లింగ మహా పురాణము
35 - దధీచి క్షుపసంవాదాది వృత్తాంతము
సనత్కుమార ఉవాచ -
శ్లో॥ కథం జఘాన రాజానం - క్షుపం పాదేన సువ్రత । దధీచ స్సమరే జిత్వా - దేవదేవం జనార్దనమ్ ॥
సువ్రతా! నందికేశ్వరా! దధీచి మహర్షి - దేవ దేవుడైన శ్రీ హరిని యుద్ధమున నోడించి క్షుపనృపుని కాలితో తన్నిన వృత్తాంతము ఎట్టిదో వివరింపుమనియు, మహాతపస్వియగు దధీచి శివుని వలన వజ్రాస్థిత్వమును, నీవలె మృత్యుంజయత్వమునెట్లు సంపాదించెనని సనత్కుమారుడు ప్రశ్నింపగా నందికేశ్వరుడు చెప్పదొడఁగెను.
బ్రహ్మదేవుని పుత్రుఁడగు క్షుపుఁడు క్షత్రియుఁడుగా నుండ నాతనికి ధధీచి మునితో స్నేహము ఏర్పడి దినదిన ప్రవర్ధమానము కొగా - ఒకనాడు - విప్రుడు శ్రేష్ఠుడా! క్షత్రియుడు గొప్పవాడా? అను వాగ్వాదము సంభవించెను.
“అష్టదిక్ పాలకుల అంశలతో రాజు జన్మించును గాన నేను క్షత్రియుడనై నీచే తిరస్కరింప దగినవాడను గాను” అనియు, “విష్ణ్యంశ సంజాతుఁడ నగుటచే నీవు నన్ను పూజించవలె” ననియు క్షుపుడు వాదింపగా ధధీచి ఆత్మగౌరవకాంక్షతో ఉగ్రుడై తన పాదముతో క్షుపుని తన్నెను. అందువలన అసురులను జయించుటకు దేవేంద్రుడు తనకు నొసగిన వజ్రాయుధముతో క్షుపుడు దధీచిని దండింపగా ఆ దెబ్బకు తాళలేక క్రిందబడుచు దధీచి శుక్రాచార్యుని స్మరించెను.
పూర్వము బ్రహ్మదేవుని క్షుతము (తుమ్ము) నుండి జన్మించిన కుపుడు స్వేచ్ఛచే మానవ క్షత్రియుఁడుగా పరిణమించినవాడు. శుక్రాచార్యుడు యోగశక్తిచే గుప్తముగా నేతెంచి రెండు భాగములైన దధీచి శరీరము నొకచో చేర్చి మృతసంజీవినీ విద్యతో జీవింపజేసి యిట్లు ప్రభోదించెను.
“దధీచిమునీ! బ్రహ్మాది వంద్యుఁడు, దేవదేవుఁడు, నిరంజనుఁడు నగు ఉమాపతి నారాధించి. శివానుగ్రహమువలన అవధ్యుఁడవై మృత్యువును జయించుము! మహేశ్వరుడు నాకీ సంజీవినీ విద్య నుపదేశించినందున నేను మృత్యువును గెలిచితిని. శివభక్తులకు మృత్యు భయముండదు. “మృతసంజీవనము” అను త్ర్యంబక మహామంత్రమును నీకు ఉపదేశించుచున్నాను.” అని శుక్రాచార్యుడు దధీచి కభయము నొసఁగి మృత్యుంజయ మహా మంత్రము నుపదేశించెను.
అదేదనఁగా!
