లింగ మహా పురాణము
41 - బ్రహ్మదేవుఁడు దేవీ పుత్రుఁడగుట త్రిమూర్తులు ఒకరి నొకరు పుట్టించుటయు
ఇంద్ర ఉవాచ- దేవేంద్రుఁడు పలికెను.
భగవానుఁడైన బ్రహ్మదేవుఁడు వేయిమహాయుగములు గడచిన తరువాత ప్రభాతసమయమున పూర్వము వలె ప్రజలను పుట్టించెను. బ్రహ్మాయుష్యము రెండు పరార్ధములతో ముగిసిన తరువాత మహాప్రళయమున - భూమి ఉదకములో నిమగ్నకాగా - ఉదకము అగ్నియందు, అగ్ని వాయువునందు, వాయువు ఆకాశమునందు, ఆకాశము సూక్ష్మ పంచ మహాభూతములలోను, తన్మాత్రలు ఏకాదశేంద్రియములు అహంకారము నందు లీనములయ్యెను. పృథివ్యాదులను తనలో చేర్చుకొనిన అహంకారము మహత్తత్త్వమునందు; మహత్తత్త్వము అవ్యక్తమునందు లీనములు కాగా అవ్యక్తము పరమేశ్వరునందు దాగి యుండెను.
మహా ప్రళయము ముగిసిన వేళ పురుషుఁడైన శివుని వలన మహా సృష్టి ప్రారంభమాయెను. బ్రహ్మదేవుని మొదట పుట్టించి ఆతనికి వేదముల నుద్భోదించియు స్త్రీ పురుష భేదముతో దేవ మానవాది సృష్టి పెరుగునని తెలుపుటకు పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుఁడుగ సాక్షాత్కరించెను.
తన మానసపుత్రులతో కూడి కఠినమైన తపస్సును బ్రహ్మయొనర్చుట - అర్ధనారీశ్వర రూపసాక్షాత్కారమునకు కారణమయ్యేను.
అర్ధ నారీశ్వర రూపమనఁగా -
(సగము స్త్రీ, సగము పురుషుడుగా వామభాగము శక్తియనియు దక్షిణభాగము పురుషుడనియు అయ్యది ఆపాదమస్తకము స్త్రీ పురుష చిహ్నములతో నుండుననియు, మూత్రేంద్రియములు విడివిడిగా నొకచో నున్నను పురుషమూత్రేంద్రియము ఊర్ధ్వరేతస్కమగుటచే స్త్రీ యోని స్పర్శచే ఎట్టి కామవికారము జెందదనియు, నామమాత్రముగా నయ్యవి ఆకృతి జెందియుండుననియు శివ భక్తులు గుర్తించి శివద్వేషులు గావించు హేళనలకు ఎంత మాత్రము బాధపడ కుందురుగాత!)
బ్రహ్మదేవుని తపష్సు వలన శివుఁడు సంతోషించినవాడై బ్రహ్మలలాటమును భేదించి కుమారుఁడై ఆవిర్భవించెను. ఇంతియే గాక శివుడు తన యర్ధభాగమగు శక్తిని యోగమార్గము ననుభవించి ఆమెయందు శ్రీహరిని బ్రహ్మదేవుని పాశుపతాస్త్రమును పుట్టించెనని దిగువ శ్లోకమున గాననగును.
శ్లో ॥ తస్యాం హరించ బ్రహ్మాణం-ససర్జ పరమేశ్వరః । విశ్వేశ్వరస్తు విశ్వాత్మా-చాస్త్రం పాశుపతం తథా ॥
(యోగమార్గమనగా మానసికమైన అపేక్ష యని వ్యాఖ్యాత విశదీకరించినాడు.) అందువలన బ్రహ్మదేవుఁడు శ్రీహరియు మహాదేవి యొక్క అంశ వలన జన్మించినవారని తేటపడినది. బ్రహ్మ యొక్క జీవితమున్నంతవరకు జగత్తునకు కల్యాణ మొద వుచుండును.
శివపుత్రుడైన నారాయణుఁడు శక్యంశ సంభూతుఁడగుటచే చరాచరమునంతయు సృజింప గలిగినవాడై బ్రహ్మదేవుని పుట్టించెను. బ్రహ్మదేవుడు రుద్రుని విష్ణువును; రుద్రుడు హరి బ్రహ్మలను ఒక్కొక కల్పమునందు పుట్టించిరి. ఇట్లు జగత్సృష్టి జరుగుచుండగా బ్రహ్మదేవుడు వైరాగ్యము గలవాడై సృష్టిని మానుకొని పదివేల వత్సరములు యోగవిధిని శివునుద్దేశించి తపింపగా ప్రసన్నుడైన పరమేశ్వరుని నామాష్టక నిర్వచనముతో ప్రార్థించెను.
