45 - శివుని సర్వాత్మభావమును ప్రతిపాదించుట

“పరమేశ్వరుని సర్వాత్మభావమును వివరింపుము!” అని శౌనకాదులు ప్రశ్నింపగా సూతుడు చెప్పఁ దొడఁగెను.

భూః, భువః, స్వః, మహః, జనః, తపః సత్యలోకములు, పాతాళము, నరకములు, నక్షత్రములు, గ్రహములు, చంద్రుడు, సూర్యుడు, ధ్రువుడు, సప్తర్షులు, వైమానిక ఖేచరగణంబు, పరమేశ్వరుని యనుగ్రహము వలననే నిలుకడగలవై ప్రవర్తించుచున్నవి. పరమేశ్వరుఁడు వీనిని నిర్మించి వీనిలోనంతరాత్మగా నుండును. గాన శివుడు భూరాదుల సమష్టి స్వరూపుడని తెలియవలెను.

మూఢులు శివమాయామోహితులై  “మహేశ్వరుఁడు సర్వాత్మకుఁడని” తెలియఁజాలరు. ముల్లోకములు మహాదేవుని శరీరము కాగా పై ఏడు లోకములు క్రింది ఏడులోకములును బ్రహ్మాండమునుండి ఉద్భవించినవని గుర్తింపవలెను. సప్తమ మహాతల (ఏడవ) పాతాళము బంగారు నేల గలదై రత్నము లన్నిటితోడను, విచిత్రములగు సౌధము (మేడ) ల తోడను శివాలయములతోడను శోభించుచుండను.

అనంతుఁడు అను నాగేంద్రుఁడు “మహాతల“ పాతాళమునకు అధిపతిగా నుండును. ముచుకుందుడు, బలిచక్రవర్తి యందు నివసింతురు. “రసాతల”  పాతాళము కొండలతో నిండియుండును. “తలాతలపాతాళము ఇసుకతో కూడి యుండును. “సుతల”  పాతాళము పసుపు వన్నెతో “వితల” పాతాళము పగడపు వన్నెతోడను, “అతల”, పాతాళము తెలుపు వన్నెతోడను,  “తల” పాతాళము నలుపు వన్నెతో నలరారుచుండును.

సువ్రతులైన మునులారా! భూలోకమునకు గల వైశాల్యము పాతాళ లోకము లన్నిటియందుండును. విశేషమేమన? మహాతలాదిలోకములందు అవకాశము (ఆకాశము) హెచ్చుతగ్గులుగా నుండును.

సువర్ణుడు, వాసుకి మొదలగు నాగేంద్రులు నివసించునది రసాతలమనియు; విరోచనుడు, హిరణ్యాక్షుడు నరకుడు మొదలగుదైత్యులు నివసించునది తలాతలమనియు, కాలనేమ్యాదుల సుతలమునుందురనియు; తారకుడు అగ్నిముఖుడు మొదలగువారు మరియు మహాంతకాది సర్పములు, ప్రహ్లాదుడు మున్నగువారును నివసించునది వితలమనియు, మహాకుంభుడు, హయగ్రీవుడు, శంకు కర్ణుడు, నముచి మొదలగు వారండునది తలమనియు తెలియవలెను. ఈ పాతాళలోకములన్నిటియందు పరమేశ్వరుడు పార్వతీ దేవితో కుమారస్వామితో నందికేశ్వరునితో ప్రమథ గణముల తోడను నివసించుచుండును. సప్తపాతాళముల క్రింద నరకములుండును.

ఇక భూమిపై గల భేదములను చెప్పఁబోవుచున్నాను. అని సూతముని విరమించెను.

ఇయ్యది “ శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (45) నలబది యైదవ అధ్యాయము.