లింగ మహా పురాణము
64 - రాక్షసభక్షితుడైన శక్తిని గురించి వసిష్ఠుని దుఃఖము
“రాక్షసుడు వసిష్ఠపుత్రుల నెందుకు భక్షించెనో తద్వృత్తాంతమును వివరింపుమని” శానకాచులు ప్రశ్నింపగా సూతుడు దిగువవిధము వక్కాణించెను.
“రుధిరుడు” అను రక్షస్సు - విశ్వామిత్ర మహర్షి యొక్క శాపము వలన శక్తిని, ఆతని సోదరులను భక్షించెను. కల్మాషపాదుడను రాజు వసిష్టుని యాజ్ఞికత్వమున క్రతువు నొనర్చుచుండగా విశ్వామిత్రుడు ప్రేరేపించి నందున రుధిరుడు వసిష్ఠ పుత్రులను తిన వలసి వచ్చెను.
అట్టితఱి వసిష్ఠుఁడు “హా పుత్రా! పుత్రా! అని ఏడ్చుచు ఆరుంధతితో గూడ నేల గూలుచు “నావంశము నశించినది” అని పరితపించి -- మరణింప నుద్యుక్తుఁడు కాగా - శక్తి భార్యయగు అదృశ్యంతి యను నామె - అత్తమామల నోదార్చుచు - పూజ్యుడా! నా కడుపులో గల శక్తి కుమారుని - అనఁగా నీ మనుమని చూచుటకై నీ శరీరప్రాణములను కాపాడు కొనుము!“ అని ప్రాధేయుపడినందున “నాకోడలు పతివియోగ దుఃఖతయైనను మమ్మూరూర డించుచున్నదని” వసిష్ఠుఁడు మూర్ఛనుండి సేదఁదీరి ఆరుంధతిని కౌగలించుకొనియు సంతోషించెను. పతివియోగముచే కన్నీళ్లు కార్చుచున్న కోడలును అరుంధతి - చేరదీసియోదార్చెను.
విష్ణుదేవుని నాభి కమలమునందు బ్రహ్మదేవుని వలె - జనని యొక్క గర్భశయ్యయందు ఆసీనుడైన కుమారుడు ఒకానొకవేదవాక్యము నుచ్చరింపగా భగవాను డగు వషిష్ఠుడు విని ఈ వాక్యము నెపరు పలికిరి లని తర్కించినవాడై మనః ప్రసన్నత గలవాడయ్యెను.
అంత శ్రీ నారాయణుఁడు ఆకాశవీధి నుండి “వత్సా! వసిష్ఠా! ఇంతకు ముందు నీవు వినిన రుక్కు నీ మనుమని ముఖకమలము నుండి వెలు వడినది. నీ పుత్రుడగు శక్తి యొక్క కుమారుడు. అదృశ్యంతి యొక్క గర్భము నుండి ప్రసవించి వర్ధిల్లినవాడైనాతో సమానుడు కాగలడు“ అని వచింపగా వసిష్ఠుడు వారిజేక్షణు (విష్ణువు)నకు ప్రణమిల్లి కోడలి కడుపును దయతో నిమిరిచూచెను. మరియు శ్రీహరి -
శ్లో॥ రుద్ర భక్తశ్చ గర్భస్థ - రుద్రుపూజా పరాయణః । రుద్రదేవ ప్రభావేన - కులం తే సంతరిష్యతి ॥
“వసిష్ఠా! స్నుషా గర్భస్థుడైన నీ పౌత్రుఁడు శివునందు భక్తి గలవాడై మహాదేవు నర్చించును గాన పరమేశ్వరుని మహిమ జూఱగొని నీ వంశమును తరింపజేయు“ నని వక్కాణించి యంతర్ధానముఁజెందెను.
వసిష్ఠుని స్నుష (కోడలు) యగు అదృశ్యంతీదేవి -- విష్ణు వాక్యము ననుసరించి వసిష్ఠమహర్షిగారి మనస్స సమాధానమునకై తన గర్భమును కాపాడుకొనుచు పదియవనెలలో “వసిషుఁడు అరుంధతియందు శక్తిని వలె, అదితీ దేవి విష్ణువును వలె, స్వాహాదేవి కుమార స్వామిని వలె, అరణి - అగ్నిని వలె, పరాశరుని కనెను.
ఐనను అదృశ్యంతి భర్తృ వియోగమును భరింపఁ జాలనిదై -
శ్లో॥ పితా మాతా చపుత్రాశ్చ - పౌత్రాః శ్వశుర ఏవచ । ఏతే న బాంధవాః స్త్రీణాం- భర్తా బంధుః పరా గతిః ॥
లకు తలిదండ్రులుగాని, కుమారులుగాని, మనుమలుగాని అత్తమామలు గాని, నిజముగా బంధువులు కారు, భర్త యొకడే బంధువు ఉత్తమగతియునగు” నని విలపించి యెట్టకేలకు కుమారుని పెంచుటకై జీవింపఁ గలిగినది. పరాశరుఁడు జన్మింపగానే పరాశరుని తండ్రియగు శక్తి పితృలోకమున దివ్యదేహధారియై తన సోదరులతో సహ పితృగణములలో చేరినవాడై సుఖముగా నుండెను. మరియు ప్రపితామహాదులు “మా వంశము భువి నంకురించిన దని” సంతోషించిరి. పుష్కరాది మేఘములు భూమిపై దివ్య మందార పుష్పములను కురిపించెను. రాక్షస నగరములలో భయంకరమగు నాదము వినఁబడుచుండెను.
