లింగ మహా పురాణము
23 - మానస శివపూజ నిరూపణము
శిలాదతనయుఁడు దిగువవిధము - సనత్కుమారునకు ప్రబోధించెను. ప్రతిదినము - ప్రాత ర్మధ్యాహ్న సాయంకాలముల యందు శివలింగమును పుజింపవలెను. మరియు యథాశక్తి నగ్నికార్యమును నిర్వర్తింప వలెను. పుష్పహస్తుడై - పూజామందిరమునఁ బ్రవేశించి - శివుని వలన అమృతవర్షము కురిసినట్లు అట్టి అమృతముఁ దగు స్నానము (జేసినట్లును భావించి - తన శరీరమును పవిత్రముగా నొనర్చుకొనియు - సదాశివుని ధ్యానింపవలెను.
కంఠము క్రింద – నాభిపైనను - సూక్ష్మ ప్రపంచమునకు ఆధారముగు హృదయము నెలకొనియండును. అట్టి హృదయకమలము యొక్క కర్ణికయందు సదాశివుడు ప్రకాశించుచుండును.
సదాశివుని - పంచవదనునిగాను, దశహస్తుని గాను, సర్వాభరణ భూషితునిగాను, పంచదశ (15) నేత్రుని గాను, చంద్రశేఖరుని గాను, పద్మాసనాసీనుని గాను, శుద్ధస్ఫటికసన్నిభుని గాను ధ్యానింపవలెను.
సదాశివుని పైముఖము తెల్లనిదనియు; పూర్వముఖము - కుంకుమ వన్నె గలదనియు, దక్షిణవక్ర్తము నీలవర్లకమనియు ఉత్తరముఖము మిక్కిలి ఎర్రని దనియు పశ్చిమ వదనము - గోక్షీరధవళమనియు కుడిచేతులతో - త్రిశూలమును పరశువును ఖడ్గమును వజ్రమును శక్తిని ధరించినవాడనియు; ఎడమ చేతులలో - పాశమును అంకుశమును గంటను నాగమును బాణముఁ దాల్చువాడనియు; పంచబ్రహ్మావి గ్రహుఁడనియు; సర్వదేవోత్తమోత్తముఁడనియు భావించి - సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన మంత్రములతో నారాధింపవలెను.
ఆథవా – పరశు మృగ పరాభయములను ధరించిన నాలుగు చేతులు గలవానిగా చంద్రశేఖరత్వాది సంపన్నుని గాను ధ్యానింపవచ్చును.
దిగువ వ్రాయబడిన శివాంగమంత్రముల నుచ్చరింపవలసి యుండును.
“ఓం ఈశానః సర్వవిద్యానాం హృదయాయ శక్తి బీజాయ నమః”
“ఓం ఈశ్వరః సర్వభూతానా మమృతాయ శిరసే నమః” “ఓం బ్రహ్మాధిపతయే కాలాగ్నిరూపాయ శిఖాయై నమః“
“ఓం బ్రహ్మణోఽధిపతయే కాలచండ మారుతాయ కవచాయ నమః” “ఓం బ్రహ్మణే బృంహణాయ జ్ఞానమూర్తయే నేత్రాయ నమః” “ఓం శివాయ సదాశివాయ పాశుపతాస్త్రాయ అప్రతిహతాయ ఫట్ ఫట్. “ఓం సద్యోజాతాయ భవేభవే నాతిభవే భవస్వ మాం భవోద్భవాయ శివమూర్తయే నమః” “ఓం హంసశిఖాయ విద్యాదేహాయ ఆత్మస్వరూపాయ పరాపరాయ శివాయ శివతమాయ నమః” “సద్యోజాతాది పంచ బ్రహ్మమయమూర్తి నిట్లు అంగమంత్రములతో ప్రార్థింపవలె” నని - శివశాస్త్రమునందు నిరూపింపఁబడినది.
- హృదయకమలమునందు - మంత్రమయుఁడగు సదాశివుని “సమిధలను చరువు నాజ్యమును మనసా కల్పించి - పంచబ్రహ్మమంత్రములతో అంగమంత్రములతోడను నాభియందు మానసిక హవనము నొనర్చి - శంకరుని శిరోభూషణమగు చంద్రమండలమునుండి అమృతధార స్రవించినట్లు అట్టి అమృతధార తనపై పడుటచే తన తనువు పునీతమైనట్లును భావించి” ధ్యానింపవలెను.
అథవా సదాశివుడు ముఖములో నున్నట్లు - భ్రూమధ్యగత తేజోమయుఁడైనట్లు -లలాటము నందున్నట్లును భావించి - పూర్వోక్తమగు హవనమును నాభియందాచరించియు - హృదయమునందు సంసారబంధమోచకుఁడగు భవుని దీపశిఖాకారునిగా - ధ్యానింపవలెను.
ఇట్టి మానసిక పూజనమునకు అంగముగా – బాహ్యమున – శివలింగమునందు - సదాశివుని రుద్రాభిషేకాదులతో నారాధింపవలెను. లేక స్థండిలాగ్నియందు పంచ బ్రహ్మమంత్రాదులతో సమిధాజ్య చరువులను వ్రేల్చి - పూర్ణాహుత్యాదులతో ముగింపవలెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక“ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (23)వ యధ్యాయము.
Summary of chapter 131 of the Linga Mahā Purana is as follows:
The narrative outlines the procedures for renovating damaged temples, re-consecrating defiled icons, and performing purification rituals known as Jirṇoddhāra. The text explains that restoring ancient, dilapidated Śiva temples yields double the spiritual merit of constructing a new temple, earning the special grace of Supreme Śiva.