లింగ మహా పురాణము
29 - దారువనమున - మునులను శివుడు పరీక్షించుట
సనత్కుమారుడు ప్రశ్నింపగా నందికేశ్వరుడు శివుని స్మరించి చిరునగవుతో చెప్పఁదొడఁగెను.
దారువనమున మునులు భార్యాపుత్ర సమన్వితులై అగ్ని నుపాసించుచు ఘోర తపస్సు చేయుచుండగా వారిని పరీక్షించుటకై పరమేశ్వరుడు మనోహర రూపముతో దారువనమునకు వెళ్లెను. అట్టితఱి ఆ దివ్యలావణ్యరూప సుందరుని ముని పత్నులు పతివ్రతలైనను చూచి మోహము గలవార గుచుండిరి. స్త్రీలకు శృంగార మన్మథవేదనను కలిగించు మందస్మితము గలవాడై కనుబొమల ద్రిప్పుచు పాటలు పాడుచున్న పరమేశ్వరుని సమీపించి - మన్మథవికారముగలవారునై ఆతనిని వెంటాడుచుండిరి. మరియు పర్ణశాలలనుండి బయలుదేరి వస్త్రములు ఆభరణములు జారుచుండగా తెలివిలేని వారగుచుండిరి. కోందరు మునిపత్నులు, భవు నవలోకించుచు యౌవన మదముతో నేత్రములను త్రిప్పుచు భ్రూవిలాసముఁజేయుచుండిరి. మరికొందరు కొద్దిగా నవ్వుచు చీరలు మొలత్రాడుల వరుసలును జారుచుండగా సంగీతముల నాలపించుచుండిరి. ఇంక కొందరు పూర్తిగా దిసమొల గలవారివలె నటించుచు తమ తమ కంకణములను మ్రోగించుచు మదవతులై బంధువులను గుర్తింపకుండిరి. ఒకర్తు - ఆ సుందర మనోహరాకారునిఁ గాంచి వస్త్రములు లేని తన ఒడలును గమనింపకుండెను. మరికొందరు వృక్షములపైని మంద మధుర వాయువు నాఫ్రాణించుచు వివశలగు చుండిరి. ఇంక కొందరు నాట్యము చేయుచు నేలఁబడుచుండిరి. ఏనుగలవలె నొకచో స్తంభించుచుండిరి. ఒకరినొకరు చిరునగవుతో గాంచుచు తమలో తమవారిని కౌగలించుకొనుచుండిరి. పరమేశ్వరుని త్రోవకు అడ్డముగా నిలువబడి కామ వికారముల జూపెట్టుచుండిరి.
“నీవెవరు? నిలువుము! ఎక్కడి నుండి ఏతెంచితివి? మమ్ము అనుగ్రహింపుము! “ అని అనురాగముతో మునిపత్నులు పలుకుచుండగా -
అవ్వారిని గాంచుచు వారి మాటల నాలకించియు భవుడు ఏమియు బదులు చెప్పకుండెను. అట్టితఱి మునులు క్రుద్ధులై తమ తపశ్శక్తుల నుపయోగించుచు కఠినముగా దూషించుచుండ నవ్వారి తపశ్శక్తులన్నియు. “సూర్యుని ముందు నక్షత్రములవలే” పరమేశ్వరునందు వ్యర్థములయ్యెను.
ఋషి శాపము పరమేశ్వరుని యందు తప్ప నితరులందరి యందు నుపయుక్తమగునది ఎట్లనఁగా?
దక్షయజ్ఞము దధీచి శాపమువలన భగ్నమైనది. భృగుమహర్షి గారి శాపము విష్ణుమూర్తికి దశావతారములనఁబడు పది జన్మలయందు గర్భవాస పత్నీవియోగాది దుఃఖముల ననుభవింపజేసినది.
గౌతమ మహాముని క్రుద్ధుడై దేవేంద్రుని పురుష చిహ్నమును వృషణములతో సహ పడగొట్టెను. శ్రీహరి నివాసమగు క్షీరసముద్రమును మరియు అమృత సముద్రమును మునులు శపించి త్రాగరాని వానిగా చేసినందున నారాయణుఁడు కాశీక్షేత్రమున విశ్వవాథుని అమృత తుల్యంబగు గోక్షీరముతోడ నభిషేకించి శివానుగ్రహముఁబడసినవాడై క్షీర సముద్రమును త్రాగ దగినదిగా నొనర్చుకొనెను. అప్పుడు రుద్రాభిషేకజలము అమృతమై సుధా సముద్రమును నింపెను. మాండవ్యుఁడు ధర్మదేవతను కృతయుగాది క్రమముగా క్షీణించుమని శపించెను. మహాత్ముఁడగు దూర్వాసుఁడు యాదవులను ”మీరందరు ద్వాపరాంతమున అన్యోన్యము కలహించుకొని మరణింతురు” అని శపించెను. భృగుమహర్షి విష్ణుమూర్తి యొక్క వక్ష్మస్థలమును కోపముతో తన్నినందున నచ్చోట నివసించు లక్ష్మీదేవి పృథక్ నివాసము నేర్పరచుకొనెను. అష్టవసువులను మునులు శపించి మానవులుగా జన్మింపజేసిరి.
