యపులకు నమస్కరించి చేతులు జోడించి మహాసంతోషముతో ఇట్లు పలికిరి. మీ అనుగ్రహముతో మేము దేవత్వమును పొందితిమి. ఆ మాటను వినిన కశ్యపప్రజాపతి గొప్ప సంతోషముతో దేవతలతో ఇట్లు పలికెను.

‘మీరు ఎల్లకాలము సత్యధర్మములతో ప్రవర్తించువారు. మా అనుగ్రహమువలన తపఃప్రభావమువలన మీరు దేవత్వమును నిత్యపదమును పొందితిరి. నాకు చాలా సంతోషము కలిగినది. కావున వరమునిచ్చుచున్నాను. మీరు ఈనాటినుండి జరామరణములు లేనివారుగా, నాశము లేనివారుగా నుందురు. అన్ని కోరికలు తీరి అన్ని అర్థములు సమృద్ధిగా నుండి సర్వసిద్ధులు చేకూరుగాత. నా అనుగ్రహమువలన దేవనాగ గంధర్వులు ఉత్తమ దేవతలు అందరూ ఈ వరమును పొందెదరు గాత.’

            విష్ణువు పలికెను.

ఓ దేవమాతా! నీకు శుభమగుగాత! వరమును కోరుకొనుము. నీకు కావలసినంతయూ ఈయగలను.

                     అదితి పలికెను.  

‘మాధవా! నీ అనుగ్రహము వలన మొదట పుత్రవతిని అయితిని. నా పుత్రులందరు జరామరణరహితులు, నాశరహితులు, పుణ్యకార్యరతులుగానున్నారు. ఇట్టి పుత్రులు నాకు లభించిరి. ఇక ఇపుడు సర్వకామనలను సమృద్ధిగా ప్రసాదించు నీవు కూడా నా గర్భములో నివసించి నాకు పుత్రుడవైతివి. పుత్రుడవగు నీతో ఎల్లపుడు సంతోషించు మహాభాగ్యమును నాకు ప్రసాదించుము. ఈ వరమును పరిపూర్తి చేయుము.’

         వాసుదేవుడు పలికెను.

‘తల్లీ! నీవు దేవకార్యము కొరకు మానవ శరీరమును ధరించవలయును. అపుడు నేను నీ గర్భవాసము చేయగలను. 12వ యుగమున భూభారమును హరించుటకు జమదగ్ని సుతుడనుగా రామనామముతో బ్రాహ్మణోత్తమునిగా అవతరించెదను. ప్రతాపవంతుడను తేజోవంతుడను సర్వక్షత్రవధకొరకు నీకు పుత్రునిగా పుట్టి శస్త్రధారులలో శ్రేష్ణునిగా పేరు పొందెదను. 27వ త్రేతాయుగమున నీ పుత్రునిగా రామనామముతో అవతరించెదను. 28వ ద్వాపరయుగమున చివరలో సర్వరాక్షససంహారము కొరకు భూభారహరణము కొరకు వాసుదేవనామముతో నీ పుత్రునిగా పుట్టెదను. ఇపుడు నా మాటను ఆచరించుము. సర్వలక్షణ సంపన్నుడు, సత్యధర్మసమన్వితుడు, సర్వజ్ఞుడు, సర్వప్రదుడు, సుందరుడు అగు పుత్రుని కనుము. ఆ నీ పుత్రునికి ఇంద్రత్వమును ఇచ్చెదను. అతను కూడా ఇంద్రుడు కాగలడు.’ ఇట్లు శ్రీమహావిష్ణువు మాటలను విని అదితి పరిపూర్ణ సంతోషముతో స్వామీ మీ అనుగ్రహముతో ఇంద్రుడు పుత్రుడు కాగలడు. మీరు చెప్పినట్లే కానిండు. మీ మాటను ఆచరించేదను అని. అంతట ఆ దేవతలందరు అన్ని బాధలు తొలగి ఆనందముతో శ్రీహరితో కలిసి తమ తమ నెలవులకు చేరిరి.

            సూతమహర్షి పలికెను.

అంతట అదితి ఋతుస్నాతయై కశ్యపుని చేరి ఇంద్రపదవినధిష్టించు పుత్రుని ప్రసాదించుడు అని యాచించెను. కశ్యపుడు ఒక క్షణము నాలోచించి ఇట్లు పలికెను. అట్లే కానిమ్ము. నీకు మూడు లోకములను అనుభవించగలవాడు, యజ్ఞభోక్త అగు పుత్రుడు జన్మించును. అని పలికి ఆమె శిరమున తన హస్తమునుంచి కశ్యపప్రజాపతి తపమాచరించుటకు వెడలెను. తేజోవంతుడు, సత్యధర్మయుక్తుడు సువ్రతుడను తేజోవంతుడు విష్ణులోకమున ఎపుడూ నివసించుచుండును. అతనికి పుణ్యము క్షీణించగా ఆ బ్రాహ్మణోత్తముడు విష్ణులోకమునుండి కర్మానుసారముగా పడును. అతను అదితి పవిత్రగర్భమున ప్రవేశించును. తాను చేసిన సత్యపుణ్యకర్మలతో ఇంద్రత్వముననుభవించుటకు ప్రవేశించెను. పూర్వపుణ్యముతో తపముతో అదితి గర్భము ధరించెను. వనవాసమునకు వెడలి సోమరితనమును విడిచి తపమును ఆచరించసాగెను. అదితి తపమునాచరించుచుండగా నూరు దివ్యవత్సరములు గడిచినవి. దేవదానవులు కూడా చేయజాలని తీవ్రతపము నాచరించెను. అదిత తపముతో తేజస్సుతో సూర్యతేజస్సుతో సాటి వచ్చు కాంతికలదై రెండవ సూర్యునివలె పరమధ్యానములో శోభించుచుండెను. తపస్సుతో తేజస్సుతో అధిక రూపవతిగా భాసించెను. అదితి తపోధ్యానపరురాలు వాయుభక్షణగావించుచు దక్షపుత్రిక మిక్కిలి వెలుగొందసాగెను. అంతట ఋషులు, సిద్దులు, తేజోవంతులగు దేవతలు ఆ మహాభాగ్యవతియగు అదితిని స్తుతించుచు జాగరూకతతో కాపాడుచుండిరి.

