పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

39 - అధ్యాయము

ఋషయ ఊచుః - ఋషులు పలికిరి.

సత్యవంతులలో శ్రేష్ఠుడా! వేనుడు పాపమును పారదోలి స్వర్గమునకెట్లు వెడలెనో నాకు విస్తరముగా తెలుపుడు!

సూత ఉవాచ - సూతమహర్షి పలికెను.

ఓ బ్రాహ్మణోత్తములారా! పావనులగు ఋషుల సంసర్గము వలన సంభాషణము వలన శరీరమును మధించుటవలన అతని పాపము బయలువెడలెను. పాపము తొలగిన తరువాత ఆ పుణ్యాత్ముడగు వేనుడు శాశ్వతమగు జ్ఞానమును పొందెను. రేవానదీ దక్షిణతీరమున పాపనాశకమగు తృణబిందుమహర్షి ఆశ్రమమున కామక్రోధములను విడిచి నూరు సంవత్సరములు తపమునాచరించెను. అతని ఉగ్రతపముతో శంఖచక్రగదాధరుడగు శ్రీహరి పాపరహితుడగు వేనునిపై దయచూపెను. ప్రసన్నుడాయెను. నేను ప్రసన్నుడనైతిని. ఉత్తమమగు వరమును కోరుము అని పలికెను కూడా.

వేన ఉవాచ - వేనుడు పలికెను.

దేవా తాము ప్రసన్నులగుచో నాకు ఈ శరీరముతోనే తలిదండ్రులతో నీ ప్రభావము వలన తమ నెలవైన పరమపదమునకు వెళ్ళగోరుచున్నాను.

శ్రీవాసుదేవ ఉవాచ - శ్రీవాసుదేవుడు పలికెను.

నీవు గొప్పవానిగా పేరుపొందిన ఆ మహామోహము ఎటు పోయినది. మోహయుక్తమగు లోభముతో తమోమార్గము భ్రష్టమైనది.

వేన ఉవాచ - వేనుడు పలికెను.

ప్రభూ! నేను పూర్వము చేసిన పాపమువలన మోహమును చెందితిని. కావున మహాభయంకరమగు ఈ పాపమునుండి నన్నుద్దరించుము. ఇపుడు జపించవలసిన లేదా పఠించవలసినదానిని అనుగ్రహించి తెలుపుము.

భగవానువాచ - భగవంతుడు పలికెను.

మహానుభావా! మహారాజా! మేలు నీ పాపము నశించినది. తపసుతో పరిశుద్ధుడవైతివి. కావున నీకు పుణ్యమును చెప్పెదను. నీవడిగినట్లు నన్ను పూర్వము బ్రహ్మ కూడా ఈ విషయమునే అడిగెను. అతనికి చెప్పినదంతయూ నీకు చెప్పెదను. నా నాభిపద్మములో ధ్యానములో నున్న బ్రహ్మకు వరమునిచ్చుటకు ఆవిర్భవించితిని. ఆ బ్రహ్మ పాపమును తొలగించు పుణ్యమేదని అడిగెను. సుగతిని ప్రసాదించునది వాసుదేవమను పేరు కలది అన్ని స్తోత్రములలో పరమము పఠించు జపించు నరులకు సర్వసౌఖ్యప్రదమగు విష్ణుప్రీతికరమగుదానిని ఉపదేశించితిని.

విష్ణురువాచ - విష్ణువు పలికెను.

అవ్యక్తమూర్తినగు నేను ఈ సకల జగత్తున వ్యాపించియుంటిని. కావుననే నా భక్తులు నన్ను విష్ణువందురు. (వ్యాప్నోతీతి విష్ణుః అని వ్యుత్పత్తి చూపబడినది.) అన్ని భూతములు నాలో నుండును. అన్ని భూతములలో నేనుందును. కావున విద్వాంసులు ఆదరముతో నన్ను వాసుదేవుడందురు. (సర్వత్ర వసతి, సర్వే వసంతి యత్ర అను వ్యుత్పత్తి చూపబడినది.) ప్రళయకాలమున సకలప్రాణులను అవ్యక్తములోనికి (ప్రకృతిలోనికి) లాగును కాన శరణాగతులు నన్ను సంకర్షణుడందురు. (సమ్యక్కర్షతి ఇతి సంకర్షణః అను వ్యుత్పత్తి చూపబడినది.) సంకల్పముతో కామరూపుడనగుదును. నేను చాలా కావలయునను కోరికతో సృష్టి కావించినవాడను కావున సంతానార్డులు నన్ను ప్రద్యుమ్నుడందురు.

