18 - విష్ణు ప్రోక్త శివస్తోత్రము

విష్ణు రువాచ -

శ్లో ఏకాక్షరాయ రుద్రాయ - అకారాయాత్మరూపిణే ఉకారాయాదిదేవాయ - విద్యాదేహాయ వై నమః

“ఓమిత్యేకాక్షరం బ్రహ్మ” అన్నట్లు వేద ప్రారంభమున అథవా సృష్టి ప్రారంభమున చతుర్ముఖ బ్రహ్మ దేవుఁడు తన నోట నుచ్చరించిన ప్రణవ (ఓంకార) స్వరూపుఁడు, అకార పాచ్యుఁడు, జీవాత్మ సమష్టి రూపుఁడు నగు బ్రహ్మదేవుఁడుగాను; ఉకార వాచ్యుఁడు, మహాసృష్టిలో మొదట నావిర్భవించిన వాడు నగు విష్ణుమూర్తి గాను; అష్టాదశవిద్యాత్మకుఁడు గాను; లేక - పరా విద్యయగు శివషడక్షరీమహా మంత్రము శరీరముగా గలవానిగా నుండు రుద్రునకు.

శ్లో తృతీయాయ మకారాయ - శివాయ పరమాత్మనే, సూర్యాగ్ని సోమవర్ణాయ - యజమానాయ వై నమః

ఓంకారములో మూడవదగు మకారముతో చెప్ప బడు మహేశ్వరుఁడు గాను; తన్మూల స్వరూపుడగు పరమాత్మ యైన శివుఁడు గానుండునట్టి; సూర్యునకు అగ్నికి చంద్రునకును కాంతి నొసగునట్టి; అథవా సూర్యుని వలె జగత్తును ప్రకాశింపఁజేయు వాడు, అగ్నివలె తేజస్సుతో వెలుగొందువాడు, చంద్రునివలె భక్తుల నానంద పఱుచు వాడుగా నుండు నట్టి; శివోపాసకుఁడగు మాహేశ్వరుఁడుగా; అథవా శివ ప్రీత్యర్ధము జపద్రవ్యాది యజ్ఞముల నొనర్చు పుణ్యపురుషుఁడుగా నుండు పరశివునకు నమస్కారము.

శ్లో అగ్నయే రుద్రరూపాయ - రుద్రాణాం పతయే నమః శివాయ శివమంత్రాయ - సద్యోజాతాయ వేధసే శ్లో వామాయ వామదేవాయ - వరదాయామృతాయ తే అఘోరాయాతిఘోరాయ - సద్యోజాతాయ రంహసే శ్లో ఈశానాయ శ్మశానాయ - అతివే గాయ వేగినే నమోఽ స్తు శతిపాదాయ - ఊర్ధ్వలింగాయ లింగినే

శ్మశానాయ = మహాశ్మశాన మనఁబడు కాశీ క్షేత్ర స్వరూపుని కొరకు; శృతి పాదాయ = వేద వేదాంతములచే తెలియఁబడువాని కొరకు; ఊర్ధ్వలింగాయ = పైపైన అవధి లేని లింగస్వరూపము గలవాని కొరకు; లింగినే = విచిత్ర రూపముతో కూడిన వాని కొరకు; అని యర్థములు.

శ్లో హేమలింగాయ హేమాయ - వారిలింగాయ చాంభసే శివాయ శివలింగాయ - వ్యాపినే వ్యోమవ్యాపినే శ్లో వాయవే వాయువేగాయ - నమస్తే వాయువ్యాపినే తేజసే తేజసాంభర్త్రే – నమస్తేజోఽధివ్యాపినే శ్లో జలాయ జలభూతాయ - నమస్తే జలవ్యాపినే పృథివ్యైచాంతరిక్షాయ - పృథివీ వ్యాపినే నమః శ్లో శబ్ద స్పర్శస్వరూపాయ - రసగంధాయ గంధినే గణాధిపతయే తుభ్యం - గుహ్యాత్ గుహ్యతమాయ తే శ్లో అనంతాయ విరూపాయ - ఆనంతానామయాయ చ శాశ్వతాయ వరిష్ఠాయ - వారి గర్భాయ యోగినే శ్లో సంస్థితాయాంభసాం మధ్యే - హ్యావయోర్మధ్యవర్చసే గోప్త్రే హర్ర్తే సదా కర్ర్తే - నిధనాయేశ్వరాయ చ శ్లో ఆచేతనాయ చింత్యాయ - చేతనాయాసహారిణే ఆరుపాయ సురూపాయ - ఆనంగాయాంగహారిణే

