పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

62 - సుకర్మ పిప్పల సంవాద వర్ణనము

విష్ణురువాచ - విష్ణువు పలికెను.

పిప్పలుడు సత్యధర్మసమన్వితమైన కుండలుని ఆశ్రమమునకు వెళ్ళి అచట పితృమాతృ సేవాపరాయణుడైన సుకర్ముని చూసెను. సుకర్మ మహానుభావుడు పితృమాతృ సేవలను చేయువాడు, సత్యపరాక్రముడు, మహారూపవంతుడు, మహాతేజస్సు కలవాడు, మహాజ్ఞానము కలవాడు, తలిదండ్రుల పాదముల వద్ద కూర్చొని ఉన్నవాడు, మహాభక్తికలవాడు, శాన్తుడు, సర్వజ్ఞాన మహానిధిగానున్న సుకర్మను చూచెను. కుండలుని పుత్రుడైన మహానుభావుడైన సుకర్మ కూడా ద్వారము వద్దకు వచ్చిన కుండలుని చూచి తన ఆసనమునుండి లేచి ఎదురేగెను. 'విద్యాధరా! మహానుభావా, మహామతే! నీవు రమ్ము అని స్వాగతము పలికి అతనికి అర్ఘ్యపాద్యములను, ఆసనమును మహామతి ఇచ్చెను. నిర్విఘ్నముగా వచ్చితివా? కుశలముగా ప్రవర్తించుచున్నావా?' అనుచు వచ్చిన పిప్పలుని కుశలప్రశ్నలు కావించెను. “నీవెందుకు వచ్చితివో చెప్పెదను. నీవు మూడువేల సంవత్సరముల తపమును చేసితివి. దేవతలనుండి వరమును పొందితివి. సకల లోకవశ్యత్వమును కామసంచారమును పొందితివి. దానితో మదించి దేనినీ తెలియుట లేదు. వృధాగా గర్వమును వహించుచున్నావు. నీ ప్రవృత్తిని చూచి మహానుభావుడైన సారసము నా పేరు, నా జ్ఞానమును చెప్పెను.

పిప్పల ఉవాచ - పిప్పలుడు పలికెను.

సుకర్మోవాచ - సుకర్మ పలికెను.

పిప్పల ఉవాచ - పిప్పలుడు పలికెను.

“సరసీరమున నన్ను సర్వజ్ఞానమునకై ప్రేరేపించిన సారసపక్షి ఎవ్వరు? అతను ఈశ్వరుడా అని అడుగగా సుకర్మ ఇట్లు పలికెను. సరసీరమున తమను ప్రబోధించిన సారసము సాక్షాత్తు పరమేశ్వరుడైన బ్రహ్మగా తెలియుము. అతను మహాజ్ఞాని. ఇంకనూ ఏమి అడుగదలిచితివో అడుగుము. దానిని కూడా తెలిపెదను. ఇట్లు సుకర్మ పలుకగా పిప్పిలుడు ఇట్లు అడిగెను. “ఈ భూమండలమున జగత్తంతా నీ వశముననున్నదని వినియున్నాము. నేను ఆవశ్యతను చూడగోరుచున్నాను. ప్రయత్నించి నీ వశ్యమును చూపుము.” అపుడు సుకర్మ అతనితో ఇట్లు పలికెను. నాలోని వశ్యావశ్యకారణమును ఇపుడే చూడుము అని పలికి సుకర్మ ఇంద్రాది లోకపాలకులను, అగ్ని మొదలగు దేవతలను స్మరించెను. ఇది కేవలము పిప్పలునికి విశ్వాసమును కలిగించుటకు మాత్రమే. ఇట్లు పిలువబడిన దేవతలు, నానా విద్యాధరులు అచటికి వచ్చి అగ్ని మొదలగు దేవతలు నీవు మమ్ములనెందుకు పిలిచితివి? అసలు కారణమును తెలుపుము అని సుకర్మను ప్రశ్నించిరి.

సుకర్మోవాచ - సుకర్మ పలికెను.

