పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

46 - శూకరికి సుదేవ పరిచర్యలు

సుకలోవాచ - సుకల పలికెను.

పుత్రులమీది వాత్సల్యముకల సూకరిని, పడిపోయి నిట్టూర్చుచున్నదానిని చూచిన సుదేవ జాలికలదై దుఃఖించుచున్న ఆ సూకరి వద్దకు వెళ్ళి చల్లనినీరును ముఖముపై చల్లి అట్లే మొత్తము శరీరముపై కూడా చల్లెను. ఇట్లు చల్లని నీరుతో అభిషేకము చేసిన సుదేవను సూకరి మానవవాక్కుతో సుస్వరముతో ఇట్లు పలికెను. 'దేవీ! నీవే నన్ను చల్లటి నీరుతో అభిషేకము చేసియుంటే నీకు సుఖము కలుగుగాత! నీవంటి మహానుభావురాలి సంపర్కమువలన, నీదర్శనము వలన నాపాపరాశి నశించినది.” అద్భుతాకారముతో కూడియున్న ఆ వాక్యమును వినిన సుదేవ “నీవు స్పష్టముగా ఆరోగ్యముగా పలికిన మాటను ఆశ్చర్యముగా చూచితిని. ఈ సూకరి పశుజాతిలోనిది. సౌష్టవముగా, స్ఫుటముగా స్వరవ్యంజన సంపన్నముగా సంస్కృతమును మాటలాడుచున్నది. సంతోషముతో, ఆశ్చర్యముతో ఉత్తమ సాహసమును ఆచరించి అచటనున్న ఆ మహానుభావురాలు సుదేవ భర్తతో ఇట్లు పలికెను.

'రాజా! ఈ సూకరి ఇదివరకు ఎక్కడ నేను చూడలేదు. పశుజాతిలో పుట్టిననూ మానవునివలె సంస్కృతమును మాటలాడుచున్నది.’ ఆమె మాటలను వినిన రాజు జ్ఞానము కలవారిలో శ్రేష్ఠుడు ఇది అద్భుతము. అద్భుతాకారము కూడా. ఇదివరకిట్టిది వినలేదు, చూడలేదు.

అంతట ఇక్ష్వాకు మహారాజు తనకు ప్రియురాలైన సుదేవతో ఇట్లు పలికెను. ప్రియురాలా! ఆమె ఎవరో అడుగుము' అని. రాజుగారి మాటను వినిన సుదేవ సూకరిని ఇట్లు అడిగెను. 'శుభకరురాలా! నీవెవరవు? నీ విషయమంతా అత్యాశ్చర్యముగా కనపడుచున్నది. నీవు పశుజాతిలో పుట్టిననూ మానవవాక్కుతో సౌష్టవముగా స్పష్టముగా సంస్కృతమును మాటలాడుచున్నావు. నీ పూర్వజన్మలో నీవేమి చేసితివో తెలుపుము. అట్లే నీ భర్తయొక్క మహావీరచరితమును, నీ పుత్రుని చరితమును తెలుపుము. నీ భర్త తన పరాక్రమముతో స్వర్గమును చేరెను. ఇది ఏ ధర్మము? నీ చరితము, నీ భర్త చరితము పూర్వమున జరిగినదానిని అంతయూ తెలుపుము.' ఇట్లు మహానుభావురాలైన సుదేవ అడిగి విరమించెను.

సూకర్యువాచ - సూకరి పలికెను.

మంగళకరురాలా! నా చరితను, నా భర్త అయిన మహానుభావుని చరితమును అడిగినచో మా పూర్వ చరితము, అపుడు మేము చేసినదానిని అంతయూ చెప్పెదను. ఇతను నా భర్త, మహాజ్ఞాని, గంధర్వుడు. గానములో పండితుడు. ఇతని పేరు రంగవిద్యాధరుడు. సర్వశాస్త్రార్ధకోవిదుడు. పర్వతశ్రేష్ఠము, చక్కని గుహలతో విలసిల్లుచున్న మేరుపర్వతమును ఆశ్రయించి మహాతేజోవంతుడైన మునిశ్రేష్టుడు పులస్త్యుడు ఏకాగ్రచిత్తముతో తేజస్వి తపమును ఆచరించుచుండెను. ఒకనాడు తన ఇచ్ఛానుసారము ఈ విద్యాధరుడు కూడా ఆ పర్వతప్రాంతమునకు వెళ్ళెను. ఆ పర్వతప్రాంతముననే గానమును అభ్యసించుచుండెను. స్వర తాలములతో సుస్వరముగా గానము చేయుచుండెను. పులస్త్యముని ఆ గానమును విని ధ్యానమునుండి మనసు చలించినవాడై గానము చేయుచున్న గీత విద్యాధరునితో ఇట్లు పలికెను. దివ్యమైన నీ గానముతో దేవతలే మోహించెదరు. పండితుడా! నీ గానము సుస్వరము సుపవిత్రము, చక్కని తాలమానము కలది లయము, భావము మూర్చనా శోభితము. అంతటి చక్కని గానము వలన నా మనసు ధ్యానమునుండి చలించినది. కావున ఈ స్థానమును విడిచి ఇంకొక స్థానమునకు వెళ్ళుము అని.