నూరు సంవత్సరములు నిండిన తరువాత అచటికి శ్రీమహావిష్ణువు వచ్చి అదితితో ఇట్లు పలికెను. ‘దేవీ! నీ గర్భము నిండినది. ప్రసవకాలము ఆసన్నమైనది. నీ తపస్సుతో పుష్టిని పొందెను. నీ తేజస్సుతో పెరిగెను. ఇక ఇపుడే గర్భమును విడువుము.’ ఇట్లు పలికి శ్రీమహావిష్ణువు వెడలిపోయెను. దివ్యకాలము రాగానే అదితి ప్రసవించెను. ఆ పుత్రుడు రెండవ సూర్యునివలె కాంతిమంతుడు, సుందరుడు, సుందరాంగుడు, సర్వలక్షణ సంపన్నుడు, చతుర్భుజుడు, దీర్ఘకాయుడు, లోకపాలకుడు, దేవేశుడు, తేజోజ్వాలలతో నిండిన చిన్నవాడు చక్రపద్మహస్తుడు, చంద్రబింబ సమానాకారవదనుడు, ప్రకాశించువాడు, మహాప్రాజ్ఞుడు వైష్ణవతేజస్సుతో భాసించువాడు, ఇతర దివ్యలక్షణములు కలవాడు, సర్వలక్షణసంపూర్ణుడు చంద్రవదనుడు, కమలాక్షుడుగా నుండెను. అచటికి త్రిమూర్తులు, వేదజ్ఞులగు ఋషులు, గంధర్వులు, నాగులు, సిద్ధులు, విద్యాధరులు, సప్తర్పులు, వారికంటే మొదటివారు. తరువాతి మహాతేజోవంతులు, ఇతరులగు పవిత్రమునులు, పవిత్ర శుభఫలములను ఇచ్చువారు, సంతోషపూర్ణహృదయులై అచటికి వచ్చిరి. ఆ మహానుభావుడు పుట్టగానే దివ్యశక్తిసంపన్నులు దేవతలు పర్వతములు, తపస్సంపన్నులు సప్తసాగరములు పవిత్రమగు నదులు ప్రీతితో ఇతర చరాచరములన్నియూ అచట చేరినవి. దేవాధిపతులు మంగళకార్యములను మహోత్సాహముతో ఆచరించిరి. అప్సరసలు నాట్యమాడిరి. గంధర్వులు పాడిరి.

ఆ మహానుభావుడగు కశ్యపపుత్రుని వేదపారగులగు బ్రాహ్మణులు స్తుతించుచున్నారు. బ్రహ్మ విష్ణుమహేశ్వరులు వేదములు అచటికి వచ్చిరి. వేదాంగములు, ఉపాంగములు కలిసి అచటికి వచ్చినవి. మూడులోకములలోనున్న పావన ప్రాణులన్నీ అచటికి చేరినవి. పవిత్రమంత్రపాఠములతో ఉత్సవములతో మంగళమును జరిపిరి. సంతోషాంతరంగులై అందరు మహాతేజశ్శాలులు అతని స్తుతించసాగిరి. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, కశ్యపుడు, బృహస్పతి, అతనికి నామకర్మమునాచరించిరి. వసుదత్తుడని, వసుదుడని, ఆఖండలుడని, మరుత్వాన్ అని, మఘవా, బిడౌజా, పాకశాసన శక్ర ఇంద్రుడని నీ పుత్రుడు ప్రసిద్దిపొందును. ఇవన్నియూ అతని పేర్లే. అందరూ సంతోషముతో ఇట్లు నామకర్మ జరిపిరి. స్నానమును ఇతర సంస్కారములను చేయించిరి. విశ్వకర్మను పిలిచి ఆభరణములనిప్పించిరి. ఆ మహానుభావుడగు దేవరాజు పుట్టగా దేవతలు తేజశ్శాలులందరూ ఆనందించిరి. పవిత్రమగు తిథి నక్షత్ర ముహూర్తములలో వసుదత్తుని ఇంద్రపదవిలో అభిషిక్తుని గావించిరి. శ్రీహరి అనుగ్రహముతో వసుదత్తుడు ఇంద్రపదవిని అధిష్టించెను. ఇట్లు దేవరాజగు వసుదత్తుడు ఘోరతపమునాచరించెను. ఆ తపములో ఉగ్రమగు తేజస్సు వజ్రపాశాంకుశాయుధములను పొందెను.

వసుదత్తుడాచరించు ఉగ్రమగు తపఃప్రభావమును చూచి శుక్రుడు ఇట్లు స్తుతించెను. ఇతనిలాంటి మహానుభావుడు సుందరుడు లోకములో ఇంకొకరుండరు. శ్రీమహావిష్ణు అనుగ్రహమువలన ఇంతటి దివ్యశ్వర్యమును పొందినవాడు ఇంకొకడు లేడు. ఇంతటి తపస్సుతో ఉగ్రవీర్యుడు మూడులోకములలో ఇంకొకడు ఉండబోడు అని స్తుతించెను.

ఇది పద్మపురాణమున ద్వితీయమగు భూమిఖండమున దేవాసురాధ్యాయమున ఇంద్రాభిషేకమను అయిద - అధ్యాయము ముగిసినది.