పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

63 - మాతృపితృ తీర్థ మాహాత్మ్యవర్ణనమ్

సుకర్మోవాచ - సుకర్మ పలికెను.

తల్లిదండ్రులకు స్నానము చేయించుచున్నపుడు వారి శరీరమునుండి పుత్రుల శరీరముపై నీటిబిందువులు పడినచో సర్వతీర్ధస్నానఫల సమఫలము పుత్రునకు కలుగును. పతితుడు, వికలుడు, వృద్దుడు తన పనులు తాను చేసుకోవాలనివాడు, వ్యాధిగ్రస్తుడు, కుష్ఠురోగపీడితుడు అయిన తండ్రిని లేదా తల్లిని ఉపచర్యలు చేయు పుత్రునకు విష్ణువు ప్రసన్నుడగును. ఇందులో సంశయము లేదు. యోగులు కూడా చేరజాలని వైష్ణవలోకమును చేరును. వికలులు, దీనులు, వృద్ధులు, మహారోగముతో బాధపడుచున్న తలిదండ్రులను పరిత్యజించిన పాపబుద్ది కృమిసంకులమైన భయంకరమైన నరకమును చేరును. పెద్దలు, వృద్ధులైన తలిదండ్రులు పిలిచినపుడు రాని పుత్రుడు మలమును భుజించు గ్రామసూకరముగా పుట్టును. ఇందులో సంశయము లేదు. ఇట్లు వేయి జన్మలు గ్రామసూకరముగా పుట్టిన తరువాత కుక్కగా పుట్టును. పుత్రుని ఇంటిలో నున్న తలిదండ్రులు భుజించకుండా పుత్రుడు భుజించినచో వేయిజన్మలు మలమూత్రములను భుజించువాడుగా పుట్టును. రెండువందల జన్మలు పాపియైన కృష్ణసర్పముగా పుట్టును. వృద్ధులైన తలిదండ్రులను అవమానించి ప్రవర్తించినవాడు శతకోటి జన్మలలో మకరముగా పుట్టును. కఠినమైన మాటలచే తలిదండ్రులను బాధించువాడు పాపియైన పెద్దపులిగా, తరువాత భల్లూకముగా పుట్టును. దుష్టబుద్దియైన పుత్రుడు తల్లిదండ్రులను మన్నించనివాడు వేయియుగములు కుంభీపాకములో ఉండును. పుత్రులకు తలిదండ్రులతో సమానమైన తీర్థము మరియొకటి లేదు.

ఇహపరములలో తరించుటకు హితమునకు నేను పితృదేవుని పూజించుచున్నాను. మాతృదేవతను కూడా సర్వదా పూజించుచున్నాను. కావుననే నేను యోగయోగిని అయితిని. తలిదండ్రుల అనుగ్రహముతో ఉత్తమ జ్ఞానము నాకు కలిగినది. మూడు లోకములు నాకు వశ్యములైనవి. అర్వాచీన జ్ఞానమును వాసుదేవుని పరాచీన జ్ఞానమును దేవదేవుని అనుగ్రహము వలన తెలియగలిగితిని. ఇదంతయూ తలిదండ్రుల దయయే. తెలిసినవాడెవడైననూ తలిదండ్రులను తప్పక పూజించును. తలిదండ్రులను పూజించనివాడు అధ్యయనము చేసిన సాంగోపాల' శ్రుతులచే శాస్త్రములతో వేదములతో ప్రయోజనమేమిటి? తల్లిని పూజించనివారు చదివిన వేదములు నిరర్థకములు. తల్లిని, తండ్రిని పూజించనివారు ఆచరించిన యజ్ఞములు దానములు పూజలు వ్యర్థములగును. బ్రతికుండి ఇంట్లో ఉన్న తండ్రిని పూజించనివారు ఆచరించిన అన్ని పుణ్యములు వ్యర్థములు. తలిదండ్రులను సేవించుట పుత్రుని ధర్మము. నరులలో తలిదండ్రులే తీర్థము. తలిదండ్రుల సేవయే పుత్రులకు మోక్షము. ఇదియే వేల వేల జన్మల ఫలము. మాతాపితృసేవయే పుత్రులకు యజ్ఞము దానము. ఇందులో సంశయము లేదు.

భక్తిభావతత్పరుడై ప్రతిదినము తండ్రిని పూజించవలయును. పూర్వము చెప్పిన ఫలమంతయూ కలుగును. అట్టివానికి దానఫలము తీర్థయాత్రా ఫలము యజ్ఞఫలము కూడా తల్లిని పూజించినవానికి లభించును. ఇందులో సంశయము లేదు. చక్కని భక్తితో తండ్రిని పూజించినవానికి అతనాచరించిన యజ్ఞాది పుణ్యకార్యములు అన్ని సిద్ధిని ప్రసాదించును. మాతా పితృసేవకొరకే నేను ధర్మశాస్త్రమును సేవించి తెలిసితిని. పిప్పలా! ఎల్లపుడూ పుత్రుడు పితృభక్తిపరుడు కావలయును. యదుమహారాజు తండ్రి సంతోషించినందున సుఖమును, కోపించినందున గొప్ప పాపమును పొందెను. పురువంశమువాడైన గురువు తండ్రి శపించగా దుఃఖమును పొందెను. ఈ తలిదండ్రులనుపాసించినందువలన ఈ జ్ఞానమును పొందగలిగితిని. ఈ తలిదండ్రుల అనుగ్రహము వలన నేను సాటిలేని ఫలమును పొందితిని.

 ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతాపితృతీర్థమాహాత్యమున అరువది మూడ - అధ్యాయము.