పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
41 - సుకలాయా పాతివ్రత్య చరిత్ర వర్ణనమ్
వేన ఉవాచ - వేనుడు పలికెను.
పుత్రుడు, భార్య ఎట్లు తీర్థమగును? తల్లి తండ్రి ఎట్లు తీర్ధమగును? గురువు ఎట్లు తీర్ధమగునో నాకు ఈ విషయమును విస్తరముగా చెప్పుడు.
శ్రీ విష్ణురువాచ - శ్రీమహావిష్ణువు పలికెను.
వారాణసీ అనునది సుందరమైనది గంగతో కూడియున్నది ఒక మహాపురము. ఆ వారాణసీ పురమందు కృకలుడను పేరుకల ఒక వైశ్యుడు నివసించుచుండెను. అతని భార్య మహాసాధ్వి, పతివ్రతాపరాయణురాలు ధర్మాచారపరురాలు, నిత్యము పతిపరాయణురాలు, ఆమె పేరు సుకల. పావనములైన అజ్ఞములు కలది, సత్పుత్రులు కలది, సుందరి, శుభకరురాలు, నిజమునే చెప్పునది, అన్నివేళలా పరిశుద్ధురాలు, ప్రియమైన ఆకారము కలది, ప్రియునికి ప్రియము చేయునది. ఇట్టి గుణములతో కూడియున్నది, సౌభాగ్యము కలది, అందముగా పనులు చేయునది. ఆ వైశ్యుడు కూడా ఉత్తముడు. నానాధర్మములు తెలిసినవాడు, జ్ఞానవంతుడు, గుణవంతుడు, పురాణమునందు శ్రాతధర్మమునందు నిరంతరము పెద్దలచే వినుటయందు ఆసక్తికలవాడు. ఆ వైశ్యుడు ఒకసారి తీర్థయాత్రయందు ఆసక్తికలవాడై చాలా పుణ్యమును ప్రసాదించు యాత్రకు శ్రద్ధతో తీర్ధములలో పవిత్రమైన మంగలకరమైన యాత్రకు బయలుదేరెను. బ్రాహ్మణుల సహవాసముతో తన వస్తువులను మోయు ఒక పరిచారకునితో బయలుదేరిన పతివ్రతయగు సుకల పతిమీది ప్రేమతో భర్తతో ఇట్లు పలికెను.
సుకలోవాచ - సుకల పలికెను.
ప్రియా! నేను నీకు ధర్మపత్నిని. మీతో కలిసి పుణ్యములనాచరించుదానను. నేనెప్పుడు భర్తృమార్గమును ఎదురుచూచుదానను. పతిదేవుని ఆరాధించుదానను. బ్రాహ్మణోత్తమా! నేనెప్పుడూ నీ సామీప్యమును విడువరాదు. నీనీడనాశ్రయించి ఉత్తమధర్మమును ఆచరించుదానను. పాతివ్రత్యము అనుపేరుగలది స్త్రీలకు ఉత్తమగతిని ప్రసాదించునది, పతిపరాయణురాలగు స్త్రీ పుణ్యస్త్రీ అని చెప్పబడును. యువతులకు భర్తకంటే విడిగా తీర్థము లేదు. సుఖమును ప్రసాదించునది స్వర్గమును మోక్షమును ప్రసాదించునది ఉత్తమతీర్థము భర్తయే. భర్త యొక్క సవ్యపాదము ప్రయాగగా, వామపాదము పుష్కరతీర్థమని తెలియు స్త్రీ ఆ భర్త పాదోదకస్నానముతో ప్రయాగ పుష్కర స్నానఫలము లభించును. స్త్రీలకు భర్తృపాదోదకస్నానము ప్రయాగ పుష్కర సమమే. ఈ విషయమున సంశయము లేదు. భర్త సర్వతీర్థస్వరూపుడు. సర్వపుణ్యస్వరూపుడు. దీక్షితునకు యజ్ఞములను ఆచరించుటవలన కలుగు పుణ్యము భర్త సేవవలన స్త్రీపొందును. గయాది పుణ్యతీర్థములను సేవించినందువలన కలుగు ఫలము స్త్రీ భర్తను సేవించుటవలన కలుగును.
