పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
32 - అధ్యాయము
సూతమహర్షి పలికెను.
ఆ మేరుపర్వతము నానారత్నములతో చక్కగా ప్రకాశించుచుండెను. బంగారముతో మెరయుచుండెను. సూర్యుడు తన కాంతితో ప్రకాశించునట్లు ఆ కొండ ప్రకాశించుచుండెను. ఈ మేరుపర్వతపు చల్లనినీడలో సుఖమును దుఃఖరాహిత్యమును ప్రసాదించును. ఆ నీడలో దృఢసనబద్దులై కూర్చుని ధ్యానించుచుందురు. మునులు ఒకచో తపమునాచరింతురు. ఒకచో కిన్నరులు పాడుచుందురు. సంతోషముతో ఋషులు గంధర్వులు వీణాది వాద్యములను తాలములను చేతితో ధరించియుండిరి. సప్తస్వరములతో తాలము లయలలో లీనమై మూర్ఛనాశతులతో కూడిన మనోహరమగు గీతమును గానము చేయుచుండిరి. ఆ ఉత్తమ పర్వతమునందు చందనవృక్షఛాయలో గీతతత్త్వమును తెలిసిన గంధర్వులు గానమును కావించుచుండిరి. ఆ పర్వతరాజమునందు దేవతాస్త్రీలు నృత్యము గావించుచుండిరి. ఆ పర్వతమునందు పాపమును తొలగించునది, పుణ్యమును కలిగించునది, దివ్యము ఉత్తమ శ్రేయముల నందించునది, అత్యంత మధురమైన వేదధ్వని వినిపించుచుండెను. ఇక ఆ పర్వతరాజమున చందన అశోక పున్నాగ, శాలితాల తమాల వృక్షములతో, మేఘమాలవాది వటవృక్షములతో శోభించుచున్నది. సంతాన కల్పవృక్షాదులచే అరటి చెట్లతో ఆ పర్వతము వన్నెలీనుచుండెను. ఆ పర్వతముచక్కగా పూచిన పున్నాగ వృక్షములతో విరాజిల్లుచుండెను. పలు ధాతువులు పలు విధములగు రత్నములతో అంతటా శోభలీనుచుండెను. అనేక ఉత్సవములు శుభములతో కూడియున్నది వేదబృందములతో విరాజిల్లుచు అప్సరోగణములతో కూడియున్నది. ఋషులు, మునులు, సిద్దులు, గంధర్వులు మొదలగువారితో శోభించుచుండెను. పర్వతములను బోలు గజములతో సింహగర్జనలతో శరభములతో మదించిన శార్దూలములతో మృగములతో శోభించుచుండెను. పవిత్ర జలములతో నిండిన, హంస కారండవములతో కూడిన వాపీకూపతటాకములతో విలసిల్లుచుండెను, బంగారు కలువలతో తెల్ల కలువలతో, ఎర్రకలువలతో విరాజిల్లుచుండెను. పవిత్ర జలములు కలిగిన నదులతో, జలపాతములతో సెలయేర్లతో శాలతాలములతో ఏనుగులతో కూడి స్పటికములతో విశాలములు బంగారు దివ్య సూర్య అగ్ని సమకాంతిగల శిలాతలములతో నిండియుండెను. దేవతా విమానములలో దేవతాభవనములుగా నున్న ఉత్తమ పర్వతములతో హంసచంద్ర సమాన కాంతిగలవాటితో హోమగుండములతో అలంకరించబడియుండెను. కలశచామరములతో కూడిన ప్రాసాదములతో నానాగుణములతో మరియు దేవబృందములతో శోభించుచుండెను. అనేక దేవవృందములతో గంధర్వులతో చారణులతో అంతట నిండియున్న పర్వతరాజమగు పరమపావనమగు మేరుపర్వతము నలుదిశలా శోభలను పరచుచుండెను.