శ్లో॥ ఏతే చాన్యే చ బహవో - విప్రాణాం వశ మాగాతాః । వర్జయిత్వా విరూపాక్షం - దేవదేవ ముమాపతిమ్ ॥
వీరు ఇతరులనేకులున్ను బ్రహ్మర్షుల శాపములకు గురియైనవారు. విరూపాక్షుఁడు ఉమాపతియునగు మహాదేవుఁడు మాత్రము మునిశాప పాత్రుడు కానట్టివాడని దారువన వృత్తాంతము ఋజువు చేయుచున్నది.
ఇవ్విధము దారువనమునులు శివమాయామోహితులై తమ చెంతకు నేతెంచిన దిగంబరుని సామాన్యునిగా తలచి పరుష వచనములఁ బలుకగా శంకరుఁడు అంతర్ధానము జెందెను. దారువన మునులు ఏమియు తోచక సత్యలోకమున కమలాసనముపై విరాజిల్లు బ్రహ్మదేవు నాశ్రయించి వినమ్రులై తమ గోడునంతయు విన్నవించుకొనిరి.
అంత బ్రహ్మదేవుఁడు లేచి దోసిలొగ్గినవాడై భవునకు నమస్కరించి ఇల్లు చెప్పఁ దొడఁగెను.
ఇహపర శ్రేయోనిధియగు పరమేశ్వరుని గుర్తింపని మీరు - వ్యర్థజన్ములైతిరి. దారువనమున మీకు కనుపడిన మహాపురుషుడు సదాశివుడని తెలియకుంటిరి.
గృహస్థులు తమ ఇంటికి వచ్చిన అతిథి విరూపుఁడైనను, సుందరుండైనను, మలినుఁడైనను, పండితుడు కాకున్నను వాని నవమానింపక సత్కరింపవలెను. ఇట్టి అతిథిధర్మమును మీరు విడనాడితిరి.
“పూర్వము సుదర్శనుఁడనుముని - అతిథి సత్కారముతో మృత్యువును గూడ జయించెను. ఎల్లనగా? అతిథి కోరిన దంతయు నొసఁగెదనని - ప్రతిజ్ఞ (జేసినవాడై “సాధ్వీ! అతిథులను నీవు అవమానింపరాదు. అతిథిమహేశ్వరుఁడే నని భావించి. అతిథికి నీ దేహమును గూడ సమర్పించి సంతోషింపఁజేయు” మని భార్య నాదేశింపగా నా పతివ్రత. “అయ్యా! నీవు చెప్పున దేమియు సమంజసము కాదని విలపించుచు దుఃఖించెను. అంత సుదర్శనుఁడు శివుఁడే అతిథి యని చెప్పితిని గాన నాతనికి శివ ప్రీత్యర్థమై సర్వంబు నొసఁగవలసినదేను “ అని శాసించెను.
అంత నాతరుణి - భర్తకు ఎదురు చెప్పఁ జాలక పతియాజ్ఞను శిరసావహించియుండగా ధర్మదేవత బ్రాహ్మణరూపముననే తెంచి సర్వవిధ ఉపచారములచే సత్కరింపఁబడి “నీ భర్త యెక్కడికో వెళ్లినట్లున్నది. ఇక నీవు నాకు ఉపభోగ్యవు కావలె’’ ననికోరగా పతిశాసనమును స్మరించి సిగ్గుపడుచు తన దేహమును సమర్పించి సురతమున కియ్యకొని” నేను భర్ర్తాజ్ఞ ననుసరించి నీకు వశురాల నగుచున్నా’’ నని నివేదించునంతలో సుదర్శనుడు గృహ ద్వారము చెంత కఱుదెంచెను. అంతమహాముని “రమ్ము రమ్ము ఎటకేగితివి? అని ఆమెను దరి జేర్చుకొని “సుదర్శనా! ఇప్పుడేమి చేయవలెనో చెప్పు” మనియు సురతము ననుభవించెద ననియు పలుకగా సుదర్శనుఁడు “ఈమెను యథేష్ట మనుభవింపుము! నేను పోయెద” నని ప్రవచించెను.