ఆచేతనాయ = చిత్త జన్యప్రాకృతజ్ఞానము లేని వాని కొరకు; చేతనాయాసహారిణే = జీవాత్మల యొక్క జన్మమరణరూపమగు ఆయాస (శ)మును హరించు (పోగొట్టు) వాని కొరకు;

అనంగాయ = ప్రాకృత శరీరము లేనివాని కొరకు; అంగ హారిణే = మన్మథుని శరీరమును కాల్చిన వాని కొరకు నని యర్థములు.

శ్లో భస్మ దిగ్ధశరీరాయ - భాను సోమాగ్ని హేత వే

శ్వేతాయ శ్వేతవర్ణాయ - తుహినాద్రిచరాయ చ

శ్లో సుశ్వేతాయ సువక్త్రాయ - నమ శ్శ్వేత శిభాయ చ

శ్వేతాస్యాయ మహాస్యాయ - నమస్తే శ్వేతలోహిత

శ్వేతలోహిత = తెల్లని నెత్తురు గలవాడా! అని యర్థము

శ్లో సుతారాయ విశిష్టాయ -  నమో దుందుభినే హర శత రూప! విరూపాయ  - నమః కేతుమతే సదా

సదా కేతుమతే= ఎల్లకాలము కాంతి గలవాని కొరకు, లేక = నంది ద్వజమునందు గల రధము నధిష్ఠించువాని కొరకు నని - యర్థములు.

శ్లో బుద్ధి శోక విశోకాయ - పినాకాయ కపర్దినే విపాశాయ సుపాశాయ -  పశుపాశ వినాశినే

పశువులనబడు జీవాత్మల యొక్క సంసారపాశమును విడగొట్టు వాని కొరకు - పశుపాశవినాశినే అను దాని యర్థము.

శ్లో సుహేత్రాయ హవిష్యాయ - సుబ్రహ్మణ్యాయ సూరిణే సుముఖాయ సువక్త్రాయ - దుర్దమాయ దమాయ చ శ్లో కంకాయ కంకరూపాయ – కంకణీకృతపన్నగ!

సనకాయ నమస్తుభ్యం - సనాతన! సనందన!

కంకాయ = కపట బ్రాహ్మణ స్వరూపము గల వాని కొరకు; కంకరూపాయ = యమ ధర్మరాజస్వరూపుని కొరకు అని యర్థములు.

శ్లో సన త్కుమార! సారంగ - మారణాయ మహాత్మనే లో కాక్షిణే త్రిధామాయ - నమో విరజసే సదా

సారంగ మారణాయ = అర్జును ననుగ్రహించుటకు కిరాత రూపము - దాల్చి మృగపక్ష్యాదులను సంహరించిన వానికొరకు అని యర్థము.

శ్లో శంఖపాలాయ శంఖాయ - రజసే తమసే నమః సారస్వతాయ మేఘాయ - మేఘ వాహన తే నమః శ్లో సువాహాయ వివాహాయ - వివాద వరదాయ చ నమశ్శివాయ రుద్రాయ - ప్రధానాయ నమో నమః

వివాదవరదాయచ = వాదము లేని సరససంభాషణముఁజేయు వారికి వరముల నొసగు వానికొరకు అని యర్థము.

శ్లో త్రిగుణాయ నమస్తుభ్యం - చతుర్వ్యూహాత్మనే నమః I సంసారాయ నమస్తుభ్యం - నమః స్సంసార హేతవే

చతర్వ్యూహాత్మనే = రుద్రమహేశ్వర సదాశివ శివుల యొక్క నాలుగు వ్యూహ (వర్గ)ములుగా నుండువాని కొరకు అని యర్థము.

శ్లో మోక్షాయ మోక్షరూపాయ - మోక్షకర్ర్తే నమో నమః ఆత్మనే ఋషయే తుభ్యం - స్వామినే విష్ణవే నమః

విష్ణవే = సర్వవ్యాపకుని కొరకు అని యర్థము.

