పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
37 - అధ్యాయము
ఋషయ ఊచుః –
ఋషులు పలికిరి.
వేనుని సృష్టియే ఇట్లుండెను కదా! అయినపుడు వేనుడు ధర్మాచారమును విడిచి పాపబుద్ది ఎట్లగును.
సూత ఉవాచ - సూతమహర్షి పలికెను.
జ్ఞానవిజ్ఞానసంపన్నులు తత్త్వజ్ఞులగు మునులు శుభాశుభములను ఇట్లు చెప్పెదరు కదా! అది విరుద్దముగా జరుగకూడదు. చక్కని తపస్వి మహానుభావుడగు సుశంఖుని శాపము కూడా తప్పక జరుగవలయును కదా! కావున మహానుభావుడు ధర్మజ్ఞుడగు వేనుడు ప్రజాపాలన జరుగుచుండగా వేనుని పాపాచారమునంతయూ తెలిపెదను. కపట చిహ్నములు ధరించిన ఒక పురుషుడచటికొచ్చెను. నగ్నుడు మహాకాయుడు శిరోముండనము చేసుకొనియుండెను. గొప్పకాంతి ఉండెను. నెమిలిపింఛములతో చేయబడిన పొరకను (చీపిరిని) చంకలో పెట్టుకొనెను. కొబ్బరిటెంకతో చేయబడిన పానపాత్రను ధరించియుండెను. వేదమును ధర్మములను దూషించు అసచ్ఛాస్త్రమును పఠించుచు వేన మహారాజు వద్దకు త్వరగా వచ్చెను. వేనమహారాజు సభలోనికి ప్రవేశించెను. అట్లు వచ్చినవానిని చూచి వేనమహారాజు ఇట్లు ప్రశ్నించేను.
ఇలాంటి రూపమును ధరించిన నీవు ఎవరు? సభలోనున్న నా ముందు ఎందుకొచ్చితివి. నీ వేషమేమిటి? నీ పేరేమి? నీ ధర్మమేమి? కర్మ ఏది? నీ వేదమేది? నీ ఆచారము ఏది? తపము ఏది? భావన ఏది? నీ జ్ఞానమేమిటి? నీ ప్రభావమేమి? సత్యమేమి? నీ ధర్మలక్షణము ఏమి? నా ముందు నీ తత్త్వమునంతయూ ఉన్నదున్నట్లు వివరించుము. ఇట్లు వేనమహారాజు వాక్యమును విని ఆ పాపి ఇట్లు పలికెను. “నీవు ఇట్లు రాజ్యపాలన చేయుచుంటివి. కావున మహామూఢుడవు. ఈ విషయమున సందేహము లేదు. నేను ధర్మసర్వస్వమును. దేవతలచేత కూడా పూజించబడువాడను. నేనే జ్ఞానమును. సత్యమును, సనాతనుడను. సకల జగత్తును ధరించువాడను. ధర్మమును, మోక్షమును. నేను సర్వదేవస్వరూపుడను. నేను బ్రహ్మదేహమునుండి పుట్టితిని. సత్యసంధుడను. మరియొకడను కాను. సత్యము ధర్మము దేహముగా గల నన్ను జినరూపునిగా తెలియుము. జ్ఞానతత్పరులగు యోగులు నా వద్దకు పరుగెత్తుకొని వత్తురు.
వేన ఉవాచ - వేనమహారాజు పలికెను.
నీవు చేయు కర్మ ఎటువంటిది? నీ దర్శనమేమిటి? నీ ఆచారము ఏది? ఇటకు వచ్చి చెప్పుము అని ఆ రాజు పలికెను.
పాతక ఉవాచ - పాతకము పలికెను.
దేవతలు పూజింపబడుచోట గ్రంథము లేని గురువు కనపడుచోట దయ పరమధర్మముగా నుండుచోట మోక్షము కనపడును. ఈ దర్శనమున సందేహముతో పనిలేదు. ఇక ఆచారములను చెప్పెదను. యజ్ఞము చేయుట చేయించుట లేదు. వేదాధ్యయనముండదు. సంధ్యావందనము లేదు. తపము లేదు. దానము లేదు. స్వధాస్వాహలు ఉండవు. హవ్యము కవ్యము ఉండదు. యజ్ఞాదిక్రియలుండవు. పితృతర్పణము లేదు. అతిథి లేడు. వైశ్వదేవికము లేదు. క్షపణుని పూజయే ఉత్తమము. అర్హతుని ధ్యానమే శ్రేష్ఠము. జైనమార్గమున ఈ ధర్మసమాచారము కలదు. ఇట్లు నా ధర్మమునంతటిని చెప్పితిని.