అంత నా ధర్మదేవత సంతోషించినదై నిజరూపమును చూపెట్టి సుదర్శనుఁడు కోరినదంతయు లభించునని వరము నొసగి వెండియు నిల్లు వచించెను.
సుదర్శనా? “ఈ నీ భార్యను నేను మనుస్సులో గూడ నపేక్షింపక – నీమెనను భవింపలేదు. మీ అతిథి ధర్మశ్రద్ధను పరీక్షింప నేతెంచితిని. అతిధి మర్యాద యను ధర్మముతోడనే నీవు మృత్యువుఁ గూడ జయింపఁ గలుగుదువు! ఆహా మీ గృహస్థధర్మము సదా చారంబు నమోఘములు” అని ఆశ్చర్యపడుచు ధర్మదేవత నిర్గమించెను. “అందువలన నో దారువన ముసులారా! మీరు అతిథిధర్మము నుల్లంఘించినందున నీ దుర్దశ గలవారై మీ తపశ్శక్తిని పోగొట్టుకుంటిరి. గాన నా శంకరునే శరణు. బొందుడు!” అని పంకజాసనుఁడు ప్రబోధింపగా నా మునులు “ప్రభో! నీకు నమస్కారము. మా భార్యలు కామవికారము గలవారైరి. రుద్రుననేక విధముల శపించి తూలనాడితిమి. మా శాపములు ఆ పరమేశ్వరునందు వ్యర్థములైనవి. జీవితముపై మాకిక ఆశ లేకుండైనది. కర్మఫలత్యాగము (జేసి మహాదేవుని దర్శించుటకు నుపాయము నెఱిగింపుము!” అని ప్రార్థించిరి.
అంత ప్రజాపతి “మునులారా! బాగుగా వినుడు! బ్రాహ్మణుఁడు - ఉపనీతుడై మొదలు వేదములను వేదాంగముల నాచార్యునొద్ద వేదార్థరూపములగు ధర్మములు తెలియువరకు - లేక - పండ్రెండ్రు వత్సరముల భ్యసించి స్నాతకుఁడై వివాహము నొనర్చుకొని పుత్రుల బడసియు కుమారులందరికి తన స్థిర చరాస్తిని సమముగా పంచి యిచ్చినవాడై - అగిప్టోమాది యజ్ఞములతో యజేశ్వరుఁడగు సదాశివు నారాధించి పండ్రెండ్రు వత్సరములు గాని, ఒక సంవత్సరము గాని, ద్వాదశ పక్షములు (ఆరు నెలలు) గాని, పండ్రెండ్రు దినములుగాని పాలు మాత్రము స్వీకరించుచు హరి బ్రహ్మాద్యమరుల నందరి నర్చించియు కుమారుల కొసగినది గాక తనకై పదిలపరచుకొనిన ధనము సంతయు సద్రాహ్మణులకు సమర్పించి - వైరాగ్యము గలవాడై గురువునొద్ద సన్యసింపవలెను.
అచెట్లనగా? శిఖతో కూడ వెంట్రుకలు తీయించుకొని జందెమును విడనాడియు “భూః స్వాహా”, ఇత్యాది పంచసూక్తములతో ఉదకములయందు హోమము నొనర్చి యతియై పుణ్య క్షేత్రముల యందు సంచరించుచుండవలెను. ఇట్లు జీవించుచుండగా మరణము రానిచో మహా ప్రస్థానము సనగా ఉత్తర దిశకు నుపవాసముతో ప్రయాణింపవలెను. ఇట్లు చేసినచో మరణము అనాయాసముగా లభించుటయే గాక శివ సాయుజ్యంబు చేకూరును.
శివుని యందు భక్తి గలవారు మాత్రము మహా ప్రస్థానము, ఉపవాసము మొదలగు కష్టములు లేనివారై ఈ శరీరమును విడువగానే ముక్తులగుదురు. శివభక్తులకు సన్న్యాసము, వ్రతములు, యజ్ఞములు, దానములు, వేదములు, శాస్త్రములు నవసరము లేదు. పూర్వకాలము శ్వేతుడను మహాముని శివు నారాధించి మృత్యువును జయించెను. అందువలన మీరు శివభక్తులై తరించుడని బోధించుచున్నాను.” అని పలికెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (29) ఇరువది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 29 of the Linga Mahā Purana is as follows:
The narrative presents the powerful spiritual science of Mṛtyuñjaya, detailing how devotion to Bhagavān Śiva grants victory over untimely death, physical ailments, and the ultimate fear of mortality. Devotees who meditate upon Mahādeva with the Mṛtyuñjaya mantra are protected by divine grace, attaining long life, physical vigor, and ultimate liberation from the cycle of rebirth.