సూర్య చంద్ర భూ జల అగ్ని వాయు ఆకాశ యజమానుల నధిష్ఠించునట్టి రుద్ర భవ శర్వ ఈశ పశుపతి భీమ మహాదేవ ఉగ్రనామధేయులుగా ఎనిమిది తెలుఁగులు గల పరమేశ్వరుఁడు అష్టమూర్తయని పేర్కొనఁబడుచున్నవాడు. పరమేశ్వరుని అధిష్ఠానము వలననే సూర్యచంద్రులు సంపూర్ణ ప్రకాశము గలవారగుటయే గాక భూమ్యాది పంచ మహాభూతములు ప్రపంచముగా పరిణమించి లోకోపకారకములైనవి. యజమానుఁడనఁగా జ్యోతిష్టోమాదియజ్ఞములను పంచమహాయజ్ఞముల నొనర్చువాడు, లేక “ బకం యజామహే“ ఇత్యాది శ్రుతి ననుసరించి శివునారాదించువాడగును. ఇట్టి భక్తుని యందు ఇష్ట లింగరూపమున నివసించుచున్నందున నాతడు శివారాధన శ్రద్ధ నినుమడించు కొని లోక కల్యాణ కారకుడగుచున్న వాడు. ఇందువలననే శివుఁడు అష్టమూర్తి యనఁబజుఁగెను.
ఇట్టి అష్టమూర్తి యొక్క అనుగ్రహము వలన విధాత సృష్టి (జేయఁగలుగుచున్నవాడు. ఒకానొక కల్పమున బ్రహ్మదేవుడు చేసిన తపస్సు నిష్ఫలము ఐసందున సంభవించిన దుఃఖమువలన క్రోధము కలుగగా క్రోధావిష్టుడైన బ్రహ్మదేవుని నేత్రములనుండి రాలిన కన్నీళ్ల వలన జన్మించిన భూతప్రేత పిశాచములఁ గాంచి తనను తాను నిందించుకొని ప్రాణములను విడిచెను.
అప్పుడు ప్రాణ గ్రంధిరూపుడగు మహేశ్వరుడు బ్రహ్మముఖము నుండి యావిర్భవించి అర్ధనారీశ్వరుడై తనను పదునొకండు విధములుగా విభజించుకొనెను. మహేశ్వరుని అర్ధాంశతో ఉమాదేవి ఆవిర్భవించెను. ఉమాదేవి - దుర్గాదేవిని, లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని అనేక శక్తులను పుట్టించెను.
మహేశ్వరుఁడు దుయాళువై మరణించిన బ్రహ్మదేవుని బ్రతికించి. “బ్రహ్మదేవా! నీకు ప్రాణముల నొసగితిని. లెమ్ము! “అని యనఁగా విధాత సాంజలియై ప్రణమిల్లి ‘‘నీవెవరు? అని యడిగెను. అంత మహేశ్వరుడు తన మృదుహస్తములతో తాకుచు
శ్లో॥ మాం విద్ధి పరమాత్మాన-మేనాం మాయా మజామితి ॥
నన్ను పరమాత్మగాను, ఈమెనుమాయగాను, జన్మ మరణాదులు లేని నిత్యురాలిగాను గుర్తెరుగుము ! ఈ ఏకాదశరుద్రులు నిన్ను రక్షించుచుందురు.” అని వచింప పంకజాసనుడు మరల ప్రణమిల్లి - దేవదేవా ! నన్నీ సంసార బంధము నుండి విముక్తు జేయు “ మని ప్రార్థించెను.
అంత మహాదేవుఁడు ఏమియు బదులు చెప్పక చిరునగవుతో ఏకాదశ రుద్రులతోడను ఉమాదేవితోడ నంతర్ధానముఁ జెందెను.
శిలాదా! దేవదేవుడగు పరమేశ్వరుఁడు ప్రసన్నుఁడైనచో నీకు అయోనిజుడు చిరంజీవియు నగు కుమారుఁడు లభించును. హరి బ్రహ్మలు గాని నేను గాని మృత్యురహితుడైన పుత్రు నీయఁజాలము.
అని దేవేంద్రుఁడు వక్కాణించి ఐరావత గజముపై స్వర్గమునకు వెళ్లగా అమరులందరు నిజనివాసముల జేరినవారైరి.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక ‘ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (41) నలబది యొకలువ అధ్యాయము.
Summary of chapter 41 of the Linga Mahā Purana is as follows:
The narrative details the cosmic birth of Bhagavān Brahmā from the divine lotus arising from the navel of Bhagavān Vishṇu, who Himself rests upon the cosmic serpent Śesha under the supreme command of Parameśvara Śiva. The text highlights how Brahmā's emergence and subsequent realization of his cosmic purpose were entirely guided by the divine voice and grace of Śiva.