పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

1 - భూమిఖండము

ఋషయ ఊచు:-  ఋషులు పలికిరి

ఓ మహానుభావా! సర్వతత్త్వములను చక్కగా తెలిసిన విద్వాంసవర్యా! బుద్దిని నశింపచేయు భయంకరమగు సందేహము కలుగుచున్నది. పురాణములలో బ్రాహ్మణోత్తములు అయిదు సంవత్సరముల బాలుడగు ప్రహ్లాదుడు కూడా శ్రీమన్నారాయణుని సంతోషింపచేసెనట. దేవాసురులకు గెలువ శక్యముకాని రాక్షసుడు హిరణ్యకశ్యపుడు యుద్ధమున శ్రీహరిచే సంహరించబడి శ్రీమన్నారాయణునిలో లీనమాయెనట.

సూతమహర్షి పలికెను.

పూర్వము కశ్యపుడు తెలిసినది. వ్యాసమహర్షి చేసినది వ్యాసమహర్షి ముందు స్వయంభూయను బ్రహ్మ చెప్పినది. ఓ బ్రాహ్మణోత్తములారా! మీ ముందు ఇపుడు దానిని తెలిపెదను. కలిగిన సందేహమును బ్రహ్మ తొలగించెను.

వ్యాసమహర్షి పలికెను.

పుణ్యనిధీ! సూతమహరీ! పూర్వకాలమున ప్రహ్లాదుని జన్మవృత్తాంతము పురాణములలో మరియొక తీరుగా వినబడినది. బ్రహ్మచే వివరించబడినది ఇపుడు చెప్పుచున్నాను వినుము. ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు. దేవతల పూజలందుకొనినవాడు. పుట్టినంతనే దుఃఖస్పర్శలేని సుఖమయమగు వైష్ణవసంప్రదాయమును ఆశ్రయించెను. పుత్రులతో కలిసి శ్రీమహావిష్ణువుతో యుద్దమునకు వెడలి శ్రీమహావిష్ణువుతో చంపబడి వైష్ణవదేహమును ప్రవేశించేను. ఈ మహానుభావుని జన్మవిధానమును వినుము. పుత్రులతో కలిసి శ్రీమహావిష్ణువుతో యుద్దము చేసి వైష్ణవతేజమును పొంది తన తేజముతో పూర్వకల్పమున పుట్టిన విధమును వివరించెదను.

ప్రహ్లాదుని వృత్తాంతమును సంగ్రహముగా వివరించెదను. పశ్చిమ సముద్రతీరమున ద్వారకానగరము సర్వసంపదలతో సర్వసిద్దులతో విరాజిల్లుచుండెను. ఆ నగరమున యోగని, యోగజ్ఞానులలో శ్రేష్ఠుడు, వేద శాస్త్రార్ధకోవిదుడు శివశర్మ అను పేరుకల బ్రాహ్మణోత్తముడుండెను. అతనికి సర్వశాస్త్రార్ధకోవిదులగు అయిదుగురు పుత్రులుండెడివారు. యజ్ఞశర్మ, వేదశర్మ, ధర్మశర్మ, విష్ణుశర్మ, సోమశర్మ అని వారి పేర్లు. వీరిలో అయిదవవాడు సోమశర్మ అత్యంత పితృభక్తిపరాయణుడు. అందరు పుత్రులు పితృభక్తి తప్ప ఇతర ధర్మములను తెలియదు. పితృభక్తితో అయిదుగురు పరిపూర్ణానందముగలవారైరి.

శివశర్మ పుత్రులకున్న పితృభక్తిని చూచి మేధావి కావున దేవతలకు పితృభక్తి ప్రభావమును తెలిపెదను. వీరికి పితృభక్తిమీద అంతగా సమాదరము లేదు. నేను తెలిసియూ బుద్ధిపూర్వకముగా ఆచరించెదను. శ్రీమహావిష్ణువు అనుగ్రహమువలన శివశర్మ సర్వసిద్ధులను పొందెను.