వేన ఉవాచ - వేనుడు పలికెను.
వేదవిహితమగు ధర్మము యజ్ఞాదిక్రియలు పితృతర్పణాదులు శ్రాద్ధము వైశ్వదేవాదికము, దానధర్మములు లేని ధర్మలక్షణమెక్కడిది? నా ముందు నిజమును చెప్పుము. నీ దయాధర్మములు ఎలాంటివి?
పాతక ఉవాచ - పాతకుడు పలికెను.
ఈ ప్రాణుల శరీరము పంచతత్త్వములతో (పంచభూతములతో) పెరుగునది. ఆత్మవాయు స్వరూపము. కావున శరీరాత్మలకు సంబంధముండజాలదు. నీటిలో భూతముల సమాగమమువలన బుడగలు ఏర్పడునట్లు భూతసమాగమమేర్పడును. ధూళిలో పృథ్వీతత్వము జలమచటనే ఉన్నది కదా. అగ్ని కూడా (విద్యుత్) కనపడుచుండును. మంచిగాలి ఎలాగైనా మూటిలో ఉండును కదా. వాటిని ఆకాశము తరువాత ఆవరించును. ఇదియే బుడగ. నీటి మధ్యలో చక్కని తేజస్సు భాసించుచునే యుండును. దానివలననే వర్తులాకారమేర్పడును. ఈ బుడగ క్షణకాలము మాత్రమే కనిపించును. క్షణము తరువాత కనిపించదు. ఇట్లే ప్రాణుల సమాగమము కూడా అంతటా కనిపించుచుండును. అవసానకాలమున ఆత్మ వెళ్ళును. పంచభూతములు ఆయా భూతములలో లీనమగును. పరస్పరము మానవులు మోహితులగుచున్నారు. మోహముతోనే శ్రాద్దమును చేయుచున్నారు. అమావాస్యనాడు (లేదా మరణించిన దినమున) పితృతర్పణము గావించుచున్నారు. చనిపోయినవాడెక్కడున్నాడని తినును? అతను ఎలా ఉండును? అతని జ్ఞానమేమిటి? అతను ఏమి చేయుచుండును. అతనిని ఎవరు చూసిరో నాకు చెప్పుము. మృష్టాన్నమును భుజించిన బ్రాహ్మణులు తృప్తిచెంది వెళ్ళేదరు. శ్రాద్ధమును ఎవరికీయవలయును? ఆ శ్రద్ద నిరర్థకము కదా!
ఇట్లే వేదమును కర్మను మరియొక దారుణమును చెప్పెదను వినుము. అతిథి ఇంటికి వచ్చినపుడు మేకను వండి భుజింపచేతురు. ఇట్లు అశ్వమేధమున అశ్వమును, గోమేధమున గోవును, నరమేధమున నరుని వాజపేయమున మేకలను చంపుదురు. రాజసూయమున చాలామంది రాజులను లేదా ప్రాణులను చంపుదురు. పుండరీకయాగమున గజమేధమున యేనుగును చంపెదరు. సౌతామణిలో మేకను చంపెదరు. ఇట్లు పలు విధములగు యజ్ఞములలో పలు జాతుల ప్రాణులను చంపుచున్నారు. ఇక చేయబడు దానము కూడా ఎలాంటిదో చూడుడు. సామూహిక భోజనమున ఒకరు లేదా కొందరు అనగా మిగిలినదానినే అనగా ఉచ్చిష్టమునే పెట్టుచున్నారు. ఏ తప్పూ చేయని (లేని) ప్రాణులను యాగములలో హింసించుచున్నారు. ఆ హింసలో ధర్మమున్నదా? ఏమి ఫలము లభించును? వేదపండితులే పశువధను నిర్దేశించియున్నారు. కావున ధర్మము నశించిన కార్యము పుణ్యము కాదు మోక్షమును ఈయజాలదు. దయలేని ధర్మము విఫలమగును. జీవులను పోషించునదే ధర్మము. స్వాహాకారము స్వధాకారము తపస్సు సత్యము దయాహీనమగుచో నిష్ఫలము కాదా? అచట ధర్మము నిలువజాలదు. దయను బోధించని వేదములు వేదములు కాజాలవు. దానములను దయను అనుసరించువాడు ప్రాణిని రక్షించవలయును కదా? అట్లు రక్షించువాడు చండాలుడైననూ శూద్రుడైనను బ్రాహ్మణోత్తముడే.