‘ఇతను పిప్పలుడను విద్యాధరుడు. నా వద్దకు వచ్చెను. వశ్యావశ్వత్వ కారణమును చూపుడని నన్నడిగెను. ఈ మహానుభావునకు విశ్వాసమును కలిగించుటకు మిమ్ములను పిలిచితిని. మీమీ స్థానములకు వెళ్ళుడు' అని దేవతలతో సుకర్మ పలికెను. అంతట మహామతి అయిన సుకర్మతో దేవతలు ఇట్లు పలికిరి. బ్రాహ్మణోత్తమా! మా దర్శనము ఎపుడూ వ్యర్థము కాదు. నీ మనసు అభిలషించు వరమును కోరుము. దానిని నీకిచ్చెదము. ఇందులో సందేహము లేదు' అని దేవతోత్తములు పలికిరి. అంతట సుకర్మ వారికి భక్తితో నమస్కరీంచి ఆ బ్రాహ్మణోత్తముడు ఇట్లు యాచించెను. 'నాకెల్లపుడు తలిదండ్రులపై చలించని భావపూర్ణమైన భక్తిని ప్రసాదించుడు. ఇదే నాకుత్తమ వరము. అట్లే నా తల్లిదండ్రి ఇద్దరు విష్ణులోకమునకు వెళ్ళవలయును. ఇంకొక వరమును నేను కోరను.’

దేవా ఊచుః - దేవతలు పలికిరి.

బ్రాహ్మణోత్తమా! నీవు పితృభక్తుడవు. నీ భక్తితో మేము ఎల్లపుడూ నీ యెడ ప్రీతితోనే ఉందుము. ఇట్లు పలికి దేవతలు స్వర్గలోకమునకు వెడలిరి. ఇట్లు సుకర్మ ఆ పిప్పలుని ముందు తన ఐశ్వర్యమునంతనూ చూపెను. పిప్పలుడు కూడా ఈ అత్యద్భుతమైన కుతూహలమును దర్శించకలిగెను. అంతట పిప్పలుడు కుండలుని పుత్రుడైన సుకర్మతో ఇపుడు నీవు చూపినది అర్వాచీన రూపము. మరి పరాచీనరూపమెట్టిదో అట్లే రెంటి ప్రభావమును చెప్పెడివారిలో శ్రేష్ఠుడా! చెప్పుము అని అడిగెను.

సుకర్మోవాచ - సుకర్మ పలికెను.

పిప్పలా! బ్రాహ్మణోత్తమా! నీకు పరాచీన రూపమునకు లింగమునే చెప్పుచున్నాను. ఆ లింగముతోనే ఇంద్రాది సచరాచరలోకములు ఆనందించుచున్నవి. ఇతనే జగన్నాధుడు. సర్వవ్యాపి. అంతట ఉండువాడు. అన్నిటిని శాసించువాడు. ఇతని రూపమును ఏ యోగియు చూడలేడు. శ్రుతియే ఆ పరమాత్మను గురించి చెప్పుచున్నది. ఆ శ్రుతి కూడా చెప్పుటకు వెనుకాడుచున్నది. చేతులు, పాదములు, నాసిక లేనివాడు. చెవులు, ముఖము లేనివాడు. మూడు లోకములలో నుండువారు చేయు అన్ని పనులను చూచుచుండును. వారు అతనిని చెవులు లేనివాడందురు. అతను అన్నిటినీ వినును. చక్కని సాక్ష్యమునిచ్చును. పాదములు లేనివాడు కాని అన్నిచోట్లకు వెళ్ళును. అంతట చూడబడును. చేతులు లేనివాడు కాని అన్నీ తీసుకొనును. పాదములు లేనివాడే కాని పరుగెత్తును. బ్రాహ్మణా! అంతటా కనిపించును. అంతటా వ్యాపించియుండును. కానీ పాదములు లేనివాడు. తత్త్వదర్శులైన మునులు దేవాధినాధులు కూడా అతనిని చూడజాలరు. సత్యపదమున అసత్యపదముననున్నవారందరిని ఆ పరమాత్మ చూచుచుండును. అతను అంతటా వ్యాపించియుండువాడు. పరిశుద్దుడు సిద్దభూతుడు సిద్ధిని ప్రసాదించువాడు. అందరికి అంతటికీ నాయకుడు. అతని ధర్మార్థములు చక్కగా తెలిసిన మహాయోగియైన వ్యాసభగవానుడు మాత్రమే తెలియును. ఆ పరమాత్మ తేజోమూర్తి. అతనే ఆకాశము. అతనే ఏకవర్ణము, అనన్తము. అతని ఈ నిర్మలరూపమును శ్రుతి చెప్పుచున్నది. వ్యాసుడు మార్కండేయుడు కూడా తెలియును. ఇది పరాచీనము. ఇక అర్వాచీనమును చెప్పెదను. ఏకాగ్రమనస్కుడవై వినుము. సకల భూతాత్మకుడైన పరమాత్మ సకల జగత్తును సంహరించి తానొక్కడే జలములో శయ్య నేర్పరచుకొని శేషభోగాసనమును ఆశ్రయించి ఒక్కడే చాలాకాలము నిదురించును.

