పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
74 - నృపాజ్ఞాశ్రవణోత్తరం సర్వైః ప్రజాజనైర్భాగవత ధర్మస్వీకరణమ్
సుకర్మోవాచ - సుకర్మ పలికెను.
అన్ని గ్రామములలో ద్వీపములలో దేశములలో పత్తనములలోనికి వెళ్ళి యయాతిరాజు దూతలు ఇట్లు చెప్పుచుండిరి. 'లోకులారా! రాజుగారి ఆజ్ఞను వినుడు. అన్ని ప్రభావములతో శ్రీహరిని పూజించుడు. దానములతో యజ్ఞములతో చాలా తపములతో ధర్మాభిలాషలతో పూజలతో మనఃపూర్వకముగా అన్ని లోకములు మధుసూదనుని ధ్యానము చేయుడు. ఇది మహారాజు ఆజ్ఞ.' ఇట్లు చక్కగా అంతటా చాటింపు చేయబడినది. ఇది అంతయూ పరమపావనము. భూమండలవాసులు రాజుగారి ఆజ్ఞను విని అప్పటినుండియే శ్రీమహావిష్ణువును ఆరాధించుచున్నారు. ధ్యానము చేయుచున్నారు. గానము చేయుచున్నారు. జపము చేయుచున్నారు. వేదములలో చెప్పబడిన సూక్తమంత్రములతో పరమపావనములైన స్తోత్రములతో అమృతము వంటివానితో శ్రీకేశవుని అతనియందే మనసుంచినవారై వ్రతములచే ఉపవాసములతో నియమములతో దానములతో తమ శరీరమనోవాక్ భవదోషములను బోనాడి ప్రేమరతులై అందరూ శ్రీనివాసుని జగన్నివాసుని శ్రీవాసుదేవుని పూజించుచున్నారు. ఇట్లు ఆ యయాతి మహారాజు ఆజ్ఞ భూమండలమున ప్రవర్తింపచేసియున్నాడు. వైష్ణవభావముతో జనులందరూ పూజించుచున్నారు. పరమాత్మ నామములతో కర్మలతో జ్ఞానకోవిదులు శ్రీమహావిష్ణువును ఆరాధించుచున్నారు. అతనినే ధ్యానించుచు ఆతనియందే అన్ని వ్యాపారములను అర్పించుచు విష్ణుపూజాపరాయణులైరి. భూమండలము మొత్తము సూర్యభగవానుడు ప్రకాశించు వరకు అంతవఱకున్న మానవులు శ్రీమహావిష్ణుభక్తులైరి.
యయాతి రాజ్యములోని మానవులు శ్రీమహావిష్ణువు ధ్యానప్రభావము, పూజాస్తోత్రములతో నామసంకీర్తనముతో ఆధివ్యాధి విహీనులుగా అయిరి. అందరూ శోకము తొలగినవారు పుత్రులు అందరూ తపోధనులు ఆ భగవంతుని అనుగ్రహము వలన అయిరీ. రోగహీనులు, దోషము, రోషము లేనివారు సర్వవిధ ఐశ్వర్యములను పొందినవారు, సర్వవిధ రోగములు లేనివారుగా ఆ శ్రీహరి అనుగ్రహము వలన అయ్యిం. జరామరణము లేనివారు ధనధాన్యసమన్వితులు శ్రీవిష్ణు అనుగ్రహమువలన మానవులు పుత్రపౌత్రులచే అలంకరించబడియుండిరి. మహానుభావా! వారి గృహద్వారములలో ఎల్లపుడు పరమపావనములైన కల్పవృక్షములు సర్వకామఫలములను అనుగ్రహించుచున్నవి. మానవులు మరణరహితులయిరి. పుత్రులచే పౌత్రులచే శోభించుచుండిరి. శ్రీమహావిష్ణు ప్రసాదముతో సర్వదోషరహితులు, సర్వసౌభాగ్యసంపన్నులు పుణ్యమంగళ సంయుతులు చక్కని పుణ్యము దానము కలవారు జ్ఞానధ్యానపరాయణులుగా నుండిరి. యయాతి రాజ్యములో కరువు కాటకములు లేవు. వ్యాధులు లేవు. అకాలమరణములు లేవు. ధర్మజుడైన యయాతి మహారాజు పరిపాలించుచుండగా మానవులందరు వైష్ణవులు, విష్ణువత పరాయణులు ఆ విష్ణువునే ధ్యానించువారు, విష్ణువునందు మనస్సు కలవారు, భావతత్పరులైరి. బ్రాహ్మణోత్తమా! వారి దివ్యగృహములు తెల్లని పతాకాలతో శంఖములతో కూడియున్నవి. గదలు చిత్రించిన ధ్వజములు, చక్రాంకితములుగా నుండినవి. కొన్ని పద్మాజ్కిత్రములు, కొన్ని విమాన ప్రతిమములు ఇంటి గోడలలో చిత్రించబడియున్నవి.
అంతట గృహద్వారములలో పుణ్యస్థానములలో దివ్యమైనవి ధాన్యాది యుక్తములగు వనములున్నవి. అన్ని శుభకరములే. ప్రాణుల దివ్యములైన పవిత్రములైన గృహములు తులసితో కేశవమందిరములచే భాసించుచున్నవి. అంతట పరమకళ్యాణమైన వైష్ణవ భావము కనపడుచున్నది. మిత్రమా! భూలోకమున శంఖనాదములు సోటధ్వనులతో దోషములను పాపములను నశింపచేయు శబ్దములు వినపడుచున్నవి. గృహద్వారములలో భిత్తులలో శంఖస్వస్తిక పద్మములు విష్ణుభక్తిగల స్త్రీలచే చిత్రించబడినవి. చక్కని వర్ణములు గల గీతములలో రాగములతో మూర్ఛనలతో తాళములతో సుస్వరములతో విష్ణుధ్యానపరాయణులైన లోకులు గానము చేయుచున్నారు. కొందరు కేశవుని శ్రీహరిని మురారిని కీర్తించుచున్నారు. మరికొందరు ప్రేమతో గెలిచిన మాధవుని కీర్తించుచున్నారు. కొందరు శ్రీనారసింహుని కమలాయతాక్షుని, మరికొందరు గోవిందుని, కమలాపతిని కీర్తించుచున్నారు. కొందరు శరణువేడదగిన కృష్ణుని శరణువేడుచున్నారు. కొందరు జపములతో రాముని పూజించుచున్నారు. దండప్రణామములతో విష్ణువును నమస్కరించుచున్నారు. వైష్ణవులందరు విష్ణుధ్యానము కలవారైయున్నారు.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదియగు భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతాపితృతీర్థ వర్ణనలో యయాతి చరితమున డెబ్బది నాలుగ - అధ్యాయము.