ఆ పర్వతరాజమునుండి పావనజలము కలది పరమపావనమగు గంగామహానది ప్రవహించుచుండెను. ఇది అనేక పుణ్యతీర్ధములతో శోభించుచుండెను. హంసలు పద్మములు నిండియుండెను. ఆ నది ఋషులచే మునులచే సేవించబడుచుండెను. ఇంతటి సకలగుణోపేతమగు శుభ ఉత్సవములతో నిండియుండిన పర్వతరాజమును అత్రిపుత్రుడగు అంగరాజు ప్రవేశించెను. పరమపావనము సుందరకందరము ఏకాంతముగా నుండు గంగాతీరమున అంగమహాముని కూర్చొని, కామక్రోధవర్జితుడై అన్ని ఇంద్రియములను నిగ్రహించి హృదయముననున్న హృషీకేశుని ధ్యానించుచుండెను. కూర్చున్ననూ పరున్ననూ నడుచుచున్ననూ సర్వక్లేశములను తొలగించు ప్రభువును ధ్యానించుచు హృదయమున దర్శించుచుండెను. ఇట్లు యోగముతో ఇంద్రియజయమును పొంది సకలచరాచర జీవరాశియందు కేశవునే చూచుచుండెను. ఆర్ధపదార్థములందు శుషపదార్థములందు ఇతర పదార్థములలో అన్నిటిలో నారాయణునే చూచుచుండెను. ఇట్లు అతను తపము చేయుచుండగా నూరు సంవత్సరములు గడిచెను. అంతట మౌరములగు చాలా విఘ్నములను కల్పించుచున్ననూ ఆ నృసింహుని తేజస్సుతో అన్ని విఘ్నములను దహింపచేసి చక్రపాణి ఆ బ్రాహ్మణోత్తముని కటాక్షించుచుండెను. నిర్విఘ్నముగా ఆ ధర్మాత్ముడు ఇతర యమనియమాదులతో ఉపవాసములతో క్షీణించుచున్ననూ దివ్యతేజస్సుతో భాసించుచుండెను. ఇట్లు అంగుడు సూర్యాగ్ని సదృశ తేజోవంతుడై కనపట్టుచుండెను. ఇట్లు తపమున మునిగి జనార్దనుని ధ్యానించుచున్న అంగునిముందు ఆదిదేవుడు ప్రత్యక్షమై వరమును కోరుమని పలికెను. ఇట్లు ఆ శ్రీమన్నారాయణుని దివ్యమంగల విగ్రహసందర్శనముతో పరమానందమును పొందిన అంగుడు. ప్రణమిల్లి ప్రసన్నచిత్తముతో వాసుదేవుని స్తుతించసాగెను.
అంగుడు పలికెను.
పరమపావనా! సకలప్రాణి సంధాయకా! అన్ని ప్రాణులకు నీవే ఆధారము. సకల జీవస్వరూపుడవు. సర్వభూతాధినాయకుడవు సకలగుణరూపుడవగు నీకు నమస్కారము. గుణరూపునికి పరమరహస్య స్వరూపునికి, సకలగుణాతీతునకు నమస్కారము. గుణునకు గుణకర్తకు గుణాఢ్యునికి, గుణాత్మునకు నమస్కారము. భవరూపునకు భవకర్తకు భక్తుల సంసారమును హరించువానికి, రుద్రుని సృజించినవానికి, సంసారభాజమునకు పరమగుహ్యునకు భవనాశకునకు నమస్కారము. యజ్ఞమునకు యజ్ఞరూపునకు యక్షేశునకు యజ్ఞకర్మకు, యజ్ఞ ప్రసంగమునకు శంఖధారునకు నమస్కారము. హిరణ్యునకు, రథాంగధారికి, సత్యునకు, సత్యభావునకు, సర్వసత్యమయునకు నమస్కారము, ధర్మునకు ధర్మకర్తకు, సర్వకర్తకు నమస్కారము. ధర్మాంగునకు, సువీరునకు ధర్మాధారునకు నమస్కారము, పుణ్యునకు పుత్రునకు, అపుత్రునకు మాయామోహవినాశకునకు, సర్వమాయాకరునకు