గీత విద్యాధర ఉవాచ - గీత విద్యాధరుడు పలికెను.

‘మహానుభావా! నేను ఇచట ఆత్మజ్ఞానముతో సమానమైన గానమును సాధించుచున్నాను. నేనెవరికీ దుఃఖమును కలిగించుట లేదు. నరులందరికీ సుఖమునే ఇచ్చుచున్నాను. నా ఈ దివ్యమైన గీతముతో దేవతలందరు సంతోషించెదరు. గీతధ్వనియందు ఆసక్తికల శంకరుడు కూడా ఇక్కడికి తీసుకొనిరాబడినాడు. గానమే సర్వరసము. గీతమే ఆనందదాయకము. శృంగారాది సకల రసములు గీతముతోనే ప్రతిష్టించబడును. ఉత్తములైన నాలుగు వేదములు కూడా గానముతోనే శోభను పొందుచున్నవి. దేవతలందరు గీతముచే సంతోషించెదరు. ఇతరోపాయములతో సంతోషించరు. అట్టి గీతమును నీవు నిందించుచున్నావు. నన్ను ఇటనుండి కదలించుచున్నావు. మహానుభావా! ఇది నీకే అన్యాయముగా కనబడుచున్నది.”

పులస్త్య ఉవాచ - పులస్త్యుడు పలికెను.

ఈరోజు నీవు నిజమునే పలికితివి. గీతము చాలా పుణ్యమును ప్రసాదించును. నీవు నామాటను వినుము. అభిమానమును విడువుము. నేను గీతమును నిందించుట లేదు. గీతమును నమస్కరింతును, 14 విద్యలు ఒకేతీరుగా ఆనందమును కలిగించునవి. అయిననూ నిశ్చలమైన మనస్సుతోనే ప్రాణులు సిద్ధిని పొందెదరు. ఏకాగ్రచిత్తముతోనే తపస్సు మన్తములు సిద్ధిపొందును. ఇంద్రియవర్గము అత్యన్తచపలమని నా అభిమతము. ఇంద్రియములు అన్ని విషయములందు ఆత్మను దృఢముగా ఆకర్షించుచుండును. ధ్యానమునుండి మనసును కూడా చలింపచేయును. ఇందులో సంశయము లేదు. శబ్దము రూపము. యువతి లేని ప్రదేశముననే తపస్సిద్ధి కొరకు మునులు వెళ్ళుచుందురు. నీ ఈ గీతము పరమపవిత్రము, బహుసౌఖ్యమును కలిగించునది. కాని మేము ఇతరములను చూడజాలము. వనములో మాత్రమే ఉందుము. కావున నీవు మరియొక చోటికి వెళ్ళుము. కాదనినచో మేమే వెళ్ళేదము.

గీత విద్యాధర ఉవాచ - గీత విద్యాధరుడు పలికెను.

ఇంద్రియవర్గమును బలమును జయించినవాడే జయీ యోగి అనబడును. అతనే వీరుడు. అతనే సాధకుడు. శబ్దమును విని రూపమును చూచి ధ్యానమునుండి చలించనివాడే ధీరుడు. తపస్సులో అధికుడు. మీరు ఇంద్రియములచే జయించబడినవారుగాన తేజోహీనులు. నా గానమును తిరస్కరించగల సామర్థ్యము స్వర్గమున కూడా లేదు. శక్తిలేనివారలు మాత్రమే వనమును విడిచిపెట్టెదరు. ఈ వనప్రాంతము అందరికీ సాధారణమైనది. వేదములకు, సర్వజీవులకు, నాకు ఎట్లో నీకు అట్లే సాధారణము. ఇంతటి సాటిలేని వనమును విడిచి నేను ఎట్లు వెళ్ళేదను. మీరు వెళ్ళుడు లేదా ఉండుడు. జరుగవలసినది వేరుగా జరుగదు కదా!? ఇట్లు ఆ మునితో గీతవిద్యాధరుడు మాటలాడెను. గీతవిద్యాధరుని సమాధానమును వినిన పులస్త్యమహర్షి ఏమిచేసిన బాగుండును అని ఆలోచించెను. ఓర్పు వహించి ఆ బ్రాహ్మణోత్తముడు ధర్మాత్ముడైన పులస్త్యమహర్షి వేరొక స్థానమునకు వెళ్ళి యోగాసనగతుడై తపమునాచరించసాగెను. కామమును, క్రోధమును, మోహమును, లోభమును పరిత్యజించి అన్ని ఇంద్రియములను మనసుతో సహా నియమించి పులస్త్యమహర్షి అట్లు తపస్సులో నిలిచేను.

