పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

77 - నృత్యగీత పరవశతయా అశౌచలేశమాత్రేణ యయాతేశ్శరీరే జరాప్రవేశః

సుకర్మోవాచ - సుకర్మ పలికెను.

మన్మధుని గీతముతో లాస్యముతో లలితమైన హాస్యముతో నటరూపముతో రాజరాజేంద్రుడు మోహింపబడెను. మలమూత్ర విసర్జనము చేసిన యయాతి మహారాజు కాళ్ళు చేతులు కడుగుకొనకయే ఆసనమున కూర్చొనెను. అంతట వెంటనే జర రాజును చేరెను. మన్మధుడు ఇంద్రహితముగా కార్యమును ఆచరించినవాడాయెను. నాటకము ముగిసి వారందరూ వెడలిపోయిన తరువాత ధర్మాత్ముడైన యయాతి మహారాజు కామసంసక్తమానసుడై కామమోహములతో మోహితుడై విహ్వలుడై వికలేంద్రియుడై అతిముగ్ధుడై ధర్మాత్ముడైనను విషయములచే ఆకర్షించబడెను. ఒకసారి యయాతి మహారాజు వ్యసనాతురుడై వేటకు వెడలెను. మోహరాగవశంగతుడైన ఆ యయాతి వనమున విహరించుచుండెను. మహారాజు సరసముగా క్రీడించుచుండగా నాలుగు కొమ్ములతో సాటిలేని ఒక అద్భుత మృగము వచ్చెను. ఆ మృగము సర్వాజ్ఞసుందరము. బంగారు కేశములు కలది. రత్నప్రకాశముతో శోభించుచున్న అవయవములు కలది. మనోహరము చూడదగినది. ధనుర్ధారియై బాణపాణియై ఆ మృగము వెంట పరుగెత్తాను. ఎవరో ఒక రాక్షసుడు వచ్చెనని తలచెను. ఆ మృగము కూడా యయాతి మహారాజును చాలాదూరము ఆకర్షించి కొనిపోయెను. యయాతి మహారాజు అట్లు వెడలి రథేగముతో శ్రమతో అలసిపోయెను. అట్లు మహారాజు చూచుచుండగనే ఆ మృగము అంతరర్థానమును చెందెను. ఆ మహారాజు అచట నందననముతో పోలు అద్భుతవనమును చూచెను.

అందమైన వృక్షములలో పంచభూతములతో చక్కగా శోభించబడినది. పెద్ద పెద్ద చందనవృక్షములతో అరటిచెట్ల సమూహములతో వకుల అశోక పున్నాగ నాలికేరతిందుక పూగీఫల ఖర్జూర కుముద సప్తపర్లక వృక్షములతో బాగా పూచిన కర్ణికారములతో ఎపుడూ ఫలములతో నున్న నానా వృక్షములతో పూలవాసనలతో నిండిన కేతక పాటలములతో నున్న ఆ వనములో అంతటా చూచుచున్న మహారాజు ఉత్తమ సరస్సును చూచెను. పవిత్ర జలముతో కూడియున్నది. అయిదు యోజనములతో విశాలమైనది. హంసకారండవాది జలపక్షుల నాదములతో నిండినది. కమలములతో పరిమళింపచేయబడుచున్నది. తెల్లకలువలతో ఎర్రకలువలతో హోటకోత్పలములతో శోభించుచున్నది. నీలోత్పలములతో కల్హారములతో శోభించబడుచున్నది. మదించిన తుమ్మెదల ఝంకారములతో ధ్వనింపబడుచున్నది. ఇట్లు సకలగుణములు కల ఉత్తమసరమును చూచెను. ఆ సరస్సు అయిదు యోజనముల వెడల్పు, పది యోజనముల పొడుగు కలది. అన్ని విధములా మంగళప్రదమైన దివ్యభావములతో అలంకరించబడిన తటాకమును చూచెను. రధవేగముతో అలసినవాడు, శ్రమచే పీడించబడి ఆ సరసీరమున చల్లని మామిడిచెట్టు నీడలో కూర్చునెను.