జలముతో అంధకారముతో సంతాపమును పొందిన మహామునియైన మార్కండేయుడు తిరిగి తిరిగి అలసినందున నిలుచుటకు స్థానమును కోరి అట్లు తిరుగుచు శేషపర్యజమున శయనించినవానిని కోటి సూర్యసమాన కాంతికలవానిని దివ్యాభరణభూషితుని దివ్యమాల్యామ్బరధరు పని యోగనిద్రను పొందినవానిని సుందరుని శంఖచక్ర గదాధరుని చూచెను. అచటనే మహానుభావురాలైన ఒక స్త్రీ కాటుక కొండవలెనున్నది. దంష్ట్రాకరాళ వదన భయంకరరూపురాలు కూడా కనపడెను. ఆమె అతనితో భయపడకుము అని పలికి చాలా విశాలమైనది, అయిదు యోజనముల విస్తీర్ణమైన పద్మపత్రమున మహాదేవి మార్కండేయుని కూర్చొనబెట్టినది. కేశవుడు నిద్రించిననూ నీకిక్కడ భయము లేదు అని పలికెను. ఆ మార్కండేయ మహాయోగి భామిని నీవెవ్వరు? ఈ శూన్యమున నీ ఒక్కదానివే వ్యాపించియుంటివి అని అడుగగా ఆ దేవి ఆదరముతో భూసురా! ఈ నాగభోగ పర్యజమున నిద్రించుచున్న కేశవుని వైష్ణవశక్తిని నన్ను కాలరాత్రి అందురు. నన్ను సర్వమాయాసమన్వితురాలనుగా తెలియుము. పురాణములలో జగత్తును మోహింపచేయు మహామాయగా చెప్పబడుదానను నేనే అని పలికి ఆ దేవి అంతర్థానమును చెందెను.

దేవి అన్తర్థానము చెందిన తరువాత మార్కండేయుడు చూచుచుండగా ఆదికేశవుని నాభియందు బంగారు కాంతులీను పద్మము ఆవిర్భవించినది. ఆ పద్మమునుండి మహాతేజస్వి లోకపితామహుడైన బ్రహ్మ ఆవిర్భవించెను. ఆ బ్రహ్మనుండి స్థావరజంగమాత్మకమగు సకలలోకములు ఆవిర్భవించెను. ఇంద్రాది లోకపాలకులు, అగ్న్యాది దేవతలు ఆవిర్భవించిరి. ఇది అర్వాచీనరూపము చూపబడినది. ఇపుడు చెప్పినది అర్వాచీనరూపము. పరాచీనము నిరాశ్రయము. ఆదికేశవుడు కాయమును సాక్షాత్కరింపచేసినచో ఆ దేవతలు లోకములు కాయరూపములు కలవగును. బ్రహ్మాది సకల లోకములు అర్వాచీనములు. ఈ మూడు లోకములలోని అన్ని లోకములు లోకులందరు అర్వాచీనులు. నిరాకారము, నిరాశ్రయము సకల భూతములును తనలో దాచుకొనిన స్వామి పరాచీనుడు యోగులు మాత్రమే అతనిని సాక్షాత్కరించుకొనగలరు. అదియే మోక్షరూపము. పరబ్రహ్మస్వరూపమగు పరస్థానము, ఇదియే అవ్యక్తము, అక్షరము. హంసము శుద్దము, సిద్ది సమన్వితము. విద్యాధరా! ఇట్లు నీ ముందు పరాచీన రూపమంతయూ చెప్పితిని. ఇంకనూ ఏమి చెప్పవలయును.

పిప్పల ఉవాచ - పిప్పలుడు పలికెను.

'సువ్రతా! ఇంతటి అద్భుతజ్ఞానము నీకెట్లు కలిగినది? అర్వాచీనగతి పరాచీనగతి నీకెట్లు తెలిసినది? నీకు త్రిలోకముల పరజ్ఞానము కూడా ఎట్లు కలిగినది? నీకు తపస్సును పరమనిష్ఠను కూడా చూచుటలేదు. యజనము యాజనము తీర్థయాత్ర తపస్సువంటివి చేసియుంటివా? ఆ ప్రభావమును తెలుపుము. నీకీ అఖిలజ్ఞానము ఎట్లు కలిగినది' అని పిప్పలుడు అడిగెను.