భగవానువాచ - భగవంతుడు పలికెను.

శ్రీమహావిష్ణువు బ్రహ్మతో ఇట్లు పలికి తన రూపమును అన్తర్థానమును గావించెను. ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా శ్రీమన్నారాయణుడు జగమంతా వ్యాపించియుండుటను తెలుసుకొని క్షణకాలమున కృతార్థుడాయెను. కావున ఓ రాజా! నీవు కూడా పృధుచక్రవర్తి పుట్టుకవలన పరిశుద్ధుడవైతివి. అయిననూ బ్రహ్మ చేసిన ఈ స్తుతితో నీవు కూడా శ్రీమహావిష్ణువును ఆరాధించుము. విష్ణువు ఆజ్ఞతో స్తుతించగా అంతట సంతోషించిన శ్రీమహావిష్ణువు గౌరవమునిచ్చినవాడా! నీవు వరమును కోరుము అని పలికెను.

వేన ఉవాచ - వేనుడు పలికెను.

శ్రీమహావిష్ణూ! నాకు ఉత్తమగతిని ప్రసాదించుము. నన్ను పాపమునుండి తరింపచేయుము. నిన్ను శరణు వేడుచున్నాను. ఉత్తమగతికి కారణమును తెలుపుము.

విష్ణురువాచ - శ్రీమహావిష్ణువు పలికెను.

మహానుభావా! పూర్వకాలముననే నీ తండ్రియగు అజ్జమహారాజు మహాత్ముడు, నన్ను ఆరాధించియున్నాడు. నేనతనికి వరమును కూడా ఇచ్చితిని. అందువలన నీవు సర్వోత్తమమైన శ్రీమహావిష్ణులోకమును చేరగలవు. రాజపుత్రా! నీవాచరించిన పుణ్యకర్మచే విష్ణులోకమును చేరగలవు. ఇపుడిక నీ కొరకు ఒక వరమును కోరుకొనుము. మహానుభావా! వేనా! పూర్వము జరిగిన ఒక వృత్తాస్త్రమును వినుము.

భూపతీ! కోపించిన సుశంఖుడు నీ తల్లియైన సునీధను బాల్యమున శపించెను. అన్నీ తెలిసిన నేను నిన్నుద్దరించగోరి నీ తండ్రియైన అంగునకు సుపుత్రుడు నీకు కలుగునని వరమునిచ్చితిని. గుణవత్సలా! ఇట్లు నీ తండ్రితో చెప్పి నీ శరీరమునుండి పుట్టి లోకమును పాలించెదను. స్వర్గమున ఇంద్రునివలే నేను భూలోకమున విరాజిల్లెదను. తానే పుత్రునిగా పుట్టును అను శ్రుతి సత్యమే కావున నీవు నా వరముతో ఉత్తమగతిని పొందెదవు. నీవు ఉత్తమగతిని పొందుటకు ఒక దానమునాచరింపుము. సునీధ ఆచరించిన పాపమునే స్వరూపముగా దాల్చిన నేను నిన్ను అధర్మవర్తనునిగా చేయుటకు నగ్నముగా వచ్చి వీధర్మములను బోధించితిని. అట్లు చేయనిచో సుశంఖుని వాక్యము వ్యర్థమగును. కావున ఓ రాజా! విధి, నిషేధము రెండూ నేనే.

నేను కర్మానుగుణముగా ఫలమునిచ్చెదను. నేను బుద్దికి అందనివాడను. గుణములనే గ్రహించువాడను. అన్నిటిలో దానమే అత్యుత్తమము. దానము అన్ని ప్రభావములు కలది. కావున నీవు దానములను చేయుము. దానమువలన పుణ్యము లభించును. దానముచే పాపము నశించును. కావున దానమును చేయుము. రాజా! అశ్వమేధాది యజ్ఞములను ఆచరించుము. బ్రాహ్మణులకు భూమి దానాది దానములనిమ్ము. మంచి దానముతో భోగము లభించును. మంచిదానముతో కీర్తి లభించును. సుదానముతో స్వర్గమును పొందును. స్వర్గమున దానఫలమును అనుభవించును. శ్రద్దతో చక్కగా చేసినదానికి మంచి ఫలము లభించును. సరిఅయిన సమయమున పుణ్యతీర్థములను సేవించవలయును. పుణ్యతీర్థములను సేవించుట కూడా ఒక పుణ్యఫలమే. శ్రద్దనిండిన మనస్సుతో పాత్రభూతుడైన బ్రాహ్మణునకు నాయందు మనసును నిలిపి మహాదానమును చేసినవాడు కోరినవాటిని అన్నిటినీ నేను ప్రసాదించెదను.