సంగ్రహముగా చెప్పుచున్నాను. తాము నా మాటను వినుడు. భర్త సేవతప్ప స్త్రీలకు విడిగా ధర్మము లేదు. కావున ప్రియా! నీకు సాయము చేయుచు సుఖమునిచ్చుదాననై నీ నీడను ఆశ్రయించి నీ వెంటనే వచ్చెదను. ఇట్లు సుకల పలుకగా కృకలుడు ఆమె రూపమును, శీలమును, గుణమును, భక్తిని, యవ్వనమును చూచి ఆమె సౌకుమార్యమును విచారించి, ఇపుడు ఈమెను దుర్గమమైన దారిలో తీసుకొనిపోయినచో ఎండ, చలి మొదలగువాటి బాధవలన ఈమె రూపము నశించును. ఈమె శరీరము పద్మకింజల్కవర్ణము కలది చల్లని ఝంఝావాతముతో నల్లబారును. పరమ కోమలములైన ఈమె పాదములు కఠినమైన రాళ్ళ దారిలో చాలా వేదనను పొందును. కావున ఈమె నాతో వచ్చుటకు తగినది కాదు. ఆకలిదప్పులతో నలమటించి ఈమె ఏ స్థితిని పొందునో! ఈమె సుందరాంగి. నాకు నివాసము సుఖస్థానము. నాకు ప్రాణములకంటే మిన్నగా ప్రియురాలు. నేనాచరించు ధర్మమునకు ఈమెయే ఆశ్రయము. ఈమె నశించినచో నా నాశము కలుగును. ఈమెయే నాకు బ్రతుకు, ఈమెయే నా ప్రాణేశ్వరి. కావున ఈమెను గొనిపోను. నేనొక్కనినే వెళ్ళేదను' అని ఆలోచించెను. అతని మనసులోని భావమును ఆమె తెలుసుకొనెను. బయలుదేరబోవుచున్న భర్తతో ఇట్లు పలికెను.
‘ఉత్తముడా! పాపములేని భార్యను పురుషుడు విడిచిపెట్టరాదు. పురుషుడాచరించు ధర్మమునకు భార్యయే మూలము. ఈ విషయమును తెలిసి మహానుభావా! నను గొనిపొమ్ము. ఇట్లు సుకల పలికిన మాటలను అన్నింటిని వినిన కృకలుడు నవ్వుతూ ఆమెతో ఇట్లు పలికెను. ప్రియురాలా! ధర్మముగా లభించిన భార్యను విడువరాదు. చక్కని నీతిసంపన్నురాలు ధర్మచారిణి అయిన భార్యను విడిచినచో దశాంగయుతమైన ధర్మమును అతను విడిచినట్లే. కావున ప్రియురాలా! నీకు శుభము కలుగుగాత. నిన్ను నేను విడిచిపెట్టను.’ ఇట్లు ఆమెతో మాటలాడి మాటిమాటికి ఊరడించి ఆమెకు తెలియకుండగా సేవకునితో కలిసి అతను తీర్థయాత్రలకు వెడలెను.
పుణ్యకర్మలనాచరించు కృకలుడు వెళ్ళిపోయిన తరువాత దైవకర్మను ఆచరించి పుణ్యకాలమున పావనురాలు, శుభానన అయిన సుకల తన ఇంటిలో కృకలును చూడకపోయెను. తొందరగా లేచి ఏడ్చుచు దుఃఖించుచున్నదై స్నేహితురాళ్ళను తన భర్తను గురించి అడుగసాగెను. దుఃఖశోకములతో పీడించబడుచు 'నా భర్తయైన కృకలుడు మీకు కనపడినారా? నా ప్రాణేశ్వరుడుఎటు వెళ్ళెనో? నా బంధువులారా! మీరు చూచినచో నా భర్త, పుణ్యములనాచరించువాడు, సర్వజ్ఞుడు, సత్యపండితుడు ఎటు వెళ్ళెనో? ఆ మహానుభావుని గురించి తెలుపుడు.' ఆమె మాటలను వినివారు ఇట్లు పలుకసాగిరి.
‘శుభకరురాలా! నీ భర్త ధర్మయాత్రా ప్రసంగముతో తీర్థయాత్రను చేయుచున్నాడు. నీవెందుకు దుఃఖించుచున్నావు? శోభనురాలా! మహాతీర్థయాత్రను పూర్తిచేసి మరల రాగలడు.' ఇట్లు హితమును చేయు పురుషులు ఇట్లు ఓదార్చగా చక్కగా మాటలాడు సుకల మరల ఇల్లు చేరెను. సుకల భర్తృపరాయణురాలు గాన దీనముగా రోదించెను. 'నా భర్త వచ్చునంతవరకు భూమిమీదనే పడుకొనెదను. పాలు, పెరుగు, నెయ్యి, నూనెలను ఆహారముగా తీసుకొనను. లవణమును, అట్లే తాంబూలమును కూడా విడిచిపెట్టితిని. గుడాదికమైన మధురమును కూడా విడిచి పెట్టెదను. ఒకపూట తినుచు పూర్తిగా ఒకరోజు తినకుండగా నా భర్త మరల వచ్చునంతవరకు ఇట్లే ఉండెదను. ఇట్లు దుఃఖము కలదై ఒకే వేణి కలదై, ఒకే కంచుకమును ధరించి మలినముగా నుండెను.