పద్మసుగంధవాసితమైన ఆ సరోవరజలములో స్నానము చేసి ఆ కమ్మని నీరు త్రాగెను. ఆ జలమును అన్ని శ్రమలను తగ్గించు అమృతమువంటిదే ఆ చెట్టునీడలో కూర్చొనియున్న ఆ యయాతిరాజు ఎవరో గానము చేయుచున్నట్లుగా చక్కని గీతధ్వనిని వినెను. దివ్యస్తీ గానమువలె గానము చేయుచున్నట్లుగా వినిపించెను. గీతప్రియుడైన మరల చింతను పొందెను. చింతాకులుడైన మహారాజు చింతించుచుండగనే ఇంతలో బలిసిన పిరుదులు, చన్నులు కల స్త్రీ శ్రేష్ఠురాలు ఆ రాజు చూచుచుండగా ఆ వనమునకు వచ్చెను. సర్వాభరణములచే అలంకరించబడిన సర్వావయవములు కలది, శీలలక్షణ సంపద కలది, ఆ వనమునకు వచ్చి రాజు ముందర నిలిచెను. మహారాజు ఆమెతో నీవు ఎవ్వరు? ఎవ్వరి దానవయ్యెదవు? ఈ వనమునకెందుకు వచ్చితివి? నాకు నీవు కారణమును చెప్పుము అని రాజు అడుగుచుండగా ఆ యువతి మంచీచెడూ ఏదీ పలుకక వెడలిపోయెను. చిరునవ్వుతో వీణాదండమును చేతదాల్చి వెళ్ళెను. ఆ మహారాజు గొప్ప ఆశ్చర్యమును పొందెను. నేను అడిగిననూ ఈ సుందరి నీకు బదులు పలుకుట లేదు అని యయాతి మహారాజు మరల చింతాక్రాంతుడాయెను. నాలుగు కొమ్ములు కలిగి బంగారువర్ణములు కలది నాచే చూడబడిన మృగమే ఇట్లు స్త్రీగా మారినది. ఇదే నిజమనిపించుచున్నది. ఇదంతయూ దానవమాయ అయ్యుండును.

నహుషాత్మజుడైన యయాతి మహారాజు క్షణకాలము చింతించుచున్నంతలోనే ఆ మహావనమున ఆ నారి రాజును చూచి నవ్వుచు అంతర్థానము చెందెను. ఇంతలో అటువంటి చక్కని స్వరముగల మరియొక గీతము మరల దివ్యముగా సర్వశ్రేష్ఠముగా మూర్చనాతానయుక్తముగా గానము వినవచ్చెను. గీతధ్వని వినవచ్చినచోటికి మహారాజు త్వరగా వెడలెను. ఆ సరస్సు చివర సహస్రదలములుగల ఉత్తమమైన ఒక పద్మము కనిపించెను. ఆ పద్మముపై సర్వశ్రేష్ఠురాలు శీలరూపగుణాన్వితురాలు దివ్యలక్షణసంపన్నురాలు దివ్యాభరణ భూషితురాలు దివ్యభావములతో వీణాదండమును చేతదాల్చి శోభించుచుండెను. తాలమానలయాన్వితముగా సుస్వరముగా గానము చేయుచుండెను. ఆ గీతప్రభావముచే చరాచరమును మోహింపచేయుచు సకల మునిగణములను దేవతలను దైత్యగంధర్వకిన్నరులను మోహింపచేయుచుండెను. రూపముతో తేజస్సుతో శోభించుచున్న ఆ యువతిని చూచి ఈ చరాచర ప్రపంచమున ఇటువంటి సుందరి ఇంకొకరు లేరు. పూర్వము నటుడు నృపతి శరీరమున జరను ప్రవేశింపచేసెను. ఇపుడు ఇతనిలో మహాకామము ప్రకటించబడెను. అగ్నిహోత్రము నేతిని స్పృశించి జ్వాలాయుక్తమగునట్లు ఆ యువతిని చూచిన మహారాజులో కామము ప్రకటితమాయెను. అందమైన కన్నులుగల ఆ యువతిని చూచి ఈ మహారాజు మన్మధావిష్ణ హృదయుడాయెను. విశ్వమును మోహింపచేయు ఇటువంటి రూపవతిని నేనిదివరకు చూడలేదు. ఇట్లు ఒక క్షణము ఆలోచించిన మహారాజు కామసంసక్త మానసుడాయెను. ఆమె విరహముతో ఆ మహారాజు లోభమును చెందెను. కామాగ్నిచే దహింపబడుచు కామజ్వరముచే పీడించబడుచుండెను.

