లింగ మహా పురాణము
28 - మానసిక శివలింగార్చన విధానము
హృదయములో అగ్నిమండలము,దానిపై సూర్యమండలము, దానిపై చంద్రమండలము;చంద్రమండలముపై సత్త్వరజస్తమోగుణ త్రయాత్మకమగు ప్రధానము (ప్రకృతి) ఉన్నట్లు భావించిప్రధానముపై మహాదేవుని - ఆదిశక్తి శరీరార్ధము నందు గలవానిగా - ధ్యానింపవలెను.
శరీరము అను పట్టణమున పరుండువాడు గాన పురుషుఁడనఁబడును. ధ్యానమునందు మహేశ్వరుఁడు ఇరువదియారవ (షడ్వింశ కుఁడు) వాడు కాగా ధ్యానించు జీవాత్మ - పంచవింశకుఁడగును. ఇంక ఇరువదినాలుగు తత్త్వములు ఏవియనగా? అవ్యక్తము, మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు (సూక్ష్మపంచ భూతములు - ములు కానివి) కర్మేంద్రియములు ఐదు,జ్ఞానేంద్రియములు ఐదు మనస్సు, మిశ్రములైన పంచమహాభూతములున్ను.
“మహేశ్వరుఁడే వేదమునకు కర్తయు, పోషకుఁడునై - సృష్టి ప్రారంభమున దేవతలందరికంటెముంగు బ్రహ్మదేవుని పుట్టించి ఆతనికి వేదములను తద్విజ్ఞానమునొసఁగిన వాడుగాన - విశ్వాధికుఁడు సర్వజ్ఞుఁడు నగు పరమేశ్వరుఁడు మమ్ము శివధ్యాన సిద్ధిప్రద మగు ఏకాగ్రబుద్ధితో కూర్చు గాక! “అని లోలోన ప్రార్ధింపవలెను. ఇట్లు చెప్పుటవలన - మోక్షమునకు బాహ్యాభ్యంతర శివారాధనమే ముఖ్యసాధనంబగునని వ్యక్త మగుచున్నయది.
లోకమున తల్లి తండ్రి (యిరువురు) లేనిది కుమారుఁడు జన్మింపనట్లు - శక్తి విశిష్ట శివుని వలననే చరాచర ప్రపంచము ఉదయించుట ఇందు పరమార్థమగునని తెలియుచున్నది. కాలము - సృష్టిస్థితి లయములఁ జేయునది కాగా కాలమును ప్రేరేపించు కాలకాలుడు మహేశ్వరుఁడగుటచే నాతని లీలావిలాసమే జగత్త్రయంబని గుర్తెరుఁగవలెను.
వేయి చెప్పనేల? ప్రపంచవుంతయు శివుని మూర్త్యష్టక మగునది. ఎట్లనగా? సూర్యచంద్రులు, భూజలాగ్నివాయ్యాకాశములు, యజమానుడు లేక శాంభవ దీక్షితుడు నను ఎనిమిది రూపములు లేనిది - జగత్తు ప్రవర్తింపదు.
అందువలన చరాచర మంతయు శివుని స్థూలరూప మని - ‘సర్వో వై రుద్రః” అను శ్రుతివాక్యము విశదీకరించినది. శివుని వాస్తవ రూపము ఆనందమయంబని గుర్తించి అట్టి శివానందమును చూఱఁ గొనినచో దేని వలనను భయము కలుగదని “ఆనందం బ్రహ్మణో విద్వాడ - నబిభేతి కుతశ్చన’’ అను శ్రుతివాక్యము వెల్లడించినది.
“సర్వం ఖల్విదం బ్రహ్మ” అను శ్రుతివాక్యము “సర్వోవైరుద్రః” అను శ్రుతివాక్యంబు సమానార్థకములగుటఁజేసి బ్రహ్మము రుద్రుఁడేనని తత్త్వవేత్తలు నిరూపించుచున్నవారు.
పురుషుఁడనగా రుద్రుఁడేను; ఇట్లు బాగుగా విచారించుకొని సంసార బంధమును తొలగించు శివధ్యానమును జపపూజనముల నొనర్చుచుండవలెను. ధ్యానమనగా? శివుని లక్షణమును మహిమను ఏకాగ్రభావనతో చింతించుట యగును.
ఇంద్రచంద్రసూర్య అగ్ని విష్ణువులను ధ్యానించుటకన్న - శివధ్యానము మిన్నయై సద్యోముక్తినొసఁగును.
ఇట్లు లోలోన శివుని ధ్యానించి ఆవాహన ఆసన పాద్య అర్ఘ్య ఆచమున స్నానములను భస్మగంధాక్షత పుష్పబిల్వములను ధూపదీప నైవేద్య తాంబూల ఫలములను మహానీరాజన మంత్రపుష్పములను మనస్సు చేతనే సమర్పించి ప్రణమిల్లవలెను.
ఇట్టి అంతర్లింగార్చన జేయువారిని శివభక్తులు గౌరవించుచు నమస్కరించి వారికి వలయు వస్తువులను సమర్పించియు వసతి సౌకర్యమును కలుగజేయవలెను.
అంతర్లింగార్చన జేయువారును బాహ్యమున భస్మరుద్రాక్షలఁదాల్చుట ముఖ్యము. శివధ్యానములో చివరిమెట్టు “శివోఽహం” భావన. అట్టి అద్వైత భావనచే ముక్తుఁడు శివుఁడగును.
అంతర్బహిర్లింగార్చకులను శివాగమ ప్రోక్తరీతిని శివలింగ ధారులైన వారిని నిందించు అల్పబుద్ధులు, దుఃఖములపాలగుదురు. వారు వికార స్వరూపము గలవారైన నవ్వారిని నిందింపరాదు. దారు వనమునందు మునులు శివుని తిరస్కరించి క్లేశభూయిష్ఠు లైనట్లు - సాధకులు కారాదు.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (28) ఇరువది యెనిమిదవ అధ్యాయము.
Summary of chapter 28 of the Linga Mahā Purana is as follows:
Extolling the supreme elevation of Mānasa Pūjā or mental worship, this chapter explains how advanced spiritual seekers worship Parameśvara Śiva within the lotus of their own heart. By offering the flowers of non-violence, truthfulness, compassion, forgiveness, and wisdom upon the inner shrine of consciousness, the devotee attains direct communion with the supreme inner Śiva Tattva without relying on external materials.