వేన ఉవాచ - వేనుడు పలికెను.

దానకాలమును చెప్పుము. కాలలక్షణమును చెప్పుము. తీర్థమనగా నెట్లుండును? సుపాత్రలక్షణము, దానవిధిని కూడా నాయందు దయగలిగినచో ప్రసాదసుముఖుడవై విశదముగా తెలుపుము.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను.

రాజా! నిత్యనైమిత్తిక కామ్యప్రాయికములని దానములు నాలుగు విధములు. ఆ నాలుగు విధముల దానకాలములను తెలిపెదను. సూర్యోదయ కాలమున చేసిన దానము వలన సకలవిధ పాపములు అన్నివైపులా నశించును. సూర్యోదయ కాలమున ఘోరములైన అంధకారాదులు నశించును. ఆకాశమున తేజోనిధిగా సూర్యుని నా అంశతో కల్పించితిని. ఆ సూర్యభగవానుని తేజస్సుతో దహించబడి అన్ని పాపములు భస్మములగును. ఉదయించుచున్న నా అంశమైన సూర్యభగవానుని దర్శించి నీరు దానము చేసిననూ అతనికి నిత్యము పుణ్యము పెరుగునని ఏమి చెప్పవలయును. మంచి సమయము లభించినపుడు పుణ్యకార్యములను చేయు నరుడు స్నానము చేసి దేవతలను పితృదేవతలను అర్చించి అపుడు దానము చేయవలయును.

శక్తికి తగిన ప్రభావముతో శ్రద్ధచే పవిత్రమైన చిత్తముతో అన్నమును, పాలను, పండ్లను, పూలను, వస్త్రమును, తాంబూలమును, భూషణములను, బంగారమును, రత్నాదికములను ఇచ్చువాని పుణ్యము అనన్తము. రాజా! ఆ తరువాత మధ్యాహ్నము అపరాష్ట్రమున నన్ను ఉద్దేశించి దానము చేయువాని ఫలము అనన్తము. ఆహారము, పానీయాదికము, మృష్టాన్నము, లేపనము, గంధము, కుంకుమము,కర్పూరాదికమును వస్త్రాలంకార సహితముగా అవిచ్చిన్నముగా ఇట్లు దానము చేసినచో భోగములను, సౌఖ్యములను ప్రసాదించును. దానమును పూజను చేయగోరువారికి ఇపుడు నేను నిత్యకాలమును చెప్పితిని. ఇక ఇపుడు సాటిలేని నైమిత్తికకాలమును చెప్పెదను.

మూడు కాలములందు దానమును చేయవలయును. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. తన హితమును కోరువాడు దానము చేయని దినమును ఉంచుకొనరాదు. నరాధిపా! యే కాలములో యే కొంచెము ఇచ్చిననూ ఆ దాన ప్రభావముచే మహాజ్ఞానము కలవాడై బహుసామర్థ్యము కలవాడై ధనవంతుడు, గుణవంతుడు, జ్ఞానవంతుడు, పండితుడు, వివేకము కలవాడు అగును. ఒక దినము, ఒక పక్షము, ఒక మాసము భోజనమును కూడా దానము చేయనివానిని అన్ని దినములు భోజనము చేయకుండగా వారింతును. దానము చేయకుండగా భుజించినవాడు స్వమలమును భుజించినవాడగును. అట్టివానికి అన్ని భోగములను వారించు రోగమును కలిగింతును. అసంతృప్తితో నేను చాలా పీడలను కలిగించు రోగమును వారి దేహమునందు కలిగించును. మూడు కాలములలో బ్రాహ్మణులకు, దేవతలకు దానము చేయనివారికి మందాగ్నితో (అజీర్ణము) కూడిన సంతాపకారణమైన జ్వరమును కలిగించును. బ్రాహ్మణులకు దేవతలకు అర్పించకుండగా తాను తినినచో అట్టివాడు గొప్ప పాపమును చేసినవాడగును. అట్టివానిని భయంకరమగు ప్రాయశ్చిత్తముతో శుద్ధిచేయవలయును. కాయమును శోషింపచేయు ఉపవాసములతో శోధింపచేయవలయును. చర్మకారుడు దయను విడిచి చర్మకుండమును కషాయములతో శోధించును, అట్లు శోధించినచో ఆ చర్మము కల్మషము పోయి పగులును. అట్లే నేను పాపము చేయువానిని శుద్ది చేతును. ఈ విషయమున ఎట్టి సందేహం లేదు.