ఒకే మలిన వస్త్రముతో ఉంటూ ఉన్నది. మాటిమాటికి హాహాకారమును చేయుచు బరువుగా నిట్టూర్చుచు బాగా దుఃఖించుచుండెను. వియోగాగ్నిచే దహించబడుచు నల్లబారిన శరీరము కలదై మురికి బట్టినదై దుఃఖములోనే బక్కచిక్కి పరితపించుచున్నది. పగలు రాత్రి రోదించుచు రాత్రి నిద్రించజాలకపోయెను. దుఃఖముతో బాధించబడినదై ఆకలిని కూడా తెలియకపోయెను. అంతట ఆమె స్నేహితురాళ్ళు వచ్చి సుకలను ఇట్లు అడిగిరి.
సఖ్య ఊచుః - చెలులు పలికిరి.
‘సుకలా! అందమైన సర్వావయవములు కలదానా! ఇపుడెందుకు రోదించుచున్నావు? అందమైన ముఖము కలదానా! ఈ దుః ఖమునకు కారణమును చెప్పుము.’
సుకలోవాచ - సుకల పలికెను.
'నా భర్త ధర్మతత్పరుడై ధర్మము కొరకు నన్ను విడిచి తీర్థయాత్రాప్రసంగముతో భూమినంతయూ సంచరించుచున్నాడు. ఏ దోషమూ లేనిదానిని ఏ పాపమూ లేని నన్ను విడిచి నా స్వామి వెడలెను. నేను సాధ్విని, చక్కని ఆచారము కలదానను. ఎల్లపుడు పవిత్రురాలను, పతివ్రతను నన్ను విడిచి తీర్థయాత్రను సాధించుటయందు ఆసక్తికలవాడై నన్ను విడిచి నా భర్త వెడలెను. ప్రాణము పోవుట మేలు. విషమును భుజించుట మేలు. అగ్నిప్రవేశము మేలు. శరీరము నశించుట మేలు. పరమకఠినుడైన భర్త ప్రియురాలైన నారిని విడిచి భర్త వెళ్ళుట భర్త త్యాగము మంచిది కాదు. ప్రాణత్యాగము మేలు. ప్రతినిత్యము భయంకరమైన భర్త వియోగమును సహించజాలను. నేను భర్త వియోగముతో నిత్యము దుఃఖించుచున్నాను.’
సఖ్య ఊచుః - చెలులు పలికిరి.
'నీ భర్త తీర్థయాత్రకు వెడలెను. మరల రాగలడు. వ్యర్థముగా శరీరమును శుష్కింపచేయుచున్నావు. వ్యర్థముగా దుఃఖించుచున్నావు. వృధాగా తపించుచున్నావు. వృధాగా భోగములను విడుచుచున్నావు. పానమును సేవించుము. భుజింపుము. నీకు ఇదివరకు ఇచ్చినదానిని అనుభవింపుము. ఎవరికి భర్త? ఎవరికి పుత్రుడు? ఎవరికి స్వజనము? ఎవరికి బంధువు? ఈ సంసారమున ఎవరికీ ఎవరూ లేరు. ఎవరితో ఎవరికీ సంబంధము లేదు. అనుభవించబడుచున్నది, భుజించబడుచున్నది. సంసారమునకు ఇదియే ఫలము. ప్రాణి మరణించిన తరువాత ఎవరు తిందురు? ఆ ఫలమును ఎవరు చూతురు?’
సుకలోవాచ - సుకల పలికెను.