సుకర్మోవాచ - సుకర్మ పలికెను.

నేను తపమును తెలియను. కాయమును శుష్కింపచేయలేదు. యజ్ఞము చేయలేదు. చేయించలేదు. తీర్థయాత్రలు కూడా నాకు తెలియవు. నేను మంచి కర్మలను ఆచరించుటవలన కలుగు సుకాలమును ధ్యానమును కూడా నేను సాధించలేదు. తల్లిదండ్రులను చక్కగా పూజించుట ఒక్కటే స్పష్టముగా తెలియును. తలిదండ్రులకు స్వయముగా నా హస్తములతో ప్రతి నిత్యము పాదప్రక్షాలనము చేతును. శరీరమును వత్తుట, స్నానము చేయించుట, భోజనము చేయించుట మూడు కాలములలో అదే ధ్యానముతో చేయుచున్నాను. ప్రతిదినము తలిదండ్రుల పాదతీర్థమును భక్తిభావముతో తీసుకొనుచున్నాను. మంచిభావముతో పూజించుచున్నాను. నా తలిదండ్రులు జీవించియున్నంతకాలము నాకు గొప్ప లాభము కలుగుచుండును. పరిశుద్దభావము నిండిన మనసుతో మూడు పూటలా నా తలిదండ్రులను పూజించుచున్నాను. పిప్పలా! ఆ తరువాత స్వచ్ఛన్దలీలా సంచారమును చేయుచున్నాను. ఇంకొక్క తపస్సు నాకెందుకు? వేరే కాయశోషణతో పనేమి? ఇక ఇపుడు నాకు తీర్థయాత్రలతో, ఇతర పుణ్యాలతో ఏమి పని? అన్ని యజ్ఞములనాచరించినపుడు కలుగు ఫలము తండ్రిని,తల్లిని సేవించుటవలన పుత్రులకు ఉత్తమగతిని ప్రసాదించుచున్నది. అన్ని కర్మల సర్వస్వము సారభూతము తల్లిదండ్రుల సేవయే!

మాతను సేవించుటవలన కూడా పుత్రునికి ఉత్తమలోకములు లభించును. అట్లే తండ్రిని సేవించుటవలన మహాపుణ్యము లభించును. తలిదండ్రులున్నచోటే పుత్రునికి గంగాతీర్థము గయాతీర్థము. ఇందులో సంశయములేదు. పలువిధములైన ఇతర పుణ్యతీర్థములు కూడా పుత్రునికి తలిదండ్రుల సేవ వలన లభించును. తలిదండ్రులను సేవించుటవలన దానఫలము తపస్సు ఫలము సత్పుత్రునికి లభించును. ఇతర ధర్మములన్నీ తలిదండ్రుల సేవవలన శ్రమయే అనిపించును. తల్లిదండ్రుల సేవించుటవలన పుత్రుడు సాటిలేని పుణ్యమును పొందును. ఇహపరములలో స్వకర్మ ఫలము తలిదండ్రులను సేవించుటవలన లభించును. బ్రతికున్న తన తలిదండ్రులను సేవించు పుత్రునికి లభించు పుణ్యఫలమును వినుము. అతనికి దేవతలు పుణ్యమును ప్రేమించి ఋషులు సంతోషించెదరు. తలిదండ్రులను సేవించుటవలన మూడులోకములు సంతోషించును. ప్రతిదినము తలిదండ్రుల పాదప్రక్షాళనము చేయువానికి ప్రతిపూట గంగాస్నానఫలము లభించును. పవిత్రములైన మిష్టాన్నములను భక్తితో తలిదండ్రులను భుజింపచేసిన వానికి కలుగు పుణ్యఫలమును చెప్పెదను. అశ్వమేధ యజ్ఞఫలము పుత్రునికి లభించును. వస్త్రములతో తాంబూలములతో వివిధ పానీయములతో భక్తితో అన్నముతో పుణ్యముతో తలిదండ్రులను పూజించువాడు సర్వజ్ఞుడగును. యశస్సును కీర్తిని పొందును. తలిదండ్రులను చూచి సంతోషముతో పలుకరించునాడు సంతోషించిన నిధులు అతని ఇంటిలో నివసించును.

ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతృపితృతీర్థమాహాత్యమున అరువది రెండ - అధ్యాయము.