పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

35 - అధ్యాయము

రంభోవాచ –

రంభ పలికెను.

పుట్టుకనేరుగశక్యముకాని బ్రహ్మనుండి అత్రియను ప్రజాపతి ధర్మాత్ముడగు పుత్రుడు కలిగెను. ఆ యత్రి పుత్రుడు అంగుడితడు. ఇపుడు నందనవనమునకు వచ్చెను. నానాతేజస్సమన్వితమగు ఇంద్రుని సంపదను చూచి ఆ సంపదయందు ఆశగలవాడై నాకిలాంటి పుత్రుడు ధర్మాత్ముడు కలిగినచో నాకు మేలు కలుగును. యశస్సు కీర్తి ఒనగూడును అని భావించి నియమములతో తపస్సులతో శ్రీమన్నారాయణుని ఆరాధించెను. శ్రీహరి ప్రసన్నుడై ప్రత్యక్షము కాగా ఇంద్రునివంటి పుత్రుడు విష్ణువు వంటి తేజః పరాక్రమవంతుడు సర్వపాపనాశకుడు విష్ణుభక్తుడు కావలయునని వరమును కోరెను. శ్రీహరి అటువంటి పుత్రుని వరముగా నొసంగెను. ఆనాటినుండి ఇతను పుణ్యాత్మురాలగు కన్యకొరకు ఎదురుచూచుచున్నాడు. ఇతనిని వరించుము. ఇతనివలన పుణ్యాత్ముడు పుణ్యధర్మజుడు, విష్ణుతేజః పరాక్రమములు కలవాడు పుత్రుడుగా కలుగును. నీవు నన్ను అడిగినదానికి వివరముగా అంతయూ తెలిపితిని. ఇతను నీకు తగిన భర్త. ఇతను తప్పక భర్త కాగలడు. ధర్మప్రచారకుడు మహానుభావుడు పుణ్యాత్ముడు కొడుకుగా కలిగినచో సుశంఖుని శాపము కూడా వ్యర్థమగును. నీకు సుఖసంతోషములు కలుగును.నేను ముమ్మాటికి నిజమునే చెప్పుచున్నాను. చక్కని క్షేత్రము రైతు విత్తనమును నాటును. బీజమునకు తగిన ఫలమును అనుభవించును. దానికి విరుద్దముగా జరుగదు. బీజానుగుణముగనే జరుగును. ఇతను అంతటి మహానుభావుడు... తపస్వి పవిత్రవీర్యవంతుడు. ఇతని వీర్యమువలన పుట్టినవాడు ఇతని గుణసంపదతోనే కూడియుండును. మహాతేజస్వి మానవులందరిలో శ్రేష్ఠుడు. మహాభాగ్యవంతుడు. యుక్తమగు స్వభావము కలవాడు, యోగతత్త్వము తెలిసినవాడు కాగలడు.

ఇట్లు ఇష్టసఖియగు రంభ పలికిన మాటలను వినిన బాల ఇది మంగళదాయకమని బుద్ధితో ఆలోచించి ఇది తత్త్వము సత్యము అని నిశ్చయించుకొనెను.

ఇది శ్రీపద్మపురాణమున రెండవదగు భూమిఖండమున వేనోపాఖ్యానమున 35 - అధ్యాయము.