ఈమె నాదిగా ఎట్లగును? నాయందు ఈమెకు భావమెట్లుదయించును? ఈ పద్మముఖి పద్మలోచన నన్ను ఆలింగనము చేసుకొనినచో ఈమె నాకు లభించినచో నా జీవితము సఫలమగును. యయాతిమహారాజు ఇట్లు ఆలోచించి ఆమెతో ఇట్లు పలికెను. శుభకరురాలా! నీవెవరు? ఎవరిదానవు? ఇదివరకు చూచిన స్త్రీ మరల ఇపుడు కనపడినది. ఆమెను ఆ ధర్మాత్ముడు మరల అడిగెను. నీ ప్రక్కననున్న ఈ సుందరి ఎవ్వరు? కళ్యాణి అంతా చెప్పుము. నేను నహుషుని పుత్రుడను. సోమవంశసంభూతుడను. సప్తద్వీపాధిపతిని. నా పేరు యయాతి. నేను మూడు లోకములలో ప్రసిద్ధుడను. నా మనసు నా భావము నీ సంగమమును కోరుచున్నది. భద్రురాలా! నీకు నీ సంగమమునిమ్ము. నాకు ప్రియమును చేకూర్చాము. నీవేది కోరిననూ ఇచ్చెదను. సందేహించవలదు. వరవర్ణిని జయింపశక్యము కాని కామముతో నేను కొట్టబడితిని. కావున సుదీనుడనగు నన్ను కాపాడుము. నిన్ను శరణు కోరినవాడను. నా సకల రాజ్యమును భూమండలమును నా శరీరమును నీ సంగమము కొరకు మూడు లోకములనైననూ ఇచ్చెదను. ఆ రాజు మాట వినిన ఆ పద్మముఖి తన చెలియగు విశాలతో ఇట్లు పలికెను. నా పేరు, నా పుట్టుకస్థానమును, తలిదండ్రులను, ఇతనియందు నా ఏకాగ్రభావమును తెలుపుము. అంతట విశాల ఆమె భావమును తెలిసి రాజుతో మధురాలాపములతో రాజపుత్రా! వినుము అని ఇట్లు పలికెను.

విశాలోవాచ - విశాల పలికెను.

 పూర్వము మన్మధుని దేవదేవుడైన శఙ్కరుడు భస్మముగావించెను. ఆ రతీదేవి భర్తృహీనయైననూ సుస్వరముగా రోదించెను. ఆ రతి ఈ సరస్సులో నివసించెను. దయతో కూడిన సుస్వరమైన ఆ రతీదేవి విలాపమును వినిన దేవతలు గొప్ప దయకలవారై శంకరునితో ఇట్లు పలికిరి. “మహాదేవ! మరల మన్మధుని బ్రతికించుము. ఈ దీనురాలు భర్తహీనగా ఎట్లుండును? మా స్నేహముతో ఈ రతిని కామునితో కూడియున్నదానిని చేయుము.' ఆ మాట వినిన మహాదేవుడు మన్మధుని బ్రతికించెదనని పలికెను. ఈ మన్మధుడు కాయహీనుడైనను పంచబాణుడుగా వసంతునికి మిత్రుడుగా నుండును. దివ్యశరీరముతో వ్యవహరించును. ఇట్లు మహాదేవుని అనుగ్రహముతో ఆ మన్మధుడు మరల బ్రతికించబడెను. ఇట్లు ఆ మన్మధుని ఆశీస్సులతో అభినందించి కామా! వెడలుము. నిత్యము ప్రియురాలితో ప్రవర్తించుము. ఇట్లు స్థితిసంహారకారకుడైన మహాదేవుడిట్లు పలికెను. దుఃఖించుచున్న రతి ఉన్న సరస్సు వద్దకు మన్మధుడు వచ్చెను. రాజా! ఇదియే ఆ కామసరస్సు. ఇచటే రతి బాగా దుఃఖించినది. ఇచటనే నివసించినది. మహానుభావుడైన మన్మధుడు దహించబడగా దుఃఖపీడితయైన రతీదేవి కోపమువలన దారుణాకారముకల అగ్నిహోత్రుడు ఉద్భవించెను. ఆ యగ్నితో చాలా దహించబడిన ఆ రతి కూడా మోహముతో మూర్ఛనందినది. నరోత్తమా! ఆ రతి భర్తృహీనయై ఇచట కన్నీరు విడిచెను. ఆమె నేత్రములనుండి ఈ జలములో కన్నీటి బిందువులు పడినవి.

