87 - సనత్కుమారాదులకు పార్వతీ పరమేశ్వరులు - మాయామోహమును - తొలగించుట

సూత ఉవాచ = సూతడు చెప్పదొడఁగెను.

సనక సనందన సనత్కుమాది మహర్షులు శప ప్రబోధము నాలకించి పరమేశ్వరుని ప్రసన్నునిగా గుర్తించియు “విరుద్ధ ప్రశ్నజేసినచో క్రోథము రాగలవని భయపడినవారై వినయముతో ప్రణమిల్లి దిగువవిధము ప్రశ్నించిరి.

పూర్వోక్తరీతిని స్త్రీ సంగాదులు లేనివారై ఆత్మజ్ఞానము గలిగి - ముక్తి భాజనులు కావలెను గదా! అదియే ఉత్తమమైనచో - ఈ హైమవతీ దేవితో విహరించుచు వివిధసుఖముల ననుభవించున్నా వెందులకు?

అంత పరమేశ్వరుడు చిరునగవులో అంబికను పరివీక్షించి నేను స్వేచ్ఛా ధృతశరీకుడ నగుటచే నాకు సంసార బంధముగాని మోక్షముగాని లేవని తెలియుడు ! పరాధీనకర్త, అల్పజ్ఞుడు నగు జీవుడు కర్మఫలము ననుభవించుచు అణుమాత్రుఁడై నానావిడ దేహములతో జన్మించి సుఖదుఃఖభాజను డగుచండును. మాయాబద్ధుఁడై కర్మల ననుభవించును. వస్తుతః - పరమాత్మకు (నాకు) జ్ఞానము ధ్యానము బంధము మోక్షంబు నవసరము లేదు.

నాయందు ఇవియన్నియు లేవని తెలిసికొనినవానికి గూడా బంధమోక్షములు ఆవశ్యకములు  కావు.

ఇక ఈమె విద్యకాగా - వేద్యుడు నేనగుదురు. మరియు నీయమ ప్రజ్ఞయనియు, శ్రుతి యనియు, స్మృతియనియు, ధృతియనియు, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి యయు, ఆజ్ఞయనియు, పరా అపరా విద్యయనియు పేర్కొనబడును. జీవసంబంధముగల ప్రకృతి, విస్తృతియు, నీమె కాడు. విచారించి చూడగా ప్రకృతి వికృత్యాదిక మంతయు మాయామయమని తేలుపడును.

నా ముఖము నుండి ఆజ్ఞాశక్తి - పూర్వము ఆవిర్భవించి, ఐదు ముఖములతో దశభుజములతో విరాజిల్లుచు - లోకులకు నభయము నొసఁగగా అట్టి అజ్ఞాశక్తిలో నేను ప్రవేశించి ఇరుపది యేడు తత్త్వములుగా పరిణమింపజేసితిని. అట్టి పృథివ్యాది తత్త్వముల నన్నిటిని వ్యాపించితిని.

అందువలన బంధము మోక్షంబు నేర్పడినవని తెలియపలెను.” అని వక్కాణించి పరమేశ్వరిని మరల నొకమారు చూడగా భవానియు భవుని వీక్షించి మునులకు ఆవహించిన మాయామోహమును తొలగించెను.

అంత వారు మాయామలము లేనివారై - పార్వతీ దేవిని పరివీక్షించి - ముక్తులైరి. అందువలన - అంబికయే ముక్తి నొందించునదని విదితమైనది.

శ్లోఉమా శంకరయో ర్భేదో నాస్త్యేవ పరమార్ధతః ద్విధాఽసౌ రూప మాస్థాయ - స్థిత ఏవ న సంశయః

“పరమేశ్వరుడే శక్తి శివరూపములతో రెండు తెఱగులుండును. ఇందు ఎంతమాత్రము సంశయము లేదు గాన ఉమామహేశ్వరుల కిసుమంతయు భేదము లేదనుట పరమార్ధమని తెలియవలెను.”

పరమేశ్వరాజ్ఞాబద్ధుడై జీవాత్మ - సర్వసంగపరిత్యాగియైనచో - మరణానంతరమే ముక్తుడగును. మోక్షప్రాప్తికి - క్రమము లేదు. ఎందుకనగా ? శివానుగ్రహము ప్రసరించిన వెనువెంటనే మోక్షము చేకూరును.

శ్లోగర్భస్థో జాయమానో వా - బాలో వా తరుణో పి వా వృద్ధోవా ముచ్యతే జంతుః - ప్రసాదాత్ పరమేష్ఠినః అండజ శ్చోద్భిజో వాఽపి స్వేదజో వా పి ముచ్యతే

“గర్భమునందున్నవాడైనను, జన్మించువాడైనను, బాలుఁడైనను, యువకుఁడైనను, వృద్ధుఁడైనను పక్షియైనను తరుగుల్మలతోధికమైనను. చెమటవలనుఁబట్టునదైనను - శివానుగ్రహమువలన తత్ క్షణముననే ముక్తు డగును.”

జగన్నాథుఁడైన శివుఁడే - బంధమును మోక్షమును కలిగించువాడు. భూలోకము, భువర్లోకము, స్వల్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, కోటికోటిశత బ్రహ్మాండములు బ్రహ్మాండముదగు ఎనిమిది ఆవరణములును మహాదేవుని ఆకారములగును.

సప్త ద్వీపములయందు - పర్వతములలో - వనములయందు - సముద్రములలో ఇతరలోకములయందును నివసించు చరాచరప్రాణులన్నియు శివాంశసంభూతులుగాన వీరికందరికి ప్రాప్యుడు - పరమేశ్వరుఁడేను.

‘‘రుద్రుఁడు సర్వాత్మకుఁడు, పురుషుడు నగుటచే నా మహాత్మునకు నమస్కారము.” గడచినది, బహువిధములుగా ఆవిర్భవించినది, రాబోవునదియు నగు విశ్వము రుద్రుడేను” అని శ్రుతులుద్ఘోషించినవి. ఆకాశసంచారులను సిద్ధులుగూడా – శివానుగ్రహపూర్వకముగ - అమ్మవారి చూపు ప్రసరించినందున - శివసాయుజ్యము సందిరి.

ఇయ్యది “ శివ విజ్ఞాన వీచిక’’ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (87)వ అధ్యాయము.