లింగ మహా పురాణము
30 - శ్వేతముని వృత్తాంతము
నందికేశ్వరుఁడు పలికెను.
ఇట్లు బ్రహ్మదేవుఁడు చెప్పగా “దారువన మునులు శ్వేతుని చరితమును తెలుపుడు” అనికోరినందున బ్రహ్మదేవుఁడు చెప్పదొడఁగెను.
బ్రహ్మశ్రీమంతుఁడైన శ్వేతముని ఆయుష్యము లేనివాడై చిరంజీవిత్వము కొరకు గిరిగుహయందు శివలింగమును పూజించుచు రుద్రాధ్యాయముతో మహేశ్వరుని ప్రార్ధించెను.
అంత శ్వేతుని ఆయుష్యము తీరినదని యముడు సమీపింపగా శ్వేతుఁడు త్ర్యంబక మహామంత్రమును జపించుచు “మృత్యువు నన్నేమి చేయ గలదు?” అని లోలోన ధైర్యము గలవాడగుచుండెను.
అట్టితఱి లోకభయంకరుఁడైన యముఁడు గర్వముతో మందస్మితము గలవాడై “శ్వేతా! రమ్ము రమ్ము! ఈ శివారాధనముతో నేమి ఫలము? బ్రహ్మ విష్ణుమహేశ్వరులుగూడ నేను సమీపించినవానిని రక్షింపఁజాలరు. అని వచింపగా - శ్వేతుడు యముని భీషణ వాక్యము నాలకించి భయపడుచు దుఃఖార్తుడై “శంకరా! భక్త రక్షణతత్పరా! అని విలపించి. “నాకు నీతో నేమి ప్రయోజనము? మహా దేవుఁడు నా ప్రభువై ఈ - నేను పూజించు శివలింగమునందుండగా నాకు నీ వలన ఎట్టి భయము కలుగదు. మహాత్ములగు నా వంటి శివ భక్తులకు బ్రహ్మలిఖితము నిరుపయోగమగును“ అని శ్వేతుడు వచింపగా యముడు తీక్ష్ణములైన కోరలతో వెరిపించుచు సింహనాదము జేయుచును పాశముతో శ్వేతుని బంధించియు “శ్వేతా! నిన్ను పాశబద్దు నొనర్చి నాలోకమునకు గొంపోవుచున్నాను. ఇప్పుడు నీ శంకరుఁడేమి చేయును? మహాదేవుఁడెక్కడున్నాడు? నేను ఎక్కడ? నీ శివపూజ ఎక్కడ? రెంటికి సంబంధము లేదు. నేను ఎవరికిని భయపడువాడను కాను. నీ శివ లింగము నధిష్ఠించియున్న మహేశ్వరుఁడు ఏమియు చేయలేని వాడైనాడు. ఇట్టి వానిని నీవు పూజించుట యెందుకు?” అని ఆర్భాటించి శ్వేతుని ప్రాణములను తీయుచుండగా
శ్లో॥ త్వరన్ వినిర్గతః పరః - శివ స్స్వయం త్రిలోచనః ।
త్రియంబకోఽ౦ బయా సమం - సనందినా గణేశ్వరైః ॥
త్రిలోచనుఁడు పరమాత్మయు నగు శివుఁడు త్వరపడుచు అంబతో నందితో ప్రమథగణములతోడ నా శివలింగమునుండి యావిర్భవించెను.
అంతయముఁడు శివుని ఘోర రూపముఁ గాచుట తోడనే భీతిల్లి క్రిందబడియు మరణించెను. రుద్రవీక్షణము వలననే యముడు మరణించి నాడని శ్వేతుఁడు గొప్ప కంఠస్వరమున “శంకరా! మహాదేవా! శరణు శరణు“ అని పలుకుచుండెను.
అట్టితఱి - ఆకాశమునుండి అమరులు పుష్పవర్షమును కురిపించుచు “శంకరా ? యముని బ్రతికించు” మని ప్రార్థింపగా మహేశ్వరుడు తన కటాక్షవీక్షణముతోడనే యముని జీవింపఁజేసెను. నందికేశ్వరుఁడును యమునుజ్జీవింప జేయుమని శివుని వేడుకొనెను. అందువలన పరమేశ్వరుఁడు యమునను గ్రహింపవలసి వచ్చెను. శ్వేతమునిని కరుణించి చిరంజీవి నొనర్చెను.
“ద్విజులారా! అందువలన మీరు త్ర్యంబక మంత్రమును జపించుచు ఏకాగ్ర భక్తితో శివు నర్చించి దుఃఖము లేనివారు కండు!” అని ప్రభోదించుచున్నాను’’ అని బ్రహ్మదేవుఁడు విరమించెను. శైలాది రువాచ - నందికేశ్వరుఁడు వెండియు నిట్లనియెను.
ఇట్లు విధాత ప్రబోధింపగా మునులు “దేవా ప్రసన్నుఁడవై మాయవివేకమును పోగొట్టితివి. ఇంక శివునందు భక్తి దేనిచేత కలుగునో వివరింపుము!
తపస్సు, యజ్ఞము, వ్రతము అను వానిలో నెద్దానితో శివభక్తి గలవారమగుదుము? అని ప్రశ్నించిరి.
అంతపంకజాసనుడు “మునులారా! దానము, తపస్సు, వేదాభ్యాసము, యజ్ఞము, వ్రతము, ప్రాణాయామాదియోగము అనువానిలో దేని వలనను శివభక్తి కలుగదు.
శ్లో॥ ప్రసాదేనైవసా భక్తిః - శివే పరమకారణే।
చరాచర ప్రపంచమునకు మూల కారణమగు శివునందు ఏకాగ్ర భక్తి- శివానుగ్రహము వలననే ద్విజులకు సంభవించును.” అని వచింపగా చారువన మునులందరు శ్రద్ధతో నాకర్ణించి, తమ భార్యాపుత్రులతో కూడ బ్రహ్మదేవునకు ప్రణమిల్లిరి.
అందువలన పశుపతియందు కలుగు భక్తి - ధర్మకామార్థములను సిద్ధింపఁజేయుటేగాక మోక్ష ప్రదంబు నగునని ఈ సందర్భమున విదితమగు చున్నయది.
పూర్వకాలమున దధీచి మహర్షి శివభక్తి ప్రభావమున దేవతలను శ్రీహరి నోడించి క్షుపుని కాలితో తన్నినవాడై వజ్రమయములగు ఎముకలు గల శరీరము గలవాడయ్యెను. మహాదేవు నుపాసించి నేను (నంది) గూడ మృత్యువును జయించితిని. అని నందికేశ్వరుడు విరామసమయమునకై తన ప్రసంగమును చాలించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (30) ముప్పదియైదవ అధ్యాయము.
Summary of chapter 30 of the Linga Mahā Purana is as follows:
The historical account of Sage Śveta is narrated, illustrating the supreme protective grace of Bhagavān Śiva. When Kāla, the deity of death, arrived to claim the life of Sage Śveta who was absorbed in deep worship of the Śiva Liṅga, Mahādeva Himself manifested from the Liṅga, struck down Kāla, and granted eternal immortality and liberation to His beloved devotee.