లింగ మహా పురాణము
39 - యుగధర్మములను వృత్తములను వేదవ్యాసుని పురాణ క్రమమును నిరూపించుట
పూర్వోక్తమును నందికేశ్వరుఁడు చెప్పగా శిలాదుఁడు విని “యుగధర్మము లెట్టివో వివరింపు” మని ప్రశ్నించెను.
దేవేంద్రుఁడు శిలాదుని ప్రశ్నకు సమాధానమును దిగువవిధము వక్కాణించెను.
కృతాది యుగములలో నొక్కొక పాదము ధర్మము తగ్గుచుండును. కృతయుగమున ధర్మము నాలుగు పాదములుండును. త్రేతాయుగమున మూడు పాదములు, ద్వాపర యుగమున రెండు పాదములు, కలియుగమున నొకపాదము ధర్మము ప్రవర్తించుచుండును.
కృతయుగమున స్త్రీ పురుషులు మధురాది రసముల నాస్వాదించుట చేతనే జన్మించుచుందురు. ప్రజలందరు సంతృప్తులై ఆనందము ననుభవించుచుందురు. అందరికి ఆయుష్యము సుఖము రూపంబు సమానములై యుండును. రాగ ద్వేషములు ఆయాసము నుండవు. ప్రజలు పర్వతములపై నివసించుచు దుఃఖము లేనివారై సత్త్వగుణ ప్రధానులై ఏకాంత ప్రియులై నిష్కామకర్మ నాచరించువారునై నిత్యము సంతుష్టచిత్తులునై పుణ్యపాప రహితులునై యుందురు. వర్ణాశ్రమ సంకరముండదు.
త్రేతాయుగమున రసోల్లాసము నశించును. మేఘముల వలననే ఉదకము లభించును. వర్షమువలన భూమిపై నుదయించు వృక్షముల క్రింద ప్రజలు నివసింతురు. సర్వ విధ వృత్తులను ప్రజలవలంబింతురు. వృక్షముల వలన లభించు పూదేనె నాస్వాదింతురు. అట్టి పూదేనె చాలనందున ఈగల వలన కలుగు తేనెను త్రాగుచు, రాగద్వేషములకు లోనై తపస్సు నాచరించుచు కష్టపడుచుందురు. వృక్షములు కాల క్రమమున తగ్గుటచే కొండపై గృహములను కట్టుకొందురు.
మాక్షిక మైన మధువు (తేనె) గూడ చాలనందున ఆకలి దప్పులచే బాధపడుచుందురు. వర్షజలము వలన చిన్న చిన్న నదులు ఏర్పడును. ఉదకములు భూమి నంటుట వలన ఓషధులు సంభవించును. స్వల్ప కృషి తోడనే సస్యములు ఫలించుచుండును. ఓషధులు ధాన్యములు లేనిది ప్రజల జీవనము కొనసాగదు. పురుషుల సవ్వారి కళత్ర పుత్రాదులను రక్షించుటకై బ్రహ్మదేవుఁడు - క్షత్రియులను పుట్టించును. యజ్ఞములను క్షత్రియలు బ్రాహ్మణులచే చేయించుచుందురు.
ద్వాపరయుగమున - మానవులకు బుద్ధి భేదములు కలుగుటే గాక - శరీర పరిశ్రమ అధికమగును. లోభము ఎక్కువగుటచే కర్మచారులకు నెలసరి జీతములేర్పడును. వేదములను వ్యాసుడు విభజించును. ఋషికుమారులు వేదవ్యాఖ్యల ననేకవిధములుగా ప్రతిపాదింతురు. బ్రాహ్మణమనియు కల్పసూత్రములనియు పూర్వోత్తర మీమాంసలనియు, మంత్రములనియు వేదాది వాఙ్మయముఁదగు విభాగమేర్పడును.
ఇతిహాస పురాణములును వేరు వేరగును. బ్రాహ్మము - పాద్మము - వైష్ణవము -శైవము - భాగవతము - భవిష్యము - నారదీయము - మార్కండేయము - ఆగ్నేయము - బ్రహ్మవైవర్తము - లైంగము వారాహము - వామనము - కూర్మము-మాత్స్యము - గారుడము - స్కాందము - బ్రహ్మండము నను పదునెనిమిది మహాపురాణములుగా విభజింపబడును. వర్షము లేనిచో ప్రజలు మరణింతురు. వ్యాధులు మొదలగు ఉపద్రవముల వలన నిర్వేదము - నిర్వేదము వలన కలుగు దుఃఖమును నివారింపఁదలపెట్టుటు; దుఃఖము బొత్తుగా తొలగ నందున వైరాగ్యము; వైరాగ్యమువలన సంసారమున దోషము గలదని గుర్తించుటచే జ్ఞానయోగము నవలంబించుటయు సంభవించును.
ఇయ్యది “ శివ విజ్ఞాన వీచిక’’ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (39) ముప్పది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 39 of the Linga Mahā Purana is as follows:
Sūta Romaharshaṇa describes the gradual decline of virtue, longevity, and spiritual strength across the four Yugas—Kṛta, Tretā, Dvāpara, and Kali. The chapter details the specific spiritual practices suited for each age, emphasizing that while intense penance and yoga were practiced in Kṛta Yuga, simple devotion, chanting of Śiva's holy names, and righteous conduct are the supreme means of salvation in Kali Yuga.