శ్లో నమో భగవతే తుభ్యం - నాగా నాంపతయే నమః ఓంకారాయ నమస్తుభ్యం - సర్వజ్ఞాయ నమో నమః శ్లో సర్వాయ చ నమస్తుభ్యం - నమో నారాయణాయ చ నమో హిరణ్యగర్భాయ - ఆది దేవాయ తే నమః

నారాయణాయ = నరుల సమూహము నార మనఁబడును. నర సమూహము యొక్క హృదయము స్థానముగా గల వాని కొరకు అని యర్థము.

శ్లో నమోఽస్త్వజాయ పతయే - ప్రజానాం వ్యూహ హేతవే మహాదేవాయ దేవానా - మీశ్వరాయ నమో నమః

ప్రజానాం ప్యూహహేతవే = ప్రజలు గుంపులుగా చేరుటకు కారణమగు వాని కొరకు అని యర్థము.

శ్లో శర్వాయ చ నమస్తుభ్యం - సత్యాయ శమనాయ చ బ్రహ్మణే చైవ భూతానాం - సర్వజ్ఞాయ నమో నమః శ్లో మహాత్మనే నమస్తుభ్యం - ప్రజ్ఞారూపాయ వై నమః చితయే చితిరూపాయ - స్మృతిరూపాయ వై నమః శ్లో జ్ఞానాయ జ్ఞానగమ్యాయ - నమస్తే సంవిదే సదా శిఖరాయ నమస్తుభ్యం - నీలకంఠాయ వై నమః శ్లో అర్ధనారీశరీరాయ - అవ్యక్తాయ నమో నమః ఏకాదశ విభేదాయ - స్థాణవే తే నమ స్సదా శ్లో నమస్సోమాయ సూర్యాయ - భవాయ భవహారిణే యశస్కరాయ దేవాయ - శంకరాయేశ్వరాయ చ శ్లో నమోఽ౦బికాధిపతయే - ఉమాయాః పతయే నమః హిరణ్యబాహవే తుభ్యం -  నమస్తే హేమ రేతసే నీలకేశాయ విత్తాయ - శితికంఠాయ వై నమః I కపర్దినే నమస్తుభ్యం - నాగాంగాభరణాయ చ వృషారూఢాయ సర్వస్య - హర్ర్తే కర్త్రే నమో నమః వీరశైవాతి రామాయ - రామనాథాయ తే నమః

వీరశైవాతి రామాయ = వీరశైవులనఁబడు లింగ ధారి ద్విజులయందు మిక్కిలి ఆసక్తి గలవాని. కొరకు అని యర్థము.

శ్లో నమో రాజాధిరాజాయ - రాజ్ఞా మధిగతాయ తే నమః పాలాధిపతయే - పాలాశాంకృత తే నమః

పాలాధిపతయే = ప్రజలను రక్షించు ప్రభువులకు అధిపతియగు వానికొరకు పాలాశాంకృత = మోదుగ కఱ్ఱల హవనముచే గుర్తింప బడువాని కొరకు అని యర్థము.

శ్లో నమః కేయూరభూషాయ - గోపతే తే నమో నమః నమః శ్రీ కంఠనాథాయ - నమో లికుచపాణయే

లికుచపాణయే = హాలాహల విషము నిమ్మపండుగా హస్తము నందు గలవాని కోరకు ఆని యర్థము.

శ్లో భువనేశాయ దేవాయ - వేదశాస్త్ర నమోఽస్తుతే సారంగాయ నమస్తుభ్యం రాజహంసాయ తే నమః శ్లో కనకాంగదహారాయ - నమస్సర్పోపవీతినే సర్పకుండల మాలాయ - కటిసూత్రీకృతాహి నే శ్లో వేదగర్భాయ గర్భాయ విశ్వగర్భాయ తే నమః

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుఁడు పలికెను. ఇట్లు శ్రీహరి బ్రహ్మదేవుని (నా) తో కూడ శివునిఁ బ్రార్థించి విరమించెను.

ఈ స్తోత్రమును ప్రతిదినము పఠించినచో బ్రాహ్మణులకు వినుపించిన యెడలను పాపములన్నియు పటాపంచలగును. మరియు పాపాత్ముడైనను దీనిని పఠించినచో పరిశుద్ధుడై బ్రహ్మలోకముఁ జెందును.

ఇయ్యది

“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (18) పదునెనిమిదవ అధ్యాయము.