పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
68 - సుకృతకర్మ ఫలకథనమ్
యయాతిరువాచ - యయాతి పలికెను.
మాతలిరువాచ - మాతలి పలికెను.
‘ఇంద్రసారథీ! నేను అధర్మఫలమునంతటిని వింటిని. ధర్మఫలమును కూడా తెలుపుము. నాకు వినవలయునని కోరిక.' అనగా మాతలి ఇట్లు పలికెను. “పాపము చేసిన ప్రాణులు నాలుగు విధములుగా యమలోకమునకు వెళ్ళేదరు. భయంకరముగా ఘోరముగా తమ వశము తప్పి దేహులందరు వెళ్ళేదరు. గర్భములో నున్నవారు, పుట్టుచున్నవారు, బాలురు, యువకులు, మధ్య వయస్కులు, పురుషులు స్త్రీలు నపుంసకులు వృద్దులు అందరు ప్రాణులు యమలోకమునకు వెళ్ళవలసినదే. ఆ యమలోకమున ప్రాణులు చేసిన శుభాశుభకర్మలను ఆ కర్మఫలమును విచారించెదరు. ఈ విచారమును చిత్రగుప్తాదులు మధ్యస్థులు సర్వమును చూడగలిగినవారందరూ విచారింతురు. యమలోకమునకు వెళ్ళని ప్రాణులు లేనే లేరు. చేసిన కర్మను విచారించబడి తప్పక అనుభవించి తీరవలయును. శుభకర్మలనాచరించినవారు సౌమ్యచిత్తము దయ కలవారు సౌమ్య మార్గముతో యమలోకమునకు వెళ్ళెదరు. పాదరక్షలు పాదుకలు బ్రాహ్మణులకు ఇచ్చువారు గొప్ప విమానముతో సుఖముగా యమలోకమునకు వెళ్ళేదరు. ఛత్రమును దానము చేసినవారు మేఘమార్గముతో వెళ్ళేదరు. వస్త్రదానము చేసినవారు దీవ్యవస్త్రములను ధరించి వెళ్ళేదరు. పల్లకిని దానము చేసినవారు విమానముతో, సుఖాసనమును దానము చేసినచో సుఖముగా యమలోకమునకు వెళ్ళేదరు. ఆరామమును చేసినవారు చల్లని నీడలలో సుఖముగా వెళ్ళేదరు. పూలతోటలను ఇచ్చువారు పుష్పకవిమానముతో వెళ్ళేదరు.
దేవాలయములను నిర్మించినవారు, యతుల ఆశ్రమములను నిర్మించినవారు, అనాధ శరణాలయములను నిర్మించినవారు ఉత్తమ గృహములలో ఆడుచు యమలోకమునకు వెళ్ళెదరు. దేవతలను అగ్నిహోత్రమును గురువులను విప్రులను మాతాపితరులను పూజించువాడు, దీనులు గుణవంతులు అయిన బ్రాహ్మణులకు శ్రద్దగా ఎంత కొద్దిగా ఇచ్చినను ఆ దానము అన్ని కోరికలను నెరవేర్చును. శ్రాద్దములో చేసిన దానమును సజ్జనులు ప్రశంసించెదరు. వాలాగ్రమంత స్వల్పమైనను శ్రాద్ధమున చేసిన దానము పాత్రాది చతుష్టయమున నిరంతరము శ్రద్ద ప్రధానము. శ్రద్దగా ఆచరించువాడు శ్రద్ద వలననే ఆయా ఫలమును తప్పక పొందును. గుణవంతులు దీనులయందు శక్తిని అనుసరించి వస్త్రములనైనను దానము చేసినవాడు సకల కామనలను అందించు పితామహ లోకమునకు చేరును. బ్రాహ్మణునకు శ్రద్దగా ఒక చిల్లిగవ్వనిచ్చిననూ అతను దేవతలకు ప్రియ అతిథి అయి దేవతల కీర్తిని పెంచును. కావున శ్రద్దగా దానము చేయవలయును. అదియే విశేషఫలమును ప్రసాదించును.
ఇదీ శ్రీ పాద్మపురాణమున రెండవదగు భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతాపితృతీర్థవర్ణనమున యయాతి చరితమున అరువది యెనిమిద - అధ్యాయము.
