లింగ మహా పురాణము
49 - జంబూ ద్వీప వర్ణనము
జంబూద్వీపము లక్ష యోజనముల నిడివి గలది కాగా - ప్లక్షద్వీపము రెండు లక్షల యోజనముల వెడల్పు కలిగియుండును. భూమి - సముద్రములతో కూడ ఏబది కోట్ల యోజనముల విస్తీర్ణత కలిగినదై సప్త ద్వీపములతో విలసిల్లుచు లోకాలోక పర్వతములతో చుట్టఁబడి యుండును.
మేరు పర్వతమునకు ఉత్తరమున నీల పర్వతము; నీల పర్వతమునకు ఉత్తరమున శ్వేతాద్రియు, శ్వేతాద్రికుత్తరమున శృంగి పర్వతము నను నీ మూడు - వర్ష పర్వతములనఁబడును. మేరువునకు పూర్వ దిశయందు జఠరము దేవకూటము నను రెండు కొండలుండును. మేరువునకు దక్షిణమున నిషధాద్రియు, దాని కుడివైపున హేమకూటము, దాని దక్షిణమున హిమవత్పర్వతంబు, మేరువునకు పడమరయందు పర్వత ద్వయము (వీని పేర్లు లేవు)ండును. మాల్యవంతము గంధమాదము నను రెండు పర్వతములు మేరుపర్వతప్రాంతస్థితములు.
ఈ పన్నెండు గిరిరాజముల యందు సిద్ధులు చారణులు మున్నగు వారు విహరించుచుందురు. ఈ పర్వతములలో ఒక్కొక దానికి మరి యొకదానికి మధ్యన తొమ్మిది వేల యోజనముల అంతరముండును. హిమాలయమునకు జెందిన నీ వర్షము భారతమని ప్రసిద్ధి గాంచినది.
భారతము - హేమకూటుము - కింపురుషము హరివర్షము - ఇలావృతము - రమ్యకము - శ్వేతము శృంగి - కురువు ననునవి నవవర్షముల నామధేయములు.
మేరు పర్వతమునకు దక్షిణమున ఉత్తరమున నుండు వర్షములు ధనురాకారము గలిగియుండును. ఇంక నాలుగు వర్షములు పొడవు గలిగియుండ నవ్వాని నడుమ నిలావృతముండును. మేరు పర్వతముఁదగు పశ్చిమ పూర్వ దిశలయందు రెండు వర్షములు దీర్ఘములు కానివిగ నుండును.
మాల్యవత్పర్వతము రెండు వేల యోజనముల ఎత్తు గలదైముప్పది నాలుగు వేల యోజనముల వెడల్పుతో నుండును.
మందరము, దేవకూటము నను పర్వతములు సూర్య దిశయందును, కైలాస గంధ మాదనపర్వతములు దక్షిణ దిశ యందును, నిషధ పారియాత్రపర్వతములు పశ్చిమ దిశయందును, త్రిశృంగము జారుచియను పర్వతములు ఉత్తరదిశయందును విరాజిల్లుచుండును.
మహోన్నతమై కనకమయంబునగు మేరు పర్వతమునకు నలుదిసలయందు గల మందర గంధమాదన విపుల సుపార్శ్వ పర్వతములచే భూమి కదలక నుండును.
మందర పర్వతముపై కదంబ వృక్షము; గంధమాదన గిరిపై జంబూ వృకము; విపుల శైలముపై అశ్వత్థ (రావి) వృక్షము; సుపార్శ్వ నగముపై న్యగ్రోధ (మఱ్ఱి) వృక్షంబు శాఖోపశాఖలతో విస్తీర్ణములై యుండును. మరియు ఈ నాలుగు పర్వతములపై గల నాలుగు మనోహరములైన వనములు చైత్ర రథ, గంధమాదన, వైభ్రాజ, సావిత్రీ నామధేయములతో దేవతలు విహరించునవిగా నుండును.
పూర్వమున మిత్రేశ్వరము; దక్షిణమున షషేశ్వరము; పశ్చిమమున వర్యేశ్వరము; ఉత్తరమున ఆమ్రకేశ్వరము నను శివక్షేత్రములు - అరుణోదము, మానసము, సీతోదము, మహాభద్రము నను సరస్సులు- కార్తికేయ (కుమార స్వామి) క్షేత్రములును నలుదిసలయందు విలసిల్లుచుండును. వీనిలో మునులు నివసించుచుందురు. మానవులుండ జాలరు.
వీటన్నిటియందు అమరులు శివాలయములను నిర్మించి శివలింగము నారాధించుచుందురు.
బిల్వవనమునందు మహాలక్ష్మ్యాదులు, అర్జున వృక్షవనము నందు కశ్యపాదులు. తొలవనము నందు ఇంద్రోపేంద్రాదులు, ఉదుంబరవనమునందు కర్దమాదులు, ఆమ్రవనము నందు విద్యాధరులు సిద్ధులును, నింబ వనమునందు నాగదేవతలు సాధ్యులును, కింశుక వనమునందు సూర్యుడు రుద్ర గణములును, బీజ పూరవనమున దేవాచార్యుడగు బృహస్పతియు, కౌముద వనమున విష్ణుమూర్తి మున్నగువారు, న్యగ్రోధ వృక్షచ్ఛాయను ఆదిశేషుడును నివసించుచుందురు. ఈ ఆదిశేషుడే పాతాళము నందును సమస్త జగదాధారముగ నుండును. ఈతడు శ్రీహరికి శయనమై హస్తకంకణంబు నగును. ఈతడే ద్వాపరయుగమున బలరాముడుగ నవతరించెను.
పనసవృక్ష వనమున శుక్రాచార్యునితో కూడ దానవాదులు, విశాఖక వనమునందు కిన్నరులు మహా సర్పములును, కోట్లకొలది మహావృక్షములు గల మనోహర వనమున ప్రమథ గణములతో నుతింపబడు నందీశ్వరుఁడును, సంతానక ప్రదేశమున సరస్వతీ దేవియు, ఆనందోత్సాహములతో నివసించుచుందురు.
వీనిని సంగ్రహించి చెప్పితిని. విస్తారముగ వక్కాణింపనలవి గాదని సూతుఁడు విరమించెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక ‘ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (49) నలబది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 49 of the Linga Mahā Purana is as follows:
This chapter details Ilāvṛta Varsha, the central realm surrounding Mount Meru, where Bhagavān Śiva resides in divine bliss surrounded by Mother Pārvatī and millions of divine maidens. The text describes the pristine beauty, wish-fulfilling trees, heavenly lakes, and divine atmosphere of Ilāvṛta where no mortal can enter without divine grace.