ఆ బిన్దువులనుండి సర్వసౌఖ్యములను నశింపచేయు మహాశోకము పుట్టినది. తరువాత ఆ అశ్రువులనుండి జరా పుట్టినది. ఆ తరువాత నాశనము చేయు దుష్టబుద్దికల వియోగము పుట్టినది. మహాభయంకరములైన దుఃఖము, సంతాపము పుట్టినవి. సుఖమును నశింపచేయునది, పరమభయంకరమైన మూర్చ తరువాత పుట్టినది. ఆ శోకమునుండి విభ్రమము, కామజ్వరము పుట్టినది. ప్రలాపము, విహ్వలము, ఉన్మాదము, మృత్యువు విశ్వమును నశింపచేయునవి ఆ రతీదేవి అశ్రుబిందువులనుండి పుట్టినవి. శరీరమును తపింపచేయునవి అన్నీ రూపుదాల్చి రతీదేవి ప్రక్కన నిలుచున్నవి. అన్నియూ సద్భావగుణసంయుతములు. అంతలో మన్మధుడు వచ్చెను అని ఎవరో చెప్పిరి. వచ్చిన మన్మధుని చూచి మహానందముతో కూడినదై కన్నులనుండి ఆనన్దబాష్పములు రాలెను. చాపల్యమువలన నీటిమధ్యలో పడినవి. అపుడు ఆ ఆనన్దబాష్పములనుండి ప్రీతి, ఖ్యాతి, లజ్జ ఆవిర్భవించినవి. వాటినుండి మహానన్దము కలిగినది. మరియొకటి శాస్త్రి. సుఖమును సంభోగమునందించు ఇద్దరు శుభకన్యలు లీల క్రీడ అనువారలు ఆ తరువాత సంయోగములు కలిగినవి. రతీదేవి వామనేత్రమునుండి ఆనందబాష్పములు జలాన్తమున పడినవి. దానినుండి చక్కని పద్మము పుట్టినది.

రాజోవాచ - రాజు పలికెను.

విశాలోవాచ - విశాల పలికెను.

ఆ చక్కని పంకజమునుండి వరానన అయిన ఈ నారి పుట్టినది. ఈమె పేరు అశ్రుబిందుమతి. ఈమె రతిపుత్రి. ఆమె ప్రీతితో సుఖమును కలిగించుచు ఎల్లపుడూ ఆమె సమీపముననే ఉండుచున్నాను. ఎపుడూ సఖీభావ స్వభావముతో సంతోషముతో ఉండుచున్నాను. నేను వరుణుని పుత్రిని. నా పేరు విశాల. ఈమె వద్దనే నిత్యము స్నేహముతో ప్రీతి కలదాననై ప్రవర్తించుచున్నాను. ఇట్లు మహారాజా! నీకు ఈమె గురించి, నా గురించి అంతయూ చెప్పితిని. ఈ వరానన భర్తను కోరుచు తపము చేయుచున్నది. ఇట్లు పలుకగా మహారాజు మరల ఇట్లు పలికెను. శుభకరురాలా! నీవు అంతయూ చెప్పితివి. నేను వింటిని. నీవు కూడా వినుము. ఈ వరానన రతిపుత్రి నన్నే భర్తగా పొందనిమ్ము. ఈ బాల కోరునదంతయూ నేనీయగలను. ఈమె నా వశమగునట్లుగా నీవు చేయుము' అనగా మరల విశాల ఇట్లు పలికెను.

 'మహారాజా! ఈమె వ్రతమును తెలిపెదను. వినుము. యవ్వనముతో నున్నవానిని, సర్వజ్ఞుని, వీరలక్షణములు కలవానిని, దేవరాజంతటి వాని ధర్మాచారములు కలవానిని, తేజస్వి, మహాప్రాజ్ఞుడు, దాత, యాగములు చేయువారిలో శ్రేష్ఠుడు, గుణములను, ధర్మభావములు బాగా తెలిసినవాడు, పుణ్యము కలవాడు లోకపాలకులతో సమానుడు. చక్కని యజ్ఞములతో ధర్మతత్పరుడు, సర్వైశ్వర్య సముపేతుడు, రెండవ నారాయణునివలె నున్నవాడు, దేవతలకు బ్రాహ్మణులకు అధికప్రీతిపాత్రుడు, బ్రాహ్మణులయందు ప్రీతి కలవాడు, వేదతత్త్వములు తెలిసినవాడు, మూడు లోకములందు ప్రసిద్ధిపొందిన పరాక్రమము కలవాడు ఇట్టి గుణములు కలవాడు మూడులోకములచే పూజింపబడువాడు, చక్కని బుద్ధి కలవాడు, సుప్రియుడు, సుందరుడు అయినవానిని ఈ సుందరి భర్తగా కోరుచున్నది.’

యయాతిరువాచ - యయాతి పలికెను.

విశాలోవాచ - విశాల పలికెను.

యయాతిరువాచ - యయాతి పలికెను.

విశాలోవాచ - విశాల పలికెను.