చక్కగా ఓషధులను కలిపి చేదు కషాయములతో వేడినీరుతో సంతాపములతో వైద్యరూపములో శుద్ది చేతును. అట్లు శుద్ధి జరిగిన తరువాత తన మనస్సునకు నచ్చిన పుణ్యభోగములను సుఖముగా అనుభవించును. సామర్థ్యముండి కూడా సర్వోత్తమమైన సర్వదానములను చేయనివానిని గొప్ప పాపముతో సంతాపము కలిగించును. పాపులు తమ కోసము నిత్యకాల దానము చేయనిచో అదికూడా శ్రద్దగా చేయనిచో అట్టివారిని భయంకరమైన ఉపాయములతో జీర్ణింపచేతును.

నరశ్రేష్టా! ఇక ఇపుడు నైమిత్తిక కాలమును, పుణ్యమును నీ ముందు చక్కగా చెప్పెదను. మంచిబుద్దితో సావధానముగా వినుము. మహారాజా! అమావాస్య, అట్లే పూర్ణిమ సంక్రమణము ఏర్పడినపుడు వ్యతీపాత్తులో, వైధృతి చెప్పబడినపుడు ఏకాదశీ దినమున మహామాఫీ అనగా మాఘ పూర్ణిమ, ఆషాఢ పౌర్ణమి, వైశాఖ పూర్ణిమ, కార్తిక పూర్ణిమ, సోమవారమునాడు అమావాస్య వచ్చినచో మన్వత్తరాదులలో యుగాదులలో, గజచ్చాయనందు పితృపక్షములలో క్షయతిథినందు ఇవి నైమిత్తిక కాలములుగా చెప్పబడినవి. రాజశేషా! ఈ నైమిత్తిక కాలములలో దానము చేసినచో కలుగు ఫలమును చెప్పుచున్నాను. రాజా! సావధానముగా వినుము. మానవుడు నన్ను ఉద్దేశించి భక్తితో బ్రాహ్మణునికి దానము చేసినచో అట్టివానికి సందేహము లేకుండగా గృహమును, సౌఖ్యమును, స్వర్గమును, చివరికి మోక్షమును కూడా ఇచ్చెదను.

మహారాజా! ఇక ఇపుడు కామ్య కాలమును, అత్యంత ఫలదాయకమును చెప్పెదను సకలవ్రతములను సకల దేవతల విషయమును వివరించెదను.

బ్రాహ్మణులు దానము యొక్క పుణ్యకాలమును ఇట్లు చక్కగా చెప్పియున్నారు. ఇట్లే ఆభ్యుదయిక కాలమును (అభివృద్దికరమైన కర్మలనాచరించు కాలము) చెప్పెదను. అన్ని శుభకార్యములలో సర్వోత్తమ శుభకార్యము వైవాహికము ఇట్లే పుట్టిన వెంటనే పుత్రునికి చేలము మౌంజ్యాదికము, భవన ప్రతిష్ఠ ధ్వజప్రతిష్ఠ దేవప్రతిష్టాది కర్మలయందు, వాపీకూపతటాకముల ఆరామ ప్రతిష్ట, గృహనిర్మాణము, గృహప్రవేశములు ఇవి దానపుణ్యకాలములు. మాతృదేవతలను పూజించు కాలము ఆభ్యుదయిక కాలమందురు. ఆ కాలమున దానము చేసినచో సకల సిద్దులను ప్రసాదించును. రాజసత్తమా! ఇట్లు నైమిత్తిక కామ్య ఆభ్యుదయికములనబడు కాలములను నీకు చెప్పితిని. ఇక పాపపీడను నివారింపచేయు ఇతర విషయములను తెలిపెదను.

