లింగ మహా పురాణము
42 - శివుడు శిలాదుని తపస్సునకు ప్రసన్నుడై అయోని సంభవుడైన కుమారుని ప్రసాదించుట
సూత ఉవాచ - సూతుఁడు చెప్పఁదొడఁగెను.
దేవేంద్రుఁడు వెళ్లిన తరువాత శిలాదుడు శంకరుని గూర్చి చేసిన దుశ్చరమైన తపస్సునకు వేయి దేవతావత్సరములు గడచెను. అట్టితఱి శిలాదుని శరీరము చుట్టు పుట్టి పెరుగుటచే పురుగులు మాంసమును భక్షించి నెత్తురు త్రాగి నందున ఎముకలు మాత్రము గలదై గోడవలె నిలచియుండగా శంకరుఁడు కరుణతో సాక్షాత్కరించి శిలాదుని శరీరమును తన దివ్యహస్తముతో తాకెను. అంతమాత్రమున - శిలాదుని ఒడలు మాంస రక్తపూరితమై పూర్వ స్థితిని పొందగా శివుఁడు - ఉమాదేవి గణములును సన్నిధి నుండగా “శిలాదా! తపస్సు చాలించుము! సర్వశాస్త్ర పారగుడు సర్వజ్ఞుండునగు కుమారు నొసఁగెదు“ నని వచించెను.
అంత శిలాదుఁడు మరల నమస్కరించి ప్రార్థించియు తడబడిన కంఠస్వరముతో “దేవదేవా! యోనిసంభవుడు కానట్టి మృత్యువు లేనట్టి కుమారుని ప్రసాదించుము ! “ అని యాచింపగా మహేశ్వరుఁడు పూర్వము బ్రహ్మదేవుడు దేవతలును నన్నారాధించి ఒకానొక మహాపురుషునిగా అవతరింపుము!” అని కోరినందున నీకు కుమారుడనగుదును.
అట్టితటి జగత్పితనగు నాకు నీవు జనకుడ వగుదువు! “అని వక్కాణించి యంతర్థానముఁజెందెను.
ఆపిమ్మట శిలాదుడు మహేశ్వరు నుద్దేశించి యజ్ఞమును తల పెట్టగా యజ్ఞమునకు వలయు భూ ప్రదేశమునుండి నేను ఆవిర్భవించితిని. అప్పుడు నేను ప్రళయాగ్నిఁ బోలిన తేజస్సు గలిగియుంటిని. ఆ సమయమున పుష్కలావరకాది మేఘములు మధురజలమును వర్షించినవి. ఖేచరులగు కిన్నరులు సిద్ధులు సాధ్యులును సంగీతముల నాలపించిరి. మరియు దివ్యమందార పుష్పములను కురిపించిరి. ఇదంతయు దేవేంద్రుని శాసనము వలన జరిగినది. నేనప్పుడు - మధ్యాహ్న సూర్యకాంతి గలవాడనై జడలను కిరీటమును ధరించి మూడు కన్నులతో నాలుగు చేతులతో శూలమును టంకమును గదను వజ్రమును ధరించియు బాలుడనై యుంటిని. నాకు పజ్రములవలె తీక్ష్ణములైన కోఱలుండెను. దేవేంద్రుడు నన్ను నుతించుచుండెను. నా చెవులకు వజ్రఘటితములగు కుండలములుండెను. నా కంఠస్వరము మేఘగర్జితముఁ బోలియుండెను. బ్రహ్మాది దేవతలు నన్ను చూచి స్తోత్రములఁ జేయుచుండిరి. మునీశ్వరులు వేద వచస్సులఁ బలుకుచుండిరి. అప్సరసలు నాట్యము జేయుచుండిరి. శివ మంత్రములతో దేవర్షులు నుతించుచుండిరి. సంతోషాతిశయమున నాకు నమస్కరించిరి.
బ్రహ్మదేవుఁడు, శ్రీహరి, రుద్రుఁడు, దేవేంద్రుఁడు, ఉమాదేవి, బృహస్పతి, చంద్రుఁడు, సూర్యుఁడు, వాయువు, అగ్నియు, ఈశానుడు, నిఋతి, కుబేరుఁడు, యముఁడు, వరుణుఁడును, విశ్వేదేవతలు, ఏకాదశరుద్రులు, అష్ట వసువులు, లక్ష్మీదేవి, శచీదేవి, జ్యేష్ఠాదేవి, సరస్వతీ దేవి, అదితి, దితి, శ్రద్ధ, లజ్జ, ధృతి, యనఁబఱగు గోమాతలు, వృషేంద్రుఁడు, ధర్మదేవతయు ప్రత్యేకించి నన్ను చుట్టుముట్టి కౌగలించుకొనియు నుతించిరి.
నా తండ్రియగు శిలాదుఁడు నా దివ్యరూపము నవలోకించి ప్రేమతో నమస్కరించి నన్ను భగవానుఁడా! దేవదేవేశ్వరా! త్రిలోచనా! అవ్యయా! నీవు నాకు కుమారుడవైతివి. జగత్తును దుఃఖమునుండి కాపాడువాడవు ! జగత్పితవై కూడ నన్ను తండ్రిగా పొందితివి. జగత్కారణా! అయోనిసంభవా! నీకు పునః పునః ప్రణమిల్లుచున్నాను. వత్సా! నన్ను రక్షించుము! నీవు జన్మింపగానే నన్ను ఆనందింపజేసితివి గాన “నంది” అను పేరు గలవాడవు కమ్ము ! నీవు నాకు పుత్రుఁడవైనందున నా తలిదండ్రులు, పితామహాదులును కైలాసముఁజే రఁగలిగిరి. మరియు నా జన్మసార్థకమైనది. నీవు నా కుమారుడవని తలచి సేనాడిన మాటలలో గల దోషమును పరిహరింపుము ! ఇట్లు నందీశ్వరునితో సంభాషించి శిలాదుఁడుమునీశ్వరులతో మునులారా! నా భాగ్యమును గమనింపుడు ! పరమేశ్వరుఁడు నాయజ్ఞాంగణమున నావిర్భవించినందున నాతో సమానుఁడైన పురుషుఁడు - దేవుఁడు గాని, దానవుఁడు గాని, లోకము నలేడని భావించుచున్నాను” అని సంభాషించెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక ‘ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (42) నలబది రెండవ అధ్యాయము.
Summary of chapter 42 of the Linga Mahā Purana is as follows:
The historical account of the divine birth of Nandīśvara is narrated, describing how the holy sage Śilāda performed severe penance to obtain an immortal, divine son. Pleased with Śilāda's devotion, Bhagavān Śiva Himself manifested as Nandi, emerging from the sacrificial fire to become the beloved son of Śilāda and the supreme chief of Śiva's divine attendants.