లింగ మహా పురాణము
66 - త్రిధన్వుఁడు మొదలగు సూర్యవంశీయులను, యయాతి మహారాజు చివరగా గల చంద్ర వంశీయులను కీర్తించుట
అట్లు- శివసహస్రనామపఠనముతో-
త్రిధన్వుఁడు తండి ఋషి యొక్క ఆశ్రయమున సహస్రాశ్వమేధ ఫలము గలవాడై పునరావృత్తి లేనట్టి గాణాపత్యము నొందియు సర్వదేవనమస్కృతుఁడాయెను.
త్రిధన్వునకు త్రయ్యారుణుఁడు, ఆతనికి సత్యవ్రతుఁడు, కుమారులు, సత్యవ్రతుఁడు అమితౌజస్కుని సంహరించి ఆతని భార్య నపహరించినందున త్రయ్యారుణుఁడు, సత్యవ్రతుని దూరము చేయగా “ఎక్కడ నేనుండవలెను ? అని సత్యవ్రతుడు అడిగెను. “ఛండాలుర చెంత నుండు” మని త్రయ్యారుణుడు శాసించి వనమున కరిగెను. ముల్లోకములయందు ప్రసిద్ధుఁడైన త్రిశంకువు- వసిష్ఠుని శాపము వలన రాజ్యభ్రష్టుడగు సత్యవ్రతుఁడేను.
మహాతేజస్వియగు విశ్వామిత్రుఁడు త్రిశంకునకు, తండ్రి యొక్క రాజ్యమునకధిగారిగా నొనర్చి అనేకయజ్ఞములను చేయించియు- దేవతలు వసిష్ఠుఁడును చూచుచుండగా మానవ శరీరముతోడనే స్వర్గమున (బ్రవేశింప జేసెను. కైకయవంశమున జన్మించిన సత్య వ్రతయనునామెను భార్యగా స్వీకరించి ఆమెయందు సత్యవ్రతుఁడు- హరిశ్చంద్రుని కనెను. హరిశ్చచంద్రునకు రోహితుఁడు; రోహితునకు హరితుఁడు; హరితునకు ధుంధువు; ధుంధువునకు- విజయుఁడు, సుతేజస్వి యను నిరువురు కుమారులు జన్మించిరి. క్షత్రియులందరినోడించుటచే విజయుఁడు సార్థక నామధేయు డయ్యెను.
విజయునకు-రుచకుఁడు; రుచకునకు - వృకుఁడ; వృకునకు బాహువు, బాహువునకు - సగరుఁడు అను ధర్మాత్ముఁడు; కుమారులుగా సంభవించిరి.
ప్రభ, భానుమతి యనువారు సగరుని భార్యలు. వారు పుత్రసంతా నప్రాప్తికై ఔర్వాగ్ని నారాధింపగా ప్రసన్నుడైన అగ్ని వరము నొసగినందున ప్రభ యనునామె అరువదివేల కుమారులను; భానుమతి యనునామె-అసమంజు నొకే కుమారుని బడసిరి.
ప్రభాదేవీ తనయులు అరువది వేల (60000) సంఖ్యాకులు పృథివి (ద్రవ్వుచు కపిలమహాముని స్వరూపుడగు విష్ణువు యొక్క హుంకారముతో దహించి బూడిదకుప్పలైరి.
అసమంజసుని కుమారుఁడు- అంశుమంతుఁడు; అంశుమంతుని తనయుఁడు-దిలీపుడు; దిలీపుని పుత్రుఁడగు భగీరథుఁడు- తపించి భాగీరథియను పేరుతో గంగామహానదిని భువి నవతరింపజేసెను. భగీరథుని సుతుఁడు శ్రుతుడు; శ్రుతుని కుమారుఁడగు నాభాగుడు శివభక్తుడై విరాజిల్లెను.
