లింగ మహా పురాణము
22 - హరిబ్రహ్మలకు శివవరప్రాప్తి, సర్పోదయము, రుద్రోత్పత్తి
(గత ప్రాణుఁడైన బ్రహ్మదేవుని శివుఁడు జీవింపజేయుటయు)
సూత ఉవాచ - సూతమహర్షి శౌనకాదులకు చెప్పఁదొడఁగెను.
శ్లో॥ అత్యంతావనతౌ దృష్ట్యా - మదుపింగాయతేక్షణః । ప్రహృష్టపదనోఽత్యర్ధ - మభవత్సత్యకీర్తనాత్ ॥
ఆకు పసుపు గోరోజనము వన్నెగలవి, విశాలములు నగు నేత్రములు గల మహేశ్వరుఁడు మిక్కిలి నమ్రులైన హరి బ్రహ్మలు యథార్థమగు స్తోత్రమును కీర్తించుటవలన అత్యంతము సంతుష్టాంతరంగు డయ్యెను.
ఉమాపతి, విరూపాక్షుడు దక్షయజ్ఞ వినాశనుడు, పినాకి, ఖండ పరశువు, త్రిలోచనుడుఁనగు మహాదేవుఁడు సుప్రీతుఁడగుటయే గాక విధివిష్ణుకృతము అమృతతుల్యంబునగు స్తోత్రము నాకర్ణించి వారెవరో తెలిసినను - లీలావిలాసముగా నిట్లు ప్రశ్నించెను.
ఒకరికి నొకరు మేలుఁగోరువారు. కమలములవంటి కన్నులు గలవారు, ఈ మహా సముద్రమున కూడినవారు, మహాత్ములునగు మీరెవరు ?
అంతవారి రువురు ఒండొరులఁ జాచుకొని ఈ “భగవానుడా! మేమెవరమో నీకు తెలియదా?నీ మాయా ప్రభావము గొప్పది; నీవే పూర్వము మమ్ము పుట్టించితివి గదా!
వారి వాక్యమును మహేశ్వరుఁడాలకించి మధురము ప్రియంబునగు మాటతో “హరి బ్రహ్మలారా! ఈ మీ భక్తిచే మీరు నాకు మిగుల సన్నిహితులైతిరి. శాశ్వతఫలప్రదములగు అక్షరములు మీరు ప్రార్ధించిన నా స్తోత్రములో గలవు గాన నా హృదయమును రంజలఁజేసినవి. మీరు కోరిన వరము నడుగుడు! అనఁగా -
“నీవు ప్రసన్నుఁడ వైతివి గాన నేనడుగన దేమియు లేదు. నీయందు నాకు ఎల్లకాలము భక్తి యుండునట్లు అనుగ్రహింపుము! అంతే చాలు” అని కేశవుఁడు ప్రార్థించెను.
శ్లో॥ ఏవ ముక్తస్తు విజ్ఞాయ - సంభావయత కేశవం । ప్రదదౌచ మహాదేవో - భక్తిం నిజపదాంబుజే ॥
ఇట్లు ప్రార్ధించిన వరమును కనుగొని శ్రీహరిని ప్రశంసించియు మహేశ్వరుఁడు తన చరణారవిందమునందు ఏకాగ్రభక్తిని కేశవునకు ప్రసాదించెను. మరియు నీవు బ్రహ్మాండము నందు అధికారము గలవాడవై నా ప్రతినిధిగా భక్తులచే ఆరాధింపఁబడుదువు! నీకు శుభమగు గాక! అని యనుగ్రహించెను.
ఇంక - భగవానుఁడగు శంకరుఁడుఁశుభప్రదములగు స్వహస్తములతో బ్రహ్మదేవుని తాకి - నాతో సమానముగా లోకమున గౌరవింపఁబడుచు నాయందు భక్తి కలిగియుందువు! నా విషయమై నీకు నా మాహాత్మ్యజ్ఞానము స్థిరపడుగాక! అని విధి ననుగ్రహించి అంతర్థానముఁజెందెను.(కనుమఱుఁగయ్యెను)
ఇవ్విధము గోవిందునివలన కమలగర్బుఁడు జాగరూకుఁడై ప్రజలను పుట్టించు తలంపు గలవాడై ఉగ్రమైన తపస్సు చేయుచుండగా - తపస్సు ఫలింపనందున కలిగిన కోపమునఁజేసి కన్నీళ్లు కాఱుచుండెను.అట్టి ఆశ్రుబిందువుల వలన సర్పములు ఉదయించెను. ఆ పాములు గొప్పబలము, విరబోసిన వెంట్రుకలు, తలలపై స్వస్తిక చిహ్నములు మహావిషంబు కలిగియుండెను.
బ్రహ్మదేవుఁడు అట్టి సర్పములఁ గాంచి “నా తపస్సునకు - లోకవినాశకరంబగు ఘోరమైన సంతానము కలుగుట ఫలమా? అని తనను తాను నిందించుకొనెను. ఇట్లు క్రోధము ఆ వేశించుటచే బ్రహ్మదేవునకు - మొదట మూర్ఛ సంభవించెను. మూర్ఛ (తెలివిఁదప్పుట) వలన కలిగిన బాధకు తాళలేక ప్రాణములను విడిచెను. బ్రహ్మదేవుని శరీరము నుండి ఏకాదశరు ద్రులుద్భవించిరి. వారు బ్రహ్మదేవుని దుఃస్థితిని గమనించి కరుణతో రోదనము జేసినందున - రుద్రులు - అనుసంజ్ఞ యేర్పడెను.
రుద్రులగువారే దేహధారులగు ప్రాణులయొక్క ఏకాదశ ఇంద్రియములుగా లేక దశప్రాణములుగా ఏకాదశాంతఃకరణముగాను పేర్కొనఁబడుదురు.
త్రిశూలధారియగు పరమేశ్వరుఁడు - బ్రహ్మదేవునకు కృపతో ప్రాణముల నొసఁగెను. పునర్జీవితుఁడైన పంకజాసనుఁడు - ఈశ్వరునకు ప్రణమిల్లి - విశ్వాత్మకమగు గాయత్రి నవలోకించియు ప్రభో! సద్యోజాతాది పంచబ్రహ్మల యొక్క యావిర్భావమును ప్రభోధింపు మని ప్రార్ధించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక’’ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (22) ఇరువది రెండవ యధ్యాయము.
Summary of chapter 22 of the Linga Mahā Purana is as follows:
The narrative recounts how when Bhagavān Brahmā encountered difficulties in creating peaceful progeny, he performed intense penance, prompting Supreme Śiva to manifest from Brahmā's forehead in the form of Nīlalohita Rudra. From this divine form emerged the eleven Rudras and countless fierce manifestations who filled the cosmos with roar, protecting cosmic order and destroying adharma throughout the worlds.