లింగ మహా పురాణము
27 - లింగార్చన విధానము
నందికేశ్వర ఉవాచ - నందికేశ్వరుఁడు పలికెను.
స్నానము, భస్మరుద్రాక్షధారణము, సంధ్యావందనము ఐన తరువాత స్వగృహమునందు పూజాస్థానమున బ్రవేశించి ప్రాణాయామత్రయమునొనర్చియు. “ఐదుముఖములు, పది చేతులు, శుద్ధస్ఫటిక వర్ణము, సర్వాభరణధారణము, చిత్రవస్త్రధారణంబు గల వానిగా” పరమేశ్వరుని ధ్యానించి మూల మంత్రమగు శివపంచాక్షరిని తన శరీరముపై న్యసించవలెను.
(అనగా - “ఓం“ “నం” “మం” “శిం” “వాం” “యం” అనువానిని శిఖ - శిరస్సు, ముఖము, హృదయము, నాభి, పాదములు అనువానిపై న్యసింపవలె నని భావము.)
పై ఆరు అక్షరముల తోడనే కరాంగన్యాసము నొనర్చి శ్రీ శివ పంచాక్షరి నిట్లు ధ్యానింపవలెను.
శ్లో॥ ఓంకార వదనా దేవీ - వాయుకార భుజద్వయీ । శికారదేహమధ్యా చ - నమకారపదద్వయీ ॥ శ్లో॥ పంచాక్షరీ పరా విద్యా - సతారా లింగరూపిణీ । శివమంత్రాభిధా శైవీ - మమాంగే సుప్రతిష్ఠితా ॥
ఓంకారము ముఖముగాను, “వా” “య” కారములు రెండుచేతులు గాను, శికారము నడుముగాను. “న” “మః“ అనునవి పాదములుగా నొప్పునట్టి పరావిద్యయగు పంచాక్షరి - ప్రణవముతో కూడినదై శివలింగ స్వరూపంబు గలిగి శివమంత్రము అను పేరుతో శివసంబంధము గలదియునై నా శరీరమునందు నెలకొని యున్నది. ఇట్లు భావించినచో జాపకుఁడు - శివ శరీరము గలవాడగును. (“శికారవదనా“ అను పాఠము అప్రసిద్ధము అనుపాదేయంబు నగును. ద్విజ స్త్రీలకు ప్రణవాధికారము లేదను అపవాదమునకు శృతి స్మృతి శివాగమములలో నవకాశము లేనందున నా వితండవాదము నిరాధారమని తెలియవలెను.)
సూత్రమునండు మణిగణములవలెను, మఱ్ఱి విత్తనమునండు వట వృక్షమువలెను ప్రణవ పంచాక్షరియందు ఛందస్సులు, మంత్రములన్నియు పరబ్రహ్మంబు సూక్ష్మ రూపములతో ఇమిడియున్నవి.
శ్రీగంధోదకమును పూజాస్థానముపై చల్లి పాద్య అర్ఘ్య ఆచమనీయ పాత్రములను ప్రణవముతో శోధించియు వానియందు శుద్ధోద్ధకమును నింపవలెను. ఆ జలమున పచ్చకర్పూరము, వటవేళ్లు మొదలగు సుగంధద్రవ్యముల చూర్ణమును, పుష్పములను చేర్చవలెను. ఓంకారముతో పంచాక్షరితోడను సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రములతోడను పాద్యార్ఘ్యాచమనీయోదకము నభిమంత్రించవలెను. మహాదేవుని ముందు నన్ను (నందికేశ్వరుని) మండుచున్న మంటలతో సమానమైన కాంతి గలవాని గాను, త్రినేత్రునిగాను, అమరాధిపతిగాను. బాలచంద్రకిరీటుని గాను, వానరముఖము బోలిన వదనము గలవానిగాను, నాలుగు చేతులు గలిగి పూల మాలఁ దాల్చియు శాంతుడుగ నుండువాని గాను, సొమ్ముల నన్నిటిని మేన (దాల్చినవాని గాసు ధ్యానించి ఉత్తరమున మరుత్పుత్రిక, సువ్రత, దేవీ పాదముల నలంకరించుటయందు ఆసక్తిగలదియునగు నా భార్యయైన సుయశను ధ్యానించి పూజింప వలెను.
ఆపిదప శివసన్నిధి నుపవిష్టుడై వినాయకుని కుమారస్వామిని పార్వతీదేవిని పూజించి లింగముపై గల పూలు పత్రి మొదలగు నిర్మాల్యమును తీసి - శివలింగమును శుభ్రముగా కడిగియు - పాద్యము నర్ఘ్యము నాచమనీయకమును పంచామృతములను ఫలోదకమును సమర్పించి. “ఓం నిధనపతయే నమః మొదలుకొని “పవిత్రం” వరకు గల మంత్రముల నుచ్చరించుచు శివునభిషేకించి విభూతి చంద నాక్షత పుష్పబిల్వధూప దీపనై వేద్యములను నీరాజన మంత్రపుష్పములను సమర్పించి నమస్కరింపవలెను.
మొదట మలాపకర్షణ స్నానమును పంచోపచారములను సమర్పించి ఆ పిదప మహాపూజనము నొనర్పవలెను.
ఎట్లనఁగా?