 సుకలోవాచ - సుకల పలికెను.

ఇట్లు మునిపుంగవుడైన పులస్త్యమహర్షి అచటినుండి వెడలిపోగా కాలప్రేరితుడైన ఆ గీతవిద్యాధరుడు కూడా ఇతను మరల నాకు కనబడుట లేదు. ఎక్కడికి వెళ్ళేను, ఎచట ఉండెను, ఏమి చేయుచున్నాడు అని ఆలోచించసాగెను. అంతట ఆ బ్రహ్మపుత్రుడు ఏకాన్తవనములో నున్నాడని తెలుసుకొని వరాహరూపమున అతని ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ పులస్త్యమహర్షి యోగాసనమున నుండెను. మహానుభావుడు తేజోజ్వాలలతో ఆవరించియుండెను. అట్లు ఆ మహర్షిని చూచి క్షోభను కలిగించెను. తుండాగ్రముతో కుచేష్టతో అతనిని ధర్షించుచుండెను. వరాహమును పశువుగా తెలుసుకొని ఓర్పు వహించుచుండెను. ఆ మహర్షి ముందర మూత్రమును విడిచెను. మలమును విడుచుచుండెను. మహారాజా! ఆ ముని పశువుగా భావించి విడిచిపెట్టెను. ఒకసారే మరల ఆ రూపముతో వచ్చెను. అట్టహాసముతో అపహాస్యమును చేసెను. పెద్దగా ఏడ్చెను. సుస్వరముగా గానము చేసెను. ఇట్లు ఆ వరాహ చేస్టలను అతని రాకను చూచి ఇది వరాహమైయుండదు. ఇతను గీత విద్యాధరుడే. ఇతడు మాత్రమే ఇట్లు నన్ను క్షోభింపచేయును. నేనుపశువుగా భావించి విడిచితిని. ఇతను దుష్టుడు. జ్ఞానము, దయ లేనివాడు. ఇట్లు ఆ మహాత్ముడు గంధర్వాధమునిగా తెలుసుకొనిన ఆ మునిశ్రేష్ఠుడు కోపించెను. మహాబుద్దిమంతుడుగాన శపించెను.

నీవు సూకర రూపముతో నన్నిట్లు చలింపచేసితివి గాన పాపీ! పాపయోని అయిన సూకరముగా పుట్టుము అని. ఇట్లు పులస్త్యమహర్షిచే శపించబడిన గీతవిద్యాధరుడు ఇంద్రదేవుని సన్నిధికి వెడలెను. వణుకుచు మహానుభావుడైన ఇంద్రునితో ఇట్లు పలికెను. సహస్రాక్షా! వినుము. నేను నీ పనిని చేసితిని. పులస్త్య మునిపుంగవుడు దారుణమైన తపమును చేయుచుండెను. ఆ తపస్సునుండి నేను అతనిని చలింపచేసితిని. క్షోభింపచేసితిని. అతను నన్ను శపించెను. నా దేవరూపమును నశింపచేసెను. పశుయోనికి చేరుచున్న నన్ను రక్షించుము. ఇట్లు దేవేంద్రుని గీతవిద్యాధరుని వృత్తాన్తమును తెలుసుకొని అతనితో కలిసి పులస్త్యముని వద్దకు వెళ్ళెను. ఆ మునితో ఇట్లు మాటలాడెను. “మీరు సిద్దజ్ఞులు. అసిద్ది వలన కలిగిన ఉత్తములు. అనుగ్రహించుడు. ఇతనిని క్షమించుడు. శాపమోక్షమును ప్రసాదించుడు.”

పులస్త్య ఉవాచ - పులస్త్యుడు పలికెను.

ఇట్లు మహేంద్రుడు ప్రార్థించగా సంతోషించిన పులస్త్యమహాముని 'దేవేంద్రా! నీ మాటతో నేను ఇతనిని క్షమించవలయును. ముందు మనుపుత్రుడు ఇక్ష్వాకువను పేరుతో మహాబలుడు మహారాజు రాగలడు. అతను ధర్మాత్ముడు. సర్వధర్మములను పాలించువాడు. ఇతనికి అతని చేతిలో మృత్యువు సంభవించినపుడు ఇతను మరల తన పూర్వదేహమును పొందగలడు. ఇందులో సందేహము లేదు. ఇది సూకరవృత్తాంతమునంతయూ నీకు తెలిపితిని. నా వృత్తాంతమును కూడా తెలిపెదను. భర్తతో కలిసి వినుము. పూర్వము నేను పాపాత్మురాలినిగా గొప్ప పాపమును చేసితిని.

            ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదగు భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున నలుబదియార - అధ్యాయము.