లింగ మహా పురాణము
37 - నందికేశ్వరుడు తన వృత్తాంతమున - దేవేంద్ర ప్రోక్తమును వివరించుట
“నీ వెట్లు పరమేశ్వర సన్నిధి జేరితివో వినగోరుచున్నాను వివరింపు” మని సనత్కుమారుడు ప్రశ్నింప- నందికేశ్వరుడు చెప్పఁదొడఁగెను.
నా తండ్రియగు శిలాదుడు పుత్రప్రాప్తి కాంక్షతో చిరకాలము కఠిన నియమముల నవలంబించి తపస్సు నొనర్పగా వజ్రధరుఁడగు దేవేంద్రుడు ప్రత్యక్షమై వరము నడుగుమనెను. అంత శిలాదుడు దేవతలందరితో కూడి కనఁబడు దేవేంద్రునకు దోసిలొగ్గి ప్రణమిల్లియు “దేవా! అయోనిసంభవుడు, మృత్యువులేనివాడు నగు కుమారు బడయుటను కోరుచున్నాను.” అని యాచింపగా ఇంద్రుడు “యోని సంభవుడు మృత్యువు గలవాడునగు కుమారు నొసగెదను. మృత్యువు లేని వారు ప్రపంచమునందెవరు నుండఁ జాలరు. బ్రహ్మదేవుఁడు గూడ మరణము లేనివాని నీయఁజాలడు. ఎందుకనఁగా? బ్రహ్మదేవుఁడు సృష్టికర్తయైనను పూర్వము విష్ణునాభికమలమున జన్మించిన వాడగుటచే నాతనికి ఏనాటికైనను మరణము తప్పదని గుర్తింపుము! మహేశ్వరుని దక్షిణాంగమునుండి ఉద్భవించి విష్ణు శరీరములో చోఱబడి అతని నాభినుండి బయలుపడినవాడైనను పరార్ధ ద్వయ కాలము మాత్రము జీవితము గలవాడు బ్రహ్మదేవుడని తెలిసి కొనుము! అందువలన అయోని సంభవుడు మరణము లేనివాడు నగు కుమారు నాశింపకుము! “అని వచింపగా శిలాదుఁడు మరల నిట్లు ప్రశ్నించెను.
“దైత్య నిషూదనా! దేవేంద్రా! మృత్యువు లేనట్టి, యోనిసంభవుఁడు కానట్టి కుమారుఁడే కావలెను. బ్రహ్మదేవుఁడు గూడా బ్రహ్మాండము నుండి, విష్ణునాభికమలము నుండి, మహేశ్వరుని దక్షిణాంగము నుండియు జన్మించినాడని నారద మహర్షి చెప్పగా వినియున్నాను.
ఆ వృత్తాంతమును వివరింపుము! బ్రహ్మదేవుని కుమారుఁడగు దక్షప్రజాపతికి దాక్షాయణి యను పేరుతో కుమార్తెయై బ్రహ్మదేవునకు మనుమరాలైనది గదా! ఐతే బ్రహ్మదేవుఁడు దాక్షాయణికి కుమారుఁడెట్లయ్యెను?”
శక్ర ఉవాచ = దేవేంద్రుఁడిట్లు చెప్పఁ దొడఁగెను.
మేఘ వాహసము అను కల్పమునందు విష్ణువు మేఘమై సహస్ర దివ్య వత్సరముల కాలము తనను మోసినందున మహేశ్వరుఁడు ప్రసన్నుఁడై బ్రహ్మదేవునితో గూడ చరాచరము నంతయు పుట్టించు సామర్థ్యము నొసఁగెను. అందువలన బ్రహ్మదేవుఁడు పరమేశ్వరుని ప్రార్ధించి జగత్సృష్టి కర్తృత్వముఁ బడసెను. మహాప్రళయమున చీకటిలో ప్రకాశించు నారాయణుని విదాత చూచి - ఆతనిని మ్రింగి తన కనుబొమ్మల నడిమి నుండి జన్మింపఁజేయగా పరమేశ్వరుడచ్చోటున కేతెంచెను. అప్పుడు హరిబ్రహ్మలు మహేశ్వరుని పలువిధములఁబ్రార్ధించిరి. అంత పరమేశ్వరుడు అంతర్థానము జెందెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (37) ముప్పది అధ్యాయము.
Summary of chapter 37 of the Linga Mahā Purana is as follows:
The narrative describes how Bhagavān Brahmā performed intense austerities directed toward Parameśvara Śiva to overcome difficulties in executing His cosmic duties of creation. Gratified by Brahmā's sincere devotion, Mahādeva appeared before Him, granted sublime boons of cosmic wisdom and creative power, and assured Him of continuous divine protection throughout the Kalpa.