అట్టితఱి అదృశ్యంతి మహాతేజస్వి యగు పరాశరు నవలోకించుచు ఒక వంక సంతోషించెను. మరొకవంక కన్నీరు కార్చుచు తన భర్త యగు శక్తిని గూర్చి “హే వసిష్ఠతనయా! శక్తే! “మహేశ్వరుఁడు సంతుష్టాంతరంగుఁడై కుమారస్వామిని చూచినట్లు“ నీ వేతెంచి ఈ నీ కుమారు నవలోకింపుము! నన్ను విడిచి వెళ్లినా వెందుకు? “అని పలువిధముల రోదనముఁజేయుచుండ, వసిష్ఠుఁడు “ఇఁక నీ దుఃఖమును చాలించుము!” అని నుడువగా నామె మామగారి యభిమతమును పాటించి దుఃఖింపనిడై బాలుని పోషించుచుండెను.
ఒకనాడు శక్తి నందనుఁడగు పరాశరుఁడు “అమ్మా! సొమ్ములు లేనిదానవై భర్తలేని స్త్రీ వలె కనుపడుచున్నావు! నా తండ్రియెక్కడున్నాడు? ‘అని యడుగగా - ఆదృశ్యంతి - గద్గద స్వరముతో విలపించుచు - “నీ తండ్రిని రక్కసుఁడు మ్రింగినాడు“ అని వచింప-పరాశరుఁడు-
శ్లో ॥ అభ్యర్బ్య దేవ దేవేశం త్రైలోక్యం సచరాచరం । దగ్ధ్వేతి శేషః క్షణేన మాతః ! పితరం దర్శయామీతి మే మతిః ॥
“అమ్మా! దేవదేవేశ్వరుఁడైన శంకరు నారాధించి ముల్లోకములను దహించియైనను నా తండ్రి జూచెదనవి నిశ్చయించుకొనినాను“ అని పక్కాణించెను.
అంత వసిష్ఠుఁడు - “నీ శివారాధన సంకల్పము సమంజసమైనది. కాని లోకత్రయమును నశింపఁజేయుట ప్రశస్తము కాదు. “అని నుడువగా పరాశరుఁడు త్రైలోక్య దహన సంకల్పమును విడనాడి రాక్షససంహారమును తల పెట్టెను. అదృశ్యంతి, అరుంధతియు పరాశరాభిమతమును ప్రశంసించిరి అంత పరాశరుడు పార్థివలింగమును రుద్రసూక్త - త్ర్యంబకమంత్ర రుద్రా ధ్యాయ - త్వరితరుద్ర శివసంకల్ప పవమాన పంచ బ్రహ్మ మంత్ర లింగసూక్త అధర్వశిరః ప్రభృతి మంత్రములతో నభిషేకించి - భస్మ గంధ అక్షత పుష్పబిల్వాదులను సమర్పించియు“ “దేవా! నా జనకుని రుధిరుడను రాక్షసుఁడు భక్షించెను. గాననా తండ్రిని ఆతని సోదరులతో సహ చూడ గోరుచున్నాను” అని ప్రార్థించి పార్థివలింగ మునకు మాటిమాటికి ప్రణమిల్లుచు “రుద్రా! రుద్రా!“ అని బిగ్గరగా అఱచుచు మూర్ఛిల్లెను. అంత మహేశ్వరుఁడు పరాశరుని ప్రార్థనము నాలకించి ‘‘దేవీ! నాయందు పరాభక్తి గలవాడై నన్ను ప్రార్థించు. నీ బాలునిఁ జూడుము!“ అనవుడు అమ్మవారు “మహాదేవా! ఈ బాలుని కోరికను నెరవేర్చుము!“ అని యనుమతింపగా,
శ్లో॥ బ్రహ్మేంద్ర విష్ణు రుద్రాద్యైః సంవృతః పరమేశ్వరః ! దదౌచ దర్శనం తస్మై మునిపుత్రాయ ధీమతే ॥
“పరమేశ్వరుఁడు బ్రహ్మ విష్ణురుద్రదేవేంద్రాదులు వెంటరాగా మునిపుత్రుఁడు బుద్ధిమంతుడు నగు పరాశరునకు సాక్షాత్కరించెను.
పరాశరుఁడు పరమేశ్వరుని దివ్యమంగళ విగ్రహము నవలోకించి ఆనందముతో కన్నీరు కార్చుచు - శివుని చరణములపై వ్రాలి పార్వతీదేవికి నందికేశ్వరునకును ప్రణమిల్లెను.
