లింగ మహా పురాణము
31 - దారువన మునులు తపస్సుతో శివు నారాధించి శివదర్శనము నొందుట
బ్రహ్మదేవుఁడు కామ్యకర్మాచరణరూపమగు తపస్సుతో అగ్నిఁబోలినవారైన దారువనమునులఁ గూర్చి యిట్లు ప్రబోధము నారంభించెను.
శ్లో॥ ఏష దేవో మహాదేవో - విజ్ఞేయస్తు మహేశ్వరః । న తస్మాత్ పరమం కించిత్ - పదం సమధిగమ్యతే ॥
ఈ మహాదేవుఁడు స్వయంప్రకాశమానుఁడనియు ప్రభువులకు ప్రభువగుమహేశ్వరుఁడనియు ఈతనిని మించిన తత్త్వమేదియు లేదనియు ధ్యానింపవలెను. ఆరాధింపవలెను. ప్రార్థింపవలెను.
దేవతలకు ఋషులకు పితురులకు నీమహాదేవుఁడే ప్రభువగువాడు. ఈ పరమేశ్వరుడే మృత్యువై వేయి మహాయుగముల చివరి వేళ ప్రపంచమును సంహరించును. మరల సృష్టికాలమున నీ దేవదేవుడే ప్రజలను పుట్టించును. ఈ సదాశివుఁడే విష్ణువై దేవేంద్రుడునై - కృతయుగమున యోగిగాను, త్రేతాయుగమున క్రతువుగాను, ద్వాపరయుగమున కాలాగ్నిగాను, కలియుగమున ధర్మకేతువుగాను పేర్కొనబడును. వెలుపల నలుచదరము లోన ఎనిమిది మూలలు గలపీఠముపై గుండ్రగా నుండు పిండము శివలింగమగును.
అగ్నిదేవుఁడు తమోగుణము; బ్రహ్మదేవుఁడు రజోగుణము; విష్ణు మూర్తి సత్త్వగుణము కలిగియుందురు. మూలరూపమగు మహాదేవునికి చెందినవే ఈ త్రిమూర్తులని తెలియవలెను. అగ్ని బ్రహ్మ విష్ణువులకు మూలముగుశివలింగమే పరబ్రహ్మంబగును. గాన దేవదేవుఁడు ప్రభువు అవ్యయుఁడునగు మహేశ్వరుని జితేంద్రియులై కోపతాపములు లేనివారునై భూసురశ్రేష్ఠులు ఆరాధించుచుందురు.
అంగుష్ఠమాత్రమగు శివలింగము బంగారముది గాని వెండిది గాని రాగిది గాని శిలాసంబంధమైనది గాని పూజనీయంబగును. ఒకానొక వేదికపై సమీచీనమగు కలశమును స్థాపించి,అందు శుద్ధజలమును నింపి, దానిలో భస్మ గంధాక్షతకుంకుమ పుష్పబిల్వముల నునిచి, యథాశక్తి బంగారము వేసియు కలశము నలంకరించియు కలశోదకమును ప్రణవ షడక్షరీ మహామంత్రముతో నభిమంత్రించియు కలశోదకముతో పంచబ్రహ్మమంత్రములను నమకచమకాదుల జదువుచు శివలింగము నభిషేకించి భస్మ గంధాక్షతాద్యుపచారములతో నర్చించి ప్రార్థించియు శరణాగతులు కండు! అప్పుడు కర్మజ్ఞాన సముచ్చయాత్మకమగు జ్ఞానము గలవారై మోక్షము నొందగలుగుదురు. మోక్షమునకు ముందు శివదర్శనము సంభవించును. శివుని యందు ఏకాగ్రభక్తి లేని వారికి శివుఁడు సాక్షాత్కరింపడు. శివుని గాంచినచో అజ్ఞానము, అధర్మంబు పటాపంచలగును.
దారువనమునులు ఇట్టి బ్రహ్మోపదేశము నవధరించి బ్రహ్మదేవునకు ప్రణమిల్లియు దారువనముఁ జేరుటకు బయలుదేరిరి.
ఆ ప్రాంతమున నలుచదరపు స్థలములయంచు, పర్వత గుహల యందు, నదులలోని ఇసుక తిన్నెలయందు, నాచుగల చోటులందు, దర్భాసనముల పైనను, పాదాంగుష్ఠాగ్రముల యందు, ఆధారపడినవారై మునులు శివు నారాధించుచుండిరి.