నమస్కారము. మాయాధరునకు, మూర్తునకు, అమూర్తునకు నమస్కారము. సర్వమూర్తిధరునకు, శంకరునకు, బ్రహ్మకు బ్రహ్మరూపునకు, పరబ్రహ్మస్వరూపునకునమస్కారము. సర్వధామునికి, ధామధరునకు నమస్కారము. శ్రీపతికి శ్రీనివాసునకు, శ్రీధరునకు, క్షీరసాగరవాసునకు, అమృతునకు నమస్కారము, మహోషధునకు హోరునకు, మహాప్రజ్ఞాపరునకు, అక్రూరునకు, ప్రమేధ్యునకు మేధ్యపతికి నమస్కారము. అనంతునకు, అశేషునకు, అనఘునకు నమస్కారము. ఆకారప్రకాశునకు, పక్షిరూపునకు నమస్కారము. హుతునకు, హుతభోక్తకు, హవీరూపునకు నమస్కారము. బుద్దునకు బుద్దరూపునకు, సదాబుద్దునకు నమస్కారము. హవ్యమునకు, కవ్యమునకు, స్వధాకారునకు నమస్కారము. స్వాహాకారునకు, శుద్దునకు, అవ్యక్తునకు, మహాత్మకు, వ్యాసునకు, వాసవునకు, వసురూపునకు నమస్కారము. వాసుదేవునకు విశ్వునకు వహ్నిరూపునకు నమస్కారము, హరికి, కేవలునకు, వామనునకు నమస్కారము. నృసింహదేవునకు, సత్యపాలునకు నమస్కారము. గోవిందునకు, గోపునకు, ఏకాక్షరునకు నమస్కారము. సర్వాక్షరునకు, హంసరూపునకు నమస్కారము. త్రితత్తునకు పంచతత్తునకు నమస్కారము. పంచవింశతితత్త్వమునకు, తత్త్వధరునకు నమస్కారము. కృష్ణునకు కృష్ణరూపునకు లక్ష్మీనాథునకు నమస్కారము. పద్మపలాశాక్షునకు ఆనందరూపునకు నమస్కారము. పరునకు, విశ్వంభరునకు, పాపనాశునకు నమస్కారము. పుణ్యునకు, సుపుణ్యునకు, సత్యధర్మస్వరూపునకు నమస్కారము. శాశ్వతునకు అవ్యయునకు సర్వనభోమయునకు శ్రీపద్మనాభునకు, మహేశ్వరునకు కేశవునకు నమస్కారము. నీ పాదపద్మములకు ప్రణమిల్లుచున్నాను. ఆనందనిలయా, కమలాప్రియా! వాసుదేవ! సర్వేశా! ఈశా! మధుసూదనా! నాకు దాస్యమునిమ్ము! కేశవా నీపాదములకు ప్రతి జన్మలోనూ నమస్కరించుచున్నాను. నాకు శాంతినిచ్చువాడా! శంఖపాణీ! నాపై దయచూపుము. సంసారమను దారుణాగ్నితాపముతో దహించుచున్నవానిని, పుత్రమిత్ర బంధువు మరణాది బహుశోకములతో తపించుచున్న నన్ను జ్ఞానమేఘముతో వర్షించుము. పద్మనాభా! దీనుడను నాకు శరణుకమ్ము.
ఇట్లు మహానుభావుడగు అంగుని స్తోత్రమును చక్కగా విని నీలమేఘశ్యామము మహాతేజోవంతమగు తన స్వరూపమును చూపెను. ఆ రూపము శంఖ చక్ర గదా పద్మహస్తములు కలది, సకల జగదాధిపత్యసూచకము, గరుడారూఢముగా చూపెను. మరియు సర్వాభరణములో శోభిల్లుచుండెను. హారకంకణకుండలములతో శోభించునది, దివ్యము, సర్వోత్కృష్టము, వనమాలతో పరిశుద్దముగా హృషీకేశుడు దివ్యతేజముతో శ్రీవత్సముతో పుణ్యప్రదమగు కౌస్తుభముతో శోభించుచున్న తన దివ్యమంగల విగ్రహమును సర్వదేవమయుడగు శ్రీహరి అంగునకు చూపి ఋషిశ్రేష్ఠుడగు అంగునితో ఇట్లు పలికెను.