శివశర్మ పుత్రుల సద్భావమును తెలుపుటకు తపఃప్రభావమును వారి దివ్యతేజమును ప్రకటించుటకు ఒక ఉపాయమును ఆలోచించెను. బ్రహ్మజ్ఞానియగు శివశర్మ మాయతో వారి (పుత్రుల) ముందు ఒక వ్యాజమును చూపెను. వారి తల్లి మహాజ్వరముతో చనిపోయినట్లు కనబరచెను. తల్లి మరణించుటను చూచి వారు తండ్రితో ఇట్లు పలికిరి. తన కడుపులో మమ్ములను ధరించి పెంచిన మా తల్లి తన శరీరమును విడిచి మరణించెను. ఇట్లు వెడలిన తల్లిని స్వర్గమునకు వెళ్లినదని ఎందుకనుచున్నారు. అని. అంత శివశర్మ తన పెద్దకుమారుడు పితృభక్తిపరాయణుడగు యజ్ఞశర్మను పిలిచి ఇట్లు పలికెను.

శివశర్మ పలికెను.

‘ఈ తీక్ష్ణశస్త్రముతో ఈమె అవయవములను ఖండించి ఎక్కడో ఒకచోట పడవేయుము’ అని. యజ్ఞశర్మ తండ్రి చెప్పినట్లుగా ఆచరించి తండ్రివద్దకు వచ్చి ఇట్లు పలికెను. ‘తాము చెప్పినట్లు చేసితిని. ఇంకేమి చేయవలయునో ఆజ్ఞాపించుడు. అది ఎంత కష్టసాధ్యమైననూ ఆచరించెదను. అట్లు యజ్ఞశర్మ మాటలను విని అతని దృఢనిశ్చయమును తెలిసి రెండవ పుత్రుని భావమును తెలియదలచి వేదశర్మను పిలిచి 'నా మాటతో వెళ్ళుము. నేను కామమోహితుడనైతిని. స్త్రీ లేకుండగా నిలువజాలను' అని చెప్పి మాయతో ఒక స్త్రీని చూపి 'ఆమెను నా కొరకు ఇచటికి తెమ్ము' అని పలికెను. అంతట వేదశర్మ మీకు ప్రీతిని కలిగించేదను అని పలికి తండ్రికి నమస్కరించి ఆమెవద్దకు వెళ్ళి ఇట్లు పలికెను. 'కామబాణపీడితుడగు మా తండ్రి నిన్ను కోరుచున్నాడు. కావున నీవు అనుగ్రహముతో ప్రసన్నురాలవు కమ్ము. ఓ సుందరీ! నీవు మా తండ్రిని సేవించుము' అని. అంతట శివశర్మ తన మాయతో ఆ స్త్రీతో ఇట్లు పలికించెను.

 స్త్రీ పలికెను.

'నేను జరపీడితుడు, సంశ్లేష్మాది రోగగ్రస్తుడు, శిథిలదేహుడు అయినవాడు కామారుడైన వృద్ధునితో సంగమమును అంగీకరించజాలను. నీతో రమించదలిచితిని. నీకు ప్రీతిని కలిగించెదను. నీవు రూపము, సౌభాగ్యము, సద్గుణములు, దివ్యలక్షణములు, దివ్యరూపము, దివ్యతేజము కలవాడవు. వృద్దుడగు తండ్రితో నీకేమి పని? నా మాట వినుము. నా దివ్యదేహసంపర్కముతో దుర్లభమునంతటిని పొందగలవు. నీవు కోరిన దంతయూ ఈయగలను. ఇట్లు అప్రియము, పాపభూయిష్ఠమగు మాటను విని వేదశర్మ ఇట్లు పలికెను.

వేదశర్మ పలికెను.