‘మీరు పలుకుచున్నది వేదసమ్మతము కాదు. భర్తనుండి విడిగా ఒంటిగానున్న స్త్రీ పాపురాలుగా నుండును. ఆమెను సజ్జనులు మన్నించజాలరు. చెలులారా! భర్తతో కలిసియుండుటయే వేదములలో అన్నివేళలా చూడబడుచున్నది. పవిత్రుల సహవాసము వలన ఉత్తమ సంబంధము కలుగును. స్త్రీలకు ఎల్లపుడూ భర్తయే తీర్థమని శాస్త్రములందు చెప్పబడుచున్నది. వాక్కులో, కాయముతో, కర్మలతో భర్తనే అనుసరించవలయును. సత్యభావయుతమైన మనస్సుతో అతనినే పూజించవలయును. భర్తయొక్క దక్షిణపార్వము మహాతీర్థము. ఆ మహాతీర్ధమును ఆశ్రయించి నారి గృహస్థురాలై సంచరించవలయును. యాగము, దానము, పుణ్యములకు ఫలితముండును. వారణాశిలో గంగలో పుష్కరములో లేని ఫలము ద్వారకాక్షేత్రములో శివతీర్థమైన కేదారములో పూజించుచు ఆ స్త్రీ ఫలమును పొందజాలదు. భర్తతోనున్నపుడు పొందు ఫలము పొందజాలదు. భర్తయొక్క అనుగ్రహమువలన పత్ని చక్కని సుఖమును పుత్రసౌభాగ్యమును స్నానమును, దానమును, అలంకారములను, వస్త్రములను, ఆభరణములను, సౌభాగ్యమును, రూపమును, తేజస్సును, ఉత్తమ ఫలమును, యశస్సును, కీర్తిని, ఉత్తమగుణములను పొందును. ఈ విషయమున ఎట్టి సంశయము లేదు. భర్త ఉండగా పతివ్రతాధర్మమును విడిచి ఇతర ధర్మమును ఆచరించిన స్త్రీ ధర్మము నిష్ఫలమగును. ఆ స్త్రీని పుంశ్చలి అందురు. స్త్రీల యౌవనము, రూపము, జన్మ భర్త కొరకు సమర్పించిననాడు ధ్రువమనబడును.
ఈ భూమిమండలమున ఒక్క భర్తకొరకు స్త్రీ ఉత్తమ పుత్రవతి చక్కని కీర్తి కలదిగా చెప్పబడుచున్నది. భర్త సంతోషించినపుడే స్త్రీ కనబడును. అనగా గుర్తించబడును. భర్తలేని స్త్రీకి ఈ భూమిమండలమున సుఖమెక్కడిది? రూపమెక్కడిది? యశస్సు, కీర్తి, పుత్రులు ఎట్లు లభింతురు? ఆ స్త్రీ ఈ సంసారమున గొప్ప దౌర్భాగ్యమును, గొప్ప దుఃఖమును అనుభవించును, ఆ స్త్రీ ఎల్లపుడూ పాపములను ఆచరించుచుండును. దుఃఖములను కలిగించు ఆచారము అనుసరించును. భర్త సంతోషించినచో సకల దేవతలు సంతోషింతురు. భర్తయే నాధుడు, గురువు, భర్త దేవతలకు దేవత. భర్తయే తీర్థము, భర్తయే పుణ్యము, స్త్రీకి భర్తయే సర్వము. శృంగారము అలంకారము, రూపము, వర్ణము, సుగంధము అంతయూ భర్తె. భర్తకొరకు అలంకరించుకొనును. ఆభరణములను ధరించును. సుగంధవస్తువులను ధరించును. పర్వదినములలో మాత్రము ఇవన్నీ విడువవలయును. పర్వదినములలో సమాగమమును పరిత్యజించవలయును గాన భార్య అలంకరించుకొనరాదు అని శాస్త్రములు చెప్పుచున్నందున పర్వదినములు విడిచిపెట్టి అని చెప్పియున్నారు. భర్త ఉన్నపుడే అలంకారములతో, ఆభరణములతో స్త్రీ శోభించును. భర్త లేనపుడు ఇట్లు అలంకరించుకొనినచో పాముకు పాలు పోసినట్లు హాని కలిగించును. మహానుభావురాలైన స్త్రీ భర్తకొరకే చక్కని వ్రతములను ఆచరించును. కళ్యాణకరమైన కర్మలనాచరించును. భర్త దేశాన్తరమునకు వెళ్ళినపుడు భార్య అలంకరించుకొనినచో ఆ రూపము, ఆ వర్ణము శవమునకు చేసినట్లే యగును. అట్టి స్త్రీని ఈ భూమండలమున లోకులు పుంశ్చలి అందురు. కావున భర్తతో ఎడబాటు పొందిన స్త్రీలారా! వినుడు. ఎపుడైననూ మహాసౌఖ్యమును కోరినచో మంచి భార్యకు భర్తయే పరమధర్మమని శాస్త్రములందు చెప్పబడినది. కావున భార్య శాశ్వత ధర్మమును విడువరాదు. ఇట్లు ధర్మమును తెలిసిన నన్ను భర్త ఎట్లు వీడుచును. చెలులారా! ఈ విషయమున పరమపావనము, పుణ్యకరము, పాపనాశనమైన సువేలా చరితము చెప్పబడుచున్నది.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున నలుబదియొకట - అధ్యాయము.