మహాభిషేక జలమును వస్త్రములో వడఁబోసి సుగంధముల నంచు చేర్చియు సద్యోజాతాది పంచబ్రహ్మమంత్రములను పవమాన సూక్తములను పురుషసూక్తమును నమక చమకముల (రుద్రాధ్యాయము)ను పఠించుచు సువర్ణ రజత తామ్రముల నేదే నొక దానితో చేయఁ బడిన పాత్రయందలి శుద్ధోదకముఁ దగు ధారలతో శివలింగము నభిషేకింపవలెను. ఇట్ల అభిషేకము నొనర్చినచో జన్మజన్మాంతర పాపములన్నియు నశించును. ఆ పిదప వస్రాపవస్త్రములను ఉపవీత (జందె) మును విభూతిని శ్రీ గంధమును శుభ్రాక్షతలను పుష్పములను బిల్వదళములను ధూప దీపనైవేద్యములను సమర్పింపవలెను. ఓంకారముతో కూడిన శివ పంచాక్షరీ మంత్రము నుచ్చరించుచు శివు నభిషేకింపవచ్చును.
ఇందుకు - శివరహస్యమున దశమాంశమున గల ప్రమాణములు ఇంట నుదాహరింపబడుచున్నవి.
శ్లో॥ వేదేషు శతరుద్రీయం - దేవతాసు మహేశ్వరః । క్షేత్రేషు చావిముక్తంవై - మంత్రే పంచాక్షరో వరః ॥ శ్లో॥ పూజాయా అధికో హోమో – హోమా తర్పణ ముత్తమం। తర్పణాచ్చ జపః శ్రేషో - హ్యభిషేకః పరో జపాత్ ॥ శ్లో॥ ప్రజపచ్చతరుద్రీయ - మభిషేకం సమాచరేత్ । ఏకవారం ద్వివారం వా - త్రివారం చమకాన్వితా ॥ శ్లో॥ ఉపాస్తిః పంచమీ ప్రోక్తా - శంభోః ప్రీతికరీ శుభా । జప్త్వా సమగ్రం నమకం - శతరుద్రీయ ముత్తమమ్ ॥ శ్లో॥ చమకస్యానువాకస్య - బైకమేకం తతో జపేత్ । రుద్రైకాశినీ మేతాం - ప్రజప శంకరోపరి ॥ శ్లో॥ కరోతి యోఽభిషేకం హి - నియమేనైకమండలం । స మహాపాతకై స్త్యక్తో రాజసూయఫలం లభేత్ ॥
వేదములో శతరుద్రీయము; దేవతలలో మహేశ్వరుఁడు; క్షేత్రములలో కాశీ క్షేత్రము; మంత్రములలో పంచాక్షరము శ్రేష్ఠములు. పూజనమున కంటె హోమము శ్రేష్ఠము; హోమమునకన్న తర్పణము మిన్న; తర్పణమున కంటె జపము గొప్పది, జపమునకన్న అభిషేకము శ్రేష్ఠము.
రుద్రాధ్యాయము జదువుచు అభిషేకము నొనర్ప వలెను. చమకముతో కూడిన నమకముతో ఒకసారి, లేక రెండు తడవలు, లేక మూడు పర్యాయములు శివునభిషేకించుట శివ ప్రీతికరమైనది. పూజా హోమ తర్పణ జప అభిషేకములలో ఐదవదగు అభిషేకముతో శివునుపాసించుట అన్నిటిలో గొప్పదగును. అభిషే మెట్లనగా?
నమకమును పూర్తిగా ఒక పర్యాయము చదివిన తరువాత చమకానువాకము నొక్కొకటిగా నుచ్చరించుచు ప్రతిదినము పదునొకండు (11) పర్యాయములు నలుబది రోజులు (మండలము) బ్రహ్మచర్యాది నియమముల నవలంబించి శివలింగము నభిషేకించువాడు మహా పాపములఁ బోగొట్టుకొనుటయే గాక రాజసూయయాగఫలము నొందువాడగును.
నైవేద్యము తరువాత పరిమళము గల ఉదకము నాచమనీయముగా సమర్పించి కిరీటము, ఛత్రము మొదలగు ఆభరణములను తాంబూలమును ప్రణవ పంచాక్షరి సుచ్చరించుచు సమర్పింపవలెను.
స్పటికవర్ణముగల మహాదేవుఁడు మరియు నిష్కళుఁడు, అక్షరుఁడు, అమరులందరి నుద్భవింపఁజేసినవాడు, చతుర్దశ భువనవ్యాపి, బ్రహ్మేంద్రవిష్ణు రుద్రాదులకు ఋషులకు దేవతలకును గోచరింపనివాడు, వేదవేదాంతవేత్తలకును ప్రత్యక్షము కానివాడు, ఆదిమధ్యాంత రహితుఁడు, భవరోగవైద్యుఁడు నగు పరశివుఁడు శాశ్వతముగా శివ లింగమునందు నివసించుచున్నాడని భావింపవలెను.
తరువాత శివస్తోత్రములను పఠించి నమస్కారము నొనర్చియు ప్రదక్షిణము cజేయవలెను. మరల అర్ఘ్యము నొసగి శివ లింగమునకు పాదములున్నట్లుగా భావించి శివచరణములపై మంత్ర పుష్పములను సమర్పించియు మరల సాష్టాంగ ప్రణామము నాచరించియు పూజితశివలింగమును భావముతో తన హృదయమునందు నెలకొలుపుకొనవలెను. ఇట్లు బాహ్య లింగార్చనమును సంగ్రహించి చెప్పితిని. ఇంక ఆభ్యంతర లింగార్చనమును వక్కాణింతునని నందికేశ్వరుడు విరమించెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (27) ఇరువది యేడవ అధ్యాయము.
Summary of chapter 27 of the Linga Mahā Purana is as follows:
This chapter outlines the formal procedure for external Liṅgārcana, detailing the offering of bilva leaves, fragrant flowers, incense, light lamps, and pure food offerings to the Śiva Liṅga. Sūta Romaharshaṇa emphasizes that worship performed with unwavering faith, mental purity, and proper Vedic or Agamic mantras attracts the immediate grace of Prabhu Śiva and bestows all earthly and spiritual blessings.