పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

61 - పితృతీర్థవర్ణనమ్

వేన ఉవాచ - వేనుడు పలికెను.

విష్ణురువాచ - విష్ణువు పలికెను.

మహానుభావా! సకల తీర్ధములలో ఉత్తమమైన భార్యాతీర్థమును కృపచేసితిరి. పుత్రులను తరింపచేయుటలో ఉత్తమమైన పితృతీర్థమును ఇపుడు వివరించుడు అని వేనుడు శ్రీమహావిష్ణువును అడుగగా శ్రీమహావిష్ణువు ఇట్లు చెప్పెను.

మహాక్షేత్రమైన కురుక్షేత్రమున ‘సుకర్మా’ అను పేరుగల ఉత్తమపుత్రుడు కల కుండలుడను బ్రాహ్మణుడు కలడు. అతని తల్లిదండ్రులు మహావృద్దులు, ధర్మమును తెలిసినవారు. శాస్త్రకోవిదులు. ఈ మహానుభావులిరువురు ముసలితనముతో పీడించబడుచుండిరి. ఆ కుమారుడు సుకర్మ అనువాడు ఆ తలిదండ్రులకు భక్తిచే పరిచర్యలు చేయుచుండెను. ధర్మజ్ఞుడు భక్తిభావముతో రాత్రింబవళ్ళు అన్నివేళలా సేవచేయుచుండెను. ఆ తండ్రినుండి వేదములను అనేక శాస్త్రములను అధ్యయనము చేయుచుండెను. సర్వాచారములు తెలిసినవాడు సమర్థుడు, ధర్మము తెలిసినవాడు జ్ఞానమునందు ప్రీతి కలవాడు. తలిదండ్రులకు స్వయముగానే అంగసంవాహనమును పాదప్రక్షాళనమును స్నానభోజనక్రియలను చేయుచుండెను. భక్తిస్వభావముతో అదే ధ్యానములో తత్పరుడాయెను. మాతాపితరుల ఉపచర్యలను చేయుచుండును. అతనున్న సమయములో కశ్యపుని కుమారుడు పిప్పలుడనువాడు మనసును మత్సరమును గెలిచినవాడై, దయాదానదమములు కలవాడై కామక్రోధములను గెలిచినవాడై తపముచేయుచుండెను. దశారణ్యదేశమున బుద్దిమంతుడు జ్ఞానశాంతిపరాయణుడు అన్ని ఇంద్రియములను నియమించి మహామనస్వి తపమును చేయుచుండెను.

ఆ పిప్పలుని తపస్సును చూచిన మునులు ఆశ్చర్యమును చెందిరి. ఇతను తపము చేయుచున్న రీతిలో ఈ విధముగా -ఇంకెవరూ తపమును చేయుట లేదు. ఇంద్రాదిదేవతలు అత్యాశ్చర్యమును చెందిరి. ఇతని తీవ్రమైన తపస్సు, ఇతని మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము అత్యాశ్చర్యము. ఎట్టి వికారమూ లేదు. ఉద్వేగము లేదు. కామక్రోధములను పూర్తిగా విడిచిపెట్టెను. చలిని, గాలిని ఎండను సహించుచున్నాడు. చలించక పర్వతమువలె ఉన్నాడు. విషయభోగములందు విముఖుడు. ధీరుడు, మనసుతో అందనిదానిని కూర్చుకొనుచున్నాడు. ఎవరి మాటలను ఏ శబ్దమును వినుట లేదు. ఒకే స్థితిలో ఉండి ఏకాగ్రతతో నిండిన మనస్సుకలవాడై బ్రహ్మ ధ్యానమయుడై ఆనందముతో నిండిన ముఖపద్మము కలవాడై ఇనుమువలె, కట్టెవలె చేష్టలు లేనివాడై ఒక పర్వతము వలె ఉన్నాడు. ఇతను స్థాణువువలె కనపడుచున్నాడు. స్థిరుడు, ధర్మముయందు ప్రీతికలవాడు. తపస్సువలన క్లేశపడుచున్న శరీరము కలవాడు. అతిశ్రద్ధ కలవాడు. అసూయలేనివాడు. ఇట్లు అతను తపము చేయుచుండగా ఒక వేయి సంవత్సరములు గడిచినవి. అతని శరీరముమీద చీమలు మట్టి తెచ్చి పుట్టను పెట్టినవి. ఆ పుట్టను తమ నివాసముగా పాములు చేసుకొనినవి. ఆ పుట్ట మధ్యలో నున్న పిప్పలుడు జడునివలె ఉండెను. ఇట్లు పిప్పలుడు తపము చేయుచుండెను. ఆ బ్రాహ్మణుని శరీరమును నల్లత్రాచులు చుట్టుకొని ఆ దివ్యతేజోవంతుని బ్రాహ్మణుని విషమును కక్కుచు కాటువేయసాగినవి.