‘నేనిట్టి గుణములు కలవానిగా తెలియుము. నేనిచటికి వచ్చితిని. నేను ఈ సుందరికి అనురూపుడనైన భర్తగా బ్రహ్మ సృష్టించెను. ఇందులో ఎట్టి సందేహము లేదు.' అని రాజనగా మరల విశాల ఇట్లు పలికెను. 'రాజా! తాము పుణ్యముల పంట అని ఈ మూడులోకములలో నేను మొదట చెప్పిన గుణములు నీయందే కలవని నాకు తెలియును. నీలోని ఒకే ఒక్క దోషముతో ఈమె నిన్ను అంగీకరించుట లేదు. నీవు సాక్షాత్తు విష్ణుస్వరూపుడవే. ఇది ఒక్కటే నా సందేహము. అనగా యయాతి మరల ఇట్లు పలికెను. ఈ సుందరి అంగీకరించని ఆ దోషమేదియో నీవే తెలుపుము. వాస్తవముగా ఈ చారుసర్వాంగి ప్రసాదసుముఖురాలు కావలయును అనగా మరల విశాల చెప్పుచున్నది. ‘మహారాజా! నీ దోషమును నీవెట్లు తెలియుట లేదు. నీ శరీరము వార్ధక్యముతో వ్యాపించబడియున్నది గాన ఈ సుందరి అంగీకరించుట లేదు.' ఇట్లు అప్రియమైన గొప్ప మాటను వినిన మహారాజు గొప్ప దుఃఖము కలవాడై ఆమెతో ఇట్లనెను. 'భద్రురాలా! ఈ జరాదోషము నాది కాదు. ఎవరి సంసర్గము వలన ఎపుడు వచ్చినదో నా శరీరమును ఎట్లు ఆక్రమించినదో నాకు తెలియదు. శుభురాలా! ఈ సుందరి మూడు లోకములలో అత్యంత దుర్లభుడైనవానిని ఎవరిని వరించిననూ అతనిని ఈమెకు ఈయదలచితిని. అట్టి వరుని కోరుమనుము.

'రాజా! నీవు జరాహీనుడవైనచో ఈ సుందరి నీ ప్రియురాలగును. రాజా! ఇది ముమ్మాటికీ నిజము. నేను నిజమునే చెప్పుచున్నాను. రాజా! శ్రుతి ఇట్లు చెప్పుచున్నది. పుత్రునికి, సోదరునికి, భృత్యునికి జరను సంక్రమింపచేసినచో అతని శరీరములోనే సంచరించును. అతని యౌవనమును నీవు తీసుకొని నీవు జరను అతనికిచ్చినచో ఇరువురికి చక్కని ప్రీతి కలుగును. అది శుభోదర్కమగును. ఎవరు కృపతో ఆత్మదానము చేతురో అతనికి అట్టి ఫలము కలుగును. ఇందులో సందేహము లేదు. ఎంతో కస్టపడి సంపాదించిన పుణ్యమును ఇతరులకు దానము చేసినచో అది గొప్ప పుణ్యమగును. అట్టి గొప్ప పుణ్యఫలము లభించును. నీ పుత్రునికే జరనిచ్చి అతని తారుణ్యమును నీవు తీసుకొనుము. అపుడు నీవు సుందరునిగా రమ్ము! నీవు ఈ సుందరిని అనుభవించదలచినచో అట్లు చేయుము.' ఇట్లు పలికి ఆ విశాల విరమించెను.

సుకర్మోవాచ - సుకర్మ పలికెను.

రాజోవాచ - రాజు పలికెను.

పుత్రా ఊచు - పుత్రులు పలికిరి.

ఇట్లు విశాల మాటలను వినిన యయాతి మహారాజు మహానుభావురాలా! అట్లే కానిమ్ము! నీ మాటను చేసెదను అని పలికెను. కామాసక్తుడు మూడుడైన యయాతి మహారాజు ఇంటికి వెడలి పుత్రులను పిలిచి తురుపూరు, కురులను, పితృవత్సలు యదువుతో ఇట్లు పలికెను. పుత్రులారా! మీరు నాకు సుఖప్రదముగా నా మాటను పాటింపుడు అని. అనగా పుత్రులు ఇట్లు పలికిరి. 'పుత్రులు శుభమైననూ అశుభమైనను తండ్రి వాక్యమును ఆచరించవలయును. నాన్నగారూ! త్వరగా చెప్పుడు. మేము తప్పక చేసెదము. ఇందులో సందేహము లేదు.' ఇట్లు పుత్రుల మాటలను వినిన యయాతి మహారాజు సంతోషముతో నిండిన మనసు కలవాడై వారితో ఇట్లు పలికెను.

ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదియగు భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతాపితృతీర్థ వర్ణనమున యయాతి చరితమున డెబ్బది ఏడ - అధ్యాయము.