పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

15 - అధ్యాయము

సోమశర్మ పలికెను.

శుభకరులారా!నీకు తెలిసియున్నచో పాపుల మరణ లక్షణములను విస్తరముగా తెలుపుము.

సుమన పలికెను.

నేను ఆ సిద్దునినుండి వినినదానిని పాపుల మరణమునకున్న చిహ్నములను చెప్పెదను వినుడు. మహాపాతకుల మరణస్థానములను చేష్టలను చెప్పుచున్నాను. మలమూత్రములతో నిండియున్న చోట అపవిత్రమగు చోట, పాపులతో కూడిన చోటును చేరిన ఆ పాపి చాలా దుఃఖములతో మరణించును. పాపి చండాల భూమిని చేరి మృతిచెందును. గాడిదలు తిరుగు ప్రదేశమును చేరి, వేశ్యాగృహమును చేరి, చర్మకార గృహమును చేరి మరణించును. ఎముకలు చర్మములు నఖములతో నిండియున్నదానిని పాపములతో పాపులతో కూడియున్న ప్రదేశమును చేరి మరణించును. ఇక యమదూతల చేష్టలను చెప్పెదను వినుము.

మహాభయంకరులు క్రూరులు మౌరులు కారునలుపువారు పెద్ద బొజ్జ ఉన్నవారూ, పసుపుపచ్చని కనులుగలవారూ, పచ్చని నల్లని మేను గలవారిని, మరీ తెల్లనివారిని, పెద్ద పొట్టగలవారిని, చాలా ఎత్తువారిని, పెద్ద నోరుకలవారిని, ఎండిన మాంసమువలె కొవ్వువలెనున్నవారిని భయంకరమగు కోరలు గలవారిని, పెద్ద నోరు కలవారిని, సింహము వంటి నోరుకలవారిని, పాముల వలె చేతులు కలవారిని యమదూతలను చూచిన ఆ పాపి వణికిపోవును. మాటిమాటికి ఖిన్నుడగును. నక్కల కూతలవలె భయంకరములగు పెద్ద అరుపులను వారు పాపి చెవిలో విడుతురు. కంఠమున, నడుమున, ఉదరమున బంధించి హాహా అని అరుచుచుండగా లాగి క్రింద పడవేతురు. ఇక చనిపోవువాడు చేయు పనులను చెప్పెదను. పరుల ద్రవ్యాపహరణము, పరభార్యలతో రమించుట, పరులనుండి ఋణమును తీసుకొని తిరిగి ఈయకుండుట, ఇట్లే ఇతర పాపములు, దుష్టులనుండి దానముగా గ్రహించుట మొదలగు పాపములన్నియూ చనిపోవుచున్నవాని కంఠమున చేరును. పూర్వము చేసిన ఇతర పాపములు కూడా ఆ మహాపాపి కంఠమును చేరును. అవి కఫమును బంధింపచేసి దుఃఖమును కలిగించును. దారుణమగు బాధతో గొంతులో గురుగురు ధ్వని వచ్చును. ఏడ్చును. వణకును. తల్లిని తండ్రిని సోదరుని, భార్యను, పుత్రులను అందరిని తలచుకొనును. పాపవిశేషముతో మరల మరచుచుండును. చాలా బాధలనుభవించుచున్ననూ ప్రాణములు త్వరగా విడువవు. పడుచుండును. వణుకుచుండును. మాటిమాటికి మూర్చపోవుచుండును. ఇట్లు బహుపీడలననుభవించుచు అతిమోహితుడై దుఃఖమును అనుభవించుచుండును. ఇంతటి దుఃఖముతో మహాకష్టములతో చుట్టుకొనిన అతని ప్రాణములు కదులుచు అపానమార్గమున బయలువెడలును. ఇట్లు మోహముతో లోభముతో నున్న ప్రాణిని యమదూతలు గొని పోవుదురు. ఇపుడు అతననుభవించు దుఃఖమును తెలిపెదను.

 ఇది శ్రీ పద్మపురాణమున పంచపంచాశత్సంహితలో రెండవదగు భూమిఖండమున ఐంద్రసుమనోపాఖ్యానమున పాపమరణవివక్షయను పదిహేన - అధ్యాయము.