లింగ మహా పురాణము
11 - సద్యోజాత తచ్ఛిష్య నిరూపణము
శౌనకాది మహర్షులు “బ్రహ్మదేవుఁడు సద్యోజాత స్వరూపుఁడగు మహేశ్వరుని, మహాత్ముఁడగు వామదేవుని పురాణ పురుషోత్తముఁడగు అఘోరుని తత్పురుషుని మరియు ఈశానుని ఎట్లు గాంచెను?” అని ప్రశ్నింపగా సూతమహాముని చెప్పఁదొడఁగెను.
ఇరువది తొమ్మిదవదిగా పరగణింపబడు శ్వేతలోహిత కల్పము నందు విధాత పరమేశ్వరునిఁ బ్రార్థింపగా బ్రహ్మదేవుని ముఖము నుండి శ్వేతలోహితుఁడను కుమారుఁడు ఉదయించెను. ఆతనికి శిఖాయజ్ఞోప వీతములుండుటచే బ్రహ్మచారి యని చెప్పవచ్చును.
అట్టి పురుషుని బ్రహ్మదేవుఁడు చూచి ఆతనిని హృదయములో నిలుపుకొని ధ్యానించుచు నా పురుషుని ధ్యానయోగమును మించినవానిగా గుర్తించి ప్రణమిల్లెను.
అంత సద్యోజాతుఁ డనఁబడు నా పురుషుని పార్శ్వము (ప్రక్క) నుండి శ్వేతవర్ణము (తెలుపువన్నె) గలవారు; సునందుఁడు, నందనుఁడు. విశ్వనందుఁడు, ఉపనందుఁడు నను నామధేయములు గలవారు నగు నలుగురు శిష్యులు జన్మించి సద్యోజాతుని సేవించు చుండిరి.
సద్యోజాతుని ముందు శివుఁడు శ్వేతవర్ణకాంతి గల శ్వేతుఁడను మహామునిగా నావిర్భవించెను. ఆ మునులందరు సద్యోజాతుని శరణ్యునిగా నాశ్రయించి పరాభక్తిచే ప్రార్థించుచుండిరి.
శ్లో॥ తస్మా ద్విశ్వేశ్వరం దేవం-యే ప్రపద్యంతి వై ద్విజాః । తేసర్వే పాపనిర్ముక్తా- విమలా బ్రహ్మవర్చసః ॥
విష్ణులోకమతి క్రమ్య-రుద్రలోకం వ్రజంతి తే ॥
బ్రహ్మదేవుని నుండి ఉద్భవించిన సద్యోజాతుఁడగు విశ్వేశ్వర దేవుని ఆశ్రయించి ఆరాధించు ద్విజులు వైకుంఠమును దాటి మహాకైలాసముఁజేరుదురు.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (11) పదునొకండవ యధ్యాయము.
Summary of chapter 11 of the Linga Mahā Purana is as follows:
The text glorifies Sadyojāta, the first of the five sacred faces of Bhagavān Śiva, associated with the western direction, white complexioned luminescence, and the power of divine creation. Sūta Romaharshaṇa narrates how Sadyojāta manifested during the Sveta Kalpa to enlighten Bhagavān Brahmā, bestowing supreme cosmic knowledge and granting divine grace upon all beings who meditate upon this benign form of Parameśvara.