నాభాగుని తనయుడు అంబరీషుడు; అంబరీషాత్మజుడు - సింధుద్వీపుడు, సింధు ద్వీప పుత్రుడు అయుతాయువు; ఆతని కుమారుఁడు ఋతుపర్లుడు; ఋతు పర్ణుని తనయుడు సుదాసుడు, సుదాసుని పుత్రుడు సౌదాసుడు; సౌదాసుని కుమారుడు మిత్రసహుడు కల్మాష పాదుడనబజగెను. కల్మాష పాదుని భార్యయందు వషిష్ఠమహర్షి-అశ్మకుని పుట్టించినందున నీతడు మిత్రసహునకు క్షేత్రజుడగు పుత్రుడాయెను. అశ్మకుడు ఉత్తరయను నామెయందుమూలకుని (బడసెను. మూలకుడు పరశురాముని భయమువలన స్త్రీల మధ్యనే నివసించెను. మూలకునకు శతరథుడు; శత రథునకు ఇలవిలుడు; ఇలవిలునకు వృద్ధశర్మ- కుమారులు కాగా వృద్ధశర్మ పితృకన్యయందు విశ్వసహుని పుట్టించెను. విశ్వసహుని కుమారుఁడగు ఖట్వాంగుడు ప్రారబ్ధాంతమున స్వర్గము జేరునపుడు తన ప్రభావముతో త్రేతాగ్నులను స్వర్గమర్త్య పాతాళలోకములను వశపఱచుకొనెను. ఖట్వాంగుని కుమారుడు దీర్ఘబాహువు; దీర్ఘబాహుని తనయుడు రఘుమహారాజు; రఘువు యొక్క కుమారుడు అజమహారాజు; అజతనయుడు దశరథుడు నైరి. ధర్మజ్ఞుడైన శ్రీరామచంద్రుఁడు, భరతుఁడు,లక్ష్మణుఁడు, శత్రుఘ్నఁడు నను నలుగురు- దశరథుని కుమారులు కాగా వారిలో జ్యేష్ఠుడైన శ్రీరాముడు రావణాసురుని సంహరించి లోకకల్యాణము నొసగూర్చియు పదివేల వత్సరములు ప్రజలను పాలించెను. శ్రీరామునకు కుశుడు, లవుడు అను ఇద్దరు కుమారులు కలుగగా - కుశుని కుమారుడు నిషధుడు; నిషధుని పుత్రుడు- నలుఁడు; నలుని తనయుడు-నభుడు; నభునకు పుండరీకుడు; పుండరీకునకు- క్షేమధన్వ; క్షేమధన్వునకు దేవానీకుడు; దేవానీకునకు అహీనరుడు; అహీనరునకు సహస్రాశ్వుడు; సహస్రాశ్వునకు చంద్రావలోకుడు; చంద్రావలోకునకు తారాపీడుడు; తారాపీడునకు చంద్రగిరి; చంద్రగిరికి భానుచంద్రుడు; భానుచంద్రునకు శ్రుతాయువు; శ్రుతాయువునకు బృహద్బలుఁడు- కుమారులుగా జన్మించిరి.
ఇట్లు ఇక్ష్వాకు వంశములో ముఖ్యులైనవారు - పేర్కొనఁబడిరి.
వీరందరు పాశుపత దీక్షితులై పరమేశ్వరుని యథాశక్తి ఆరాధించి – ప్రారబ్దాంతమున మహాకైలాసము జెందినవారైరి.
తరి - వీరిలో నృగుడు బ్రాహ్మణశాపము వలన ఊసరవెల్లి యయ్యెను. ధృష్టుడు, ధృష్టకేతువు, రణధృష్టుడు నను ముగ్గురు- నృగుని కుమారులు కాగా ఆనర్తుఁడను వాడు శర్యాతి పుత్రికయగు సుకన్యయందు రోచమానుడను కుమారుని పొందెను.
రోచమానునకు దేవుడు, దేవునకు- రైవతుడు, కుమారులు కాగా రైవతుని నూరుగురు కొమరులలో పెద్దవాడైన కకుద్మి యొక్క కుమార్తె యగు రేవతిని ద్వాపరయుగమున బలరాముడు వివాహవిధిని భార్యగా బడసెను.
నరిష్యంతుఁడనువాని కుమారుఁడు జీతాత్మ యనఁబజగెను. నాభాగుని పుతృడగు అంబరీషుఁడు విష్ణుభక్తుడై విరాజిల్లెను. అంబరీషునకు ఋతుడు; ఋతునకు--కృతుడు, కృతునకు పృషితుడు; కరూషుడను వానికి కారుషులు కుమారులైరి. పృషితుడు గోవును వధించి చ్యవనుడను గురువు యొక్క శాపమువలన శూద్రుడుగా పరిగణింపబడెను.
దిష్టుఁడనువానికి నాభాగుఁడు; నాభాగునకు- భలందనుడు; భలందనునకు విక్రాంతుఁడు; కుమారులుగా జన్మించిరి.
ఇట్లు మనువంశీయులు, ఇక్వాకు యొక్క పుత్రపౌత్రాదులును సంగ్రహించి పేర్కొనబడిరి. ఇక ఐలుని సంతానమును వివరించుచున్నానని సూతుడు వక్కాణింప నారంభించెను.
ఐలుఁడబడు పురూరవుఁడు శివభక్తుఁడై ఉత్తరదిశలో యమునాతీరము నందు ప్రయాగక్షేత్ర సమీపమస్థమగు ప్రతిష్ఠాన పురమును రాజధానిగా చేసికొని రాజ్యమును శత్రురహితముగా నొనర్చెను.