‘దేవీ! నీవు అధర్మమును అయుక్తమును పాపభూయిష్టమగు ఇలాంటి మాటను పితృభక్తిపరాయణుడనగు నాతో మాటలాడరాదు. నేను తండ్రి కొరకు వచ్చి నిన్ను యాచించుచున్నాను. నీవు వేరుగా మాటలాడరాదు. నా తండ్రిని సేవించుము. ఈ మూడులోకములలోగల దేవరాజ్యాదులు, చరాచరములన్నిటిలో నీవు దేనిని కోరిననూ ఇచ్చెదను. సందేహించవలదు.’

స్త్రీ పలికెను.

'ఇట్లు నీవు నీ తండ్రి కొరకు ఈయగలవాడవగుచో మహేశ్వరుడు, ఇంద్రుడు మొదలగు దేవతలను చూపించుము. నీ దివ్యబలమును చూపుము. నాకిది దుర్లభము కావున ప్రసాదించుము.’

వేదశర్మ పలికెను.

‘దేవీ! నా తపోబలమును, ప్రభావమును చూడుము. నాచే పిలువబడి ఇంద్రాది దేవతలు వచ్చిరి. అట్లు వచ్చిన దేవతలు ఓ బ్రాహ్మణోత్తమా! ఏమి చేయవలయును? నీవు కోరినదానిని ఇచ్చెదము. సందేహించవలదు అని పలికిరి. అంతట వేదశర్మ నా విషయమున దేవతలు ప్రసన్నులగుచో నా తండ్రి పాదములయందు నాకు పరిశుద్దభక్తిని ప్రసాదించుడు' అని పలికెను. అట్లే అగుగాక అని పలికి దేవతలు వచ్చిన విధముగానే వెళ్ళిరి. అంతట స్త్రీ వేదశర్మతో నీ తపోబలమును చూచితిని. కాని దేవతలతో నాకు పనిలేదు. మీ నాన్నగారి కొరకు నన్ను గొనిపోవ దలిచి నా కోరికను తీర్చదలిచినచో నీ చేతులతో స్వయముగా నీవే ఖండించుకొని నీ శిరమును నాకిమ్ము.

వేదశర్మ పలికెను.

దేవీ! ఇప్పటికి నేను ధన్యుడనైతిని. ఋణత్రయ విముక్తుడనైతిని. నా శిరమును ఇచ్చెదను. స్వీకరించుము. ఇట్లు పలికి నవ్వి తీక్షమగు శస్త్రముతో తన శిరస్సును ఖండించుకొని ఆమెకిచ్చెను. నెత్తురోడుతున్న అతని తలను తీసుకొని ఆమె మునివద్దకు వెళ్ళెను.

స్త్రీ పలికెను.

            ఓ బ్రాహ్మణోత్తమా! వేదశర్మ అను నీ పుత్రుడు ఈ శిరమును నీ కొరకు పం పెను. తానే స్వయముగా ఖండించుకొనెను. పితృభక్తితో నీకొరకు పంపెను. ఇక నన్ను అనుభవించుము అని. అచట వేదశర్మ సోదరులు అతని సాహసమును చూచి కంపించిపోయిరి. ధర్మసాధ్వియగు మా తల్లి ధర్మసమాధితో మృతిచెందినది. ఈ మహానుభావుడు తండ్రికొరకు మరణించెను. తండ్రికొరకు ఇంతటి పుణ్యకార్యమును ఆచరించిన ఇతను ధన్యుడు. పుణ్యపరాయణులగు ఆ సోదరులు ఇట్లు మాటలాడుచుండగా భక్తిపరాయణమగు ఆ మాటలను విని తన శిరస్సును ఖండించుకొనిన వేదశర్మను తెలిసి ధర్మశర్మతో ఈ శిరస్సును తీసుకొనుము అని పలికెను.

ఇది శ్రీ పద్మపురాణమున భూమిఖండమున శివశర్మ చరితమున మొదటి అధ్యాయము ముగిసినది.