మృత్యుకాలము ఆసన్నమైనపుడు, క్షయము ప్రాప్తించినపుడు క్షయమును తెలుసుకొని సుఖముగా యమమార్గమున వెళ్ళుటకు దానము చేయవలయును. మహారాజా! ఇట్లు నిత్యకాలము నైమిత్తికకాలము కామ్యకాలము ఆభ్యుదయికకాలము అన్యకాలము నీ ముందర చెప్పితిని. తమ తమ కర్మఫలములను ప్రసాదించు ఈ కాలములను చెప్పితిని మహారాజా! ఇపుడు నీ ముందు తీర్థ లక్షణములను చెప్పెదను. అన్ని పుణ్యతీర్థములలో ఈ గంగాసరస్వతులు విరాజిల్లుచున్నవి. రేవా యమునా తాపీ చర్మణ్వతీనది, సరయూ, ఘర్ఘర, వేణా, సర్వపాపములను నశింపచేయు కావేరి, కపిల, ప్రపంచమును తరింపచేయు విశాల, గోదావరీ, తుఱభద్రా, పాపములను చేయువారికి భయమును కలిగించు భీమరధీ, దేవికా, కృష్ణ గంగా ఇంకా ఇతరములైన ఉత్తమనదులు, ఈ నదులలో పుణ్యకాలములందు అనంత పుణ్యతీర్థములుండును. గ్రామములో నున్ననూ, అరణ్యములోనున్ననూ అంతటా నదులు పావనములే. ఆయా నదులలో ఆయా పుణ్యకాలములలో స్నానదానాది పుణ్యకార్యములను ఆచరించవలయును. ఉత్తమము అని ఆ తీర్థము యొక్క పేరు తెలియనిచో విష్ణుతీర్థమని పేరును చెప్పవలయును.

అన్ని తీర్థములకు దేవతను నేనే. ఈ విషయమున ఎట్టి సంశయము లేదు. సాధకుడు దేవతల విషయమున తీర్థముల విషయమున నన్నే ఉచ్చరించవలయును. రాజపుత్రా! నా నామమును ఉచ్చరించినందువలన అతనికి పుణ్యఫలము కలుగును. తెలియని తీర్థములకు దేవతలకు స్నానవిషయమున దానవిషయమున నానామమునే ఉచ్చరించవలయును. రాజేనా! అన్ని తీర్థములకు బ్రహ్మ వీటిని ధారకములుగా చేసియున్నాడు. భూమిలో అంతటా ఉన్న నదులు సముద్రములు సర్వపుణ్యప్రదములు. ఆయా తీర్థములలో స్నానదానాది సత్కర్మల నాచరించవలయును. ఆయా సుతీర్థకాల అనుగ్రహమువలన అక్షయఫలమును పొందును. సప్తసాగరములు తీర్థరూపములు మహాపుణ్యప్రదములు. మానసాది సరస్సులు, సెలయేళ్ళు, పల్వలములు అన్ని తీర్థరూపములే. స్వల్ప నదులలో కూడా తీర్థము ప్రతిష్టించబడియున్నది. తవ్వినవాటిలో ఒక్క కూపము తప్ప అన్నీ తీర్థములే.

ఈ భూమండలమున మేరువు మొదలగు పర్వతములు కూడా తీర్థరూపములే. యజ్ఞభూమి, యజ్ఞము, అగ్నిహోత్రస్థితి, శ్రాద్దభూమి దేవశాల ఇవి కూడా పుణ్యతీర్థములే. అట్లే హోమశాల, వేదాధ్యయనశాల, ఇండ్లలో పుణ్యముతో కూడిన గోశాల ఉత్తమతీర్థము. సోమయాగము చేసినవాడున్న ప్రదేశము తీర్థమే. పవిత్రమైన ఆరామములు రావిచెట్టున్న ప్రదేశము, మేడిచెట్టు, మర్రిచెట్టున్న ప్రదేశము తీర్థరూపమే. ఇతరములైన పవిత్రములైన సస్య వృక్షములున్న ప్రదేశములు తీర్థరూపములే. ఇవియన్నియూ పుణ్యతీర్థములే. తండ్రి తల్లి ఉన్నచోటు, పురాణములు చదువు ప్రదేశము, గురువుగారున్న ప్రదేశము, ఉత్తమురాలైన భార్య ఉన్న చోటు పుణ్యతీర్థమే. ఉత్తమ పుత్రుడున్న చోటు, రాజభవనములున్న చోటు ఇవన్నియూ పుణ్యతీర్థములే.

వేన ఉవాచ - వేనుడు పలికెను.

సురోత్తమా! మాధవా! నా మీద దయతో ప్రసన్నముఖుడవై నాకు ‘సుపాత్ర' అనగా దానము చేయదగినవాని లక్షణము చెప్పుము.

వాసుదేవ ఉవాచ - వాసుదేవుడు పలికెను.