భయంకరమైన విషము కలిగిన సర్పములు కాటువేసిననూ పిప్పలుని గాత్రమర్మములను చేరి ఆ విషము భేదింపజాలకపోయినది. ఆ బ్రాహ్మణుని తేజస్సుతో నాగులు శాంతిని పొందినవి. పిప్పలుని తేజస్సుతో కాయమునుండి పుట్టిన తేజస్సు ప్రజ్వలించుచున్న జ్వాలలు నానారూపములుగా, అనేకములు వేరువేరుగా కనపడుచుండెను. అగ్నియొక్క తీవ్రమైన జ్వాలలవలె, సూర్యభగవానుడు మేఘగర్భమున ప్రవేశించి తన కిరణములతో ప్రకాశించునట్లు పుట్టలోనున్న ఆ పిప్పలుడను బ్రాహ్మణుడు తన తేజస్సుచే ప్రకాశించుచున్నాడు. కోపముతో తమ కోరలతో సర్పములు కరచుచున్నవి. తమ తీవ్రమైన కోరలతో పిప్పలుని చర్మమును భేదించజాలకున్నవి. ఇట్లు తపము చేయుచుండగా ఒక వేయి సంవత్సరములు గడిచినవి. చలి, వాన, ఎండలను సహించుచు మూడువేళలూ తపమును సాధించుచున్న మహానుభావుడైన పిప్పలునకు వాయువును మాత్రమే ఆహారముగా తీసుకొనుచు మూడువేల సంవత్సరములను గడిపెను. అతని దివ్యమైన తపమునకు దేవతలు అతని శిరస్సుపై పుష్పవృష్టి కురిపించిరి. 'మహానుభావా! నీవు బ్రహ్మజ్ఞానము కలవాడవు. ధర్మము తెలిసినవాడవు. సర్వజ్ఞానములు కలవాడవు. నీవు నీవాచరించిన కర్మలచే ఈ గొప్పతనమును సాధించితివి. నీవు కోరుకున్న ప్రతిదీ నీకు లభించును. అన్ని కోరికలు నీకు సహజముగా సిద్దించును.

ఇట్లు దేవతలు పలికిన మాటలను విని మహానుభావుడైన పిప్పలుడు దేవతలందరికి నమస్కరించి భక్తితో తలవంచి గొప్ప సంతోషముతో ఇట్లు పలికెను. “ఈ ప్రపంచమంతయూ నా వశమగునట్లు దేవతా శ్రేష్ఠులు మీరు చేయుడు. అట్లే నేను విద్యాధరుడను కావలయును.” ఇట్లు పలికి ఆ మేధావి పిప్పలుడు విరమించెను. అపుడు ఆ దేవతలందరు అట్లే కానిమ్ము అని ఆ బ్రాహ్మణోత్తమునితో పలికి వరమునిచ్చి వెళ్ళిపోయిరి. ఇట్లు దేవతలందరూ వెళ్ళిపోయిన తరువాత బ్రాహ్మణోత్తముడైన పిప్పలుడు ప్రతిదినము బ్రాహ్మణ్యమును సాధించుచు ప్రపంచమెట్లు వశమగునని ఆలోచించుచుండెను. అప్పటినుండి పిప్పలుడు విద్యాధర పదవిని పొంది తలచిన చోటికి వెళ్ళుచు విరాజిల్లుచుండెను. ఇట్లు ఆ పిప్పలుడు విద్యాధర పదవిని పొంది దేవలోకేశుడు సర్వశాస్త్ర విశారదుడాయెను. ఒకసారి మహాతేజస్వియైన పిప్పలుడిట్లు ఆలోచించసాగెను. విశ్వము నా వశమగునని దేవతలు నాకు వరమునిచ్చిరి. ఆ విషయమును విశ్వసించుటకు ప్రయత్నించసాగెను. అతను ఆలోచించినదంతయూ అతని వశమాయెను. ఇట్లు నమ్మకము కలిగిన తరువాత అతను మనసులో నాతో సమానుడైనవాడు ఈ లోకమున ఇంకొకరు లేరు అని ఆలోచించసాగెను.