అట్టితఱి - పరాశరుడు మహానంద సాగర నిమగ్నుడై “ప్రస్తుతము నాజీవితము సఫలమైనది. చంద్రశేఖరుడు నన్ను రక్షించుటకు ఏతెంచినాడు గాన లోకమున నాతో సమానుడు- దేవుడుగాని దానవుడు గాని లేడు” అని బ్రహ్మాదుల నుద్దేశించి సంభాషించెను.
అంత నదే క్షణమున అంతరిక్షమునందు పరాశరుఁడు తన తండ్రిని, ఆతని తమ్ములను సూర్యమండలముఁబోలినది, ప్రపంచమునందంతట సంచరించునదియు నగు విమానమునందు గాంచుచు నవ్వారికి ప్రణమిల్లుచు సంతోషించెను.
వృషభధ్వజుఁడు వసిష్ఠపుత్రుడగు శక్తిని గూర్చి “శక్తే! ఆనందముతో కన్నీరు కార్చుచున్నట్టి నీ తనయుని, నీ తండ్రియగు వసిష్ఠుని, నీ భార్యయగు అదృశ్యంతిని, నీ తల్లియగు అరుంధతిని చూడుము! నీ తలిదండ్రులకు వందనము నిడుము!” అని యాదేశింపగా శక్తి - శంకరాజ్ఞను తలదాల్చి మొదట ఉమామహేశ్వరులకు ప్రణమిల్లి తరువాత అరుంధతీ వసిష్ఠులకు నమస్కరించియు “వత్సా! పరాశరా! నీవు నాకు కుమారుడవైనందున అణిమాద్యష్టైశ్వర్యములు గల గొప్ప పదవి నధిష్ఠించితిని. నా భార్యయగు అదృశ్యంతిని, కరుణతో గాంచియు సోదర సమన్వితుడై నిజనివాసమునకుఁజనెను.
ఆ పిమ్మట పరాశరుడు పార్వతీ పరమేశ్వరులను బహువిధ వైదిక పౌరాణిక స్తోత్రములతో సుతింపగా ఆది దంపతులు “మనో2భీష్ట సిద్ధిరస్తు’ అని యనుగ్రహించి యంతర్థానము ఇందిరి.
అంత పరాశరుడు సంప్రాప్తి శివానుగ్రహుడై మంత్రశక్తితో రాక్షసులను కాల్చుచుండగా ధర్మజ్ఞుడైన వసిష్ఠుడు పరాశరా! క్రోధమును చాలించుము! నీ జనకుడు ప్రారబ్ధము ననుభవించెను. ఇవ్విషయమై రాక్షసుల యపరాధము గానరాదు. బుద్ధిమంతులకు కోపాతిశయము విహితము కాదు. ఎవడు ఎవనిని సంహరింపజాలును?“ సమస్తము స్వకృతము ననుభవించును. క్రోధము - కీర్తిని, పుణ్యమును నశింపజేయును.
అని వచింపగా పరాశరుడు శాంతించి రాక్షస సంహారమును విరమించెను.
అట్టితటి బ్రహ్మమానసపుత్రుడైన పులస్త్య ప్రజాపతి యేతెంచగా వసిష్ఠుడాతనిని పాద్యార్ధ్య ఆసనాది ప్రదానముతో సత్కరించెను. పరాశరుడును పులస్త్యునకు ప్రణమిల్లెను. అంత పులస్త్యుడు“ “నీవు కృష్ణుడవైనను శాంతించి నా వంశమును కాపాడితివి గాన శాస్త్రములనన్నిటిని బాగుగా గుర్తించి దేవతలలో శ్రేష్ఠుడైన నారాయణు నుద్దేశించి వైష్ణవుల కుపకరించునట్లు విష్ణు పారమ్యము గల పురాణసంహితను రచించెదవు! కర్మ యొక్క యధార్ధనిర్ణయమును చేయగలుగుదువు!“ అని వరముల నీయగా వసిష్ఠమహర్షియు పులస్త్యుని భాషితమును సమర్థించెను.
పరాశరుడు పులస్త్యవసిష్ణానుగ్రహమున మహాపురాణములలో నాలుగవదగు విష్ణుపురాణమును రచింపగలిగెను. విష్ణుపురాణము ఆరువేల శ్లోకములతో వేదార్థ గర్భితమై విరాజిల్లునది. “ఇట్లు వసిష్ఠ శక్తి పరాశ రాది వృత్తాంతమును యథామతి ప్రతిపాదించితి” నని సూతుడు మధ్యాహ్న విశ్రాంతికై వీరమించెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున 64వ అధ్యాయము.
Summary of chapter 64 of the Linga Mahā Purana is as follows:
This chapter recounts how the revered sage Pulastya granted divine boons to King Parāśara, blessing him with complete knowledge of the Purāṇas and Vedic wisdom. Pulastya declared that Parāśara would compose sacred scriptures and preserve the divine historical traditions of Sanātana Dharma for the spiritual upliftment of future generations.