మహాప్రాజ్ఞా! రాజా! పాత్రయొక్క మంచిలక్షణమును వినుము శ్రద్దతో, పరిశుద్దులైన మహానుభావులు దానము చేయవలసినవారి లక్షణమును తెలుపుచున్నాను. బ్రాహ్మణుడు మంచి కులములో పుట్టినవాడు, వేదాధ్యయనతత్పరుడు, శాస్తుడు, ఇంద్రియనిగ్రహము కలవాడు, తపస్సు కలవాడు, త్రికరణశుద్ధి కలవారు, న్యాయార్జిత ధనమునే ఉపయోగించువాడు, ప్రజ్ఞ కలవాడు, జ్ఞానము కలవాడు, దైవారాధన యందు ఆసక్తిపై యున్నవాడు, సత్యవాక్యములే పలుకువాడు, మహాపుణ్యము కలవాడు, విష్ణుభక్తుడు, జ్ఞానము కలవాడు, పండితుడు, ధర్మము తెలిసినవాడు, ఆశ లేనివాడు, పాషండులకు దూరముగా నుండువాడు, ఇట్టివాడు ఉత్తమ పాత్ర అని చెప్పబడినాడు. ఇట్లే ఇతర విషయములను కూడా చెప్పెదను. శ్రద్దగా వినుము.

ఇట్టి ఉత్తమగుణములు కల చెల్లెలి పుత్రుడు అట్లే పుత్రికా పుత్రుడు (దౌహిత్రుడు) ఉత్తమ పాత్రగా తెలియుము. ఈ ఉత్తమ భావములు కల అల్లుడు, గురువు, దీక్షితుడు, వీరూ ఉత్తమ పాత్రలే. శ్రేష్ఠుడా! దానయోగ్యములైన మంచిపాత్రలు ఇవియే. వేదాధ్యయనము ఆచారముకలవాడైననూ తృప్తిపొందనివాడు దానపాత్రము కాదు. అట్లే ఒంటికన్నువారు పరమధూర్తుడు. బాగా నల్లగా ఉన్నవాడు, కపిలవర్ణుడు అయినవానిని విడిచిపెట్టవలయును. ఇట్లే కర్కటాక్షుని, నల్లగా ఉన్నవానిని, మురికిపట్టిన పన్నులు కలవానిని, నల్లని పన్నులు కలవాని, పచ్చని పన్నులు కలవానిని, అట్లే బర్బరుని, ఎక్కువగా దుమ్ము ధూళితోనుండువానిని, అంగవికలుని, అధికాంగములు కలవానిని, కుష్టువ్యాధిగ్రస్తుని, చిరుగోళ్ళు కలవానిని విడిచిపెట్టవలయును. చర్మవ్యాధికలవానిని, ఖల్వాటుని విడువవలయును (గజ్జికలవానిని). అన్యాయమార్గమున ఆసక్తికల, భార్యకల బ్రాహ్మణునికి బ్రహ్మసముడైననూ దానమీయరాదు. స్త్రీలోలునికి, వ్యాధిగలవానికి, చనిపోయినవారింటిలో సూతకము భోజనము చేయువానికి, చోరునికి, అత్రివంటివారైననూ దానమీయరాదు. తృప్తిలేనివానికి, శవములు మోసి సంపాదించువానికి ఈయరాదు. స్థబ్దునికి పంచకునికి దానము చేయరాదు.

వేదశాస్త్రములు చదివినవాడైననూ సదాచారము లేనివాడైనచో శ్రాద్ధమున దానమునకు ఎపుడూ యోగ్యుడు కాజాలడు. ఇక ఇపుడు ఫలవంతము, పుణ్యయుక్తమైన దానమును చెప్పెదను. ఉత్తమ పుత్రులకు శ్రద్ద ఉన్నపుడు దానాదులు చేయు ఉత్తమ కాలము లభించును. భూమిలో నరులకు శ్రద్దతో సమానమైన పుణ్యము లేదు. శ్రద్ధాసమ సుఖమూ లేదు. శ్రద్ధాసమమైన తీర్థమూ లేదు. ఒకవేళ శ్రద్ధలేనివాడు నానామస్మరణ చేయవలయును. ఉత్తముడైన పాత్ర చేరగా శ్రద్దలేనివాడు స్వల్పముగానే చేయవలయును. ఇట్లు యధావిధిగా చేసిన దానమునకు శాస్త్రము చెప్పిన ఫలము నా అనుగ్రహము వలన అక్షయముగా పొందును. నా అనుగ్రహముతో సుఖమును పొందును.

            ఇది శ్రీ పద్మపురాణమున భూమిఖండమున వేనోపాఖ్యానమున ముప్పదితొమ్మిద - అధ్యాయము.