మహానుభావుడైన పిప్పలుడు ఇట్లు భావించుచుండగా అతని మనసులోని భావమును తెలుసుకొనిన ఒక సారసపక్షి సరసీరమున నున్నది, చక్కని స్వరముతో భావమును స్పష్టపరచుచు సౌష్టవముగా ఇట్లు పలికెను. “ఇట్లు నేనే పరమాత్మను అను గర్వమును నీవెందుకు వహించుచున్నావు? నీకు సర్వవశ్యాత్మకమైన సిద్ది లభించినదని నేను తలచుట లేదు. వశ్యావశ్యత్మకమైన ఈ కర్మ కొత్తగా నీకు లభించినది. కాని పాతదైన నీ పిప్పలత్వమును మూర్ఖుడవైన నీవు తెలియుట లేదు. ఒక మూడువేల సంవత్సరములు తపము చేసిన నీవు ఈ మాత్రానికే ఇంతగా గర్వించుచున్నావు. ఇది వ్యర్థము. కుండలుని పుత్రుడైన సుకర్మయను బుద్ధిమంతుడు. అతనికి ఈ జగత్తంతయు వశ్యావశ్యమాయెను. అతని చరిత్రను ఇపుడు వినుము. అతను ప్రాచీనమైనదానిని నవీనమైనదానిని అంతయూ తెలియును. పిప్పలా ఈ లోకమున అతనితో సమానమైన జ్ఞాని లేడు. నీవు కుండల పుత్రునితో సమానుడవు కాజాలవు. అతను ఏ దానమునూ చేయలేదు. ఏ జ్ఞానమును గురించి ఆలోచించలేదు. అతను హోమమును, యజ్ఞమును చేయలేదు. తీర్థయాత్రలకు వెళ్ళలేదు. అగ్నిని ఉపాసించలేదు. అతను ఎపుడూ ధర్మమును సేవించుటకు స్వచ్ఛన్దముగా సంచరించువాడు, జ్ఞాని, తల్లిదండ్రులకు ప్రియమును ఆచరించుచుండును. అతను వేదాధ్యయన సంపన్నుడు. సర్వశాస్త్రార్ధకోవిదుడు. సుకర్మ బాలునిగా ఉన్నపుడున్న జ్ఞానము కూడా నీకు ఇపుడు లేదు. నీవు వృధాగా గర్వించకుము.

పిప్పల ఉవాచ - పిప్పలుడు పలికెను.

సారస ఉవాచ - సారసము పలికెను

'నీవు ఎవరు? పక్షిరూపముతో నన్నెందుకు దూషించుచున్నావు? నా జ్ఞానమును ఎందుకు నిందించుచున్నావు? పరాచీనమనగా ఎట్టిది? నాకు దానిని విస్తరముగా తెలుపుము. నీకీ జ్ఞానము ఎట్లు కలిగినది? సకలమైన అర్వాచీన జ్ఞానము, పరాచీన జ్ఞానము ఇపుడు ఓ పక్షిశ్రేష్టా! నాకు తెలుపుము. నీవు బ్రహ్మవా? రుద్రుడవా లేక విష్ణువే ఈ రూపములో వచ్చితివా అని అడుగగా సారసము ఇట్లు పలికెను. నాకు తపస్సూ లేదు, తపః ఫలమూ లేదు. నీవు చేసిన తపఃఫలము ఎట్టిదో ఇపుడు వినుము. కుండలుని పుత్రుడైన సుకర్మ బాలునిగా ఉండగా ఉన్న గుణములు కూడా, జ్ఞానము కూడా ఇప్పుడు లేదు. ఆ జ్ఞానము జాడ కూడా నీకు తెలియదు. నీవు ఇక్కడినుండి ఆ సుకర్మ వద్దకు వెడలి నా రూపమును అడుగుము. ఆ ధర్మాత్ముడే నీకు సకల జ్ఞానమును తెలుపును. ఇట్లు సారస వాక్యమును వినిన పిప్పలుడు వెంటనే బయలుదేరి మహావేగముగా దశారణ్యములోని అతని ఆశ్రమమునకు వెడలెను.

            ఇది శ్రీ పాద్మపురాణమున 55 వేల సంహితలో రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున పిప్పలచరితమున అరువది ఒకట - అధ్యాయము.