ఆయువు, మాయువు, అమాయువు, విశ్వాయువు, శ్రుతాయువు, శతాయువు, మరి యొకరు నీ యేడుగురు - పురూరవునకు ఊర్వసియందు కుమారులుగా జన్మించిరి. వీరు ఊర్వశీతనయులగుటచే గంధర్వాదిలోకములయండు ప్రఖ్యాతిఁబడసి శివభక్తులుగా నుండిరి.
ఆయువు యొక్క ఐదుగురు కుమారులు స్వర్భానుపు యొక్క పుత్రిక యగు ప్రభాదేవియందు జన్మించిరి. ఈ ఐదుగురిలో నహుషుడు జ్యేషుడై యుండెను. నహుషునకు పితృకన్యయగు విరజయందు ఆరుగురు -యతి, యయాతి, సంయతి, ఆయాతి, అంధకుడు, విజాతి యను పేర్లతో జన్మించిరి.
వీరిలో పెద్దవాడగు యతి - మోక్షార్థియై శివునుపాసించి ముక్తుడయ్యెను.
నహుషుని రెండవ కుమారుడైన యయాతి- శుక్రాచార్యుని తనయయగు దేవయానిని, వృషపర్వుడను అసురుని కుమార్తెయగు శర్మిష్ఠను భార్యలుగా స్వీకరించెను. దేవయాని యదువును తుర్వసువును కనగా శర్మిష్ఠ- ద్రుహ్యుడు, అనువు, పురువు అను ముగ్గురుకి జననియైనది. శుక్రాచార్యుడు-యయాతి ప్రార్థనచే సంతుష్టుడై మిక్కిలి శోభించు సువర్ణమయరథమును అక్షయములగు అమ్ములపొదలను యయాతికి నొసగగా - నాతడు యుద్ధమున దేవ దానవ మానవుల నోడించినవాడై శివభక్తుడై ధర్మనిష్ఠుడునై యజ్ఞముల నొనర్చినవాడై క్రోధమును జయించి ప్రాణుల నందరిని శాసించువాడయ్యేను.
శుక్రాచార్య ప్రదత్తమగు రథము - కురువంశీయులకు ఆలంబనముగా నుండెను. యయాతి మొదలుకొని కురువంశములో జన్మించిన వారిలో పరీక్షిన్మహా రాజుగారి కుమారుడైన జనమేజయుడు గర్గముని యొక్క కుమారుడైన బాలుని సంహరించినందున బ్రహ్మహత్యా పాతకమునకు లోనై దుర్వాసనగల నెత్తురుతో ఇటునటు తిరుగుచు - ప్రజలచే బహిష్కరింపబడినందున బాధపడుచు శరణాగతరక్షకుడగు “ ఇంద్రేతి “ యనబడు శౌనకమహర్షి నాశ్రయించెను. శుక్రరథము జనమేజయునకు లభ్యము కానిదై స్వర్గమును చేరెను.
అట్టితటి - ఇంద్రేతిముని జనమేజయుని బ్రహ్మహత్య తొలగుటకై అశ్వమేధమును చేసినందున జనమేజయుడు దుర్వాసనతో కూడిన నెత్తురు లేనివాడై పాపనిర్ముక్తుడు కాగా కురువంశమునకు దూరమైన శుక్రాచార్య రథమును వసువు అనబడు చేదిపతికి దేవేంద్రుడు ప్రసాదించెను. చేదిపతి నుండి బృహద్రథు (జరాసంధు)డు రథాదిపతి యయ్యెను. తరువాత కొంతకాలమునకు యుధిష్ఠిరానుజుడగు భీమసేనుడు జరాసంధుని సహరించి ఆ రథమును శ్రీకృష్ణునకు ప్రేమతో సమర్పించెను.
ఇక యయాతి యొక్క సమనంతర చరితమును చెప్పుచున్నాను. వినుడు ! అని సూతుడు చెప్పదొడగెను.
యయాతి మహారాజు తన కనిష్ఠపుత్రుడైన పురువును రాజ్యాధికారిగా పట్టాభిషిక్తునొనర్చెను. అప్పుడు బ్రాహ్మణాది ప్రజలు “జ్యేష్ఠ పుత్రుడగు యదువుండగా కనిషుడైన పురువు రాజ్యాధికారి యొట్లగు ? నని యయాతి నృపుని ప్రశ్నించిరి.
ఇయ్యది “ శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (66)వ అధ్యాయము.
Summary of chapter 66 of the Linga Mahā Purana is as follows:
The narrative begins the historical account of King Yayāti, a celebrated monarch of the Lunar dynasty, detailing his righteous rule, vast conquests, performance of grand Vedic sacrifices, and unwavering devotion to Sanātana Dharma. The text highlights how Yayāti governed his empire with justice, protecting his subjects and honoring devas and Brāhmaṇas.