లింగ మహా పురాణము
57 - బుధుడు మొదలగు గ్రహముల యొక్క రథములను మండలములను - నిరూపించుట
చంద్రుని కుమారుఁడైన బుధుని ఉదకము తేజస్సు నిండిన రథమును - గోరోజనమువంటి కపిలవర్ణము గల అశ్వములు ఎనిమిది వహించుచుండును. ఇక శుక్రాచార్యుని భూసారము గల రథమును నానావర్ణములు గలవి బలిష్ఠములు నగు పది అశ్వములు నడిపించును. సువర్ణ నిర్మితము సుశోభనంబు నగు అంగారక రథము అష్టాశ్వములు కలదై యుండును. బృహస్పతి యొక్క రథము సువర్ణమయమై ఎనిమిది వాహనములు కలిగియుండును. శనైశ్చరుని ఇనుపరథము నలుపు వన్నె గల పది గుఱ్ఱములచే నడిపింపబడును. రవిశత్రువైన రాహువు - అష్టాశ్వములు గల రథమునందు సంచరించుచుండును.
ధ్రువుడు వీరందరి రథములుతోట్రుపడకుండ వాయ్వాత్మ కిరణములతో నడుపుచుండును. జ్యోతిర్గణమంతయు ధృవునకు లోబడినను తమ ఆకాశసంచారముతో ధ్రువుని కదిలించు శక్తి కలిగియుండును. ధ్రువుడు జ్యోతి స్పంచారమునకు బాధ్యత వహించును గాన ప్రవహుడని గూడ పిలువఁ బడును. జ్యోతిస్సులన్నియు ధ్రువమండలమునకు ప్రదక్షిణము జేయుచు ధ్రువుని సమీపించి చూడఁగోరుచుండును.
సూర్యమండలము తొమ్మిది వేల యోజనముల పొడవు. ఇరువది యేడు వేల యోజనముల వెడల్పు గలది కాగా చంద్రమండలము సూర్య మండల పరిమాణమున కన్న రెట్టింపు కొలత గలిగియుండును. సూర్యచంద్రమండలములతో సమానమైన రాహుమండలము సూర్యచంద్రులకంటే క్రిందుగా సంచరించుచు చీకటితో నిండియుండును. చంద్రమండలముఁ దగు పదునారవ భాగము శుక్రమండల ముండగా బృహస్పతి మండలము శుక్ర మండలములోని మూడు భాగములంత పరిమాణము కలిగియుండును. ఇట్లే కుజ శని బుధ మండలములు పాదహీనములు కాగా ఆకారము గల నక్షత్రముల యొక్క మండలములన్నియు పాద (నాలుగవభాగము తక్కువగా) హీనములుగా ప్రవర్తించును.
నక్షత్రములన్నియు తఱచుగా చంద్రుని జేరునట్టి వేను. నక్షత్రమండలములన్నియు పది యోజనముల నిడివి పొడవు గలవైసూర్యచంద్రాది సమస్తమండలముల పైభాగమున విరాజిల్లుచుండును. సూర్యునికన్న చంద్రు, చంద్రునికంటె నక్షత్రములు, నక్షత్రములకన్న బుధుడు, బుధుని కంటే శుక్రుడు - శుక్రునతిక్రమించి అంగారకుడు - అంగారకుని కంటె బృహస్పతియు, బృహస్పతి కంటే శనైశ్చరుడు శనైశ్చరుని కంటెసప్తర్షులు, సప్తర్షుల నతిక్రమించి ధ్రువుడు పై ప్రదేశముల యందు నివసించుచుందురు. ఆపైన విలసిల్లు వైకుంఠ (విష్ణులోక)ము సర్వలోక శ్రేష్ఠమనియు వైకుంఠము ద్వారా శివలోక (పరమ పద) ము ముముక్షువులకు లభించుననియు భావించువారు పాపనిర్ముక్తులై చిత్తశుద్ధి గల వారగుదురు.
గ్రహాధిపతి పదవిపై బ్రహ్మదేవుడు సూర్యుని (శంకరుడు అమరసేనాదిపతి పదవిపై కుమారు స్వామిని వలె) పట్టాభిషేకించెను.
ఇయ్యది “ఈ శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (57) ఏబది యేడవ ఆధ్యాయము.
Summary of chapter 57 of the Linga Mahā Purana is as follows:
Sūta Romaharshaṇa describes Grahacāra, detailing the specific orbits, speeds, and influences of the major planets including Mangala, Budha, Bṛhaspati, Śukra, Śani, Rāhu, and Ketu. The chapter highlights how planetary alignments reflect karmic patterns and cosmic law, guiding seekers to perform appropriate Śiva worship to neutralize negative planetary afflictions.