ఇట్లు వారు ఒక సంవత్సరము పూజా జప ధ్యానాదులతో నారాధించినందున వసంతకాలమున తనయందు భక్తిగల నామునులనందరి ననుగ్రహించుటకు మహాదేవుఁడు హిమవత్ పర్వతముపై గల దారువనముఁజేరి ఒంటినిండ విభూతి నలఁదుకొని నగ్నుడై వికారస్వరూపముతో ప్రత్యక్షమయ్యెను. మరియు నాతఁడు కొఱవిని కేలఁబూని ఎరుపు గొరోజునవర్ణంబు గల నేత్రములతో ఒకప్పుడు భయంకరముగా నవ్వుచుండెను. మరియొక తూఱి ఆశ్చర్యముతో పాడు చుండెను. శృంగార చేష్టలను వెల్లడించుచు నాట్యమాడుచుండెను. మరియొకసారి మాటిమాటికి అఱచుచుండెను. మున్యాశ్రమముల యందు ఇటునటు తిరుగుచు మరల బిచ్చమడుగుచుండెను.
శివుండు - అల్లు వికృత చేష్టలచే ఏవగింపు కలుగజేయుచున్నను మునులు వివేకము గలవారై పరమేశ్వరునిఁ బ్రార్థించుచు ఉదకములతో పాదములను కడిగియు భస్మగంధాక్షతలను పుష్పమాలికలను కోమల బిల్వ దళములను ధూప దీపాదులను సమర్పించియు భార్యలతో పుత్రులతో పరిజనముతో కూడ వినమ్రులై విహితములైన వాక్కులతో దిగువవిధము సన్నుతించిరి.
దేవదేవేశ్వరా! మేము అవివేకముతో మనోవాక్కాయములచే చేసిన ఎగ్గులను క్షమింపుము! నీ చరితములు విచిత్రములు, రహస్యములు, బ్రహ్మాదులకు తెలియనలవి గానివి. నీ మార్గమును నిలకడను తెలియఁజాలము, విశ్వేశ్వరా! నీవు ఎట్టివాడవో ఎవరికిని తెలియదు. మహాత్ములు నిన్ను అనేకవిధములఁ బొగడుచుందురు.
“భవుఁడు, భవ్యుఁడు, భావనుఁడు, అనంత బలవీర్యుఁడు, భూతపతి, సంహారకుఁడు, పిశంగుఁడు, (గోరోజనము వంటి కపిల వర్ణము గలవాడు) అవ్యయుఁడు, వ్యయకారుఁడు, గంగాజులధారలను తన మేనుపై పడగొట్టుకొనువాడు, జగదాధారుఁడు, త్రిగుణాత్మకుఁడు, సత్త్వరజస్తమో గుణత్రయము గల అంబ (పార్వతి) గల త్ర్యంబకుఁడు, త్రినేత్రుఁడు, త్రిశూలధారి, సుఖముచే సంతోషింపజేయు కందర్పుఁడు (కం= సుఖం, తేన దర్పయతి = హర్షయతీతి = కందర్పః) హుతాశనుఁడు, పరమాత్మ, శంకరుఁడు, వృషాంకుఁడు, గణాధిపతి, దండహస్తుఁడు, కాలుఁడు, పాశ హస్తుఁడు, వేదమంత్ర ప్రధానుఁడు, శత జిహ్వుఁడు” అను విశేషణములు నీకే చెల్లును.
భూత భవిష్య ద్వర్తమాన కాలములయందు ప్రవర్తించు చరాచర ప్రపంచ మంతయు నీ దివ్యశరీరము నుండి యుద్భవించుచున్నయది. మానవుఁడు - తెలిసి గాని తెలియక గాని చేయు కార్యము నంతయు భగవానుడవగు నీవే చేయించువాడవు! ఇవ్విదము మునులు సంతుష్టాంతరంగులై ప్రార్థించి - “నీ నిజరూపమును చూపెట్టు” మని కోరిరి.
అంత మహాదేవుఁడు ప్రసన్నుఁడై ఆవ్వారికి దివ్యదృష్టి నొసగగా వారు పరమేశ్వరుని దివ్యలావణ్యమనోహరవిగ్రహముఁగాంచిన వారై సంతోషమును పట్టలేక మరల స్తోత్రమును చేయఁబూనిరి.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రచనమున (31) ముప్పది యొకటవ అధ్యాయము.
Summary of chapter 31 of the Linga Mahā Purana is as follows:
This chapter contains an exalted hymn of praise offered by cosmic sages and devas to Bhagavān Śiva, extolling His unlimited divine power, compassion, and supreme role as the inner ruler of all existence. The hymn highlights how chanting Śiva's divine names and contemplating His transcendent qualities purifies the heart and dispels the darkest clouds of worldly illusion.