లింగ మహా పురాణము
94 - హిరణ్యాక్షుని విష్ణువు వరాహరూపముతో వధించుట వరాహదంష్ట్ర (కోఱ) ను శివుఁడు ధరించి భూమిని స్థిరపఱచుటయు
“అంధకాసురుని తండ్రియగు హిరణ్యాక్షుని వధింప నారాయణుఁడు వరాహముగా నవతరించెను గదా! అట్టి వృత్తాంతమును వివరింపుము!” అని శౌనకాదులు ప్రశ్నింపగా సూతుడు దిగువవిధము వక్కాణించెను.
హిరణ్యకశివుని సోదరుఁడగు హిరణ్యాక్షుడు కాలాంతకుఁబోలిన వాడై దేవతల నోడించి భూమిని బంధించి పాతాళమునకు గొంపోయెను. అంత బ్రహ్మాదులు వెలవెలబోయినవారై హిరణ్యాక్షుని బాధలకు తాళలేక శ్రీహరికి విన్నవింపగా కేశవుఁడు ప్రసన్నుఁడై “మున్ను పరమేశ్వరుఁడు మహా లింగాకృతిఁ జెందిన శివశక్తిని స్మరించి యజ్ఞవరాహమై తన కోరయంచు తోడను హిరణ్యాక్షుని సంహరించి పాతాళము నందలి భూమిని లేవనెత్తి బ్రహ్మాండ మధ్య స్థానమున నెలకొలిపెను.
అందువలన పితామహుఁడు దేవేంద్రాదులతో గూడ సంతోషాతిశయమున కంఠస్వరము తడఁబడుచుండగా శ్రీహరిని ప్రశంసించెను.
శాశ్వతాయ వరాహాయ దంష్ట్రినే దండినే నమః ॥ నారాయణాయ సర్వాయ బ్రహ్మణే పరమాత్మనే ॥
“కోఱలు గల యజ్ఞవరాహము, దుష్ట శిక్షకుఁడు, శాశ్వతుఁడు, సమస్త జగద్రూపుఁడు, బ్రహ్మంబు, నారాయణసమాఖ్యుఁడు నగు పరమాత్మకు నమస్కారము.”
సృష్టిస్థితుల నొనర్చుచు దైత్యులను సంహరించి ఆదితేయులను రక్షించుట ద్వారా లోకకల్యాణమునొనఁగూర్చువాడవు నీవు ఆదిదేవుఁడవు; అనంతనామధేయుఁడవు; యజ్ఞవరాహవిష్ణో! నీ కోఱయంచుతోడనే దైత్యుని దైత్యపరివారమును మడియఁజేసితివి. తథైవ దంష్ట్రాగ్రముతో ధరణి నుద్ధరించితివి; త్రిలోకవాసులగు దేవమానవులు చరాచరమంతయు నిన్ను ఆత్మరక్షణకై ప్రార్థించుచుందురు.
ఇట్లు తనను పంకజాసనుఁడు నుతించినందున శ్రీహరి సంతోషించి – బ్రహ్మాదులకు అనేకవరముల ననుగ్రహించెను.
ఆ పిదప బ్రహ్మాదులు “యజ్ఞవరాహస్వరూపుఁడగు శ్రీహరి నిన్ను రసాతలము నుండి ఉద్ధరించెను. నీవు నిజముగా కామధేనువు వంటి దానవగుటచే నీ మృత్తికను శిరస్సున ధరించి పాపములఁ బోగొట్టుకొందుము.” అని ప్రార్థించినందున భూదేవి ప్రసన్నురాలై “వరాహదంష్ట్రతో భేదింపఁబడిన నా మృత్తికను “ఉద్ధృతాసి వరాహేణ విష్ణునా శతబాహునా “ ఇత్యాది మంత్రము నుచ్చరించుచు ధరించు మానవుఁడు పాపరహితుడై ఆయుష్మంతుడు, బలవంతుడు, ధన్యుడు, పుత్రపౌత్ర సమన్వితుఁడునై జీవితాంతమున స్వర్గముఁ జేరి దివ్య సుఖము ననుభవించును “ అని ప్రవచించెను.
ఇట్లు నారాయణుడు ధరణీ నుద్ధరించి వరాహరూపమును పరిత్యజించి వైకుంఠమునకు వెళ్లగా వరాహదంష్ట్ర యెక్ బరువువలన భూమి కంపించుచుండెను. ఆనంతరము మహేశ్వరుఁడు లోకమునందలి వింతలఁగాంచుటకై సంచరించుచు నచ్చోటున కేతెంచి భూభారమగు వరాదంష్ర్టగైకొని భూషణముగా తన నొసలు లేక వక్షః స్థలమున ధరించెను. అందువలన సురలు మహాదేవుని మహిమను వేనోళ్ల గొనియాడిరి.
ఇత్లు దేవదేవుడు తన లీలావిలాసముగ భూమిని స్థిరపరచెను. ఇంతియే గాక మహా ప్రళయకాలమున బ్రహ్మ విష్ల్వాములు అసువులఁబాసియుండ నవ్వారి శరీరములలోని పవిత్రభాగములను వాత్సల్యమును తాను భరింపకుండినచో హరి బ్రహ్మాది భక్తులకు ముక్తి యెట్లు లభించును ?
అనగా ప్రాణములగోలుపోయిన శతములఁగూడ తాను గ్రహించి యవ్వాని సారమును తనలో నిమిడ్చుకొను పరమేశ్వరుడు - కరుణాంతరంగుడని ఇందు వ్యక్తమైనది.
ఇయ్యది “ శివ విజ్ఞాన వీచిక ‘ యను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (94)వ అధ్యాయము.
Summary of chapter 94 of the Linga Mahā Purana is as follows:
The narrative details Varāhaprādurbhāva, describing how Bhagavān Vishṇu assumed the divine boar incarnation, Varāha, to uplift Mother Earth from the cosmic ocean where she was submerged by demon Hiraṇyāksha. The chapter emphasizes that Vishṇu accomplished this grand cosmic exploit through the inner strength and boons granted by Parameśvara Śiva.