నిర్దయుడు పశుఘాతకుడు కఠినుడు క్రూరచిత్తుడగు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే కాజాలడు. జ్ఞానశూన్యమగు వేదమును వంచకులు చెప్పిరి. జ్ఞానమున్నచోటనే వేదముండును. దయలేని వేదములలో విప్రులలో, వేదపాఠకులగు విప్రులలో సత్యము కర్మ లేదు. కావున ఇట్టి వేదములు వేదములు కావు. ఇట్టి బ్రాహ్మణులు సత్యవర్జితులు బ్రాహ్మణులు కాజాలరు. దయారహితమగు దానమునకు ఫలము లేదు. కావున దానమును చేయరాదు. శ్రాద్దమునకు చిహ్నము దానమునకు లక్షణము జినధర్మమే. జినధర్మమే భుక్తి ముక్తి ప్రదాయకము. కావున నీ ముందు నేను బహుపుణ్యమునిచ్చు జినధర్మమును చెప్పెదను. మొదట శాంతచిత్తముతో దయను అలవరచుకొనవలయును. సకలచరాచరజగత్తును జయించిన జినదేవుని మాత్రమే పరిశుద్దభావము నిండిన మనసుతో పూజించవలయును. ఆ జినదేవునికే నమస్కరించవలయును. తలిదండ్రులకు కూడా నమస్కరించరాదనిన ఇక ఇతరుల విషయమున ఏమి చెప్పవలయును.
వేన ఉవాచ - వేనుడు పలికెను.
ఈ విప్రులు ఆచార్యులు గంగాదినదులు, పుణ్యతీర్ధములు బహుపుణ్యప్రదములు అనునది నిజమేనా అని నాకు ధర్మమును తేకోరినచో తెలుపుము.
పాతక ఉవాచ - పాతకుడు పలికెను.
మహారాజా! మేఘములు ఆకాశమునుండి వర్షించును. ఆ జలము భూమిమీద పర్వతములందు అంతట కురియును. ఆ జలము అంతట ప్రవహించును. కావున అంతట దయచూపవలయును కాని పాపప్రవాహములగు నదులు సుతీర్థములెట్లగును? ఓ మహారాజా! చెరువులు, సముద్రములు, జలాశయములు భూమిని మోయు పర్వతములు రాళ్ళకుప్పలు వీటియందు పావనత్వమెట్లుండును? ఈ నీటినెలవులలో స్నానమాడిన పుణ్యమున్నచో చేపలకు పుణ్యమెందుకు రాదు? స్నానమున సిద్ది లభించుచో చేపలకు సిద్ది శుద్ది ఎందుకు లభించుట లేదు. జినుడున్నచోటనే తీర్థము సనాతనధర్మముండును. తపోదానాది పుణ్యములన్నియూ జినుడున్నచోటనే ఉండును. ఓ రాజా! ఒక్క జినుడే సర్వమయుడు. జినుని మించిన ధర్మము తీర్థము లేనేలేదు. ఈ జినుడే పరమలాభము. కావున జినుని నిత్యము ధ్యానించుము. సుఖమును పొందగలవు. ఇట్లు వేదమును ధర్మమును దానమును యజ్ఞరూపమగు పుణ్యమును నిందించి రాజునకు పాపస్వభావులు పాపపు బోధను బాగుగా చేసిరి.
ఇది శ్రీపాద్మపురాణమున పంచపంచాశత్ సహస్ర సంహితలో రెండవదగు భూమిఖండమున వేనోపాఖ్యానమున 37వ సర్గ