ఓ బ్రాహ్మణోత్తమా! మహానుభావా! నా శుభవాక్కును వినుము. మేఘగంభీరనాదములతో బ్రాహ్మణునితో మాటలాడి మరల ఇట్లు పలికెను. నీవు చేసిన ఈ తపస్సుతో సంతోషించితిని. శుభకరమగు వరమును కోరుము అని.
ఇట్లు సంతసించిన హృషీకేశుడగు కమలానాధుని చూచి తేజస్సుతో ప్రకాశించుచున్న విశ్వరూపుని సకల జననాధుని పాదపద్మములకు ప్రణమిల్లి పరమానందముతో జనార్ధనునితో ఇట్లు పలికెను. దేవేశా! శంఖచక్రగదాధరా నీకు దాసుడను నేను. నాకు వరమీయదలచినచో అట్టి చక్కని పుత్రుని ప్రసాదించుము. స్వర్గములో సర్వతేజస్సమన్వితుడై భాసించు ఇంద్రుని వంటి వానిని సర్వలోకరక్షకుడగువానిని నాకు పుత్రునిగా నిమ్ము. ఆ పుత్రుడు సర్వదేవప్రియుడు కావలయును. బ్రాహ్మణ భక్తుడు కావలయును. ధర్మజ్ఞుడు, పాత, జ్ఞానసంపన్నుడు ధర్మతేజములు కలవాడు, త్రైలోక్యరక్షకుడు, అపరిమితానంద స్వరూపుడు సత్యధర్మపాలకుడు, యజ్వలలో (యజ్ఞము చేయువారిలో) ఉత్తముడు, శూరుడు, త్రైలోక్యభూషణుడు, వేదవిద్వాంసుడు, బ్రాహ్మణప్రియుడు, సత్యసంధుడు, జితేంద్రియుడు, ఎవ్వరిచేత ఓడనివాడు, అందరిని గెలుచువాడు, విష్ణుతేజస్సుతో సమానమగు తేజస్సు కలవాడు, విష్ణుభక్తిపరాయణుడు, పుణ్యకార్యములు చేయువాడు, పుణ్యకార్యములవలన పుట్టువాడు, పుణ్యలక్షణములు కలవాడు, శాంతస్వభావి, తపస్సుతో కూడియుండువాడు, సర్వశాస్త్రవిశారదుడు, వేదజ్ఞుడు, యోగిశేషుడు ఉత్తమ గుణములు కలవాడు అగు ఇలాంటి పుత్రుని నీవు వరమీయదలచితివేని ఇమ్ము!
వాసుదేవుడు పలికెను.
ఇంతటి ఇటువంటి గుణములు కలవారు నీకు పుత్రునిగా కలుగును. అత్రివంశముతో పాటు సకలప్రపంచమును రక్షించువాడగును. తన తేజస్సుతో యశస్సుతో పుణ్యములతో తండ్రిని ఉద్దరించును. సత్యములలో తండ్రిని తాతను కూడా ఉద్దరించును. నీవు నా స్థానమగు పరమపదమును పొందెదవు అని దేవదేవేశుడు అంగునితో మాటలాడెను. మరల ఒక పరమపుణ్యవీరుని, పవిత్రురాలగు కన్యను వివాహము చేసుకొని ఆమెయందు పుణ్యప్రదుడు ప్రియుడగు పుత్రుని పొందెదవు. అతను ధర్మాత్ముడగును. నా అనుగ్రహమువలన సర్వజ్ఞుడు, సర్వవేత్త నీవు కోరిన విధముగా అగును. ఇట్లు అంగునికి వరమునిచ్చి శ్రీహరి అంతర్థానమును చెందెను.
ఇది శ్రీ పద్మపురాణమున ద్వితీయమగు భూమిఖండమున వేనోపాఖ్యానమున అంగవరప్రదానమను 32 - అధ్యాయము.
