పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

75 - వైష్ణవ ధర్మాచరణేన యయాతేస్సదా తారుణ్యం తత్ప్రజానాంచ మృత్యురాహిత్య వర్ణనమ్

సుకర్మోవాచ - సుకర్మ పలికెను.

శ్రీమహావిష్ణూ! కృష్ణా! హరీ! రామా! ముకుందా! మధుసూదనా! నారాయణా! విష్ణురూపా! నారసింహా! అచ్యుతా! కేశవా! పద్మనాభా! వాసుదేవా! వామనా! వారాహా! కూర్మా, మత్స్యా! హృషీకేశా! సురాధిపా! విశ్వేశా! విశ్వరూపా! అనన్హా! అనఘా! శుచీ! పురుషా! పుష్కరాక్షా! శ్రీధరా! శ్రీపతీ! శ్రీహరీ! శ్రీదా! శ్రీశా! శ్రీనివాసా, మాధవా! మోక్షదా! ప్రభూ! ఇట్లు శ్రీహరినామములను యయాతి రాజ్యములోని మానవులుచ్చరించుచుండిరి. ఈ నామసంకీర్తనమును బాలురు, వృద్దులు, కుమారికలు, స్త్రీలు అందరు మానవులు గృహకర్మలనాచరించుచు చేయుచున్నారు. కూర్చున్ననూ పరున్ననూ నడిచిననూ ధ్యానములోనూ మాటలోనూ ఆటలోనూ బాలులు అందరూ మాధవుని గోవిన్దునికి నమస్కరించుచున్నారు. రాత్రింబవళ్ళు మధురముగా శ్రీహరి నామమును ఉచ్చరించుచున్నారు. బ్రాహ్మణోత్తమా! అంతటా విష్ణునామసంకీర్తనమే వినబడుచున్నది. భూమండలములోని మానవులు వైష్ణవ ప్రభావముతో జీవించుచున్నారు. వ్యవహరించుచున్నారు. ప్రాసాదముల అగ్రములలో దేవాలయములలో సూర్యబింబములవలె చక్రములు శోభించుచున్నవి. శ్రీవైకుంఠమున కనిపించు భావమే భూమండలమున కనిపించుచున్నది.

బ్రాహ్మణోత్తమా! ఆ యయాతి ఆజ్ఞను పుణ్యమును రెంటిని అందించియున్నాడు. ఆ మహానుభావుడు భూలోకమును విష్ణులోక సమముగా చేసెను. నహుషపుత్రుడు విష్ణుభక్తుడైన యయాతి భూవైకుంఠలోకముల భావమును ఒకటిగా చేసెను. భూలోక విష్ణులోకములకు భేదమే కనబడుట లేదు. వైష్ణవులు వైకుంఠమున విష్ణునామమును కీర్తించునట్లు భూతలమున మానవులు కూడా అట్లే కీర్తించుచున్నారు. రెండు లోకములలో ఒకే భావము కనపడుచున్నది. భూతలమున జరారోగ భయము లేదు. మృత్యువు లేదు. దానభోగ ప్రభావము భూమిపై అధికముగా కనపడుచున్నది. నరులు పుత్రసుఖమును అంతకంటే అధికముగా పౌత్రసుఖమును పొందుచున్నారు. శ్రీమహావిష్ణువు అనుగ్రహముతో మహారాజుగారి ఉపదేశముతో మానవులు విష్ణుభక్తులు సర్వవ్యాధి వినిర్ముక్తులైరి. భూమండలమున స్వర్గలోక ప్రభావమును యయాతి మహారాజు చేసెను. మానవులందరూ 25 సంవత్సరముల వయస్సు వారిగానే కనిపించుచున్నారు. నరులందరు వేదమును తెలిసినవారు, జ్ఞాన ధ్యానపరాయణులు, యజ్ఞ దానపరులు, దయాభావులు ఉపకార పరాయణులు, కీర్తిమంతులు, ధన్యులు అందరూ ధర్మపరులు విష్ణుధ్యానపరాయణులుగానుండిరి.

యయాతి మహారాజుచే ఉపదేశింపబడినవారై అందరూ విష్ణుభక్తి పరాయణులైరి. రాజోత్తమా! ఆ మహారాజు చరితమును వినుడు. నహుషపుత్రుడైన యయాతి సర్వధర్మపరుడు. విష్ణుభక్తుడు. అతనికి ఒక లక్ష సంవత్సరములు గడిచినవి. అయిననూ అతని శరీరము 25 సంవత్సరములవానివలె నూతనముగా కనపట్టుచున్నది. రూపము వయస్సు కూడా 25 సంవత్సరముల వలె భాసించుచున్నది. బలముతో కూడియున్నది. ప్రౌఢత్వము కలిగియున్నది. ఇది అంతయూ ఆ శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహము వలన జరుగుచున్నది. భూలోకమును చేరిన మానవులు యముని చూచుట లేదు. యముని చేరుట లేదు. రాగద్వేషములు, క్లేశపాశములు లేనివారు. దానముల వలన కలిగిన పుణ్యములతో సుఖవంతులు, సర్వధర్మపరాయణులు. గరిక మట్టివృక్షముల వలె అతని రాజ్యములోని జనులు సంతతితో విస్తృతిని పొందుచుండిరి. పుత్రులతో, పౌత్రులతో ఆ జనులందరు విస్తృతిని పొందిరి. ఆ జనులు మృత్యుదోషములు లేనివారై చాలాకాలము జీవించుచుండిరి. స్థిరమైన శరీరము కలవారు, సుఖము కలవారు జరారోగవర్జితులు అందరూ 25 సంవత్సరముల వయస్సు కలవారివలె భూమండలమున కనపడుచుండిరి. అందరూ సత్యాచారపరాయణులు, విష్ణుధ్యానపరులు. ఇట్లు శ్రీహరి అనుగ్రహము వలన మానవులందరూ దానభోగపరాయణులైరి. నరోత్తమా! ఏ ఒక్క మానవుడు మరణించినట్లు కనపడుట లేదు.

యయాతి రాజ్యములోని ప్రజలు శోకమును చూచుటే లేదు. దోషమును పొందుట లేదు. భూలోకమునకు స్వర్గలోకరూపము ప్రాప్తించినది. ఇదంతయు శ్రీహరి ప్రసాదము వలన జరిగినది. శ్రీమహావిష్ణు దూతలచే కొట్టబడి యమదూతలు భూలోకమును విడిచి వెళ్ళిరి. రోదించుచు అందరూ కలిసి యమధర్మరాజును చేరి యయాతి మహారాజు చేసినదానిని అంతయూ చెప్పిరి. “సూర్యపుత్రా! దానభోగములచే భూలోకము మృత్యువు లేని లోకమైనది. ఇట్లు నహుషుని పుత్రుడైన యయాతి చేసియున్నాడు. విష్ణుభక్తుడు, పరమపావనుడైన యయాతి భూలోకమునకు స్వర్గరూపమును చూపియున్నాడు. అపుడు ధర్మరాజు ఇదంతయూ శ్రద్దగా వినెను. దూతలు చెప్పినదానిని మొత్తము వినిన ధర్మరాజు యయాతి చేష్టకు అన్ని విధములుగా ప్రతిక్రియను ఆలోచించెను.

ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదియగు భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతాపితృతీర్థ వర్ణనమున యయాతి చరిత్రలో డెబ్బది యైద - అధ్యాయము.