శ్లో॥“త్ర్యంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనం,
ఉర్వారుక మివ బంధనాత్ - మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్”
(మృత్యుంజయ మహామంత్రము)
మంత్రార్థము:
త్ర్యంబకం= ముల్లోకములకు తండ్రి, సూర్యచంద్రాగ్ని జనకుడు, సత్త్వరజ స్తమోగుణముల నధిష్ఠించువాడు, మనో బుద్ధ్యహంకార ప్రచాలకుఁడు, గార్హపత్య ఆహవనీయ దక్షిణాగ్ని స్వరూపుఁడు, బ్రహ్మ విష్ణు రుద్రజఁకుడు, ఋగ్యజుస్సామవేద ప్రణీతయు నగు (ఇట త్రి శబ్దమునకు మూడుఅనియు, అంబక శబ్దమునకు తండ్రి, అధిష్ఠాత, ప్రేరకుడు, స్వరూపము, ప్రణేత - అని యర్థములు నిర్వచింపఁబడినవి)
సుగంధిం అనగా సుగంధము గలవాడు. సుగంధమనగా ప్రాణులందరిలో గుణత్రయమున మూల ప్రకృతియందు ఇంద్రియములలో దేవతలయందు ప్రమథగణములలోను “పుష్పములలో పరిమళము వలె “ సూక్ష్మ రూపముతో నుండుట యగును. పరిమళమును ముక్కుతో గ్రహించు నట్లు శుద్ద మనస్సుతో పరమేశ్వరుని కనుగొనవలెను. అని యిట స్ఫురించుచున్నది.
పుష్టియనగా పురుషుని ప్రకృతి యగును. అట్టి ప్రకృతిని బ్రహ్మదేవునకు విష్ణువునకు మునులకు దేవేంద్రునకు దేవతలకు శరీర వాఙ్మనో బలమును; వర్ధనం= పెంపొందించునట్టి; అమృతాత్ = వినాశములేని దేవుని - యజామహే = పూజన ఉపవాస రుద్రాధ్యాయాది వేదాభ్యాస సమాధి యోగ ధ్యానములతో ఆరాధించుచున్నాము. (యజధాతువు - దేవపూజనమునందు, సంబంధమునందు దానమునందు వర్తించును.)
మహేశ్వరుఁడు ఈ మంత్రము ననుసంధించువానిని – మృత్యోః = యమపాశము నుండి ముక్షీయాత్ = విడిపించు గాక!
ఎట్లనఁగా?
“ఉర్వారుక మివ బంధనాత్”
బంధనాత్ = తొడిమెనుండి; ఉర్వారుకమివ = సూర్యకిరణ స్పర్శచే పక్వంబగు దోసకాయ విడిబడునట్లు; మృత్యోః! జననమరణ జరావ్యాధి సంకులమగు సంసారము నుండి; ముక్షీయ = విడిబడుదును గాక!
“మృత్యోః = సంసారబంధమునుండి; మాం = నన్ను; ముక్షీయ = విడిపించుగాక; మాఽమృతాత్ = అమృతాత్ = మోక్షము నుండి; మాముక్షీయ= విడిపింపకుందునుగాక!“ అనియు చెప్పవచ్చును.
శివ సన్నిధి నీ మంత్రముచే నభిమంత్రిపబడిన ఉదకము (ద్రాగుచు మాత్రము మంత్రమును జపించుచు దీనితో హవనము జేయవలెను. ఇట్లు చేసినచో అపమృత్యుభయము ఎంతమాత్రము సంభవింపదు.
ఇట్టి మహామంత్రమును శుక్రాచార్యుని వలన స్వీకరించి దధీచి శుక్రుడుపదేశించినట్లు ఆచరించియు, అవధ్యత్వమును వజ్రాస్థి త్వమును సంపాదించినవాడై మరల నొకసారి క్షుపన్పపేంద్రుని కాలితో తన్నగా నాతడు ప్రయోగించిన వజ్రాయుధము దధీచియందు కుంఠితమైనందున దధీచియందు శివానుగ్రహము ప్రసరించినదని గుర్తించి ఉపేంద్రరూపముతో ఇంద్రునకనుజుడై యుండు నారాయణు నారాధించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక“ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (35) పంచత్రింశాధ్యాయము.
Summary of chapter 35 of the Linga Mahā Purana is as follows:
The historical narrative recounts the intense conflict between King Kshupa, an ardent devotee of Bhagavān Vishṇu, and the great sage Dadhīca, a devoted worshipper of Bhagavān Śiva. When King Kshupa arrogantly claimed Kshatriya supremacy over Brāhmaṇas, Sage Dadhīca demonstrated the supreme power of spiritual austerities and devotion to Śiva, defeating Kshupa and demonstrating the transcendental superiority of divine wisdom.